మార్చురీ

1
1

[box type=’note’ fontsize=’16’] అందరూ నిర్జీవ శరీరాన్ని మార్చురీలో పడేసి తలుపులు మూసేసి విశ్రాంతి తీసుకోడానికి, నిద్రపోడానికి వెళ్ళిపోతే, ఆ విగత జీవి ఆత్మ తన వేదనని వెలిబుచ్చిన కథ గూడూరు గోపాలకృష్ణమూర్తి రచించిన ‘మార్చురీ‘. [/box]

[dropcap]నా [/dropcap]ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోయాయి అనే కన్నా నేను మరణించాను, నాకు ఈ మనష్యులతో, బంధాలు అనుబంధాలతో సంబంధం లేదు అని అనుకున్నాను నేను. అయితే నా ఆత్మకి చావు లేదు. అందర్నీ గమనిస్తోంది. ఆ సంగతి నా వాళ్ళకి తెలిసో తెలియదో? తెలిసి ఉండదు. తిరిగి అనుకున్నాను.

“మీరందరూ వారం రోజుల నుండి నానా హైరానా పడ్డారు. ఈ శవాన్ని మార్చురీలో పడేయండి. రేపొద్దున వచ్చి ఇంటికి తీసుకు వెళ్ళవచ్చు” కోడలి తరుపు వాళ్లు అన్నారు.

‘నేను జీవించి ఉన్నప్పటికీ ఇప్పటికి ఎంత తేడా? అప్పుడు నేను జీవం ఉన్న మనిషిని. జీవం లేని నా శరీరాన్ని ఇప్పుడు శవం అంటున్నారు’ అనుకుని పిచ్చిగా విరక్తిగా నవ్వుకున్నాను.

కోడలి తరుపు వాళ్ళ సలహా తన కొడుక్కీ కోడలికి నచ్చిందేమో ‘అదే మంచిది’ వంతు పాట పాడేరు వాళ్ళు.

కోడలి కయితే బుద్ధి లేదు. తన కొడుక్కుయినా బుద్ది ఉండొద్దూ? కోడలయినా తన వాళ్ళకి అలా చేయనిస్తుందా? అయినా పై ఇంటి నుండి వచ్చిన అమ్మాయిని అనుకోడం ఎందుకు? తన కొడుక్కే ఆ మాత్రం ఇంగితజ్ఞానం లేకపోతే? ఈ సృష్టికి మూలకారణం అమ్మ. బిడ్డ ఎంత దుర్మార్గుడయినా, దుష్టుడయినా అక్కున చేర్చుకుని అమ్మ మాత్రమే అని వాడికి తెలియదా? అయినా పెళ్ళయిన తరువాత ఒక్కనాడయినా నన్ను అమ్మా అని ఆప్యాయంగా పిలిచాడా? తను ఏం పట్టించుకోలేదు. ఎంతైనా కన్న పేగు కదా!

అందరూ నా నిర్జీవ శరీరాన్ని మార్చురీలో పడేసి తలుపులు మూసేసి విశ్రాంతి తీసుకోడానికి, నిద్రపోడానికి వెళ్ళిపోయారు.

చలి.. చలి.. చలి.. ఆ గదిలోని చల్లదనానికి నేను ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. నా పరిస్థితికి నాకే ఏడుపు వస్తోంది. నా నిర్జీవ శరీరానికి ఈ భావోద్వేగాలతో సంబంధం లేకపోయినా నా ఆత్మ ఏడుస్తోంది. వచ్చిన కన్నీళ్ళు తుడుచుకుంటోంది.

నా ఆత్మ విమర్శలో పడింది. చీకటి.. చీకటి.. చీకటి. ఒంటరి.. ఒంటరి.. ఒంటరి.. ఇన్ని సంవత్సరాల జీవితంలోనూ తను ఎన్నడూ ఒంటరిగా ఊడలేదు. చీకటిలో ఇలా అంతకన్నా ఉండలేదు. తను, తన భర్తా తోడు నీడగా మెలిగారు. జీవితం మనల్ని అప్పుడుప్పుడు మట్టి కరిపిస్తూ ఉంటుంది. అయినా లేచి నిలబడి ముందుకుడుగు వేయాలి. మళ్ళీ క్రింద పడినా తిరిగి ధైర్యంగా లేవడానికి ప్రయత్నం చేయాలి తప్ప అక్కడే ఆగిపోకూడదు అన్న జీవిత పాఠాలు నేర్చుకుని ముందుకు అడుగు వేసారు తనూ, తన భర్త.

కూతురితో తన మనసులో మాట కష్ట సుఖాలు చెప్పుకుని ఉపశమనం పొందేవారు తను తన భర్త. ఆ కూతురే తమకి దూరమైపోయిననాడు తిరిగి ఆ జీవిత పాఠాన్నే అలవర్చకున్నారు. ఆ సమయంలో తనకి చదువు చెప్పిన రామ్మూర్తి మాష్టారు గుర్తుకువచ్చారు.

