మోతి

0
1

[శ్రీపార్థి గారు రాసిన ‘మోతి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఈ[/dropcap] ఇంటికి నేనే పెద్ద పులిని. నన్నుగాదని ఎవడన్న లోపలికత్తడ. అత్తే ఆని పిక్క నా నోట్లుంటది.

నేనంటే యేవరనుకున్నారా, ఈ ఇంటి కుక్కను. నా పేరు మోతి. కుక్కనని తీసిపారేయకుండ్రి, నా సంగతి దెల్వది మీకు. ఇంటిముంగట నేను గూసుంటే ఎవడన్న అత్తడ ఇట్ల, నన్ను జూత్తనే లాగుల ఉచ్చబోసుకోవాలే అట్లుంట మరినేను.

అగో! ఇంట్లకెళ్లి మా పసిగాడచ్చిండు, గీడే నన్ను పెంచెటోడు. పసిగాడంటే ఎవరనుకున్నర, మా పెద్ద పటేలు రెండో కొడుకు, వీడు నేను సమానం. వీడు బడి ఎగనూకుతే ఇద్దరం గలిసి ఊర్లే వున్న షేండ్లపొంట, షింతలపొంట, షర్లపొంట, బాయిల పొంట తిరుగుడే తిరుగుడు, గిదే మా పని. ఇగ మా పటేలు పెద్ద కొడుకును ఎప్పుడైతే నేను జూల్లె. ఆయన పట్నంలో వుంటడు అని మా పటేలమ్మ అనంగ ఇన్న.

“తిండి బెట్టవురా పసిగా ఆకలైతాంది, తిండి అంటే ఏమో నెత్తిమీద షెయ్యివెట్టి దువ్వుతడు, సరేకాని ఆయింక దిందాం తియి మరి”

బజారుపొంట మా ఇంటికెళ్లి ఎవడో అత్తాండు మెల్లగ.. షావుకార్ల పిలగానిలెక్కున్నడు

“ప్రసాదన్నా కుక్కను గట్టిగ వట్టుకో, ఆయింత నామీద వడ్తది, పట్టుకో పట్టుకో”

“యేమనది పో.. నేనున్నగద, మోతి కూసో ఈడ”

“నేను పట్టుకున్న పో”

“మొన్న మీదికుర్కచ్చిందన్నా, గందుకని”

అరేయ్! ‘పసిగా’ ఇడువుర వీని సంగజూత్త, మొన్నవీడు బండవట్టి కొట్టుటానికచ్చిండు నా మీదికి ఇడువురా.. నువ్విడువురా వీని సంగజూత్త, పిక్క గుంజి పోషవతల్లి గద్దెమీద వెడ్త, యేవనుకుంటాండో పోరడు.

అబ్బా.. పోరడు ఒక్కటే ఉర్కుడు ఉర్కుతాండు గదనే, ఇడువురా అంటే ఇడ్వకపోతివి.

అగో మా పటేలచ్చిండు బయిటికి, యేటో బోతాండు, గీ పటేలయితే ఉత్త బోలా మనిషి. యేం దెల్వది, ఈనే తండ్రి సంపాయించిన జాయిదాదంతా (ఆస్తి) ఉత్తపుణ్యానికి పోగొట్టిండని మా పటేలమ్మ ఆయన లేకుంట జూసి తిడ్తనే వుంటది.

అగో మా షిన్నపోరడెమో మా పటేలు ఎన్కవడి ఉర్కుతాండు. గాడు మా పటేలు షిన్న కొడుగ్గని.

ఇగ మాపసిగాడు లేసిండు. యేడికో తిరుగబోవుడే వుంటది మేము.

***

నేను పుట్టి కండ్లు దెర్షినంక మా అమ్మ నన్ను ఇడ్సిపెట్టి యేడికోపోతే, జర ఊషారున్ననని మా పసిగాడు నన్ను ఈ ఇంటికి పట్కచ్చిండట. రోజు అన్నం బెట్టుడు, పాలు బోసుడు, తానం జేపిచ్చుడు అన్ని ఆడే జేసిండు. ఇగ గాన్ని యేట్ల ఇడిసిపెడత నేను.

