మౌనమె నీ భాష ఓ మూగ మనసా!-7

0
2

[శ్రీమతి జి. ఎస్. లక్ష్మి రచించిన ‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా!’ అనే మినీ నవలను ధారావాహికగా అందిస్తున్నాము.]

[ప్రభాకరం దృష్టిలో పడకుండా తన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్న మీనాక్షికి అనుకోకుండా మరో సమస్య ఎదురవుతుంది. ఆడపడుచు రాధ, కూతుర్ని తీసుకుని వస్తుంది. ఆమె భర్త పతంజలి, భార్యనీ, కూతురుని ఇంట్లోంచి గెంటేస్తాడు. అతను గతంలో రాధని అదనపు కట్నం కోసం చాలాసార్లు వేధించాడు. అతని తల్లిదండ్రులు కూడా అతని ప్రవర్తన భరించలేక, సొంతూరులో ఉంటారు తప్ప, కొడుకు దగ్గరకి రారు. క్రుంగిపోతున్న రాధని చూస్తుంటే ప్రభాకరానికీ, మీనాక్షికి గుండె నీరైపోతుంది. ఎవరి మాటా విననని పతంజలిని ఎలా దారిలో పెట్టాలో ప్రభాకరానికి అర్థం కాదు. ఓ వారం గడిచాకా, చెల్లెలి గాయాలు తగ్గాకా, విజయవాడ తీసుకువెళ్తాడు. పతంజలి ఇల్లు ఖాళీ చేసేశాడనీ, ఉద్యోగానికి రాజీనామా చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడని, అతని వివరాలు అతని తల్లిదండ్రులకు కూడా తెలియవని తెలుస్తుంది. ఏం చేయాలో తెలియక చెల్లెల్ని, ఆమె కూతురుని తీసుకుని రాజమండ్రి వచ్చేస్తాడు. తన బతుకెందుకిలా అయిపోయిందంటూ నెత్తి కొట్టుకుంటూ వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తుంది రాధ. చచ్చిపోతానని అంటుంది. ప్రభాకర్ బంధువులని, స్నేహితులని సలహాలడుతాడు. మీనాక్షి ఏదో చెప్పబోతే కసురుకుంటాడు. రాధ మాత్రం ఎవరేం చెప్పినా పాటిస్తూ, గుడిలో ప్రదక్షిణాలు చేస్తూ, భర్త తిరిగి వచ్చి తనని తీసుకువెళ్ళాలని ఉపవాసాలు చేస్తూ కాలం గడుపుతూ ఉంటుంది. చెల్లెలి సమస్య గురించి ప్రభాకర్ మీన్స్‌కి ఎన్ని మెయిల్స్ పెట్టినా జవాబు రాదు. ఇక చదవండి.]

అధ్యాయం 13

[dropcap]ఎ[/dropcap]ప్పుడూ ఇలా సమస్య అడిగితే అలా ఠక్కున జవాబిచ్చే ఈ మీన్స్ ఏమయిపోయేడో.. అని ఆలోచిస్తున్న ప్రభాకరం ఒకవేళ అతను తనకి జవాబంటూ ఇవ్వకపోతే తన పరిస్థితేమిటీ అనుకున్నాడు. ఆ మీన్స్ అయితే తను అడిగినవాటికి వెంటనే పుస్తకాలన్నీ తిరగేసేసి, అప్పటిదాకా పరిష్కరించిన కేసులన్నీ రిఫర్ చేసేసి, ఏం చేస్తే బాగుంటుందో టక్కున చెప్పేసేవాడు. తను అలా అన్నీ చదవగలడా! తను చేసిన ఎం.ఎ. ప్రయివేటుగా. అందులోనూ తెలుగు మీడియమ్‌లో. తెలుగులో అప్పటికి ఉన్న పుస్తకాలు చదివి పాసైపోయేడు తప్పితే నిజంగా సబ్జెక్ట్ మీద అతనికి అంత పట్టు లేదు. ఆ సంగతి అతనికీ తెలుసు. పోనీ ఇంగ్లీష్‌లో పెద్ద పెద్ద ప్రొఫెసర్లు రాసిన పుస్తకాలు చదువుదామంటే సైకాలజీ సబ్జెక్ట్‌లో ఉన్న ఆ టెక్నికల్ లాంగ్వేజ్ తనకి అర్థమౌతుందా! ఏవిటో.. ఎటు చూసినా అయోమయంగానే ఉందతనికి.

ఇన్నాళ్ళూ సమస్యని ‘ఆస్క్ మీన్స్’ ముందు పెట్టేసి, అతను చెప్పిన ప్రకారం క్లయింట్ల సమస్యలు తీర్చేవాడు ప్రభాకరం. కానీ ఆ మీన్స్‌కి ఏమయిందో.. అసలు తను అడిగిన ప్రశ్నలే ఇప్పటి వరకూ చూడలేదు. ఆ పతంజలిని ఎలా ట్రీట్ చేస్తే చెల్లెలి కాపురం బాగుపడుతుందో అతనికి అర్థం కావటం లేదు.

ఆ రోజు ఆదివారం. స్థిమితంగా భోంచేసి, ఒక కునుకు తీసి అప్పుడే లేచి వచ్చి హాల్లో కూర్చున్నాడు ప్రభాకరం. ఇదే సరైన సమయం అనుకుంటూ కాఫీ చేసి ప్రభాకరానికి ఇచ్చి పక్కనే కూర్చుంది మీనాక్షి. “ఏవిటి విషయం!” అడిగేడు ప్రభాకర్.

“అదే.. రాధ విషయం ఏం చేద్దామనీ!” సూటిగా విషయాని కొచ్చేసింది.

