[శ్రీమతి జి. ఎస్. లక్ష్మి రచించిన ‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా!’ అనే మినీ నవలను ధారావాహికగా అందిస్తున్నాము.]
[రాధ సమస్య గురించి తను ఎన్ని మెయిల్స్ పెట్టినా మీన్స్ నుంచి సమాధానం రాకపోయేసరికి ప్రభాకరం దిగులుపడతాడు. అతనికంతా అయోమయంగా ఉంటుంది. ఓ ఆదివారం స్థిమితం భోంచేసి చిన్న కునుకు తీసి వచ్చి హాల్లో కూర్చుంటాడు. అదే సమయంలో మీనాక్షి కాఫీ తెచ్చిచ్చి, అతని పక్కనే కూర్చుని రాధ విషయం ఏం చేద్దామని అనుకుంటున్నారని అడుగుతుంది. పతంజలి వచ్చే దాకా వేచిచూద్దాం అని అంటాడు. రాధ దృష్టి మార్చుకుని ఏదైనా చదువులో పడితే మంచిదని మీనాక్షి అనేసరికి విపరీతంగా కోపం తెచ్చుకుంటాడు. గట్టిగా అరుస్తాడు. ఆ అరుపులు విని లోపలి గదిలోంచి బయటకొచ్చిన రాధ గట్టిగా ఏడుస్తూ గోలగోల చేస్తుంది. తన కూతుర్ని అన్నయ్య చూసుకుంటానని మాటిస్తే, తాను తక్షణం చచ్చిపోతానని అంటుంది. తన ఉద్దేశాన్ని అపార్థం చేసుకున్నారని గ్రహించి, మీనాక్షి అక్కడ్నించి వెళ్ళిపోతుంది. ఓ రోజు మధ్యాహ్నం గుడిలో ఎవరో స్వామీజీ వచ్చారని చెప్పి, కూతుర్ని తీసుకుని వెళ్తుంది రాధ. అప్పుడు తాను తప్ప ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చాలా రోజుల తర్వాత కంప్యూటర్ తెరుస్తుంది. మెయిల్స్ చూసుకుంటుంటే ప్రభాకరం దగ్గర దగ్గర నుంచి వచ్చిన ప్రశ్నలు కనబడతాయి. వాటికి తగిన జవాబులు వ్రాస్తుంది. మర్నాడు కంప్యూటర్‍లో మెయిల్స్ చూస్తున్న ప్రభాకరానికి మీన్స్ నుంచి వచ్చిన సూచనలు కనబడతాయి. వాటిని అమలు చేసి, చెల్లెల్ని ఇంటి దగ్గరే ఉన్న ఓ కంప్యూటర్ కోచింగ్ సెంటర్‍లో చేర్పిస్తాడు. మేనకోడల్ని తన పిల్లల బడిలోనే చేర్పిస్తాడు. మీనాక్షి అభిమానం, ఆప్యాయతలతోనూ, ప్రభాకర్ ప్రేమా, సలహాలతోనూ రాధ నెమ్మది నెమ్మదిగా మామూలు ధోరణిలో పడుతుంది. కాలం గడుస్తూంటుంది. పిల్లల పెంపకం సవాలుగా మారుతోంది. పిల్లల ప్రవర్తన సవ్యంగా ఉండాలంటే ఏమి చెయ్యాలా అనే ఆలోచనలో పడతారు తల్లితండ్రులూ, టీచర్లూ, పెద్దలూ. అదే సమయంలో – స్కూళ్ళకి వెళ్ళి, టీచర్స్, పేరెంట్స్‌తో మీటింగులు పెట్టి, పిల్లల ప్రవర్తనను గమనించాలన్న ఆలోచన ప్రభాకరానికి వస్తుంది. ఓ రోజు మీనాక్షి అతని ఆఫీస్‍కి ఫోన్ చేసి – కూతురు వీణ స్కూల్లో ఎవరో కుర్రాడు వీణపై యాసిడ్ పోస్తామని బెదిరించాడనీ, తాను స్కూలుకి వెళ్తున్నాననీ, అతన్ని రమ్మని చెప్తుంది. కంగారుగా వెళ్తాడు. ప్రిన్సిపల్ రూమ్‍లో వీణ, చేతులు కట్టేసిన ఓ కుర్రాడు కనబడతారు. ఏం జరిగిందో తెలుసుకుంటాడు. ఆ అబ్బాయి