“ఏలా లలిత నీలకుంతల ధరాం
నీలోత్పలాభాంశుకాం
కోలూరాద్రి నివాసినీం భగవతం
ధ్యాయామి మూకాంబికాం!”
[dropcap]క[/dropcap]ర్ణాటక రాష్ట్రం, ఉడుపి జిల్లాలో కొల్లూరులో కొలువైవున్న అమ్మవారు ‘మూకాంబికా దేవి’. దేశవిదేశాల నుండి వస్తున్న యాత్రికులు, వారి సౌకర్యార్థం మంచి హోటల్స్ ఉన్నా, హడావుడి లేకుండా ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఎత్తైన కొండలు, (ఔషధ) వృక్ష రాజాలతో శోభిల్లుతూ ప్రకృతి శోభతో విరాజిల్లుతూ, ఎలాంటి అనారోగ్యంతో బాధపడే వారైనా ఉపశమనం పొందేలా, ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఈ క్షేత్రంలో వెలసిన మూకాంబికా దేవి ఆవిర్భావం గురించి రెండు గాథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం ‘కామాసురు’డనే రాక్షసుడు దేవతలను, ప్రజలను హింసిస్తుండగా వారందరూ పార్వతీదేవిని శరణువేడారు.
ఒక స్త్రీ చేతిలోనే అతని మరణం ఉందని ఆమె గ్రహించింది.
కామాసుడు శివుని గురించి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. లోకసంరక్షణార్ధం సరస్వతీ దేవి అతని నాలుకపై నిలిచి, మాట రాకుండా చేసింది. తర్వాత సరస్వతి, మహాకాళి, శక్తి సమ్మిళితంగా పార్వతీ దేవి ‘మహాశక్తి’గా అవతరించి కామాసురుని సంహరించింది. ‘మూక’ అసురుని కోరిక మేరకు అమ్మవారు ‘మూకాంబికా’గా వెలసిందంటారు. రాక్షస వధ గావించిన పార్వతీదేవి ధైర్యానికి మెచ్చి పరమశివుడు తన కాలి మడమతో అక్కడ శ్రీ చక్రాన్ని సృష్టించి ప్రతిష్ఠించాడని వాడుకలో ఉంది.
కుడజాద్రి పర్వతంపై ఆదిశంకరాచార్యులు అమ్మవారి కోసం ఘోర తపమాచరించగా ఆమె ప్రత్యక్షమై వరము కోరుకోమని అనుగ్రహించింది. తన జన్మస్థలమైన కేరళకు రమ్మని ఆదిశంకరుల వారు కోరగా, తను మౌనంగా అతని వెంట వస్తానని ఏ పరిస్థితుల్లోనూ వెనుతిరిగి చూడరాదని, ఒకవేళ చూస్తే ఆ ప్రాంతంలోనే స్థిరంగా ఉండిపోతానని అమ్మవారు షరతు విధించారు. శంకరుల వారు ఒకానొక సమయంలో కొల్లూరు ప్రాంతంలో అమ్మవారి కాలిఅందెల సవ్వడి వినరాక వెనుతిరిగి చూసారు. మాట తప్పినందుకు, అక్కడే తను స్థిరంగా ఉండిపోతానని అమ్మవారు చెప్పగా, శ్రీచక్రం సహితంగా అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇది శంకరులు. మౌనంగా నడిచి వచ్చినందున ‘మూకాంబికా దేవి’ అని పేరు వచ్చిందని అంటారు.