ఇంట్ల అందరు నన్ను మంచిగ జూసుకుంటరు గా ఉప్పిగాడు దప్ప. ఉప్పిగాడంటే ఎవరనుకున్నర ఉపేందరు. గాడు మా పటేలు తమ్ముడు. ఎప్పుడు జూసిన ఇంట్లనే పడి యేడ్తడు. యేదన్న పన్జేసుకోరా అని మా పటేలు యేటన్న పంపుతే తీస్కపోయిన సామాను, ఇచ్చిన పైసలు అన్ని ఒడజేసి మళ్ల ఇల్లుజేరుతడు. ఎవ్వలకు దెల్వకుంట ఇంట్లున్న పాత సామాను అమ్ముకొని తినుడు తాగుడు ఇదే పని.

ఒకసారి మా ఇంటికి రాత్రిపూట ఇద్దరు దొంగలు అచ్చిండ్రు, నేనూకుంటన అండ్ల ఒగని పిక్కలు పీకి ఆడ గూసుండవెట్టిన, ఇంకోడు తప్పిచ్చుక పోయిండు. ఆడు ఉప్పిగాడేమోనని అప్పటి సంది నాకు ఉప్పిగాని మీద అనుమానం. ఒకసారి ఉప్పిగాడు బగ్గదాగి ఊరవుతల మంచిళ్ల బాయికాడ పడిపోతే, యేడబోయిండని ఇల్లంత పరేషానైతే నేనే దొర్కవట్టి మా ఇంట్లజెప్పిన. గింతగూడ విశ్వాసం లేదు ఉప్పిగానికి, నన్ను జూత్తే జాలు అస్సలు ఓర్వడు. అన్నిటికి అడ్డం వున్ననని.

ఇగ అప్పటిసంది మా పటేలమ్మ నన్ను గూడ కొడుకులెక్క మంచిగ జూసుకుంటది. యేమనది, యేల్లకు ఇంత అన్నం బెడ్తది. అప్పుడప్పుడు కోడి బొక్కలు గూడ యేత్తది.

ఇంట్ల శాకం (మాంసం) కూర అండితే మా పటేలు గంట దింటడు అన్నం. ఇగ నేను ఆయన దగ్గర్నే గూసుంట. పెద్ద పెద్ద బొక్కలన్ని నాకేత్తడు. అయన్ని గంకుడు నా పని. అప్పడప్పుడు ఆయన లేంది జూసి ఆయన మంచంల గూడ పంటగని.

***

బగ్గదిని అర్గక కిందపండి బొర్లుకుంట, మా పటేలు, పటేలమ్మకు షెప్పె ముచ్చట అంత ఇన్కుంట గూసున్న. మా ఇల్లు సగం పోస్టాఫీసుకు కిరాయికి అడుగుతాండ్రట పోస్టోళ్లు. సగం ఇంట్ల మేముండాన్లట. కిరాయి వంద రూపాయలిత్తరట.

“గింత పెద్దింట్ల సగం ఇల్లిత్తే కిరాయి వందేనా” అన్నది మా పటేలమ్మ.

“గదే ఎక్కువ అంటాండ్రు” అన్నాడు మా బోలా పటేలు.

మా ఇల్లంటే ఇల్లుగాదు ఇది. పేద్ద బిల్డింగు ఎన్కటిది, దీన్ని మా పటేలు వాళ్ల బాపు డంగు సున్నం బట్టిలు పెట్టిచ్చి, అడివిలకెళ్లి టేకు మొద్దులు దెప్పిచ్చి ఈ ఇల్లు కట్టిచ్చిండట. ఇంట్ల లోపల్నుంచే తంతేలు పెట్టించి గింత పెద్ద గడి బంగ్లా మిద్దె యేమన్ననుకోండ్రి గని- గిది గట్టిచ్చిండట. ఆయన పెద్ద వతందారు, ఊర్లే పోలిస్ పటేలు ఉండేనట ఎన్కట. ఎవుసం (వ్యవసాయం) మస్తుజేసెదట మాఇంట్ల అనంగిన్న గని.

గిదంత సరేగని, ఈ ఇంట్లకు కిరాయికి ఎవడత్తడో నేనుగూడ జూత్త. నన్ను గాదని మా ఇంట్ల ఆడుంటడ.

***

గీ మీసాల మాబు గాడత్తాండేంది. గీడే మా పటేలు దగ్గర సుంకరితనం జేత్తడు.