వీణని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడనీ, వీణ అంగీకరించకపోయేసరికి వాష్ రూమ్‍కి వెళ్ళేదారిలో వీణపై యాసిడ్ పోయబోయాడనీ, ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ టీచర్ అది చూసి, ఆ కుర్రాడిని ఆపి, వాచ్‍మన్ సాయంతో పట్టుకుని తన ముందు నిలబెట్టిందని ప్రిన్సిపల్ చెప్తుంది. ఆ కుర్రాడి పేరెంట్స్‌ని పిలిపించమంటాడు ప్రభాకరం తండ్రి ఊర్లో లేడని తెలుస్తుంది, తల్లి రానని అంటుంది. ఆ రాత్రి ఈ సమస్య గురించి మీన్స్‌కి రాస్తాడు. ఊరు నుంచి వచ్చిన తరువాత ఆ కుర్రాడి తండ్రి స్కూలుకి వస్తాడు. ప్రిన్స్‌పాల్, ప్రభాకరం ఆయన కొడుకు భవిష్యత్తు గురించి నచ్చజెప్తారు. మీన్స్ సూచనల ప్రకారం భార్యాభర్తలిద్దరికి కౌన్సిలింగ్ ఇస్తాడు ప్రభాకరం. సిట్టింగ్స్ గడిచేకొద్దీ ప్రభాకరం తన కొడుకుకి మేలు చేస్తున్నాడని వాళ్ళు గ్రహిస్తారు. ఇక చదవండి.]
అధ్యాయం 15
[dropcap]ఒ[/dropcap]క రోజు పొద్దున్నే ప్రభాకరం పెద్దమ్మ కూతురు వరలక్ష్మి ఫోన్ చేసి ఏ మాటా చెప్పకుండానే ఏడుపు మొదలుపెట్టింది. ప్రభాకరానికి గాభరాలాంటిది వచ్చింది.
“ఏవయిందక్కా.. అందరూ బాగున్నారా.. బావగారు ఎలా ఉన్నారూ..”
“ఒరే ప్రభూ.. ఘోరం జరిగిపోయిందిరా.. మన రఘూ కనిపించడం లేదురా.. ఏ అఘాయిత్యం చేసుకున్నాడోనని హడిలిపోతున్నాంరా.. నేనూ బావానూ..” అంది.
ఒక్కసారి వళ్ళు ఝల్లుమంది ప్రభాకరానికి. పొద్దున్నే ఎమ్సెట్ రిజల్ట్స్ వచ్చాయి. కాసేపాగి రఘుకి ఎంత ర్యాంకు వచ్చిందో అడగాలనుకుంటున్నాడు. ఇంతలోనే ఈ వార్త.. ఏం చెప్పడానికీ తోచలేదతనికి.
“అక్కా, మీరేం కంగారు పడకండి.. నేనిప్పుడే వస్తున్నాను.”
ప్రభాకరం ద్వారా జరిగిన విషయం విన్న మీనాక్షి తను కూడా భర్తతో బయలుదేరింది.
వరలక్ష్మి ఆ ఊళ్ళోనే ఉంటోంది. ఆవిడ భర్త నాగేశం రాజమండ్రిలోనే ఉన్న ఒక కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. వాళ్లకి ఇద్దరు కూతుళ్ళూ, ఒక కొడుకూ.. కూతుళ్ళిద్దరికీ ఎలాగూ పెళ్ళి చేసి పంపించేస్తాం కదాని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించి, హైస్కూల్ అవగానే చదువు మానిపించేసి, తగిన సంబంధాలు చూసి పెళ్ళి చేసి పంపించేడు. ఆఖరివాడు కొడుకు రఘు. మగపిల్లాడు కదా అని చిన్నప్పట్నించీ ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని ప్రైవేటు స్కూల్లో చదివించాడు. కొడుకు ఎమ్సెట్‌లో మంచి ర్యాంకు తెచ్చుకోవాలని, ఇంటర్మీడియెట్ లోకి రాగానే ఎమ్సెట్ కోసం తలకు మించిన ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్లో కూడా చేర్పించి మరీ చదివిస్తున్నాడు.
