Site icon Sanchika

మౌనమె నీ భాష ఓ మూగ మనసా!-3

[శ్రీమతి జి. ఎస్. లక్ష్మి రచించిన ‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా!’ అనే మినీ నవలను ధారావాహికగా అందిస్తున్నాము.]

[గుర్నాథం గారి కుటుంబ సభ్యుల సమస్యకు కారణం కమ్యూనికేషన్ గాప్ అని గ్రహించిన ప్రభాకరం వారి మధ్య అటువంటి అపార్థాలు తొలగించాలంటే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తాడు. తను వారి కుటుంబ సమస్యల్లో కల్పించుకున్నాడని వాళ్లకి తెలియకుండా పరిష్కరించాలని భావిస్తాడు. ఈ సమస్య పరిష్కారం కోసం కంప్యూటర్‍లో ఇంటర్‍నెట్‍లో వెతుకుతుండగా ఓ వెబ్‍సైట్‍లో ‘ఆస్క్ మీన్స్.. మీన్స్‌ని అడగండి’ అనే స్లైడ్ చూసి, ఈమెయిల్ ద్వారా సంప్రదిస్తాడు. మీన్స్ సూచించిన ప్రకారం – కుటుంబ సభ్యులందరినీ ఒక ‘మిరాకిల్ క్వశ్చన్’ అడిగి వాళ్ళ సమాధానాలు రాబడతాడు. ఒకరి మనసులోని భావాలు మరొకరికి తెలిసేలా చేసి, వారి మధ్యనున్న అపార్థాలను తొలగిస్తాడు. ఈ వివరాలన్నీ గుర్నాథం గారు సభకి వివరిస్తారు. తర్వాత, ప్రభాకరం దగ్గరికి చికిత్స కోసం వచ్చినవాళ్ళు ఇంకా చాలామంది అతను తమ కుటుంబాలనెలా నిలబెట్టాడో చెప్తారు. ప్రభాకరానికి ఘన సన్మానం జరుగుతుంది. ఇంటికి వచ్చాకా, తన మెడలోని దండ తీసి మీనాక్షి మెడలో వేస్తాడు. తన సహకారం వల్లే తానీ ఘనత సాధించినట్లు చెప్తాడు. మరి సభలో ఈ ఘనత మీన్స్‌ది అని అన్నారు అని మీనాక్షి అంటే, అది కేసుల గురించి, ఇది ఇంటి గురించి అని చెప్తాడు ప్రభాకరం. ఇంట్లో వుండేవాళ్ళకి అలాంటి కేసుల గురించి తెలీదంటారా అని భార్య అడిగిన ప్రశ్నకి – ఇంట్లో వంట చేసుకుంటూ పిల్లల్నీ, మొగుణ్ణి చూసుకునేవాళ్లకి అంతంత పెద్ద పెద్ద విషయాలేం తెలుస్తాయంటూ దాటవేసి, భోజనాలకి ఏర్పాటు చేయ్, ఈ లోపు మీన్స్‌కి థాంక్స్ చెప్పొస్తాను అంటూ కంప్యూటర్ దగ్గరకి వెళ్తాడు. అతన్ని అలా చూస్తున్న మీనాక్షి – తను ఆ ఇంటి కోడలిగా ఎలా వచ్చిందో గుర్తొస్తుంది. తన తల్లి చనిపోయేక తండ్రి తన అన్నగారయిన రంగనాథం అడ్రసు కోసం చాలా రకాలుగా ప్రయత్నించినా, అది ఫలించలేదు కానీ మీనాక్షి సైకాలజీలో ఎం.ఎ పాసయి, పి.హెచ్.డి. చేస్తున్నప్పుడు – రంగనాథం గారి నుంచి ఉత్తరం వస్తుంది. వచ్చే నెలలో తమ పెద్దమ్మాయి వివాహమని, కుటుంబ సమేతంగా తమ్ముడిని ఆహ్వానిస్తారాయన. పొంగిపోయిన రాఘవ ఉత్తరంలో ఉన్న అన్నయ్య నెంబరుకి ఫోన్ చేసి మాట్లాడుతాడు. భార్య చనిపోయిన విషయం, ప్రస్తుతం తన కూతురు మీనాక్షి, తనూ మాత్రమే ఉంటున్న విషయం  చెప్పి, పెళ్ళికి పది రోజుల ముందే వస్తామని అన్నగారికి చెప్తాడు. మీనాక్షి సెమినార్ పూర్తయి ఢిల్లీ నించి వచ్చేసరికి రాజమండ్రి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లూ చేస్తాడు. ఇక చదవండి.]