“ఏవిటి చేసేది! అతనొచ్చేదాకా ఎదురు చూడ్డమే.. అంతకన్న ఇంకేం చెయ్యగలం. బోల్డు పూజలూ, ఉపవాసాలూ చేస్తోంది. ఏదో.. ప్రస్తుతం టైమ్ బాగలేదంతే. ఈ చెడురోజులు వెళ్ళిపోగానే వచ్చేస్తాడు.” ఎంతో నమ్మకంగా చెప్తున్న అతని మాటలు విని తెల్లబోయింది మీనాక్షి.

పతంజలేమీ తెలివితక్కువవాడు కాదు. ఎంతో ప్రణాళికతో మూణ్ణెల్లు ముందుగానే కాలేజీలో రాజీనామా ఇచ్చేసేడు. ఎక్కడో అక్కడ అమ్మా నాన్నలకీ, పెళ్ళాం పిల్లలకీ దొరకకుండా ఉండేచోట ఇప్పటికే ఉద్యోగం సంపాదించుకునే ఉంటాడు. తెలిసి తెలిసి తన ఆచూకీ తెలీకుండా ఉండడానికి అంత పకడ్బందీగా ప్లాన్ చేసుకుని పారిపోయిన అతను మళ్ళి తిరుగు వస్తాడని వీళ్ళనుకుంటుంటే, వీళ్ళని అమాయకులనుకోవాలో, మూర్ఖులనుకోవాలో తెలీలేదు మీనాక్షికి.

అయినా అదిప్పుడు చర్చలోకి తేవాల్సిన విషయం కాదు. ఇప్పుడు ముందు రాధ విషయం చూడాలి అనుకుంటూ, “అదికాదండీ. రాధది ఇంకా చిన్న వయసే. ముందు జీవితమంతా ఎలాగంటారూ!” అంది.

“ఎలాగేంటీ.. ఇలాగే.. ఏం.. ఆమాత్రం మనం తిండి పెట్టలేమా..”

“అహా. అదికాదు..” నొచ్చుకుంది మీనాక్షి. “ఈ రోజుల్లో అలా వెయిట్ చేస్తూ ఎవరూ ఉండడం లేదు..”

“అంటే..” అన్నాడు అర్ధం కాక.

“అంటే, రాధ కాస్త దృష్టి మార్చుకుని ఏదైనా చదువులో పడితే మంచిదని నా ఉద్దేశ్యం.”

ఆ మాట వినగానే ఇంతెత్తున లేచేడు ప్రభాకరం.

“ఏం.. నా చెల్లెలు నీకంత బరువైపోయిందా! సంపాదించుకుంటేగాని దానికి తిండికి గడవదా! ఈ అన్నయ్య చెల్లెలి కామాత్రం తిండి పెట్టలేడనుకున్నావా!”

గట్టిగా వినిపిస్తున్న మాటలకి గదిలోంచి బైటకి వచ్చిన రాధ విషయం తెలుసుకుని మళ్ళీ హాల్లో కూలబడి ఏడుపు మొదలెట్టింది. “నా మొహాన్న ఏం రాసేవురా భగవంతుడా.. మా అమ్మానాన్నలతో నన్ను కూడా తీసుకుపోలేకపోయేవా. ఇప్పుడు నన్నేం చెయ్యమంటావ్ వదినా.. ఎక్కడికైనా పోయి చద్దామన్నా నాకు ఈ పిల్లొకత్తి బంధమై కూచుండి పోయిందికదా!.. ఒరే అన్నయ్యా, పోనీ, నువ్వు నా కూతుర్ని చూసుకుంటానని మాటివ్వరా.. ఇప్పుడే చచ్చిపోతాను.’’ అంటున్న రాధ మాటలకి హడిలిపోయింది మీనాక్షి.

“నా ఉద్దేశ్యం అది కాదమ్మా..” అనబోయిన మీనాక్షిని మాట్లాడనివ్వలేదు అన్నాచెల్లెళ్ళిద్దరూ.

ఇంక వాళ్లతో మాట్లాడి లాభం లేదని అక్కడ్నించి వచ్చేసింది మీనాక్షి. ముఫ్ఫై యేళ్ళున్న రాధ ఏదైనా చదువు ధోరణిలో పడితే మంచిదని మీనాక్షి ఉద్దేశ్యం. చదువు వైపు తన బుర్రని డైవర్ట్ చేస్తే కొంచెం ఈ పూజలూ, శాంతుల ఆలోచనల్లోంచి రాధ బయట పడుతుందని ఆమె ఆలోచన. పెళ్ళై, పిల్ల పుట్టి, ఉద్యోగం చేసుకుంటున్న మగవాడు చెప్పకుండా అలా వెళ్ళిపోయేడంటే దాని అర్థం మరింక రాడనేగా! ఆ విషయం వీళ్ళు అర్థం చేసుకోరేం. మంత్రాలకి చింతకాయలు రాల్తాయా! ప్రదక్షిణలు చేస్తే అతను తిరిగొస్తాడా. మొన్న గుళ్ళో పొర్లుదండాలు పెట్టొచ్చేక రాధను చూసిన మీనాక్షికి కడుపులోంచి దుఃఖం తన్నుకు వచ్చింది. నాకొద్దు మొర్రో అంటున్నవాడికోసం ఎందుకు శరీరాన్నీ, మనసునీ ఇంత హింస పెట్టుకోడం. మొగుడు వదిలేస్తే ఇంక జీవితమే లేదా! ఎప్పటి కర్థమవుతుంది ఈ అన్నాచెల్లెళ్ళకి? రాధని ఏదైనా కోర్స్ చేయించి, చిన్నదో పెద్దదో ఏదైనా ఉద్యోగంలో పెడితే తప్ప ఆ పిల్లకి సుఖం ఉండదని స్పష్టంగా తెలుస్తోంది మీనాక్షికి.