వరలక్ష్మికీ, నాగేశానికీ కూడా ఇరవైనాలుగ్గంటలూ కొడుకు ఎమ్సెట్ ధ్యాసే.. రఘు పుస్తకాల ముందు నుంచి లేస్తే చాలు తల్లితండ్రులిద్దరూ అల్లాడిపోయేవారు. రోజూ వాళ్ళిద్దరూ పడుకునేముందు ఆ రోజు రఘు ఎన్ని గంటలు చదివాడో, ఎన్ని గంటలు నిద్ర పోయాడో.. మర్నాడు ఇంకా ఎన్ని గంటలు ఎక్కువ చదవాలో లెక్కలు వేసుకునేవారు.
రఘుకి ఏమాత్రం ఇబ్బంది కలగకూడదని చిన్నమెత్తు పని కూడా చెప్పకుండా, ఆరారగా తినడానికి, తాగడానికీ ఏర్పాట్లు చేస్తూ రఘ కన్న వాళ్ళే ఎక్కువగా అలసిపోయేవారు. కొడుకు చదువుకి ఎక్కడ ఇబ్బంది అవుతుందోనని వాళ్ళు ఎవరింటికీ వెళ్ళేవారు కాదు.. ఎవరినీ కూడా వాళ్ళింటికి రమ్మనమనేవారు కాదు.
వాళ్ళిద్దరూ ప్రభాకరంతో అస్తమానం రఘు చదువు గురించే మాట్లాడేవారు. అది చూస్తుంటే ప్రభాకరానికి ఒక విధమైన భయం లాంటిది వేసేది. కొడుక్కి మంచి చదువు చెప్పించుకోవాలనుకోవడంలో తప్పు లేదు. కానీ ఎమ్సెట్‌లో ర్యాంకు రాకపోతే ఇంక జీవితమే లేదన్నట్టున్న వాళ్ల ధోరణి అతనికి అర్థమయ్యేది కాదు.
ఆ మాటే అడిగాడు నాగేశాన్ని ప్రభాకరం. “ఏంటి బావా ఇదీ.. ట్యూషన్ పెట్టించావూ.. వాడూ బుధ్ధిగా చదువుకుంటున్నాడూ.. కానీ మీరిద్దరూ ఇరవైనాలుగ్గంటలూ అదే ధ్యాసతో ఉండడం మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దేన్నైనా తట్టుకునేలా మీరుండి, రఘూని చూసుకోవాలి.”
“మాకంటూ ఏవుందయ్యా ప్రభాకరం.. వాడి భవిష్యత్తు కోసమేగా ఇదంతా.. మాకేమైనా వ్యవసాయమా.. వ్యాపారమా.. ఉద్యోగం తప్ప వేరే దిక్కు లేదు. నాకెలాగూ సరైన చదువు లేదు.. అందుకే ఈ చిన్న ఉద్యోగంతో సరిపెట్టుకోవల్సొచ్చింది. కనీసం వాడైనా మంచి ర్యాంకు తెచ్చుకుని, ఇంజనీరయితే వాడైనా మా కన్న ఓ మెట్టు పైనుంటాడనీ.. అంతే.. ఏదో ఈ రెండేళ్ళూ కష్టపడి, మంచి చోట సీటొస్తే అంతకన్న మాకింకేం కావాలీ!”
నాగేశం మాటలకి ప్రభాకరం ఏమీ అనలేకపోయాడు. ఆయనన్నదీ నిజమే.. కానీ వీళ్ళు ధ్యాసంతా దాని మీదే పెట్టుకున్నారే.. ఈ పోటీ ప్రపంచంలో పావు మార్కుకి కూడా ర్యాంకు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఏదైనా తేడా వస్తే వీళ్ళు తట్టుకోగలరా అనిపించేది.
ఇప్పుడు మీనాక్షితో కలిసి అక్కింటికి వెడుతుంటే ప్రభాకరానికి అదే అనిపించింది. తను కూడా ఎంత చిన్నగా ఆలోచించాడూ.. అక్కాబావల గురించే ఆలోచించాడు కానీ రఘూ ఆలోచనలు ఎలా ఉంటాయోనని ఎందుకు ఆలోచించలేకపోయాడూ!..
