[box type=’note’ fontsize=’16’] మార్చ్ 24, 25 తేదీలలో విశాఖపట్నంలో మొజాయిక్ సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో జరిగిన రెండు రోజుల సెమినార్, మొజాయిక్ సాహిత్య పురస్కార ప్రదానోత్సవ సభ వివరాలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు సలీం. [/box]
విశాఖపట్టణంలో గత పదిహేనేళ్ళుగా అనేక సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ప్రసిద్ధి గాంచిన ‘మొజాయిక్ సాహిత్య సంస్థ’ మార్చి 24, 25 తేదీల్లో ప్రముఖ రచయిత సలీం రచనల మీద రెండు రోజుల సెమినార్ నిర్వహించింది. మొదటి రోజు సాయంత్రం విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన సభలో తాడికొండ నియోజక వర్గం శాసన సభ్యులు శ్రీ తెనాలి శ్రావణకుమార్ గారు మొజాయిక్ సంస్థ లోగోని ఆవిష్కరించి ప్రసంగించారు. ఆంధ్రా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య జి. నాగేశ్వరరావు గారు ‘జషన్-ఏ- సలీం’ పవర్ పాయింట్‌ని సమర్పించారు. మొజాయిక్ సాహిత్య సంస్థ పదిహేనవ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన ‘మొజాయిక్’ సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ కథా, నవలా రచయిత సలీంకు ప్రముఖుల చేతుల మీదుగా ప్రదానం చేయటం జరిగింది. ఈ పురస్కార ప్రదాన కార్యక్రమానికి శ్రీయుతులు తెనాలి శ్రావణకుమార్, ఆచార్య జి. నాగేశ్వరరావు, దాడి వీరభద్రరావు, డా. బి. యస్. ఆర్. మూర్తి గార్లతో పాటు శ్రీ రామతీర్థ, శ్రీ ఎల్. ఆర్. స్వామి, శ్రీ పి. జయశీలరావు తదితరులు పాల్గొన్నారు.
తదుపరి శ్రీ ఎల్. ఆర్. స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సలీం నవల ‘అరణ్య పర్వం’ మీద ప్రముఖ రచయిత శ్రీ అట్టాడ అప్పల్నాయుడు ప్రసంగించారు. డా. మాటూరి శ్రీనివాస్ గారు సలీం నవల ‘మరణ కాంక్ష’ను మెర్సీకిల్లింగ్ మీద ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో విశ్లేషించారు. ప్రముఖ కవి శ్రీ శిఖామణి గారు సలీం కవితా సంపుటి ‘విషాద వర్ణం’ మీద ప్రసంగించారు.
మరుసటి రోజు ఉదయం పదింటికే మొదటి సమావేశం ఆచార్య వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి గారి శుభాశీస్సులతో ప్రారంభమైంది. సలీం నవలలు, బాల సాహిత్యం, కథల గురించి యువ స్వరాలైన కవిదాసు, మానాపురం రాజాచంద్రశేఖర్, పి. రాజేష్, విరియాల గౌతం చేసిన ప్రసంగాలు సభికుల్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రముఖ రచయిత్రి విజయభాను కోటె కుమారుడు తొమ్మిదో తరగతి చదువుతున్న రాజిత్, సలీం బాలల కోసం రాసిన సైంటిఫిక్ ఫిక్షన్ ‘మేధ 017’ ని పరిచయం చేసిన తీరు అందర్నీ అబ్బురపరిచింది. తదుపరి సమావేశంలో ఆచార్య చందు సుబ్బారావు గారి అధ్యక్షతన జరిగిన ‘సలీం కవిత్వావలోకనం’లో ప్రముఖ రచయిత శ్రీ గంటేడ గౌరునాయుడు, శ్రీ రామతీర్థ ప్రసంగించారు.
భోజన విరామం తర్వాత శ్రీ శంకు దర్శకత్వంలో దూరదర్శన్ కోసం నిర్మించిన సలీం కథా చిత్రా లు ‘క్రిష్ణబిలం’, ‘తుఫాను ప్రదర్శించబడ్డాయి. తర్వాత జరిగిన సెషన్లో ప్రముఖ రంగస్థల నటులు, దర్శకులు శ్రీ చలసాని కృష్ణప్రసాద్ గారు ‘వెండి మేఘం’ నవలని నాటకీకరించే ప్రతిపాదన చేశారు. అనంతరం ‘సలీం కథా వీక్షణం’ లో ‘రూపాయి చెట్టు”, ‘నీటిపుట్ట’ కథా సంపుటాల్లోని కథల గురించి ప్రముఖ కథా రచయిత మంజరి, రచయిత్రి శ్రీమతి విజయభాను కోటే ప్రసంగించారు. మధ్యాహ్నం నాలుగింటికి శ్రీ జయశీలరావు గారి అధ్యక్షతన మొదలైన ‘మొజాయిక్ 15- ఆశీరభినందనలు’ సదస్సులో పలువురు ప్రముఖులు తమకు మొజాయిక్ సంస్థతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇదే సదస్సులో శ్రీ జయశీలరావు గారు చతురలో ప్రచురించబడిన సలీం నవలిక ‘లిటిల్ జూలీ’ గురించి మాట్లాడుతూ వాళ్ళింట్లో పెంచుకున్న కుక్కల గురించిన జ్ఞాపకాల్ని పంచుకున్నారు.
శ్రీ తూమాటి సంజీవరావు సంపాదకత్వంలో వెలువడిన వ్యాససంపుటి ‘తెలుగు సాహిత్యంలో దేశభక్తి’ ఆవిష్కరణ ఆంధ్రా యూనివర్శిటీ రిజిస్ట్రార్ శ్రీ ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా జరిగింది. తేనీటి విరామం తర్వాత మొదలైన సాయంత్ర సభలో ‘మొజాయిక్ 15- దృశ్యోత్సవం’ ద్వారా గత పదిహేనేళ్ళుగా మొజాయిక్ సాహిత్య సంస్థ నిర్వహించిన ముఖ్యమైన సాహిత్య సభల్ని అప్పటి ఫోటోలతో సహా శ్రీ రామతీర్థగారు వివరించారు.
తదుపరి శ్రీ ఎస్.కె. బాబు అధ్యక్షతన జరిగిన ‘సలీం నవలా పరిశీలనం’ సదస్సులో డా. సీతారత్నం గారు “అనూహ్య పెళ్ళి’ నవల గురించి, బులుసు సరోజిని, పెబ్బిలి హైమావతి గార్లు ‘మౌనరాగాలు’ నవల గురించి, గరిమెళ్ళ నాగేశ్వరరావు గారు ‘పడగనీడ’ నవల గురించి, జగద్ధాత్రి గారు ‘వెండి మేఘం’ నవల గురించి ప్రసంగించారు. మొజాయిక్ సాహిత్య పురస్కార గ్రహీత శ్రీ సలీం స్పందనతో రెండ్రోజుల సమావేశాలు ముగిశాయి.