“షిన్న పటేలా నీ కుక్క పందిలెక్క బగ్గ బలిషింది, తిండి జర తగ్గియ్” అన్నడు మా పసిగాంతోని మొన్న మా ఇంటికచ్చినపుడు. వీని పిక్కల సంగతి వోసారి జూడాలే, బిడ్డడు మళ్ల నోరెత్తకుంట ఉంటడు.

ఎప్పటికి నామీదనే కన్ను వీనికి.

అగో బొర్ర మైబుగూడ ఈన్నే వున్నడు గద. గీనే గూడ మా పటేలు దగ్గర సుంకరి పనే. కని గీ బొర్ర మైబు షానా మంచోడు. యేమన్నుంటే నాకింత వెట్టి ఆయనింత దింటడు. గందుకే ఆయనత్తే నాకు సంబురం.

అగో మా పటేలమ్మ పిల్తాంది. యేమన్న పెడ్తదేమో లోపలికోవాలే – మల్లత్త ఉండుండ్రి.

***

ఊరంత బాగ తింపిండు మా పసిగాడు, తిరిగి తిరిగి బాగా టక్లాయించినమ్ (అలసిపోయాం).

అగో మాఇంటి కాడ ఎవరో మా పటేలుతోని గంత దగ్గర గూసోని మాట్లాడుతాండ్రు. ఎవలబ్బ గీనే మొద్దుకు మొద్దు ఇంత పొడుగున్నడు.

“అరేయ్! పసిగా నువ్వు ఇంట్లకు బోరా, నేను గీళ్ల ముచ్చటేందో ఇనత్త”

అగో.. నన్ను ఇంట్లకు గుంజుకపోతడు, నువ్వు బోరా నేనత్త,

“పటేలు సాబు, ఇల్లు పోష్టాఫీసు గలిపి సౌలతులన్ని మంచిగున్నయి. నన్నే ఈడికి పోస్టుమాష్టరుగ యేసిండ్రు. నేను నా భార్య మూడెండ్ల నా బిడ్డ వుంటం. జేల్దే దిగుతం ఇంట్ల”

గీడెనా మా ఇంట్లకు అచ్చె పోస్టోడు.

ఒక్కసారి వీనిమీదికి పోయిసూద్దాం, భయంతోని పడుంటడు బిడ్డడు.

భౌ.. భౌ భౌ.. భౌ భౌభౌ..

వా..మ్మో, సచ్చిండ్ర భగమంతుగా, కుక్క కుక్కా.. యేయ్.. యేయ్…

హి హి హి హీ… (నవ్వు) – వీడేంది, గీంతదానికే షెప్పులు ఈడపారేసి, ప్యాంటూ పైకిగుంజి ఒక్కటే ఉర్కుడు ఉర్కుతాండు.

యేన్క మా పటేలుగూడ పోతాండు.

“పోస్టు సారు, యేమనది, రాండ్రి ఇటు రాండ్రి, యేమనది, మాదే, దీని పేరు మోతి, మా ఇంట్లుండేదే నేను పట్టుకుంట రాండ్రి”

“మోతో.. కోతో గని పటేలు సాబు నా పానం బోయ్యినంత పనయింది, కుక్కలను జూత్తేనే నాకు భయం వాటి దగ్గరికి గూడ బోను నేను”

వీడేంది నన్నువట్టుకొని కోతి గీతి అంటాండు, వీని సంగతి ఎవల్లేనప్పుడు జేప్త.

ఈ లోల్లికి ఆయింత మా ఇంట్ల ఉన్నోళ్లందరు బయిటికురికచ్చిండ్రు గద. మా పసిగాడు నన్ను ఎత్తుకొని గట్టిగ పట్టుకున్నడు కదులకుంట.. ఇడ్సిపెట్టు రా..

గింతాంత దానికి గింత పొడుగు జేసి ఆయే పాయే పానాలు జేసిండు ఈ పోస్టోడు, గింత కత అయితదని నాకేం ఎరుక.