ఆలయంలో శంకర సింహాసనం ఉన్నది. అక్కడే ఉన్న బావి నుండి పూజారులు నీటిని తోడి అమ్మవారికి అభిషేకం చేస్తారు. ఆ పవిత్ర జలం తోనే ప్రసాదాలు తయారుచేస్తారు. మూకాంబికా దేవి శంఖ చక్ర గదా ఆయుధాలు ధరించి, మూడు నేత్రాలతో ఉన్నా, పద్మాసనంలో ఉండి ప్రశాంత వదనంతో దర్శనమిస్తారు. ఇక్కడ ‘పంచ కడ్జాయం’ అని ఐదు మధుర పదార్ధాలతో చేసే ప్రసాదం చాల ప్రసిద్ధత కలిగినది. పూర్వం అమ్మవారికి నివేదించిన ఈ ప్రసాదాన్ని ఒక బావిలో వేసేవారట. ఒకరోజు కేరళ వాసి యైన ఒక నిరక్షరాస్యుడు బావి లోపల దాగుండి, ఆ ప్రసాదం తిన్నాడు. ఆ తర్వాత అతడు మహా పండితుడయ్యాడని, కనుకనే అక్కడ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే ఉన్నత చదువులు ప్రాప్తిస్తాయని, సంగీత నాట్యాది కళలను మొదట ఇక్కడ ప్రదర్శిస్తే ఆయా కళలలో ప్రావీణ్యం సంపాదిస్తారని ప్రజల విశ్వాసం. ముఖ్యంగా ప్రదోష కాలంలో అమ్మవారిని హారతి సమయంలో దర్శించుకోవడం ఒక అద్భుతమైన అనుభూతి అని భక్తుల నమ్మకం. (మేము మధ్యాహ్నం వెళ్ళడం వల్ల చూడలేకపోయాం. అక్కడ నుండి గోకర్ణ క్షేత్రంకి వెళ్ళాం.)
ఆలయం లోపల ఫోన్లు, కెమెరాలు అనుమతించక పోవడం వల్ల ఫోటోలు తీయలేక పోయాం. భక్తులు నమ్మకంతో మొక్కుకొని తీర్చుకోవడానికి ‘తులాబారం’ ఉంది. కుడజాద్రి పర్వతం పై శంకరుల వారు తపస్సు చేసిన ‘అంబవనం’, ‘చిత్రమూలం’ ప్రదేశాలనూ దర్శించవచ్చు. సామాన్య ప్రజలే కాక, కర్ణాటకను పరిపాలించిన రాజులు కూడా అమ్మవారి పట్ల ప్రగాఢమైన విశ్వాసం కలిగివుండి సేవించారు. నగర, బెర్నూర్ రాజులు, విజయనగర ప్రభువులు కూడా మూకాంబికా అమ్మవారికి విలువైన కానుకలు సమర్పించుకొన్నారు.
గోకర్ణ క్షేత్రము. ఈ కథ మనం ‘భూకైలాస్’ సినిమాలో చూసిందే. రావణాసురుడు తన తల్లి కైకసి సముద్రతీరంలో శివలింగాన్ని ఇసుకతో చేసి, పూజించబోతుంటే అలల తాకిడికి కొట్టుకుపోతోంది. తల్లి పూజించుకోడానికి కైలాస పర్వతాన్నే పెకిలించబోయి విఫలుడౌతాడు రావణబ్రహ్మ. అతని భక్తికి మెచ్చిన శివుడు వరము కోరుకొమ్మనగా, ‘ఆత్మలింగా’న్నిమ్మంటాడు. ఆత్మలింగాన్ని ఇస్తూ, నేలపై పెడితే అక్కడే స్థిరంగా ఉంటుందని చెబుతాడు భోళాశంకరుడు. శివుని ఆత్మలింగం లంకలో ప్రతిష్ఠింపబడితే ఏర్పడే అవాంతరాలను ఊహించిన దేవతలు కళవళపడతారు. నారదుని కోరికపై వినాయకుడు చిన్న పిల్లవాడిగా రావణునికి ఎదురుపడతాడు. విష్ణుమాయ వల్ల కల్పించబడిన చీకటిని చూసి సూర్యాస్తమయం అయిందని భ్రమించి, సంధ్యావందనం