ప్రభాకరాన్నీ, మీనాక్షినీ చూడగానే ఒక్కసారి గొల్లుమన్నారు వాళ్ళిద్దరూ. “ఎప్పుడో తెల్లారకట్ల ఎమ్సెట్ రిజల్ట్స్ వచ్చాయని ఫ్రెండ్ చెపితే ఇంటర్నెట్ కేఫ్‌కి వెళ్ళేడురా.. వెనకాల మీ బావని వెళ్ళమని చెప్తూనే ఉన్నాను. ఈయన బయల్దేరి వెళ్ళే లోపల వాడక్కడ రిజల్ట్స్ చూసుకోవడం.. ఎక్కడో చివరగా వచ్చిన ర్యాంకు చూసుకుని అక్కణ్ణించి వెళ్ళడం జరిగిపోయింది. ఇంటికి రాలేదు. ఎక్కడి కెళ్ళాడో తెలీదు.. వాళ్ల స్నేహితులు కూడా ఏమీ తెలీదంటున్నారు.”
ప్రభాకరానికి ఏం చెప్పాలో తెలీలేదు. అంత కష్టపడి చదివినా కొడుకుకి సరైన ర్యాంకు రాలేదన్న బాధ ఒకవైపు. ఎక్కడికి వెళ్ళాడొ తెలీని కొడుకు ఏ అఘాయిత్యం చేసుకుంటాడో ననే ఖంగారు మరోవైపు వాళ్లని నిలవనివ్వటం లేదు.
మీనాక్షి వరలక్ష్మి పక్కన కూర్చుని ఆమెని ఓదారుస్తోంది.
“కంగారు పడకండి వదినా.. మీ తమ్ముడు అన్నీ కనుక్కుంటారు. కావాలంటే పోలీస్ రిపోర్టిద్దాం..” ఆ మాట వినగానే వరలక్ష్మి ఏడుపు మరింత ఎక్కువైంది.
పోలీసులయితే బాగా కనుక్కుంటారని రిపోర్ట్ చెయ్యడానికి వెడితే, ఇలాంటప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయనీ, రెండ్రోజుల్లో కుర్రాడు ఇంటికి రాకపోతే అప్పుడు రిపోర్ట్ చెయ్యమనీ చెప్పారు.
ప్రభాకరం రఘు ఫ్రెండ్స్ ని కొంతమందిని కలుసుకుని, వాళ్ల ద్వారా ఇంకొంతమందిని కలుసుకుంటూ రఘు ఎక్కడికి వెళ్ళే అవకాశముందో ఆరా తీస్తున్నాడు. రిజల్ట్ చూసుకుని రఘు గోదావరొడ్డు వైపు వెళ్ళాడని ఎవరో అన్న మాటలని పట్టుకుని అటు వెళ్ళాడు ప్రభాకరం.
అధ్యాయం 16
అప్పుడే పూర్తిగా తెల్లవారింది. గోదవరిలో స్నానాలు చేసి వస్తున్న వాళ్ళని పరిశీలనగా చూస్తూ, గోదారిలోకి మోకాళ్ళలోతు వరకూ వెళ్ళాడు ప్రభాకరం.
అక్కణ్ణించి మార్కండేయస్వామి గుడిగోపురం వైపు మళ్ళింది అతని దృష్టి. ఆ పరమశివునికి మనసులోనే అంజలి ఘటిస్తూ తన మేనల్లుడిని క్షేమంగా తమ దగ్గరికి చేర్చమని వేడుకున్నాడు ప్రభాకరం. మనసంతా అల్లకల్లోలమైపోయింది.
అసలు ఎందుకిలా జరుగుతోంది. ఇంకా పూర్తిగా విచ్చుకోని పువ్వుల్లాంటి ఈ పసిమొగ్గలకి ఇలాంటి పరీక్షలేంటి! వాళ్ల నిండు జీవితమంతా ఈ పరీక్ష మీదే ఆధారపడినట్టు తల్లితండ్రులూ, టీచర్లూ పిల్లలని ఊదరగొట్టెయ్యడమేంటి! ఎమ్సెట్‌లో ర్యాంకు రాకపోతే ఇంక ఎందుకూ పనికిరాడన్న భావన వీళ్ళంతా పిల్లలలో ఎందుకు కలిగిస్తున్నారు. తల్లితండ్రులు అనుకున్నట్టు తమ కన్న పిల్లల జీవన పరిమాణం బాగుండాలంటే ఇంజనీరు, డాక్టరూ మాత్రమే అవాలా! మిగిలిన ఉద్యోగాలకి మన దేశంలో విలువా, డబ్బూ లేకుండా ఎందుకు పోతున్నాయి!
