[box type=’note’ fontsize=’16’] మనలో చాలామందికి మూస అభిప్రాయాలుంటాయని, ఈ మూస రూపాల సాయంతోనే నమ్మించి మోసం చేసే నకిలీగాళ్ళంతా తమ పబ్బం గడుపుకుంటారని వివరిస్తున్నారు సలీం. [/box]
[dropcap]రం[/dropcap]గారావుకి అబిడ్స్‌లో నగల దుకాణం ఉంది. గురువారం ఉదయం ఆరింటికి కాలింగ్ బెల్ మోగితే తలుపు తీశాడు. “మేము ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచొచ్చాం. మీ ఇల్లు సోదా చేయాలి” అంటూ బిలబిలమంటూ ఐదుగురు వ్యక్తులు లోపలికి జొరబడ్డారు. ఆ మాట వినగానే రంగారావుకి చెమటలు పట్టాయి. వణుకొచ్చింది. హాల్లో ఉన్న సోఫాలో కూలబడి టీపాయ్ మీదున్న జగ్‌లోంచి గ్లాస్ లోకి నీళ్ళు ఒంపుకుని గటగటా తాగేశాడు.
అందులో ఒకతను ఎత్తుగా స్మార్ట్‌గా ఉన్నాడు. టక్ చేసుకుని, టై కట్టుకుని, ఫుల్ సూట్‌లో ఉన్నాడు. మిగతా నలుగురికీ ఇంగ్లీష్‌లో ఆదేశాలిస్తున్నాడు. రంగారావు కొంత స్థిమితపడ్డాక “నా పేరు వినయ్ భూషణ్. ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్‍ని. ఈ నలుగురూ ఇన్‌స్పెక్టర్లు” అన్నాడతను. తన జేబులోంచి ఐడి తీసి చేతిలో పట్టుకుని “ఇది నా ఐడి కార్డ్. మీరు అలా నమ్మేస్తే ఎలా? మేం ఇన్‌కమ్‌టాక్స్ నుంచి వచ్చామనగానే మా ఐడీలు చూపమని అడగాలి కదా. ఎన్ని మోసాలు జరుగుతున్నాయో వినటం లేదా? ఎప్పుడు నేర్చుకుంటారండీ” అంటూ మందలించాడు. అప్పటికే భయంతో బిక్కచచ్చిపోయి ఉన్న రంగారావు ఐడీ కార్డ్ వైపు చూడకుండానే “అవసరం లేదు సార్. మీరు ఆఫీసర్ అని తెలుస్తూనే ఉందిగా” అన్నాడు.
ఇంట్లో ఉన్న నగల్ని ఓ చోట కుప్పగా పోసి వాటి జాబితా తయారు చేశారు. దొరికిన నగదు వివరాల్ని డినామినేషన్ ప్రకారం మరో జాబితాలో పొందుపర్చారు. రంగారావుని వాటికి సంబంధించి పదో పన్నెండో ప్రశ్నలేసి అతని జవాబుల్ని లిఖితపూర్వకంగా నమోదు చేసి అతని సంతకాలు తీసుకున్నారు. నగల జాబితా ప్రతిని, నగదు వివరాలు పొందుపర్చిన ప్రతిని రంగారావు చేతికిచ్చి “ఎంక్వయిరీ మొత్తం పూర్తయ్యాక టాక్స్ కట్టిన ఆదాయంలోంచే ఈ నగలూ నగదూ సమకూర్చుకున్నారని తేలితే తిరిగి ఇచ్చేస్తాం. రేపుదయం పదిన్నరకి ఆఫీస్‌కి రండి” అని చెప్పి వాటిని పట్టుకుని వెళ్ళిపోయారు.
వాళ్ళటు వెళ్ళగానే రంగారావు తన ఆడిటర్‌కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. “వినయ్ భూషణా? అటువంటి పేరు గల ఆఫీసర్ ఎవరూ లేడే” అన్నాడు.