తనని మొగుడు వదిలేసాడని బాధపడుతూ, ఇలా గుళ్ళూ గోపురాలూ తిరిగే బదులు అలా బైట కెళ్ళి ఏదైనా పనికొచ్చే చదువు చదువుకుంటే మంచిది కదా! నలుగురితో తిరిగినప్పుడు నాలుగు విషయాలు తెలుస్తాయి కదా! రాధలాంటి వాళ్ళు, మొగుడూ, అత్తామామల చేత అంతకన్నా బాధపడినవాళ్ళూ కూడా మన చుట్టూ చాలామంది ఉన్నారనీ, తనొక్కతే కాదనీ, తనని చూసి నవ్వడం తప్ప జనాలకి మరో పని లేదనుకోడం వట్టి భ్రమేననీ రాధకి తెలియాలి. అలా తెలియాలంటే రాధ బైటకి వెళ్ళాలి. అలా బైట ప్రపంచంలో జరుగుతున్న విషయాలు తెలీక రాధ తన జీవితాన్ని పాడుచేసుకుంటోందని మీనాక్షి బాధ.

ఈ అన్నాచెల్లెళ్ళ కెలా చెప్పాలా అనుకుంటున్న మీనాక్షికి ఆరోజు అనుకోకుండా ఆ అవకాశం వచ్చింది. పొద్దున్న గుడి కెళ్ళొచ్చిన రాధ మధ్యాహ్నం ఆ గుళ్ళోకే ఎవరో స్వాములారు వస్తున్నారంటే కూతురు సరోజని కూడా తీసుకుని వెళ్ళింది. రాధ ఇంట్లోనే ఉంటోంది కనక ఈ మధ్య మీనాక్షి అసలు కంప్యూటర్ వైపే వెళ్ళలేదు. అందులోనూ రాధ బాధ చూస్తుంటే ఆమె పక్కన కూర్చుని, ఏమైనా చెయ్యాలని తాపత్రయపడుతూ, మిగిలిన విషయాల జోలికే వెళ్ళలేదు మీనాక్షి. ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. అందుకే రెణ్ణెల్లనుంచీ ముట్టుకోని కంప్యూటర్‌ని ఆ రోజు మళ్ళీ తీసింది. మామూలుగానే తన మెయిల్ అకౌంట్ చూసుకుంటుంటే ప్రభాకరం దగ్గర్నుంచి ఎన్ని మెయిల్స్ ఉన్నాయో. ఆశ్చర్యపోయింది. అందులో ఎక్కువగా ఉన్నవి రాధ గురించీ, పతంజలి గురించీ..

వాటిలో ఎంతసేపూ పతంజలిని మామూలు మనిషిని చెయ్యాలంటే ఏం చెయ్యాలీ అనడుగుతాడే తప్పితే రాధ భవిష్యత్తు గురించి అసలు ప్రసక్తే లేదు. వాటన్నింటికీ మీనాక్షి గుడి నుంచి రాధ వచ్చేలోపల గబగబా జవాబు లిచ్చేసింది.

ఆ రోజు రాత్రి కంప్యూటర్ ముందు కూర్చున్న ప్రభాకరం చాలా సేపటి వరకూ అక్కడే ఉండిపోయేడు. ఏమాలోచించుకున్నాడో కానీ మర్నాడు పొద్దున్న రాధని పిలిచి, దగ్గర కూర్చోబెట్టుకుని నెమ్మదిగా చెప్పేడు. “అమ్మా రాధా, నీకూ నీ కూతురికీ నేనున్నాను. పతంజలి ఎప్పుడోప్పుడు వస్తాడు. మరతను వచ్చేటప్పటికి నువ్వు ఇలా పిచ్చిదానిలా చిక్కి శల్యమైపోయి కనపడితే ఎలా చెప్పు. అందుకని ఇవాల్టి నుంచీ నువ్వు వారానికి ఒక్కసారే ఏ శనివారమో ఉపవాస ముంటూండు. గుడి చుట్టూ పొర్లుదండాలు అక్కర్లేదు. అసలు ఆడవాళ్ళు అలా పొర్లుదండాలు పెట్టకూడదుట. మొన్న శాస్త్రిగారు చెపుతున్నారు. రోజూ పొద్దున్నే ఓ గంటసేపు ఇంట్లో భక్తితో పూజ చేసుకో. సరోజని కూడా స్కూల్లో వేస్తాను. దాన్ని స్కూల్ సంగతులవీ చూసుకో.” అన్న అన్నగారి మాటలకి ససేమిరా ఒప్పుకోలేదు రాధ.

“నా దైవం దూరమయ్యేక నాకు తిండి ఎలా సహిస్తుందనుకున్నా వన్నయ్యా. పొర్లుదండాలు పెట్టకూడదని శాస్త్రిగారు చెప్పేరు కనక ఆ పని చెయ్యను. కానీ ప్రదక్షిణలు మటుకు మానను. ప్రస్తుతం నాకు రోజులు బాగులేవన్నయ్యా. మంచిరోజులు రాగానే ఆయన వచ్చేస్తారు.” చెల్లెలి మాటలకి చిన్నగా నవ్వి, “అలాగే, నీకు ఎలా కావాలన్పిస్తే అలాగే చెయ్యి..” అన్నాడు.

అతనికి తెలుసు.. ఇలా ఒకసారి చెప్పగానే చెల్లెలు తనమాట వినదని. మీన్స్ సలహాతో ఇటువంటి మనుషులకి ఎంతమందికో చికిత్స చేసిన అతను చెల్లెలి విషయంలో కూడా రోజూ కొంచెం కంచెం నెమ్మదిగా విషయాన్ని ఆమె బుర్రలోకి ఎక్కించాలనుకున్నాడు. అందుకే అక్కడితో ఆ విషయాన్ని వదిలేసి వేరే సంగతులు మాట్లాడ్దం మొదలుపెట్టేడు.