ఆలోచిస్తుంటే ప్రభాకరానికి ఒకటే అనిపించింది. వీళ్ళాంతా తమనీ, తమ పిల్లల్నీ పక్కవాళ్ళతో పోల్చుకుంటున్నారు. నిజంగా ఆలోచిస్తే బతకడానికి చాలా ఉద్యోగాలున్నాయి. ఇంచుమించు ఇంజనీర్‌కి వచ్చినంత జీతాలూ వస్తాయి. పని ఏదైనా దానిలో ప్రతిభ చూపించినవాడు జీవితంలో తప్పకుండా పైకొస్తాడు. కానీ ఈ మనుషులు చాలామంది గొర్రెలలాంటివారు. ఒక గొర్రె ఎటు వెడితే మందలో గొర్రెలన్నీ అటే వెడతాయి. ఇంకో దారి కోసం ప్రయత్నించను కూడా ప్రయత్నించవు. అందుకే చాలామంది తల్లితండ్రులు ఇంజనీర్, డాక్టర్ అన్న పేర్లలో ఉన్న గ్లామర్‌కి ఆకర్షించబడి తమ పిల్లల్ని ఈ రేట్ రేస్‌లో పెడుతున్నారు. అందులో కొందరు గట్టెక్కితే ఇంకొందరు మునగానాం తేలానాం అన్నట్టుంటున్నారు.. ఇలాంటి రేట్ రేస్‌లో రఘూ లాంటి పిల్లలు ఏమైపోవాలి.. ఇంతకీ ఈ రఘూ ఏమైనట్టూ!
నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ వస్తున్న ప్రభాకరం అటు పక్కన రావిచెట్టు మొదట్లో ఒక పెద్దాయన ముందు తడిబట్టలతో వణికిపోతూ కూర్చున్న ఓ కుర్రాణ్ణి చూసాడు. వీడు మన రఘూ లాగే ఉన్నాడే అనుకుంటూ కాస్త దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి ఆ కుర్రాడు నిజంగా రఘూనే.. “రఘూ..” అని పిలుస్తూ దగ్గరికి వెళ్ళిన అతన్ని చూసి ఆ పెద్దాయన “ఈ కుర్రాడు మీ తాలూకానా!” అనడిగాడు. అవునన్నట్టు తలూపాడు ప్రభాకరం. తలవంచుకుని నిలబడ్ద రఘుని చూసి, “జాగ్రత్తగా ఇంటికి తీసికెళ్ళండి. గోదాట్లో ఊపిరాడక మునకలేస్తుంటే ఒడ్డుకి తెచ్చాను. ఈత రానివాళ్ళు నీళ్ళలో అంత మధ్యలోకి వెళ్ళకూడదు.” అంటూ రఘూని ప్రభాకరానికి అప్పచెప్పి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా రఘూ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు ప్రభాకరం. మావయ్యని చూసి ఒక్కసారి గొల్లుమన్నాడు రఘు..
“నేను మా అమ్మానాన్నలకి మొహం చూపించలేను మావయ్యా.. చచ్చిపోతాను..” అన్నాడు వెక్కుతూ..
పీకలదాకా వచ్చిన కోపాన్ని బలవంతాన ఆపుకున్నాడు ప్రభాకరం.
“నువ్వు చచ్చిపోతే వాళ్ళేమైనా సంతోషపడిపోతారా!” అనడిగాడు పళ్ళ బిగువుతో.
“వాళ్ళు నా మీద ఎంత ఆశ పెట్టుకున్నారో.. బోల్డు డబ్బు ఖర్చు పెట్టేరు. అంతా నాశనం చేసేను. నేనెందుకూ పనికిరాను.. నాకింక చదువు రాదు మావయ్యా..”