అధ్యాయం 5

[dropcap]సై[/dropcap]కాలజీలో ఎమ్. ఎ. డిగ్రీ తెచ్చుకున్న తను సైకాలజీ అంటే తనకుండే ఇష్టం వల్లనే కష్టపడి చదివి యు.జి.సి. టెస్ట్ పాసయి, రీసెర్చ్ చేయడానికి ఫెలోషిప్ కూడా తెచ్చుకుంది.

అప్పటికి నాలుగేళ్ళనుంచీ తను చేస్తున్న పరిశోధన పూర్తి కావచ్చింది. థీసిస్ సబ్మిట్ చేసేసి, వైవాకి అటెండయి, తన పేరు ముందు డాక్టర్ అన్న పదాన్ని పెట్టుకోవచ్చనుకుంటున్న సమయంలో తమ సబ్జెక్ట్ లో ఢిల్లీలో అంతర్జాతీయ సదస్సు జరిగింది. అందులో తను కూడా ఒక పేపర్ ప్రజంట్ చేసింది. ఆ సదస్సు మూడు రోజులు, ఆ చుట్టుపక్కల ప్రదేశాలు చూడడానికి మరో రెండు రోజులు. మొత్తం అయిదురోజుల కోసం ఢిల్లీ వెళ్ళింది తను.

ఆ సమయంలోనే తండ్రి రాఘవ కూడా చార్‌ధామ్ యాత్రలకంటూ ఒక యాత్రా బస్‌లో బయల్దేరాడు.

సదస్సులో తను ఆర్టికిల్ చదవడం అయిపోయింది. కొంతమంది ప్రొఫెసర్లు దానిలో కొన్ని సందేహాలను వ్యక్తం చేసారు. వాటి కన్నింటికీ కూడా సైకాలజీ సబ్జెక్ట్ ఆధారం చేసుకుని తను చక్కగా సమాధానాలిచ్చింది. అందరూ తన సమాధానాలకి సంతుష్టులయి, పేపర్ బాగా రాసానని మెచ్చుకున్నారు. తనకి ఏనుగెక్కినంత సంబరమయ్యింది. గాలిలో తేలిపోతూ బసకి వచ్చిన తనకి రిసెప్షన్‌లో ఉన్న అమ్మాయి శరాఘాతం లాంటి సందేశం వినిపించింది.

“మీ నాన్నగారు వెడుతున్న యాత్రా బస్ బాలన్స్ తప్పి లోయలో పడిపోయిందిట. ఎవ్వరూ మిగలలేదుట. పూనా నుంచి మీ ఫ్రెండ్స్ ఫోన్ చేసారు..” అంటూ.

ఆ మాట వింటూనే కళ్ళు తిరిగి పడిపొయింది తను.

సెమినార్‌కి వచ్చినవారి సాయంతో పూనా చేరుకున్న తనకి లోకమంతా శూన్యంగా కనిపించింది. మామూలుగానే తనది అంత నలుగురితో కలిసే స్వభావం కాదు. దానికి తోడు కాలేజీ, ఇల్లూ, తండ్రీ, చదువూ తప్పితే మరో లోకం లేకుండా గడిపిందేమో, ఒక్కసారిగా గుండె లోతుల్లో దుఃఖం పొంగుకుంటూ వచ్చేసి, బైట పడకుండా గొంతులోనే ఆగిపోయింది. తట్టుకోలేకపోయింది. కొలీగ్స్ మానవత్వంతో ఏదో నామమాత్రంగా నాలుగు రోజులు మంచి చెడులు కనుక్కున్నారు తప్పితే తన గురించి మనసుకి పట్టించుకున్నవారు ఒక్కరు కూడా కనిపించలేదు. అప్పుడే తండ్రి మాటల్లోని అర్థం బోధపడింది. “నీకంటూ ఒక కుటుంబం ఉండాలమ్మా.. అలాంటి చోటే నిన్నిస్తాను.” అంటూండేవాడు.