ఆఫీసుకి వెడుతూ మర్చిపోకుండా మీనాక్షితో చెప్పేడు, “మీనూ, పక్కవీధిలో ఏదో కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్ పెట్టారన్నావుగా.. అదేవిటో, ఏం చెప్తారో కొంచెం డీటైల్స్ కనుక్కుంటావా. నాకు ఆఫీస్‌కి టైమైపోయింది.”

“ఎందుకూ.. ఎవరికీ..” అంది ఆశ్చర్యంగా మీనాక్షి.

“మన రాధ కోసమే. చాలారోజుల తర్వాత నిన్న మీన్స్ మెయిల్ చేసేడు. అతనే చెప్పేడు. కావాలని వెళ్ళిపోయిననతనికి ఏం చికిత్స చేస్తావూ.. ముందు అతని కోసం పిచ్చిదానిలా అయిపోతున్న రాధ సంగతి చూడూ అన్నాడు. అందుకే.. ఓసారి కనుక్కుంటావనీ..” అంటూ నసుగుతూ చెప్పి వెళ్ళిపోయేడు ఆఫీసుకి.

అందుకేనేమో శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదంటారు అనుకుంది మీనాక్షి. మీనాక్షి అభిమానం, ఆప్యాయతలతోనూ, ప్రభాకర్ ప్రేమా, సలహాలతోనూ రాధ నెమ్మది నెమ్మదిగా మామూలు ధోరణిలో పడింది. సరోజని ప్రభాకర్ పిల్లలు చదువుతున్న స్కూల్లోనే చేర్చేరు. రాధ పక్క వీధిలో ఉన్న కోచింగ్ సెంటర్‌లో కంప్యూటర్ కోర్స్ లో చేరింది. కోర్స్ మాట ఎలా ఉన్నా ముందు రాధకి మనసులో తనమీద తనకి నమ్మకం లాంటిది ఏర్పడింది.

అధ్యాయం 14

రోజులు గడుస్తున్నాయి. రోజురోజుకీ ప్రతివారి జీవితం వేగం పుంజుకుంటోది. ఇదివరకటి సందు చివరి కిరాణాకొట్లు ఇప్పుడు కనిపించడం లేదు. ఏ లొకాలిటీకి ఆ లోకాలిటీలోనే ఒక సూపర్ మార్కెట్టూ, ఇంకాస్త దూరంలో పెద్ద పెద్ద మాల్సూ ప్రత్యక్ష్య మయ్యాయి. పక్కవాడినే కాదు ఇంట్లోవారిని కూడా పలకరించే సమయం దొరకటం లేదు ఎవరికీ. ఇదివరకటి విలాసవంతమైన వస్తువులు ఇప్పుడు కనీసావసరాలయ్యాయి. అవి కావాలంటే భార్యాభర్త లిద్దరూ ఉద్యోగం చేస్తే కానీ గడవని పరిస్థితులొచ్చేయి.

పిల్లల పెంపకం కూడా ఒక సవాలుగా మారింది. ఇంటర్నెట్టూ, మొబైల్ ఫోనూ వాళ్ల చేతుల్లో ఆట వస్తువు లయ్యేయి. అవసరానికి మించిన సమాచారం వాళ్ళ గుప్పిట్లో ఉంటోంది. తల్లితండ్రులూ, టీచర్లూ, పెద్దలూ అందరూ కూడా పిల్లల ప్రవర్తన సవ్యంగా ఉండాలంటే ఏమి చెయ్యాలా అనే ఆలోచనలో పడ్డారు. మీన్స్ సలహాతో సరిగ్గా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు ప్రభాకరం. స్కూళ్ళకి వెళ్ళి, టీచర్స్, పేరెంట్స్‌తో మీటింగులు పెట్టి, పిల్లల ప్రవర్తనను గమనించాలన్న ఆలోచన కలిగిం దతనికి.

ఇంకా ప్రభాకరం అలా అనుకుంటూనే ఉన్నాడు, ఒకరోజు ఆఫీస్‌లో ఉండగా అతనికి ఇంటినుంచి ఫోన్ వచ్చింది. ఎప్పుడూ ఆఫీస్‌కి ఫోన్ చెయ్యని మీనూ ఎందుకు చేసిందా అనుకున్నాడు ప్రభాకరం. ఎత్తగానే ఏడుపుగొంతుతో “మన వీణ మీద స్కూల్లో ఎవరో అబ్బాయి యాసిడ్ పోయబోయేట్టండీ. నేను స్కూల్‌కి వెడుతున్నాను, మీరూ రండీ.” అంటూ పెట్టేసింది. హడిలిపోయేడు..

వీణ చదువుతున్నది ఎనిమిదో క్లాసు. అంత చిన్న పిల్ల మీద యాసిడ్ ఎవరైనా ఎందుకు వేద్దామనుకుంటారూ! తమకి తెలీకుండా వీణ ఎవరితోనైనా గొడవల్లో పడిందా! అయినా ఇంట్లో ఉండి ఈ మీనూ ఏం చేస్తోందిటా.. స్కూలికి వెడుతున్న అడపిల్ల అక్కడ చదువే చదువుతోందో.. లేక గొడవలే పడుతోందో.. ఆ మాత్రం చూసుకోకుండా ఈవిడగారు చేస్తున్న ఘనకార్యాలేంటిటా! స్కూల్‌కి వెళ్ళేవరకూ కూతురి మీదున్న ప్రేమ ప్రభాకరం మనసులో రకరకాల ఆలోచనలను రేకెత్తించింది.

స్కూల్‌కి వెడుతూనే ప్రిన్సిపల్ రూమ్ వైపు వెళ్ళాడు. అక్కడ వెక్కివెక్కి ఏడుస్తున్న వీణ చుట్టూ చేతులు వేసి ఓదారుస్తూ మీనూ, పక్కనే చందూ కనిపించారు. వాళ్ల చుట్టూ ప్రిన్సిపల్, కొంతమంది టీచర్లూ, ఓ మూలగా చేతులు కట్టేసిన ఓ అబ్బాయీ కనిపించేరు.