రంగారావుకి మోసపోయానేమోనన్న భయంతో చెమటలు పట్టాయి. వెంటనే సర్దుకున్నాడు. లేదు. తను మోసపోలేదు. అతను ముమ్మాటికీ ఆఫీసరే. ఎంత హుందాగా ఉన్నాడో… ఇంగ్లీష్‌లో ఎంత చక్కగా మాట్లాడాడో… “నాకా అనుమానం లేదండీ. అతను ఆఫీసర్ లానే ఉన్నాడు” అన్నాడు.
“ఆఫీసర్‌లా ఉండటమేమిటి?”
“ఎత్తుగా స్మార్ట్‌గా, టక్ చేసి, టై కట్టుకుని, కోటు వేస్కుని, ఇంగ్లీష్‌లో గడగడా మాట్లాడాడు… ఆఫీసర్లు అలానేగా ఉంటారు.”
ఆడిటర్ తల పట్టుకున్నాడు. “సరే. మీకలా అన్పించినా వాళ్ళు ఉన్నప్పుడే నాకు ఫోన్ చేయాలని తెలీదా?” అన్నాడు.
“ఫోన్లు చేయడానికి వీల్లేదని మొబైల్ ఫోన్లన్నీ లాగేసుకున్నారు. అతను తన ఐడి కార్డ్ కూడా బైటికి తీశాడు. తప్పకుండా ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసరే. అనుమానం లేదు”
“ఐడీ కార్డ్ మీరు చూశారా?”
“చూళ్ళేదు. చూపించబోయాడుగా. అది చాలదా అతన్ని నమ్మడానికి?”
“ఎందుకైనా మంచిది నేను డిపార్ట్‌మెంట్లో తెలిసినవాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటాను” అన్నాడు. మరో పావుగంట తర్వాత ఫోన్ చేసి “రంగారావు గారు. పోలీస్ కంప్లయింట్ ఇవ్వండి. మిమ్మల్నెవరో మోసం చేశారు” అన్నాడు.
రంగారావు కుప్పకూలిపోయాడు.
మనలో చాలామందికి ఇలాంటి మూస అభిప్రాయాలుంటాయి. దానివల్లనే చాలాసార్లు మోసపోతుంటాం. దొంగంటే గళ్ళలుంగీ, చారల బనీను, బుగ్గమీద ఓ పులిపిరి, నల్లటి మేనిఛాయ… దొరంటే ఎత్తుగా, స్మార్ట్‌గా, హుందాగా, మడతలు నలగని బట్టలు, టై, సూటు బూటు, నాలుగు ఇంగ్లీష్ మాటలు… దుర్మార్గుడంటే ఎర్రటి నిప్పు కణికల్లాంటి కళ్ళు, బుర్ర మీసాలు, స్ఫోటకపు మచ్చలు, చెంప మీద ఓ కత్తిగాటు… అధికార్లమంటూ నమ్మించి మోసం చేసే నకిలీగాళ్ళంతా మనుషుల మనసుల్లో ముద్రించబడి ఉన్న ఈ మూస రూపాల సాయంతోనే తమ పబ్బం గడుపుకుంటారు.
అర్భకంగా కన్పించే వ్యక్తి మామూలు బట్టలు వేసుకుని ఓ వ్యాపార సంస్థకెళ్ళి ‘నేను ఇన్‌కమ్‌టాక్స్ అధికారిని’ అంటే అతను నిజంగానే అధికారి అయినా సదరు సంస్థ యజమాని నమ్మడు. వంద రకాల అనుమానాలతో అతన్ని శల్యపరీక్ష చేస్తాడు. అదే సూటూ బూటుతో కార్లోంచి దిగి, డాబూ దర్పం ప్రదర్శిస్తూ, హడావిడి చేస్తే అతను నకిలీ అయినా నమ్ముతాడు. ప్రశ్నించడానికి వెనుకాడతాడు.
నాకు మా ఆఫీస్‌లో జరిగిన ఓ సంఘటన గుర్తిస్తోంది. చీఫ్ కమీషనర్ గారి కారు ఆయకర్ భవన్ ఆవరణలోకి ప్రవేశిస్తూ ఉండగానే బజ్జర్ మోగుతుంది. వెంటనే రెండు లిఫ్ట్‌లలో ఒక లిఫ్ట్‌ని ఆపేసి ఉంచుతారు. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి లిఫ్ట్ దగ్గర వారికోసం ఎదురుచూస్తూ నిలబడతాడు. చీఫ్ కమీషనర్ గారు లిఫ్ట్ ఎక్కి వెళ్ళేవరకు ఆ లిఫ్ట్‌ని మరెవ్వరూ ఎక్కడానికి వీల్లేదు.