అలా ఒంటరిగా మిగిలిపోయిన తనని పెదనాన్న రామనాథం అక్కున చేర్చుకున్నాడు.

అలా గతంలోకి చూసుకుంటున్న మీనాక్షి,

“మీనూ, వడ్డించెయ్. ఆ మీన్స్ ఆన్‌లైన్‌లో దొరకలేదు. ఫంక్షన్ బాగా అయిందని థాంక్స్ చెపుతూ మెసేజ్ పెట్టెసేనులే!” అంటూ వచ్చిన ప్రభాకరాన్ని చూసి ఈ లోకంలోకి వచ్చింది.

ఆ రాత్రి ప్రభాకర్ తనకి జరిగిన సన్మానాన్ని మరోసారి తల్చుకుంటూ ఎంతో సంతృప్తితో మీనాక్షితో అన్నాడు, “ఇదంతా నువ్వు నా ఇల్లాలుగా రావడం వల్లే. నిన్ను మీ పెదనాన్నగారింట్లో మొట్టమొదట చూసినప్పుడే నా కోసమే నువ్వు వచ్చావనిపించింది. ఇప్పుడు ఆ అభిప్రాయం ఇంకా బలపడింది. నాకు ఇంత చేదోడువాదోడుగా ఉంటున్న నీకు ఏమిస్తే ఋణం తీరుతుందీ!”

నవ్వింది మీనాక్షి.

“ఇద్దరు చక్కటి పిల్లల్నిచ్చారు, మంచి కుటుంబాన్నిచ్చారు. ఇంతకన్న ఏ ఆడదైనా ఏం కోరుకుంటుందీ!”

అచ్చమైన ఇల్లాలిలా మీనూ చెప్పిన సమాధానానికి సంతోషించి ప్రభాకర్ హాయిగా నిద్రపోయాడు. అలా నిద్రపోతున్న అతన్ని చూస్తుంటే మీనాక్షి మనసు మళ్ళీ గతంలోకి వెళ్ళింది.

అధ్యాయం 6

తండ్రి పోయాక ఏర్పడిన ఒంటరితనాన్ని తట్టుకోలేకపోయింది మీనాక్షి. తనకి మిగిలివున్న ఏకైక రక్తసంబంధి పెదనాన్న రామనాథం ఒక్కరే. ఇప్పటికొచ్చి ఆయన్ని తనూ, తనని ఆయనా చూడనేలేదు. మనస్తత్వాల మాట అటుంచి అసలు మనుషులే ఎలా ఉంటారో ఒకరి కొకరు తెలీదు. అలాంటి సమయంలో రాఘవా, మీనాక్షీ పెళ్ళికి ఎప్పుడు బయల్దేరి వస్తున్నారో అడగడానికి రామనాథమే మళ్ళీ ఫోన్ చేసాడు. గుండె చిక్కబట్టుకుని రాఘవ విషయం చెప్పింది మీనాక్షి. కాసేపు రామనాథం వైపునుంచి ఏ మాటా వినపడలేదు మీనాక్షికి. ఒక నిమిషమయ్యేక “ఇప్పుడు నువ్వొక్కదానివే ఉంటున్నావామ్మా!” అనడిగేడాయన. ఆ కాస్త పలకరింతకే మీనాక్షి కదిలిపోయింది.

“అవునండీ” అంది నెమ్మదిగా.

“నన్ను ‘అండీ’ అనకమ్మా. మీ నాన్నలాగే నేనూను. వాడిని మళ్ళీ నీకు తెచ్చివ్వలేకపోయినా నీకు పెద్దదిక్కుగా ఉంటానమ్మా. తొందరలో టికెట్ దొరకగానే నేను వస్తాను అక్కడికి.” అన్నారు. ఆ మాటకే కొండంత ధైర్యం వచ్చినట్టనిపించింది మీనాక్షికి. ఈ ప్రపంచంలో తనొక్కతీ లేదు. తనకి తండ్రి తర్వాత తండ్రిలాంటి పెదనాన్న ఉన్నారు అనుకుంటూంటే మళ్ళీ ఆయనే అన్నారు, “మరో మూడువారాల్లో ఇంట్లో పెళ్ళుంది కదా. ఈ లోపల వస్తాను.”