“అమ్మా..” అంటూ కూతురి దగ్గరికి వెళ్ళిన అతనిని పట్టుకుని వీణ మళ్ళీ భోరుమంది.

కూతురి భుజం మీద చెయ్యివేసి ఓదారుస్తూ, “పరవాలేదమ్మా, నేనొచ్చేసాగా.. అంతా కనుక్కుంటాను.” అంటూ ప్రిన్సిపల్ వైపు తిరిగాడు విషయం ఏమిటో చెప్పమన్నట్టు.

“వుయ్ ఆర్ వెరీ సారీ మిస్టర్ ప్రభాకర్, మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. సమయానికి వైదేహీ టీచర్ అటు వెడుతుండడంతో చాలా పెద్ద ప్రమాదమే తప్పింది.” అంటూ చేతులు కట్టేసిన ఆ అబ్బాయి వైపు చూపించింది. ఆ అబ్బాయిని పరీక్షగా చూసాడు ప్రభాకరం. పదిహేనేళ్ళకన్న ఉండవు, సన్నగా చామనచాయతో, కళ్ళలో ఒక విధమైన నిర్లక్ష్యంతో కనిపిస్తున్నాడు.

“ఇతని పేరు వాసు. టెంత్ క్లాస్‌లో ఉన్నాడు. మీ అమ్మాయి వీణని ప్రేమిస్తున్నాడుట. మీ అమ్మాయి ఏమీ చెప్పలేదుట. తనని ప్రేమించకపోతే మొహమ్మీద యాసిడ్ పోసేస్తానని వాష్ రూమ్ వైపు వెళ్ళిన తన వెనకాల పడ్డాడుట. వీణ భయపడి కారిడార్‌లో పరిగెడుతుంటే అటువైపే వస్తున్న వైదేహీ టీచర్ చూసి వీణ్ణి గట్టిగా పట్టుకుని బాటిల్ లాక్కుని విసిరేసి, వాచ్‌మేన్‌ని గట్టిగా కేకేసి పిలిచింది. అతను వచ్చి వాసుని గట్టిగా పట్టుకుని ఇక్కడికి తీసుకొస్తే, సంగతి మీకు తెలియాలని ఫోన్ చేసాం”.

ఎంత ప్రమాదం తప్పిందీ! వింటున్న మీనాక్షికీ, ప్రభాకరానికీ కూడా చాలా ఆశ్చర్య మనిపించింది. ఇంకా టెంత్ క్లాస్ చదువుతున్న పదిహేనేళ్ళ కుర్రాడికి ప్రేమా.. ఆ ప్రేమించిన అమ్మాయి వినిపించుకోకపోతే ఆమె మీద యాసిడ్ పొయ్యాలనుకోవడమా.. అసలు ఈ యాసిడ్ పొయ్యాలనే హింసాత్మకమైన ఆలోచన ఇంత చిన్నపిల్లాడికి ఎలా వచ్చిందీ! అసలు ఇతనికి యాసిడ్ ఎక్కడ దొరికిందీ! అలా కారిడార్‌లో అమ్మాయి వెనకాల పరిగెడుతుంటే ఎవరైనా చూసి పట్టుకుంటారన్న ఆలోచన కూడా అతనికి రాలేదా!

నెమ్మదిగా లేచి ఆ కుర్రాడి ముందు కెళ్ళి నిలబడి అతని కళ్ళల్లోకి సూటిగా చూసాడు ప్రభాకరం. నువ్వంటే నాకేం భయం లేదన్నట్టు నిర్లక్ష్యంగా చూస్తూ తల ఎగరేసాడా కుర్రాడు.

“మీ నాన్నగారి పేరేంటీ!” అడిగాడు ప్రభాకరం. ఏమీ మాట్లాడలేదతను.

“నిన్నే అడిగేది. మీ నాన్నగారి పేరేంటీ!” కాస్త స్వరం పెంచేడు.

“వైకుంఠం”.

“ఏం చేస్తుంటాడు!”

“బిజినెస్”

“ఏం బిజినెస్!” ఓపిగ్గా అడిగాడు.

“ఎక్స్ పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్..”

“మీ అమ్మగారు!”

“ఏం చైదు. ఇంట్లోనే ఉంటుంది.”

ఆ కుర్రాడిని ఏమడిగినా ఆ జవాబులు ఇంత నిర్లక్ష్యంగానూ ఉంటాయని ప్రభాకరానికి అర్థమైపోయింది.

ప్రిన్సిపల్ వైపు తిరిగి, “వాళ్ల పేరెంట్స్‌కి ఫోన్ చేసేరా!” అనడిగేడు.

“చేసామండీ. ఆయన బిజినెస్ పని మీద పక్కూరికి వెళ్ళాట్ట. ఊర్లోకొచ్చేసరికి సాయంత్రం అయిపోతుందిట. రేపు వచ్చి కలుస్తానన్నారు.”

“మరి వాళ్ళమ్మగారు!”

“ఆవిడకి ఒంట్లో బాలేదుట. ‘రేపు వాళ్ళ నాన్న వస్తారుకదా.. ఏదన్నా ఉంటే ఆయనతో చెప్పండీ’ అని ఫోన్ పెట్టేసేరు. ”

స్వంత కొడుకు చదువుతున్న స్కూల్ నుంచి అర్జంటుగా రమ్మని ఫోన్ వస్తే మర్నాడు వస్తానన్న ఆ తండ్రీ, తండ్రి చూసుకుంటాడులే అనుకుంటూ తన బాధ్యతను గుర్తించని ఆ తల్లి గురించీ ఆలోచిస్తుంటే ప్రభాకరానికి అర్థమైపోయింది ఆ తల్లితండ్రుల పెంపకంలో పెరుగుతున్న ఈ కుర్రాడు రేపు సమాజానికి చీడపురుగు అవుతాడని.