“అమ్మా! మన జీవితం చదరంగం ఆట లాంటిది. ఆ ఆట మనకి అడుగులు వేస్తూ ఉండని చెబుతుంది. మన జీవితంలో గెలవాలంటే ఆడుగులు వేస్తూనే ఉంటాలి. మన జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. ఆ ఆటంకాలను దాటుకుంటూ ప్రయాణం సాగించాలి. ప్రతీ కొత్త అడుగుల కోసం అన్వేషిస్తాం.. మన అడుగుల వలన విజయమైనా లభించవచ్చు. వైఫల్యమైనా రావచ్చు” అని అనేవారు. అయితే తన జీవితంలో వైఫల్యమే లభించింది.

అయినా తన జీవన సరళిని సమర్థించుకుంటూ అప్పుడప్పుడు జీవితంతో రాజీపడ్తూ బ్రతికింది. ఆశలు, మమకారాలు, కోరికలు, ఆనందాలు, ఆవేశాలు, అవమానాలు, ఆక్రందనలు వంటి బావోద్వేగాల సమాహారమే జీవితం. అంతేకాదు కొంతమందికి గత జన్మమీద నమ్మకం ఉండకపోవచ్చు కాని నేను మాత్రం అనుకుంటాను గత జన్మలో చేసుకున్న కర్మల ఫలితాన్నే ఈ జన్మలో మనం అనుభవిస్తున్నాము అని.

తను ఇలా ఎప్పుడయినా ఒంటరిగా బ్రతికిందా? ఊహూ!!! లేదు. తన పెళ్ళి అయ్యే వరకూ కన్నవాళ్ళ మధ్య పెరిగింది. పెళ్ళయిన తరువాత తన భర్త యొక్క అండదండలు పుష్కలంగా తనకి లభించేవి. కష్ట సుఖాల్లో నా వెన్నంటి ఉంటాను అని తన భర్త ప్రమాణం చేసిన విధంగా తనకు అండగా నిలబడ్డాడు భర్త జీవితంలో.

మరి ఆ తరువాత? తన ఒక్కగాని ఒక్క కూతురు చనిపోయిన సమయంలో, కొడుకుకి పెళ్ళయి కోడలు ఇంటికి వచ్చాక ఇంటిలో చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినప్పుడు తను కలత చెందితే తనని ఓదార్చి తనకి స్వాంతన చేకూర్చేవాడు తన భర్త.

“మనకి ఇక్కడి జీవితం మంచిగా లేదనిపిస్తే మన ఇల్లు ఉంది కదా అక్కడికిపోయి మనకి శక్తి ఉన్నన్నాళ్ళు ఒకరికి మరొకరు తోడుగా నిలబడి చివరి ఎవరి చేత మాటలు పడకుండా బ్రతుకుదాం” అని అన్నాడు తన భర్త. దానికి ఫలితమే తమింట్లో ఒకరికి మరొకరు తోడు నీడగా ఉంటూ, అరవయి సంవత్సరాల తమ వైవాహిక జీవితాన్ని గడిపేసారు.

అయితే తన భర్తలో ఒక్క గుణం తనకి నచ్చేది కాదు. చావు వచ్చి, చావాలని మనకి రాసి పెట్టి ఉంటే ఎలాగూ చస్తాము. బ్రతకాలంటే ఎలాగూ బ్రతుకుతాం. ఇంతటి దానికి హస్పిటల్‌కి ఎందుకు? అని మెట్ట వేదాంతం వల్లించేవారు. అంతగా అనారోగ్యంగా ఉంటే మెడికల్ షాపుకి వెళ్ళి మాత్రలు వేసుకుని బాధ నుండి ఉపశమనం పొందేవారు. తన విషయంలోనూ అంతే. ఇదే తనకి నచ్చేది కాదు.

మిక్సీలు, గ్రైండర్లు కాలం వచ్చినా తను మాత్రం పాతకాలం నాటి రుబ్బురోలు లోనే పచ్చళ్ళు మిగతావి రుబ్బుకునేది. ప్రక్కింటి సావిత్రి తన భర్తతో బాబాయిగారూ పిన్నిగారిని ఇలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. మిక్సీ కొనండి అని అంటే అలాగే అనేవారు కాని కొనలేదు. అలా అని డబ్బులేదా అంటే డబ్బు ఉంది. తమ పెన్షను డబ్బులే కుప్పలు. ఏంటో ఆ మనిషితత్వం తనకి అర్థం కాదు.