అప్పుడు గుర్తొచ్చింది తనకి. వాళ్లమ్మాయి పెళ్ళికి తననీ, తండ్రినీ రమ్మనడం. ముందు కూతురి పెళ్ళి ఉండగా ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకనే ఉద్దేశ్యంతో, “నాకోసం ఇంతదూరం మీరెందుకు పెదనాన్నగారూ. నేనే టికెట్ దొరకగానే వస్తాను.” అంటూ ఫోన్ పెట్టేసింది.

అన్నదే కానీ టికెట్ కొనుక్కుందుకు ధైర్యం చాలలేదు. ఈయన ఎలాంటివారో. తను తగుదునమ్మా అని వెడితే వాళ్ళింట్లో పరిస్థితులెలాంటివో. పెద్దమ్మ, ఇంకా ఆయన పిల్లలూ ఏమనుకుంటారో.. అనుకుంటూ టికెట్ కొనడానికి తాత్సారం చేసింది. కానీ రామనాథంగారు మటుకు మీనాక్షిని వదలలేదు. రోజూ సాయంత్రం ఫోన్ చేసి “టికెట్ ఎప్పటికి కొన్నావ్!” అని అడిగేవారు. చాలా ప్రేమగా, సౌమ్యంగా మాట్లాడుతూ, “మా రాఘవని చూడలేకనే పోయాను. నిన్నైనా చూడాలనుందమ్మా. తొందరగా కొనుక్కో టికెట్. మళ్ళీ పెళ్ళి దగ్గరికి వచ్చేస్తుంది.” అనేవారు.

ఆయన మాటలు వింటుంటే నాన్నే గుర్తొచ్చేవారు. ‘నాన్నా, నువ్వెళ్ళిపోతూ నన్ను పెదనాన్నకి అప్పగించేవా!’ అనుకుంది మీనాక్షి తండ్రిని గుర్తు చేసుకుని.

ఆ రోజు రాజమండ్రీలో రైలు దిగిన మీనాక్షి అచ్చం తన తండ్రిలాగే ఉన్నరామనాథాన్ని వెంటనే గుర్తు పట్టేసింది. అవునా కాదా అనుకుంటూ తన దగ్గర కొచ్చిన రామనాథాన్ని “పెదనాన్నగారూ!” అంటూ నోరారా పిలిచింది. ఆయన మొహం మీనాక్షి పిలుపుకి విప్పారింది. “నా తల్లే.. మా రాఘవలాగే ఉన్నావమ్మా.. పద పద ఇంటి కెడదాం..” అంటూ అటు తిరిగి కళ్ళు తుడుచుకోవడం మీనాక్షి దృష్టిని దాటిపోలేదు.

హూ.. ఎలా కలుసుకున్నారు ఇద్దరూ. “ఎంత కష్టమొచ్చింది తల్లీ, నీకు..” అంటూ కన్నీళ్ళు దాచుకుంటూ ఇంటికి తీసికెళ్ళేరు.

రామనాథానికి ఇద్దరు ఆడపిల్లలు. భార్య దమయంతి. అసలు సిసలైన ఇల్లాలు. మీనాక్షిని తల్లి హృదయంతో దగ్గరకు తీసుకుని అక్కున చేర్చుకుంది.

మీనాక్షికి ఆ దంపతుల మధ్యా, ఆడపిల్లల మధ్యా అలా ఆనందంగా కలిసిపోయి గడపడం అద్భుతంగా అనిపించింది. అక్కలిద్దరూ మీనాక్షితో బోల్డు కబుర్లు చెపుతూ ఆమెని ఒంటరిగా, దిగులుగా ఉండనిచ్చేవారు కాదు. ఇదంతా చూస్తున్న మీనాక్షికి ‘నలుగురున్న కుటుంబంలో నిన్నిస్తానమ్మా…’ అని తండ్రి ఎందుకనేవాడో అర్థమయింది.

రామనాథం పెద్దకూతురు కరుణ పెళ్ళిలో ప్రభాకరం కుటుంబసభ్యులు మీనాక్షిని చూసి ముచ్చట పడ్డారు. అలాంటి అమ్మాయి తమ ఇంటి కోడలయితే బాగుంటుందనుకున్నారు.