ఒక్కసారి ప్రభాకరం ఒళ్ళు జలదరించింది.

“వాళ్ల నాన్నగారిని ఒకసారి వచ్చి నన్ను కలవమని చెప్పండి.” అంటూ ప్రిన్సిపల్ దగ్గర శేలవు తీసుకున్నారు ప్రభాకరం దంపతులూ, పిల్లలూ.

ఆవిడ ఒకటికి పదిసార్లు వీళ్ళకి క్షమాపణలు చెప్పుకుంది. వీణ గురించి స్కూల్లో మరింత జాగ్రత్తగా ఉంటానని వాగ్దానం చేసింది.

ఇంటి కొచ్చాక మీనాక్షీ, ప్రభాకరం వీణని దగ్గర కూర్చోబెట్టుకుని వివరాలన్నీ మరోసారి చెప్పించుకున్నారు. అప్పటికి నెల రోజుల్నించీ ఆ వాసూ తనని వేధిస్తున్నా కూడా వీణ ఇంట్లో ఎందుకు చెప్పలేదని అడిగారు.

“అమ్మకి వంటా, ఇల్లూ తప్పితే ఏవీ తెలీవు. స్కూల్‌కి వచ్చి అసహ్యంగా గొడవేమైనా చేస్తుందేమోనని చెప్పలేదు” అంది.

కూతురుకి తన మీద అలాంటి అభిప్రాయం ఉన్నట్టు అప్పటిదాకా తెలీని మీనాక్షి ఒక్కసారి తెల్లబోయింది. అంతలోనే తనని తనే సంబాళించుకుంది. నిజమే కదా! వీణ ఇంట్లో తెల్లారి లేచినది మొదలూ తనని ఎలా చూస్తోందీ.. వంట చేసుకుంటూ, ఇల్లు చక్కదిద్దుకుంటూనే చూసింది. ఇల్లంతా తండ్రి మాట మీద నడుస్తోందనీ, తండ్రి చేయమన్న పనే తల్లి చేస్తుందనీ, కాదన్నది మానేస్తుందనీ చూస్తూ పెరిగింది. మరి అలా పెరిగిన పిల్లకి తల్లిలో అంతర్గతంగా ఉన్న విజ్ఞానం ఎలా తెలుస్తుందీ!

“పోనీ, నాకైనా చెప్పొచ్చు కదమ్మా!” అన్నాడు ప్రభాకరం.

“నీకు చెప్పడానికి భయం వేసింది నాన్నా.” అంది అమాయకంగా.

ఒక్కసారి కదిలిపోయేడు ప్రభాకరం. ఊళ్ళో వాళ్ళందరికీ పిల్లలతో స్నేహితుల్లా ఉండాలని చెప్పే తనే ఇంట్లో తన కూతురికి తనంటే భయపడేలా ఉన్నాడా! ఒక్కసారి ఆలోచించుకున్నాడు. నిజమే కదా! ఏనాడు తను వాళ్లతో కలిసి కూర్చుని కబుర్లు చెప్పాడనీ. సాయంత్రం దాకా ఆఫీసూ, సాయంత్రం క్లినిక్కూ. క్లినిక్ నుంచి తను ఇంటి కొచ్చేసరికి పిల్లలు నిద్రకి పడేవారు. ఇంక వారానికి వచ్చే ఒక్క ఆదివారం లోనే వారంలో చెయ్యలేని పనులన్నీ పెట్టుకునేవారు. ఇంక తనంటే పిల్లలకి భయం కాక ఏముంటుందీ!

“నేను మీ ప్రిన్సిపల్‌తో మాట్లాడి, మళ్ళి ఈ సమస్య రాకుండా చూస్తానమ్మా. ఇకనుంచి నువ్వు కూడా స్కూల్‌లో ఏది జరిగినా నాకూ, అమ్మకీ చెపుతూండాలి, తెల్సిందా!”

పిల్లలిద్దరినీ సముదాయించి, వాళ్ళు పడుకున్నాక మీనాక్షి ప్రభాకరాన్ని అడిగింది.

“ఏం చేద్దామండీ ఇప్పుడూ!”

“అదే నాకూ అర్థం కావటంలేదు. అంత చిన్న కుర్రాడికి ప్రేమేవిటీ.. కుదరకపోతే యాసిడ్ పోస్తాననడం ఏవిటీ! అయినా వాడికా యాసిడ్ ఎక్కడ దొరికిందంటావ్..”

“అది కాదు ఇప్పుడు మనకి కావల్సింది. ఈ రోజు వీడు చేసేడు, రేపు ఇంకోడు ఇంకోటి చేస్తాడు. ఆ పిల్లలు అలా చెయ్యకుండా చెయ్యాలి కదా!”

“దానికి మనమేం చెయ్యగలం! వాళ్ళమ్మా, నాన్నా చూసుకోవాలి. పోనీ, మన వీణని ఈ కో-ఎడ్యుకేషన్ స్కూల్ మార్చేసి, ఏ గర్ల్స్ హైస్కూల్లో నైనా వేద్దామా!”

“అయ్యో.. ఇది చాలా మంచి స్కూలండీ. మంచి టీచర్లున్నారు.”

“ఎంత మంచి టీచర్లుండి ఏం లాభం! చూడు, స్కూల్ నించి కొడుకు గురించి కంప్లైంట్ వచ్చినా రేపొస్తాం, ఎల్లుండొస్తాం అంటున్నారు వాళ్ళమ్మా నాన్నలు. ఈ కుర్రాడేమైపోతున్నాడొ వాళ్ళకే పట్టలేదు. ఇంక మనమేం చేస్తాం.”