ఈ మద్య తను పని చేయలేకపోతోంది. ఎవరైనా చేసి పెడ్తే తినాలి అనేదే తన భావన. అయితే తన భర్త అంగీకరించలేదు. “నీవు పని చేయలేకపోతే నేను సాయం చేస్తాను. అంతే కాని మనం ఎక్కడికీ వెళ్ళవద్దు” అని అనేవారు. అయితే తన పోరు పడలేక రాజీ పడ్డ తన భర్త కొడుకు దగ్గరికి వెళ్ళడానికి అంగీకరించారు.

దానికి ఫలితమే ఆరు నెలల క్రితం కొడుకు దగ్గరకి వెళ్ళాం. ఏం జరిగిందో ఏమిటో కాని బాగా తిరుగుతున్న తన భర్తకి అకస్మాత్తుగా అనారోగ్యం చేసింది. ఇంట్లో ఉంచితే ఎవరు చాకిరీ చేస్తారు అనుకున్న ఇంట్లో వాళ్ళు తన భర్తని హాస్పిటల్‌లో పడేసేరు. ఈ పరీక్షలు, ఆ పరీక్షలు అని చెప్పి ఎన్నో పరీక్షలు చేశారు కార్పొరేటు హాస్పిటల్ వాళ్ళు. చివరికి ఇలా హస్పిటల్‌కి వెళ్ళిన మనిషి శవమై అలా శ్మశానానికి వెళ్ళిపోయారు.

భర్త చావుతో తన జీవితం మూగబోయింది. బ్రతుకు శూన్యమయిపోయింది. తన ఆశాసౌధాలు కూలిపోయాయి. అందరూ ఉన్నా భర్త తోడు లేకుండా ఒంటరి అయిపోయింది.

జీవితంలో తోడును కోల్పోయిన తనకి నిస్సత్తువ ఆవరించింది. పరీక్ష చేసిన డాక్టర్లు తనకి కేన్సరు అన్నారు. ఎక్కువ రోజులు బ్రతకనని అన్నారుట. ఇవేవీ తనకి తెలియదు.

తన భర్త చేయించిన బంగారు వస్తువులు భర్త చనిపోయిన తరువాత గొలుసు చేయించి నా మెళ్ళో వేసింది కోడలు. నా భర్త చేయించిన బంగారమే అని తెలిసినా నా కొడుకు ఈ గొలుసు నాకు చేయించాడు అని అందరితో చెప్పుకునేదాన్ని. ఎందుకంటే కొడుకు చేయించక పోయినా వాడ్ని చిన్నబుచ్చలేను కదా.

కోడలు కాళ్ళు వత్తుతున్నట్లు, తడిగుడ్డతో తుడుస్తున్నట్లు, అన్నం చెంచాతో తినిపిస్తున్నట్లు చేసిన పనుల్లో తనకు సహజత్వం అగుపించేది కాదు. మెప్పు కోసం చేస్తున్నారా అని అనిపించేది.

తన భర్త తనని విడిచి ఎన్నాళ్ళో అవలేదు. నన్ను తన దగ్గరికి రమ్మనమని తన భర్త పిలుస్తున్నట్లు కలలు వచ్చేవి. నిద్ర పట్టేది కాదు. ఈ మధ్య నా పరిస్థితి ఏం బాగులేదు. తనకి అన్ని పరీక్షలూ జరిపిస్తున్నారు. నా అవయవాలన్నీ పాడయి పోయాయిట. తనకి కేన్సరు జీవన చరమాంకంలో ఉందట తను. ఈ విషయాలేవీ తనకి తెలియవు. నన్ను హాస్పిటల్‌లో జాయిను చేశారు. ఇంట్లో ఉంచుకుని సేవ చేసే ఓపిక ఎవరికీ లేదు.

మొక్కుబడిగా వస్తున్నారు వెళ్తున్నారు కుటుంబ సభ్యులు. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారన్నట్లు తన ప్రాణాలు పంచ భూతాల్లో కలిసిపోయాయి. ఆ తరువాత సంఘటన తను ఇలా మార్చురీలో నిర్జీవ శరీరంతో ఉంటే తన ఆత్మ నరకయాతన బాధ అనుభవిస్తోంది. ఆలోచనా ప్రపంచం నుండి బయట పడింది నా ఆత్మ.

ఉదయం అయినట్లు ఉంది. తలుపులు తెరుచుకున్నాయి. బయట నుండి వచ్చిన వెలుగు రేఖలు నా నిర్జీవ శరీరంపై పడ్డాయి. నా శరీరం రాత్రి చల్ల దనానికి గడ్డకట్టుకు పోయింది. ఇంత వరకూ ఎంత క్షోభని అనుభవించింది నా ఆత్మ. నాకు పుట్టెడు బలగం ఉంది. నా శవాన్ని నా ఇంటికి తీసుకెళ్ళవచ్చు కదా. అలా కాకుండా ఈ అనాథ ప్రేతంలా నన్ను ఈ శవాల గదిలో పడేసేరు అని అనుకున్నాను నేను. అలా చేయకుండా రాత్రంతా ఒంటిరిగా చీకటి గదిలో ఉండవల్సి వచ్చింది తిరిగి అనుకున్నాను ఆత్మకి భయమేంటి అనుకున్నారు కాబోలు.