ప్రభాకరం తండ్రీ శివరామయ్యగారూ, రామనాథంగారూ చిరకాల మిత్రులు. ఆ శివరామయ్యగారి కొడుకు ప్రభాకరం. అతని ఉద్యోగం పర్మనెంట్ అయి పెళ్ళి చేసుకోవాలీ అనుకునే సమయానికి ప్రభాకర్ వయసు ముఫ్ఫైకి దగ్గరగా వచ్చింది. సరిగ్గా అప్పుడే అతని కంట మీనాక్షి పడింది.

అమాయకమైన గుండ్రటి ముఖంతో, చురుకైన కళ్లతో, లావూ సన్నమూ కాకుండా సమమైన ఎత్తుతో, చామనచాయకు ఒకచాయ ఎక్కువైన చాయతో ఎదురుగా జరుగుతున్న పెళ్ళి వేడుకలని ఇంతింత కళ్ళు చేసుకుని చూస్తున్న మీనాక్షిని చూడగానే ప్రభాకరానికి ఎందుకో మనసు సన్నగా స్పందించింది. అప్పుడే ఉద్యోగంలో స్థిరపడిన అతనికి ఇంట్లో పెళ్ళి చేయాలనే పెద్దవారి మనసు తెలిసింది. అందుకే తల్లి దగ్గర మీనాక్షి మాట చెప్పాడు.

మీనాక్షిని తమింటి కోడలిగా చేసుకోవాలనే వారి అభిప్రాయం చెప్పగానే రామనాథంగారు ప్రభాకరాన్ని విడిగా పిలిచి అడిగారు. “అమ్మాయితో విడిగా ఏమైనా మాట్లాడతావా బాబూ!” అని.

అప్పుడు మామగారు అడిగినదానికి తమింట్లో అందరూ ఆశ్చర్యపోయేరు. ఎందుకంటే పెళ్ళిచూపులైనా, పెళ్ళి కుదుర్చుకోడమైనా అన్నీ పెద్దవాళ్ళే చేస్తారు అనుకునేలాంటి తమ కుటుంబానికి ఆయనన్న మాటలు కొత్తగా అనిపించేయి. కుటుంబానికి మాత్రమే అనుకోవడమెందుకూ! తనకి కూడా అలాగే అనిపించేయి ఎందుకంటే తను ఇంటికి ఒక్కడే కొడుకు. ఉన్న ఊళ్ళోనే ఉద్యోగం. బదిలీలుండవు. తండ్రి దగ్గరే ఆ ఇంట్లోనే తనూ ఉండాలి. అలా ఉండడానికి తనకేమీ అభ్యంతరం లేదు. ఆ వచ్చే అమ్మాయికి కూడా ఏమీ అభ్యంతరం ఉండకూడదు. అలా మనసులో అతననుకుంటున్న మాటని తండ్రికి చెప్పేడు.

“నేనా విషయం కనుక్కుంటాలేరా. పిల్లయితే నాకూ, అమ్మకీ నచ్చింది. ఒద్దికగా ఉంది. నెమ్మదిగా మాట్లాడుతోంది. మనింట్లో ఆడవాళ్ళు ఉద్యోగం చేసే అలవాటు లేదని చెప్తానుగా..” అని తండ్రి అన్నాక మీనాక్షితో పెళ్ళికి ఒప్పుకున్నాడు ప్రభాకర్.

శివరామయ్యగారు రామనాథంగారికి ఖచ్చితంగా చెప్పేసారు. “అబ్బాయి ఒక్కడే మాట్లాడ్దం మా ఇళ్ళలో లేవండీ. పిల్ల మొత్తం ఇంట్లో అందరికీ నచ్చాలి..” అంటూ.

రామనాథంగారు కాస్త తడబడి, “అంటే ఈ రోజుల్లో పిల్లలు అలా మాట్లాడుకుంటున్నారని అడిగేనంతే..” అంటూ దానిని అక్కడితో ఆపేసారు.

ఈ విషయాలన్నీ మీనాక్షికి చెపుతూ మీనాక్షి అభిప్రాయం అడిగారు రామనాథంగారు.

(సశేషం)

Exit mobile version