***

పోస్టోడు మా ఇంట్ల దిగిన కాన్నుంచి నన్ను కట్టేసే వుంచుతాండ్రు. మా పసిగానితోని తిరుగుడే అయితలేదు. వాడే ఎప్పుడన్న నా మెడకు తాడుగట్టి బయిటికి తీస్కపోతాండు గంతే. ఆ పోస్టోడు నన్ను జూత్తేజాలు ఇంట్లకు ఉర్కుతాండు. నాకేమో జైల్లేసినట్టున్నది. కరువుల వాంతి అని చేతులూపుకుంట మా ఉప్పిగాడు దిగిండు. ఆడు అచ్చిన కాన్నుంచి పోస్టోనితోని ఒక్కటే ముచ్చట్లు.

నా రాత బాగలేదన్నట్టు మా పటేలు, పటేలమ్మ పసిగాడు అందరు గలిసి అర్జంటు పనున్నదని వరంగలు బోయిండ్రు. నన్ను మంచిగ జూసుకొమ్మని ఉప్పిగానికి అప్పజెప్పిండ్రు. వాడు.. నన్ను గట్టేసి కూసోవెట్టిండు. ఇగజూడు నా బాధ, యేంజెయాలే గందుకే సప్పుడుజేక ముడుసుకొని పన్న. ఇంట్ల ఎవరు లేరు గద అని వాని తాగుడు వాందే, వాని తిండి వాందే నన్నేడ జూసెటట్టున్నడు ఉప్పిగాడు.

యేందో మరి, పోస్టోని దగ్గరకు పోతాండు ముచ్చట పెడ్తాండు అత్తాండు మా ఉప్పిగాడు. తలుపు సందుల కెళ్లి నాకు అన్ని ఇనిపిత్తానయి. పోస్టోళ్లకు మాకు దర్వాజలే అడ్డం. మీసాల మాబు మాటలు గూడ ఇనపడతానయి. ఆడు గూడ అచ్చినట్టున్నడు. అగో యేంది ఉప్పిగాడు పోస్టోడు మీసాల మాబు ముగ్గురు గలిసి నా దగ్గరకు అత్తాండ్రు.

“ఇగో ఉపేందరు, యేట్లనన్న ఈ కుక్కను దూరంగ పట్నంల ఇడ్సిపెట్టి రాండ్రి, మల్ల రాకుంట వుంటది, చార్జి పైసలు నేనిత్త”

“మా అన్నయ్య అచ్చి కుక్కెదిరా అంటే యేంజెప్పాలే సారు”

“ఈ కుక్కను జూత్తేనే మా ఇంట్లోళ్లు మస్తు బయపడ్తాండ్రు, పటేలు సాబు అడుగుతే నేను జెప్తగని, నువ్వెం పరేషాను గాకు ఉపేందరు”

“అవురా మాబు యేంజేద్దామంటవు, కుక్కలేకుంటే మా అన్న కొడుకు పెద్ద లొల్లి జేత్తడు గాదురా”

“యే.. యేంగాదు పటేలా, దీనికి కావురం బాగున్నది, దూరం యేన్నన్న ఇడ్సిపెట్టి అద్దాం పా, ఇది అన్నిటికి మనకు అడ్డమే అయితాంది, యేండ్ల జొర్రనిత్తలేదు, యేంగాదు గని యేమన్నంటే పోస్టు సారు జెప్తడు”

అరేయ్! నా మీద పడ్డార్రా మీరు, ఎక్కడికి పట్కపోతర్రా నన్ను. పోస్టోడు జెయ్యవట్టె ఈ కథంతా.

“అరేయ్! ఈ గోనే సంచిల మూటలెక్క గట్టి బసుల యేసి పట్కపోదాం” అన్నాడు ఉప్పిగాడు.

“సరే కాని, పట్టు పటేలా”

సరే ఇడువుండ్రి బిడ్డా షెప్త

“అరేయ్ మాబు, మెల్లగ తాడు ఇడ్షి గట్టిగ పట్టుకో, లేకపోతే ఉర్కుతది”

ఇడువు బిడ్డా వుంటనా..

తాడు ఇడ్షిండు గంతే.. ఒక్క జంగ మాబు మీది కెళ్లి, ఒక్కటే ఉర్కడు.. ఉంటన

“అరే.. పాయేర, పాయేర, పాయేర.. రారా.. రారా.. మాబు రారా పట్టుకోవాల్రా”

రోడ్డు పొంట పోతే దోర్కుత, మా ఇంటి ఎదురుంగ వున్న జగన్నాథరాయిని ఇంటి ఎన్కనుంచిబోతే అటు తన్నిరోళ్ల ఇంట్లకెల్త, అట్లబోతే ఇగ దొర్కె ముచ్చటే లేదు, అబ్బో ఎన్క ఉరుక్కుంట అత్తనే వున్నరు. పోవాలే దబ దబ..