మీనాక్షి ఆలోచించింది. మనం అంటే ప్రభాకరం ముందుకి వెళ్ళడు. అందుకే భారమంతా అతని మీదే పెడుతున్నట్టు, “ఇంతమంది మనసులను బాగుచేస్తున్నారు. అలాంటి చిన్న కుర్రాళ్ల మనసులు బాగు చెయ్యలేరూ!” అనడిగింది.

భార్యకి తన మీద ఉన్న నమ్మకానికి కాస్తంత గర్వంగా అనిపించిందతనికి. “చూద్దాం, ఏవైనా చెయ్యగలమేమో.. వాళ్ల పేరెంట్స్‌తో మాట్లాడితే కానీ ఈ కుర్రాడిలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో అర్థం కాదు. రేపు వస్తానన్నారుగా. ఏదైనా చేద్దాంలే.” అన్నాడు.

అలా అని ఊరుకోకుండా ఆ రాత్రి మీన్స్ ముందు ఈ సమస్య పెట్టి ఎలా ముందుకెళ్ళాలో చెప్పమన్నాడు.

మర్నాడు స్కూల్లో ఆ వాసూ తండ్రిని కలిసేడు. తల్లి రాలేదు.

“ఏంటండీ మావాడు చేసిన గొడవా!” వస్తూనే అధికారికగా అడిగేడు తండ్రి వైకుంఠం.

పొడుగ్గా మోటుగా ఉన్న వైకుంఠం నాగరికం లేకుండా అలా అడుగుతుంటే అర్థమైపోయింది ప్రభాకరానికి, ఈ వాసు ఎందుకిలా తయారయ్యేడో.

“మీ అబ్బాయి ప్రేమించమంటూ ఒకమ్మాయి వెంటపడుతున్నాడు. కాదంటే యాసిడ్ పోస్తానంటూ యాసిడ్ బాటిల్‌తో వెనకాల పడ్డాడు. ఇంత్ర చిన్న వయసులో ఇలా ప్రేమంటూ అమ్మాయిల వెనకాల పడడమేంటీ.. కాదంటే యాసిడ్ పోస్తాననడమేంటీ! అసలు ఈ వయసులో చదువుమీద దృష్టి పెట్టాలి కానీ ఇలా ప్రేమలంటూ హింసకి దిగడం ఏవైనా బాగుందా!”

ప్రిన్సిపల్ అడిగిన ప్రశ్నకి,

“చిన్నపిల్లాడు వాడికేం తెలుసండీ. పొద్దున్న లేవగానే స్కూలికే కదా వస్తాడూ. ఏది నేర్చుకున్నా ఇక్కడే మీ దగ్గరే నేర్చుకునుంటాడు. మీరు చెప్పే చదువులు అంత గొప్పగా ఉన్నాయన్నమాట. ఏదో పెద్ద పేరున్న స్కూలని బోల్డు డబ్బులు కట్టి జాయిన్ చేసేను. ఆ ఫీజులు కట్టడానికి రాత్రనకా పగలనకా పని చేయాల్సొస్తోంది. ఇంక వాణ్ణి నేనెక్కడ చూడగలను! ఇక్కడే ఎక్కడో నేర్చుకునుంటాడు అన్నీ.”

బాధ్యతా రహితంగా చెప్తున్న అతని మాటలు వింటుంటే ప్రభాకరానికి విసుగనిపించింది.

“పోనీ వాళ్ళమ్మగారైనా పిల్లాడేం చేస్తున్నాడో చూసుకోవచ్చు కదండీ.”

ప్రిన్సిపల్ అడిగినదానికి గొల్లున నవ్వేడతను.

“స్కూలిషయాలన్నీ ఇంట్లో కూర్సునే ఆడోళ్ళకేం తెలస్తాయండీ. పొద్దస్తమానూ టీవీలో సీరియళ్ళే సూస్తారా.. పిల్లాణ్ణే సూస్తారా..” అంటూ గొల్లున నవ్వేడతను.

అతను చెప్పిన సమాధానానికి వింటున్న వాళ్లందరూ తెల్లబోయేరు.

ప్రభాకరం కల్పించుకున్నాడు.

“చూడండీ, మీరూ, మీ భార్యా మీ అబ్బాయిని తీసుకుని సాయంత్రం మా క్లినిక్‌కి రండి. పిల్లాడి గురించి ఏం చూడాలో ఎలా చూడాలో చెపుతాను.” అన్నాడు.

“ఈనెవరూ!” అడిగేడు వైకుంఠం.

“ఈయన ఈ ఊళ్ళోనే పెద్ద పేరున్న సైకియాట్రిస్ట్. మీ అబ్బాయిని ఎలా బాగుచేసుకోవాలో చెపుతారు.”

“మా అబ్బాయికి రోగమేవీ లేదే!”

“మీ అబ్బాయి శరీరానికి రోగం లేకపోవచ్చు కానీ, అతని మనసుకి చికిత్స చెయ్యాలి. అందుకని ఆయన్ని కలవండి”

“ఏంటీ! నా కొడుకెవైనా పిచ్చాడనుకుంటున్నారా!” గట్టిగా అరిచేడు వైకుంఠం.

ప్రభాకరం నవ్వాడు. అతనికిది అలవాటే. సైకియాట్రిస్ట్ అనగానే పిచ్చివాళ్ళే వెడతారన్న భావం చాలామందిలో ఇంకా పోలేదు.

“చూడండీ. మీరు నా దగ్గరికి రావక్కరలేదు. మీ బిజినెస్ పనులు మానక్కరలేదు. మీ ఆవిడ సీరియళ్ళు చూడడం కూడా మానక్కరలేదు. ఇలాగే జరగనీయండి. ఇవాళ మీ అబ్బాయి యాసిడ్ బాటిల్ పట్టుకున్నాడు. రేప్పొద్దున్న కత్తి పట్టుకుని ఎవరి మీదకో వెడతాడు. ఎల్లుండి ఏ రివాల్వరో ఉపయోగిస్తాడు. ఈ లోపల మీవాణ్ణి పోలీసులు పట్టుకోకుండా చూసుకోండి.”