వాహనంలో నన్ను ఉంచి అప్పుడు ఇంటికి తీసుకెళ్ళారు. అదే రాత్రి సమయంలో తీసుకు వెళ్తే రాత్రంతా జాగారం ఉండాలి ఎందుకొచ్చిన బాధ అని అనుకుని ఉంటారు. ఇంటికి తీసుకెళ్ళినా నా ఆత్మకి శాంతి లేకుండా పోయింది.

నా కోడలు ఏడుస్తోంది. నా కొడుకు కళ్ళు తుడుచుకుంటున్నాడు. వారి ఏడుపుల్లో సహజత్వం నాకు అగుపించలేదు. ఏదో మొక్కుబడి తీర్చుకున్నట్లున్నాయి వారి ఏడ్పులు.

“ఎందుకే అలా కళ్ళు కాయలు కాసిపోయేలా ఏడుస్తున్నావు. నీ అత్త మామలకి నీవెంత చేశావో మాకు తెలియదా, చేయి కడిగి అన్నం పెట్టేదానివి. ఎవరో బుద్ధితక్కువవాళ్ళు ఏదో అన్నారని ఎందుకలా బాధపడ్తావు” ఎవరో ఒక ఆవిడ గట్టిగా అరుస్తున్నట్లు అంటోంది.

మా కుటుంబం గురించి తెలిసిన ఒకాయన “ఎందుకలా అరుస్తున్నారు. ఆ ఏడుపు నాటకాలేంటి, అయినా అనర్థం ఏదో అయిపోయింది. రాత్రంతా అనాథ శవంలా మార్చురీలో ఉండి ఉండి ఆ ఆత్మ ఎంత క్షోభకి గురయిందో. ఇంటికి తీసుకు వచ్చిన తరువాత కూడా ఆత్మకి శాంతి లేకుండా చేస్తారా. శ్మశానానికి తీసుకెళ్ళే లోపున ఆత్మ శాంతికి ఏవో భక్తి శ్లోకాలు చదవండి” అని గట్టిగా పెచ్చరించారు. అందరి నోళ్ళు మూత పడ్డాయి.

అక్కడ ఎందరో తల్లి తండ్రులున్నారు. ఈ మార్చురీ విషయం తెలుసుకుని రేపొద్దున్న తమ బ్రతుకులు ఏంమవుతాయో తమ పిల్లలు కూడా అలాగే చేస్తారా తమ బ్రతుకులు ఎలా ఉంటాయో అని నిశ్శబ్దంగా మౌనంగా ఆలోచిస్తున్నారు. అందరి మనస్సుల్లో ఉన్న గుబులు ఆత్మ అయిన నాకు తెలుస్తున్నాయి.

పురోహితుడు వచ్చారు. కొడుకూ కోడలూ స్నానాలు చేసి వచ్చారు. బంధువులు కూడా స్నానాలు చేసి వచ్చారు. నా చుట్టూరా తిరగడానికి అక్కడ జరపవల్సిన తంతంతా విధి పూర్వకంగా జరిపించారు. నన్ను కట్టేమీద చేర్చి తాళ్ళతో కట్టి శ్మశానానికి నన్ను సాగనంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

నాలో వైరాగ్యం భావం పెల్లుబుకుతోంది. పుట్టినప్పుడు ఒంటరే, పోయేటప్పుడు ఒంటరే. ఈ మధ్య జీవితంలోనే బంధాలు, రాగద్వేషాలు. భావోద్వేగాలు, భావోద్రేకాలు, బంధుత్వాలు…. విరక్తిగా నవ్వుకుంటూ అనుకున్నాను.

శ్మశానంలో నా కొడుకు తలకొరివి పెట్టి నిర్వికారంగా ఎటో చూస్తూ కూర్చున్నాడు. నా నిర్జీవ శరీరం అగ్ని జ్వాలల మధ్య ఆహుతి అయిపోయింది. మంట.. మంట.. వేడి.. వేడి.. అది నా ఆత్మకి కూడా తాకుతుంది. దూరంగా ఉండి ఆ దృశ్యాన్ని చూస్తున్నాను నేను. ఆ నిర్జీవ శరీరం బుడిదగా మారిపోయింది.

అది చూస్తూ గాఢంగా నిట్టూర్పు విడిచాను నేను. ఆత్మ పరమాత్మలో ఐక్యమవుతుందని అంటారు. కాని నా ఆత్మ మాత్రం ఈ కలియుగం మనుషుల మధ్యే తిరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here