కొన్నేళ్ళక్రితం బదిలీమీద హైద్రాబాద్ వచ్చిన ఓ చీఫ్ కమీషనర్ గారు బాధ్యతలు చేబట్టారు. ఆయన చాలా ఆదర్శవాది. ఆర్భాటాలకు చాలా దూరంగా ఉండేవారు. టైలు, సూట్టూ బూట్లు… వారికి నచ్చేవి కావు. చాలా సాధారణమైన బట్టలు ధరించేవారు. మొహంలో ప్రేమ, కరుణ తప్ప దర్పం కన్పించేది కాదు. చప్రాసీతో కూడా చాలా దయగా మాట్లాడేవారు. వారికి ఈ లిఫ్ట్ దగ్గర చీఫ్ కమీషనర్ కోసం జరిగే తతంగం నచ్చలేదు. వెంటనే ఆర్డర్ జారీ చేశారు. చీఫ్ కమీషనర్ వస్తున్నదానికి గుర్తుగా బజ్జర్ మోగించనవసరం లేదు. పీఆర్వో ఆఫీస్ ఉద్యోగి ఎవ్వరూ అతని కోసం లిఫ్ట్ వద్ద నిలబడాల్సిన అవసరం లేదు. చీఫ్ కమీషనర్ కోసం లిఫ్ట్‌ని మిగతా ఉద్యోగులు ఎక్కకుండా ఆపటం సరైంది కాదు. చీఫ్ కమీషనర్ కూడా మిగతా ఉద్యోగులకు మల్లే అతనో ఉద్యోగి. అంతే.
చాలా గొప్ప వ్యక్తి… మహానుభావుడు. అందులో అనుమానం లేదు. కానీ ప్రజల్లో నాటుకుపోయిన మూస ఆహార్యాల కారణంగా ఓ రోజు అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం. లిఫ్ట్ పైకి వెళ్తోంది. దానికోసం ఎదురుచూస్తున్న క్యూలో ముందు చీఫ్ కమీషనర్ గారు నిలబడి ఉన్నారు. వారి వెనక నలుగురు ఉద్యోగుల తర్వాత నేను నిలబడి ఉన్నాను. నా వెనుక ఓ స్టెనో నిలబడి ఉన్నాడు. అతను నా దగ్గర పని చేసే స్టెనోనే.
లిఫ్ట్ కిందికి దిగుతూ మూడో అంతస్థులో ఆగిపోయింది. క్యూలో ముందు నిలబడి ఉన్న చీఫ్ కమీషనర్ గారు అది కిందికి రావడానికి నొక్కే బటన్ని నొక్కారు. కదలిక లేదు. మరోసారి నొక్కారు. లిఫ్ట్‌లో చలనం లేదు. మూడోసారి నొక్కినపుడు నా వెనుక నిలబడి ఉన్న స్టెనో “ఎందుకలా నొక్కుతావు? కొద్దిసేపు ఓపిక పట్టలేవా?” అంటూ అరిచాడు. క్యూలో ఉన్న మిగతావాళ్ళమంతా బాంబు పేలినట్టు భయకంపితులమై బొమ్మల్లా నిలబడిపోయాం. బటన్ నొక్కింది చీఫ్ కమీషనర్ అని ఆ స్టెనోకి తెలియదు. వారి వస్త్రధారణ, రూప విలాసాలు చూస్తే చిన్నస్థాయి ఉద్యోగి అనో లేకపోతే ఏ ఆడిటర్ దగ్గరో పనిచేసే గుమాస్తా అనో అనుకుంటారు తప్ప పెద్ద హోదాలో ఉన్న అధికారి అనుకోరు.
