[పాలస్తీనా కవి మోసాబ్ అబు తోహా రచించిన మూడు మినీ కవితలని తెలుగులో అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి. Telugu Translation of Mosab Abu Toha’s three mini poems by Mrs. Geetanjali.]
~
1. మా జ్ఞాపకాలు పూల లాంటివి (Memories Are Flowers by Masab Abu Toha)
~
అవును.. మా జ్ఞాపకాలు పూల లాంటివి.
మేము వాటికి నిత్యం నీరు పోస్తూ బతికించుకుంటూ ఉంటాం
మా అపురూపమైన జ్ఞాపకాలను వ్యాఖ్యానిస్తాం!
కవిత్వంగా మార్చి రాస్తాం!
నాటకం గానో.. కథలుగానో కూడా రాస్తాం!
గాజా నగరంలో ఉన్న క్లబ్బులలో..
అందమైన పూల లాంటి మా జ్ఞాపకాల్ని
వెలిగిపోయే లైట్ బల్బులతో..
రకరకాల ప్రతీకలతో
భిన్నమైన రంగులతో అలంకరిస్తాం.
అయితే కొన్ని జ్ఞాపకాలు మాత్రం చాలా చీదరగా కుళ్లిపోయి ఉంటాయి.
వాటినుంచి వికారమైన వాసన వస్తూ ఉంటుంది.
ముతకైన.. గుచ్చుకునే చర్మంతో ఉంటాయి ఆ స్మృతులు.
ఎంత లోతుగా ఆ మృత ఎముకలను పాతిపెట్టినా..
జ్ఞాపకాల పురుగులు మాత్రం వాటి దారి అవి చేసుకుంటూనే ఉంటాయి.
అయినా సరే.. మాకు జ్ఞాపకాలు పరిమళించే పూల లాంటివే!
*
2. పేరు లేని కవిత (Nameless poem by Masab Abu Toha)
~
ఒక తండ్రి అర్థరాత్రి ఉలిక్కిపడి లేచి గోడల వైపుకి గ్లానిగా చూస్తాడు.
గోడలపైన నాలుగేళ్ల కొడుకు గీసిన రంగు రంగుల బొమ్మలు కనిపిస్తాయి.
కానీ ఆయన కొడుకు బాంబుల దాడిలో చనిపోయాడు!
ఆ తండ్రికి దుఃఖం కమ్ముకు వస్తుంది.
గోడ మీద రంగులు నాలుగు అడుగుల ఎత్తులో ఉన్నాయి.
అచ్చం తన కొడుకంత ఎత్తున!
వచ్చే ఏడాది కల్లా అవి 5/6 అడుగుల పొడవు పెరగవచ్చు.
కానీ ఆ చిన్ని చిత్రకారుడే లేడు.. మరణించాడు!
మ్యూజియంకి కొత్త చిత్రాలు కూడా లేవు!
*
3. గులాబీ భుజాలు ఎత్తి ఠీవిగా నిలబడుతుంది! (A Rose Shoulders Up by Masab Abu Toha)
~
గాజాలో ఎక్కడైనా ధ్వంసమైన శిధిలాల లోంచి
వికసించిన గులాబీ అలా దర్పంగా నిలబడితే..
ఆశ్చర్యపోకండి!
అవును.. ఇక్కడ యుద్ధ భూమిలో మేమిలాగే బతుకుతూ ఉన్నాము.
తాజా గులాబీలా కొత్త ఆశలతో!
~
మూలం: మోసాబ్ అబు తోహా (Mosab Abu Toha)
అనువాదం: గీతాంజలి (Geetanjali)
అతని మొదటి కవితల పుస్తకం, Things You May Find Hidden in My Ear, ఏప్రిల్ 2022లో సిటీ లైట్స్ ద్వారా ప్రచురించబడింది.
ఈ పుస్తకానికి అమెరికన్ బుక్ అవార్డ్, పాలస్తీనా బుక్ అవార్డ్, ఆరోస్మిత్ ప్రెస్ వారి 2023 డెరెక్ వాల్కాట్ పోయెట్రీ ప్రైజ్ లభించాయి.
ప్రస్తుతం భార్యా, ముగ్గురు పిల్లలతో జబాలియా లోని ఐక్యరాజ్యసమితి శరణార్థుల శిబిరంలో తలదాచుకుంటున్నాడు.