“పోనీలే.. మీ ఇంటి కెళ్ళొద్దు. మా ఇంటికి వెడదాం రా..” అంటూ ఒక విధంగా బలవంతంగా తమింటికి తీసుకొచ్చాడు ప్రభాకరం మేనల్లుణ్ణి. మీనాక్షిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తను అక్కా వాళ్ళింటికి వెళ్ళి, రఘూ క్షేమంగా తమింట్లో ఉన్నాడని చెప్పగానే వాళ్లకి కొత్త ఊపిరి వచ్చినట్టైంది.
“ఇక్కడికి తీసుకురాకుండా మీ ఇంటికి ఎందుకు తీసికెళ్ళేవ్..” అన్న నాగేశం ప్రశ్నకి వీళ్ళకి విషయం పూర్తిగా వివరించకపోతే కష్టమనుకుంటూ అసలు విషయం చెప్పాడు ప్రభాకరం.
“బావా, రఘూ గోదాట్లో పడి చచ్చిపోదామనుకున్నాడుట”
షాక్ తిన్నారు వింటున్న ఇద్దరూ.
“మన రోజు బాగుండి అప్పుడు అక్కడే ఉన్న ఓ పెద్దాయన పైకి తీసుకొచ్చి, తన దగ్గర పెట్టుకుని కూర్చున్నాడు. నేను వెళ్ళేసరికి ఇదీ పరిస్థితి. ‘ఏంటీ ఈ పనీ!’ అంటే ‘నా మొహం అమ్మా నాన్నలకి చూపించలేను మావయ్యా.. వాళ్ల ఆశలన్నీ కుప్పకూల్చేసాను.’ అంటూ ఏడవడం మొదలుపెట్టేడు. వాణ్ణి ఊరుకోబెట్టి, మా ఇంట్లో దింపి వచ్చేను. అక్కా, బావా.. మీరే చెప్పండి. ముందసలు పిల్లాడు బతికుంటే కదా ఇంజనీరో డాక్టరో అవడానికి!”
ప్రభాకర్ చెప్తున్నది వింటున్నకొద్దీ వాళ్ళిద్దరికీ దుఃఖం ఉబికి ఉబికి వచ్చేసింది.
“మా పిల్లాడు మా కళ్ళ ముందుంటే చాలు. ఎలాగోలా బతుకుతాడు.” అంటూ రఘూని ఇంటికి తీసుకురమ్మని బతిమాలేరు. ప్రభాకర్ ఆ సమయంలో వాళ్ళిద్దరికీ పిల్లల మీద ఆశ పెట్టుకోవడం తప్పు కాదనీ, కానీ ఆ ఆశే పిల్లలని భయపెట్టేలా చెయ్యకూడదనీ అర్థమయ్యేలా చెప్పేడు.
ఈ సంఘటన తర్వాత ఇలాంటి టీనేజ్ పిల్లలు మానసికంగా దృఢంగా ఉండడానికి జూనియర్ కాలేజీల కెళ్ళి, ఆ స్టూడెంట్స్‌తో మాట్లాడేవాడు. చదువు ముఖ్యమే, అన్ని చదువులూ అన్నం కోసమే, కానీ వాటితోపాటు మనిషికి విలువలు కూడా అంతే ముఖ్యమంటూ, తమ మీద తమకి ఎలా నమ్మకం కలిగించుకోవాలో ఉదాహరణలతో సహా చెప్పేవాడు.
రాజమండ్రిలో ఉన్న స్కూళ్ళన్నింటిలోనూ ఆయా మేనేజిమెంట్ వాళ్ళతో మాట్లాడి విద్యార్థులకి కౌన్సిలింగ్ ఇవ్వడం మొదలుపెట్టేడు. ఒత్తిడులు లేకుండా ఎలా చదువుకోవాలో, మంచి మార్కులు రావాలంటే చదువుకు ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలో ఆయా స్కూళ్ళకెళ్ళి స్పీచ్‌లు ఇచ్చేవాడు. ముఖ్యంగా మార్కులు తక్కువొచ్చినప్పుడు మానసికంగా బలహీనులయిన పిల్లలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయేవారు. వారిని డిప్రెషన్ లోంచి బయటికి తీసుకొచ్చి, మళ్ళీ చదువుకునేలా ధైర్యం ఇచ్చేవాడు. అందుకే ఒకరిని చూసి ఇంకోరు మొత్తం అన్ని స్కూళ్ళూ ప్రభాకర్ కౌన్సిలింగ్ కోసం క్యూలు కట్టేసేరు.
(సశేషం)