చీఫ్ కమీషనర్ గారు గొప్ప సంస్కారవంతులు. ఆ స్టెనో వైపు తిరిగి నవ్వుతూ “సారీ” అన్నారు. ప్రళయమేదో విరుచుకు పడబోతుందని భయపడిన మేమంతా వూపిరి పీల్చుకున్నాం. ఆ తర్వాత నేనే స్టెనోని వారి ఛాంబర్‌కి పంపించి సారీ చెప్పించాను. ఇలా జరగడానికి కారణం మనుషుల మనసుల్లో ముద్రించుకుపోయిన మూస స్వరూపాలే.
మా చీఫ్ కమీషనర్ గారి ఆదర్శాలు అలా ఉంటే చాలా చిన్నస్థాయి ఉద్యోగులు కొంతమంది ప్రవర్తన మరోలా ఉంటుంది. మా రేంజ్‌లో ఓ ప్యూన్ పని చేస్తూ ఉండేవాడు. ఆరడుగుల ఎత్తుంటాడు. ఎత్తుకి తగ్గ లావు. మనిషి మంచి రంగు కూడా. రోజూ సఫారీ సూట్ వేస్కుని ఆఫీస్ కొచ్చేవాడు. ఫ్యూన్లకి నిర్దేశించబడిన యూనిఫాం ఉన్నా ఎవ్వరూ పాటించేవాళ్ళు కాదు. అధికారులెవ్వరూ పట్టించుకునేవాళ్ళు కాదు. దానికి వాళ్ళ యూనియన్ బలమైనది కావడం కూడా కారణమే. అతను నడిచేటప్పుడు చూడాలి. ఛాతీని ఓ అంగుళం పొంగించి, సుయోధనుని పాత్రలో ఎన్టీ రామారావు నడిచినట్టు నడిచేవాడు. ఎప్పుడైనా సర్వేలకు వెళ్ళాల్సి వస్తే ఆఫీసర్లు అతన్ని పిల్చుకెళ్ళడానికి భయపడేవారు. అతని ఎత్తూ, సఫారీ సూటు, ఎన్టీ రామారావు నడక చూసి అతన్ని తమ పై అధికారి అని షాప్ యజమానులు అనుకునే ప్రమాదముందని వాళ్ళ భయం.
అతన్ని పిలిచి ‘నువ్వు చప్రాసీవి కాబట్టి ఆఫీస్‌కి సఫారీ తొడుక్కుని రాకూడదు. మామూలు బట్టలే వేసుకుని రావాలి’ అని చెప్పటం ఎంత వరకు న్యాయం? అతని బట్టలు అతనిష్టం. ఓ కమీషనర్‌కి తను కమీషనర్ కావటం గొప్పయితే ఆ ఫ్యూన్‌కి తను ప్యూన్ ఉద్యోగంలో ఉండటమే గొప్ప కావొచ్చు. అసలు ఆఫీసర్ అంటే సూటూ బూటు వేసుకోవాలనీ, చప్రాసీ వేసుకోకూడదని విభజన రేఖ గీసిందెవరు? మనుషుల్ని వాళ్ళ హోదాని బట్టి ఇలాంటి చట్రాల్లో బంధించడం వల్లనే కేటుగాళ్ళు నకిలీ అధికార్లుగా చలామణి అవుతూ ప్రజల్ని మోసం చేయగలుగుతున్నారు.
మనుషుల రూపు రేఖల్ని బట్టి, వస్త్రధారణని బట్టి ఆఫీసరో కాదో అనే నిర్ణయానికి రాకుండా ప్రతి వ్యక్తి వాళ్ళ ఐడీ కార్డుని నిశితంగా పరిశీలించటం నేర్చుకోవాలి. ఐడీ కార్డుని అడగడం అలవాటు చేసుకోవాలి. అడిగినపుడు ఐడీ కార్డ్ చూపటం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత అనే విషయం గుర్తుంచుకోవాలి. ఆఫీసర్ అంటే ఇలా ఉంటాడు, బంట్రోతు అయితే ఇలా ఉంటాడు లాంటి మూస అభిప్రాయాల్లోంచి ప్రజలు బైటపడితే గాని నకిలీగాళ్ళ నుంచి రక్షణ ఉండదు.