మోరల్ వాల్యూస్

0
60

[‘అభినందన’ సంస్థ (విజయనగరం) జూలై 2022లో నిర్వహించిన మినీ కథల పోటీలో బహుమతి పొందిన కథ]

చెక్కు పైన ఆ అమౌంట్ ఫిగర్ చూసి ఆశ్చర్యపోయాడు సుబ్బారావు.

అతని ముఖకవళికలు గమనించి, “మార్కెట్ లోకి ఏదో న్యూ వెర్షన్ బైక్ వచ్చిందట. మా అబ్బాయి ముచ్చటపడ్డాడోయ్! పిల్లలు సరదాపడ్డ కోరిక కూడా తీర్చలేకపోతే తల్లిదండ్రులుగా ఇంకా మనమెందుకు!? చూడు సుబ్బారావ్.. ఇది ఫైవ్ జీ కాలం! మనమే అప్‌డేట్ అవ్వాలి. అన్నట్టు మీ అబ్బాయి కూడా ఎంసెట్‍కి ప్రిపేర్ అవుతున్నట్లుంది. కనీసం కొడుక్కి మోపెడ్ అయినా కొనిచ్చావా?” నవ్వుతూ తన స్థాయి గురించి గొప్పగా చెప్పాడు మేనేజింగ్ డైరెక్టర్ నందనరావు.

అతనలా తన లేమితనాన్ని అవహేళన చేస్తూ మాట్లాడడం మనసుకు చాలా బాధ కలిగించింది సుబ్బారావుకి. అయినా లోలోపల తమాయించుకున్నాడతడు. పైకి ఏమీ అనలేదు. ఎందుకంటే అతను తన బాస్ కాబట్టి.

చదువులో మెరిట్ స్టూడెంట్ అవడం వలన తలకు మించిన భారమని తెలిసినా తన కొడుక్కి నఛ్చింది చదివిస్తున్నాడు సుబ్బారావు.

అతను ఆ ఆఫీసులో క్లర్క్‌గా పని చేస్తున్నాడు.

***

ఆ రోజు ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి.

తన ఛాంబర్ లోకి స్వీట్ బాక్స్‌తో వచ్చిన సుబ్బారావుని, “ఏంటి సుబ్బారావ్! ఏదన్నా విశేషమా..!?” అనుమానంగా అడిగాడు నందనరావు.

“విశేషమే సార్! మా అబ్బాయికి ఎంసెట్‌లో టాప్ ర్యాంక్ వచ్చింది!” ఆనందంగా చెప్పాడు సుబ్బారావు.

ఆఫీసుకు వచ్చాడే గాని ఉదయం నుంచి చాలా మూడీగా ఉన్నాడు నందనరావు. కారణమేమిటంటే.. తన కొడుక్కి ఎంసెట్‍లో ఎవరికీ చెప్పుకోలేని అతి దారుణమైన ర్యాంక్ వచ్చింది మరి!

ముఖం ఎత్తకుండానే సుబ్బారావు అందించిన స్వీట్ తీసుకున్నాడు. ఓ క్లర్కు ముందు తన పరువు పోయి, చాలా అవమానకరంగా అనిపించింది నందనరావుకి.

తిరిగి వెళ్తున్నవాడల్లా ఒక్కసారిగా వెనక్కి తిరిగి “నా ఆర్థిక పరిస్థితిని బట్టి నా కొడుక్కి కనీసం మోపెడ్ అయినా కొనివ్వలేకపోయాను. కానీ వాడు జీవితాంతం తన కాళ్ళపై తాను నిలబడేలా విలువైన ‘మోరల్ వాల్యూస్’ నేర్పించాను సార్! నా అదృష్టం. నేర్పించిన విలువలని వాడెప్పుడూ పెడచెవిన పెట్టలేదు. ఇదిగోండి ఇలా.. తన బంగారు భవిష్యత్తుకు కష్టపడి బాటలు వేసుకుంటున్నాడు. ఓ తండ్రిగా నాకింకేం కావాలి సార్!” అని డోర్ తీసుకుని వెళ్ళిపోయాడు సుబ్బారావు.

ఆ మాటలు ఎక్కడ తగలాలో అక్కడ తగిలాయి నందనరావుకి.

అప్పుడే అతని చేతిలోని మొబైల్ రింగయ్యింది.

తండ్రి కొత్త బైక్ కొనిచ్చిన సందర్భంగా తన ఫ్రెండ్స్‌కి డ్రింక్స్ పార్టీ ఇచ్చిన కొడుకు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇప్పుడు స్టేషన్‍లో ఉన్నాడని ఆ ఏరియా ఎస్.ఐ. చెప్పడంతో నందనరావు చేతిలోని మొబైల్ జారి కిందపడి భళ్ళున పగిలింది.

అచ్చం అతని మనసులాగే..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here