చేయదలచి, బాల వినాయకుని కాసేపు ఆత్మలింగాన్ని పట్టుకోమంటాడు. తాను చిన్నవాడినని, ఆ ‘మహా బల’మైన లింగాన్ని ఎక్కువ సేపు పట్టుకోలేనని, మూడుసార్లు పిలుస్తానని, రాకపోతే నేలపై పెట్టేస్తానని షరతు పెట్టాడు బాలుడు. రావణుడు ఒప్పుకొని అటు వెళ్ళగానే, సంథ్య వార్చక మునుపే మూడుసార్లు పిలిచి నేలపై ఆత్మలింగాన్ని ఉంచేసాడు వినాయకుడు. అది స్ధిరంగా భూమిలో పాతుకుపోయింది. తిరిగి వచ్చి అది చూసిన రావణాసురుడు కోపంతో బాలవినాయకుని తలపై మొట్టాడు. (ఇక్కడ ఉన్న గణపతి విగ్రహం తలపై చిన్న గుంటని చూడవచ్చు) మహాబలంగా లింగాన్ని వెలికి తీయాలని తీవ్ర ప్రయత్నం చేసాడు రావణుడు. ఆ ప్రయత్నంలో చిన్న ముక్కలు చెల్లాచెదురుగా పడ్డాయని, ఆ ప్రాంతాలు గోకర్ణం, సజ్జేళ్వరం, గుణేశ్వరం మొదలైనవని అంటారు. శివ భక్తుడు, మహా బలశాలి యైన రావణుడే పెకలించలేకపోయినది కనుక ఇక్కడ శివలింగానికి ‘మహా బలేశ్వరు’డని పేరు.
మురుడేశ్వరం. కర్ణాటక లోని భట్కల్ ప్రాంతంలో అరేబియా సముద్రం ఒడ్డున ‘మురుడేశ్వర’ పుణ్యక్షేత్రం ఉంది. రావణుడు ఆత్మలింగం పైనున్న వస్త్రాన్ని విసిరివేయగా అది కందుకు పర్వత ప్రాంతం- మృదేశ్వరంలో పడిందని, అదే క్రమంగా ‘మురుడేశ్వరం’ గా మారిందని అంటారు. కన్నడంలో మురుడ అంటే వస్త్రం, సంతోషం అని అర్థం.
సముద్రం ఒడ్డున 123 అడుగుల శివుని విగ్రహం, 250 అడుగుల ఎత్తు గోపురం, 17 అంతస్తులతో నిర్మింపబడినది. 16వ అంతస్తు వరకు లిఫ్ట్ ఉంది. అక్కడ నుండి చూస్తే సముద్రపు అలలు, ధ్యానముద్రలో ఉన్న శివుని విగ్రహం.. ఆశ్చర్యం, ఆనందం, ఆధ్యాత్మిక భావాలతో మిళితమైన భక్తులే కాదు, ప్రకృతి సౌందర్యారాధకులూ పరవశించిపోతారు.
ఈ ప్రాంతాలన్నీ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నా, ఎక్కువగా కేరళ రాష్ట్ర వాతావరణం, సంప్రదాయాలు కనిపిస్తాయి. ఎక్కువ మంది కేరళీయులే విశ్వాసంతో వస్తుంటారు. హడావుడిగా కాకుండా సరిగ్గా ప్రణాళిక వేసుకొని , వీలైతే కారులో మంచి డ్రైవర్ సహకారంతో ఈ ప్రాంతాలన్నీ పర్యటిస్తే ఆనందమూ, ఆరోగ్యమూ, ఆధ్యాత్మిక భావాలతో ఆహ్లాదకరంగా ప్రయాణం చేసి రావొచ్చు. దారిలో టైం ప్లాన్ చేసుకొంటే మంచి జలపాతాలూ, ఎన్నెన్నో బీచ్‌లు, ఉడుపి, ధర్మస్థల చూడవచ్చు. కనీసం 10 రోజుల ప్రణాళిక అయినా ఉంటే కానీ కర్ణాటక రాష్ట్రంలో ‘కొన్నైనా’ ముఖ్యమైన ప్రదేశాలు చూడలేం. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ప్రయాణానికి అనుకూలం.