నెమ్మదిగా అంటున్న ప్రభాకరం మాటలు విన్న వైకుంఠం కంగారు పడ్డాడు.

“అట్టా గెట్టౌతుందీ!” అడిగేడు అనుమానంగా.

“ఎందుకవదూ! మీరు మీ అబ్బాయికి స్మార్ట్ ఫోన్ కొనిచ్చేరు కదా!”

“కొన్నాను. అందులోనూ అలాంటిలాంటిది కాదు. ఐ ఫోన్ కొన్నాను. లేటెస్ట్ మోడల్. మా చుట్టాల్లో ఎవురికీ లేదలాటిది.” గర్వంగా చెప్పేడు వైకుంఠం.

“మరి ఆ ఫోన్ మీ అబ్బాయి ఎలా వాడుతున్నాడో గమనించేరా!”

ప్రభాకరం ప్రశ్నకి తెల్లబోయేడు వైకుంఠం.

“మీరూ, మీ భార్యా మీ అబ్బాయిని తీసుకుని రేపు మా క్లినిక్‌కి రండి. మాట్లాడుకుందాం” అంటూ ఇంక అక్కడినుంచి వచ్చేసేడు ప్రభాకరం.

ప్రభాకరానికి ఈ వాసూ ఇలా ఎందుకు ప్రవర్తించేడో అర్థమైపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్. అందులో ఏమి చూస్తున్నాడో, ఎటువంటి గేములు ఆడుతున్నాడో గమనించుకోని పేరెంట్స్, కావల్సినది పొంది తీరాలన్న ఆ పిల్లాడి ఫీలింగ్.. ఈ మధ్య ఇలాంటివన్నీ చిన్నపిల్లల్లో కనిపిస్తున్నాయి. ఆ పిల్లల్ని సరైన దారిలో పెట్టాలంటే వాళ్లని ఎలా ట్రీట్ చెయ్యాలనే నిన్న మీన్స్‌ని అడిగేడు.

మీన్స్ ఏం చెపుతాడో చూసి, ఈ కేసుని అలాగే బాగుచేయాలనుకున్నా డతను.

ప్రభాకరం అనుకున్నట్టుగానే మర్నాటికి మీన్స్ నుంచి పరిష్కారం వచ్చింది.

అతననుకున్నట్టుగానే మీన్స్ కూడా టీనేజ్‌లో ఉన్న పిల్లలలో వస్తున్న ఇటువంటి ప్రవర్తనకి కారణాలు చెప్పేడు.

హింసాత్మకమైన సినిమాల ప్రభావం. అది సినిమా అనే జ్ఞానం లేకుండా దానిని నిజ జీవితానికి అన్వయించేసుకుంటారు కొందరు పిల్లలు.

మొబైల్‌లో దూకడం, పొడవడం, కాల్చడం లాంటి గేమ్స్ ఆడే పిల్లలు ఇలాంటి ప్రభావానికి లోనౌతుంటారు.

తల్లితండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోవడం వలన పిల్లల ఆలోచనలు మంచి విషయాలవైపు కన్నా ఎక్కువగా ఆకర్షించే ఇలాంటి చెడు విషయాలవైపే వెడుతుంది.

భ్రమల్లో, భ్రాంతుల్లో ఉండేవాళ్ళకు అసలు నిజాలు తెలియక ఆ భ్రమే జీవితం అనుకుంటుంటారు.

ఇలాంటి పిల్లల్లో హింసాత్మకమైన ఆలోచనలు వచ్చే అవకాశముంది.

ఆ హింసని వాళ్ళు రకరకాలుగా చూపెడతారు. ఎదుటి మనిషిని గాయపరిచీ, అనకూడని మాటలు అనీ, మానసికంగా హింసించీ.. ఇలా రకరకాలుగా ప్రవర్తిస్తారు.

ఇటువంటివారిని బాగు చెయ్యాలంటే కాగ్నిటివ్ బెహేవియరల్ తెరపీ (సిబిటి) చికిత్స చేయాలనీ, ఆ చికిత్స వారి మానసిక భావోద్వేగ నియంత్రణను మెరుగుపరచడానికి, వాటి అనుబంధ ప్రవర్తనలపై దృష్టి పెడుతుందనీ మీన్స్ చెప్పాడు. దానికి పేరెంట్స్‌కీ, పిల్లలకీ కలిపి, విడివిడిగానూ చాలా సిటింగులు తీసుకోవాల్సి ఉంటుందనీ, సమయం పడుతుంది కానీ, నెమ్మదిగా వారి ప్రవర్తనలో మార్పు వస్తుందనీ చెపుతూ, ఆ సిబిటి చికిత్స ఎలా చెయ్యాలో వివరంగా రాసాడు.

సరిగ్గా మీన్స్ చెప్పినట్టే చేసాడు ప్రభాకర్. కౌన్సిలింగ్ మొదలుపెట్టినప్పుడు దాని గురించి తెలీని వైకుంఠం, భార్యా సిటింగులు జరుగుతున్నకొద్దీ అందులోని మంచి విషయాలని తెలుసుకున్నారు. ఈ ప్రభాకర్ బాబు కనిపించకపోతే తమ కొడుకు జీవితం ఏమైపోతుందో ననిపించి, అప్పట్నించీ ప్రభాకరం చెప్పినట్టే చేస్తున్నారు వాళ్ళు.

వాళ్ళ సంతోషాన్ని చూసిన ప్రభాకరానికి తృప్తిగా అనిపించేలోపే మళ్ళీ మరో కేసు అతని ముందు కొచ్చింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here