అబ్బా.. నేను మర్షేపోయిన ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యన పెద్ద చేద బాయి (బావి) వున్నది. యేట్ల దుంకాలే ఇట్నుంచటు. బాయి యేమో పెద్దగ పాడయ్యింది గద యేట్లా..

అబ్బో ఎన్కవడి అత్తనే వున్నరు. ఈన్నుంచి అటు దునుకుడు ఒక్కటే దారి.

“అరేయ్ మాబు, బాయి మీదున్నది పట్టుకోరా.. పట్టుకోరా”

హు.. హో.. అయ్యో.. నా పట్టు జారినట్టున్నది, అయ్యో.. అయ్యో.. బాయిల పడ్తానా.. పడ్తానా.. దబ్బెల్.. పడ్డ, బాయిల పడ్డపో..

ఇప్పడేట్ల, పైకిగూడ ఎక్కచ్చెటట్టులేదు, బండలు పాకురుతోని జారుతానయి, లోతు బాగున్నది.

మాబుగాడేదో మంచం యేత్తాండు బాయిలకు, నులక మంచం, దీన్ని పట్టుకుంట గట్టిగ, ఇగ గుంజుండ్రి పైకి, దెబ్బలైతే యేం దాకలే, నయమే, ఇప్పుడు తప్పిచ్చుకునేటట్టులేదు ఇగ,

“తాడు పట్టుకో పటేలా, ఇగ గుంజు మీదికి.. గుంజు”

“ఎన్క కాళ్లను నువ్వు గట్టిగ పట్టుకోరా మాబు, ఇటు నేను పట్టుకుంట, యేయిరా, ఈ గోనే సంచిల యేయి, ఇటుబట్టు, మంచిగబెట్టు దాని కాళ్లు సంచి మూతి బిగ్గితవట్టుకున్నగని నువ్వు సుతిల్ తాడు గట్టు, గట్టిగట్ర, మళ్లిప్పుకుంటే దొర్కదిగ”

అబ్బ, గిండ్ల జొర్రగొట్టిండ్రు గద వీళ్లు, మొస మొర్లుతలేదు (గాలి ఆడట్లేదు) నాకు.

“బస్సు టైం అయితాంది, ఇగ వారా, బస్సుల యేస్కపోదాం”

యేడికి దీస్కపోతర్ర బసుల, మా పసిగాడున్నా మంచిగుండు, నాకీ హాలతుండకపోవు

“పోస్టు సారు పోతానం, యేన్నన్న ఇడ్షిపెట్టత్తం”

“ఇగో ఉపేందరు చార్జి పైసలు, దూరంగ ఇడ్సిపెట్టుండ్రి, మళ్ల ఈ ఊరికే రావద్దది”

***

యేటు గాకుంట, గింత పెద్ద ఊర్ల ఇడ్షిపెట్టి పోయిండ్రు గద వీళ్లు, ఇప్పుడెట్ల పోవాలే, యేడికని పోవాలే ఈడ బసులు లారీలు మీదికే అత్తానయ్, మా పసిగాడు, పటేలమ్మ, పటేలయ్య యేంజెత్తాండ్రో.

మూడు రోజులయితాంది ఊరంత దిరుగుతాన గని బుక్కెడు తిండి దొరుకతలేదు. తిరిగి తిరిగి షాతనైతలేదు, గీ బస్టాండుల యేమన్న దొరుకుతదేమో సూద్దాం.

అబ్బ.. యేడ యేంలేదుగద గా సంచులు పట్టుకొని బస్సు దిగేది మా పటేలమ్మ లెక్కున్నది, మా పటేలమ్మేనా, యేనుక ఎవరు మా పసిగానిలెక్కున్నడు, పసిగాడేనా.. మా పసిగాడే, అబ్బరకొండ మా పసిగాడే, మా పసిగాడే..

ఒక్క జంగల మా పసిగాని మీదకి ఎగిరి కూసున్న.. గంతే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here