[శ్రీమతి జి. ఎస్. లక్ష్మి రచించిన ‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా!’ అనే మినీ నవలను ధారావాహికగా అందిస్తున్నాము.]
[ఓరోజు పొద్దున్నే ప్రభాకరం అక్క వరసయ్యే వరలక్ష్మి ఫోన్ చేసి ఏడవడం మొదలుపెడుతుంది. గాభరాపడిన ప్రభాకారం ఆమెని ఓదార్చి వివరం కనుక్కుంటాడు. తన కొడుకు రఘు కనిపించడం లేదనీ, ఏ అఘాయిత్యం చేసుకుంటాడోనని భయం వేస్తోందని చెప్తుందామె. ఆ రోజు ఉదయమే ఎమ్‍సెట్ ఫలితాలు వచ్చాయి. కంగారుపడొద్దనీ, తాను వస్తున్నానని చెప్తాడామెకు. మీనాక్షి, ప్రభాకర్ ఇద్దరూ వరలక్ష్మి ఇంటికి వెళ్తారు. ఇద్దరు ఆడపిల్లల తరువాత పుట్టిన రఘు అంటే వరలక్ష్మీకి, ఆమె భర్త నాగేశానికి అమితమైన ప్రేమ. కొడుకుకి ఎమ్‍సెట్‌లో మంచి ర్యాంకు రావాలని, ఆర్థికంగా తమకి ఇబ్బందైనా సరే, ఎక్కువ ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్లో చేర్పిస్తారు. కొడుక్కి మంచి చదువు చెప్పించుకోవాలనుకోవడంలో తప్పు లేదు. కానీ ఎమ్సెట్‌లో ర్యాంకు రాకపోతే ఇంక జీవితమే లేదన్నట్టున్న వాళ్ల ధోరణి ప్రభాకరంకి నచ్చేది కాదు. అక్కకీ, బావగారికీ నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు, కానీ వాళ్ళు వినరు. ఇంటికొచ్చిన ప్రభాకరాన్ని చూడగానే వాళ్ళిద్దరూ గొల్లుమంటారు. పొద్దున్నుంచి రఘు జాడ తెలియడంలేదని అంటారు. మీనాక్షి వరలక్ష్మి పక్కన కూర్చుని ఆమెని ఓదార్చింది. పోలీస్ రిపోర్ట్ ఇద్దామని వెడితే, ఇలాంటప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయనీ, రెండ్రోజుల్లో కుర్రాడు ఇంటికి రాకపోతే అప్పుడు రిపోర్ట్ ఇవ్వమని చెప్తారు పోలీసులు. రిజల్ట్ చూసుకుని రఘు గోదావరొడ్డు వైపు వెళ్ళాడని ఎవరో చెప్పిన మాటలు విని గోదావరి ఒడ్డుకు వెళ్తాడు ప్రభాకరం. స్నానఘట్టం మెట్లు దిగి వెళ్ళి చూస్తాడు. అక్కడ్నించి పైకి ఎక్కుతుంటే, రావిచెట్టు మొదట్లో ఒక పెద్దాయన ముందు తడిబట్టలతో వణికిపోతూ కూర్చున్న ఓ కుర్రాణ్ణి చూస్తాడు. రఘూ లానే ఉన్నాడే అనుకుంటూ అక్కడికి వెళ్ళి చూస్తే, రఘూనే. గోదాట్లో ఊపిరాడక మునలేస్తుంటే, కాపాడి ఒడ్డుకు తెచ్చాననీ, పిల్లాడ్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఆ పెద్దాయన వెళ్ళిపోతాడు. అమ్మానాన్నలకి మొహం చూపించలేననీ, చచ్చిపోతానని అంటాడు రఘు. వాడిని ముందు తన ఇంటికి తీసుకువెళ్ళి, ధైర్యం చెప్పి, తరువాత, ఆక్కాబావలకి ఫోన్ చేసి జరిగినదంతా చెప్తాడు. వాళ్ళు వచ్చి రఘుని తీసుకువెళ్తుంటే – పిల్లల మీద ఆశ పెట్టుకోవడం తప్పు కాదనీ, కానీ ఆ ఆశే పిల్లలని భయపెట్టేలా చెయ్యకూడదనీ వాళ్ళిద్దరికీ అర్థమయ్యేలా చెప్తాడు ప్రభాకరం. ఈ ఘటన తర్వాత టీనేజ్ పిల్లలు మానసికంగా దృఢంగా ఉండడానికి జూనియర్ కాలేజీల కెళ్ళి, ఆ స్టూడెంట్స్‌తో మాట్లాడడం మొదలుపెట్టాడు. స్కూలు విద్యార్థులు మార్కులు తక్కువగా వస్తే డిప్రెషన్ లోకి వెళ్ళకుండా ధైర్యం చెప్పేవాడు. ఒకదాని తర్వాత మరొకటిగా అన్ని స్కూళ్ళు ప్రభాకరం కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాయి. ఇక చదవండి.]
అధ్యాయం 17
పది పదిహేనేళ్ళక్రితం ఇలా మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళడం అవమానంగా అనుకునేవారు. ఒక్క పిచ్చి పట్టినవాళ్ళే మెంటల్ డాక్టర్ దగ్గరికి వెడతారనే అభిప్రాయంలో ఉండేవారు. కానీ టెక్నాలజీ పెరిగి, మనుషుల్లో యాంత్రికత ఎక్కువయి, ఒత్తిళ్ళూ, మానసిక సంఘర్షణలూ మీదపడినప్పుడు ఇలా కౌన్సిలింగ్ అంటూ సైకాలజిస్ట్ దగ్గరకి వెళ్ళడం మామూలయిపోయింది. జీవితాలు ఇదివరకటిలా సామాన్యంగా ఉండడం లేదు. చాలా సంక్లిష్టంగా ఉంటున్నాయి.
ఒక్క చదువులోనే కాదు దానితోపాటు ఈ రోజుల్లో కొత్తగా భార్యాభర్తల మధ్య కేసులు కూడా ఎక్కువైపోయాయి.
ఈమధ్య భార్యాభర్తల కూడా చాలా తొందరగా విభేదాలు వచ్చేస్తున్నాయి. ఎవరికి వారే ఈగోలతో, సర్దుకుపోవడమనే మాట మరిచిపోయి, విడాకుల కోసం వెడుతున్నారు. అందుకని రాజమండ్రి లోని కొందరు లాయర్లు తమ దగ్గర కొచ్చిన ఇలాంటి విడాకుల కేసులని ముందు కౌన్సిలింగ్ కోసం ప్రభాకరం దగ్గరికి పంపుతున్నారు. ఇన్నేళ్ళ అనుభవంలో చిన్న చిన్న సమస్యలను తనంతట తనే తీర్చేస్తున్నా కొన్ని గడ్డు సమస్యలకు ఇప్పటికీ ఇంకా మీన్స్ మీదే ఆధారపడుతున్నాడు ప్రభాకరం.
ఉమ్మడి కుటుంబాలున్న రోజుల్లో లోపల్లోపల ఎన్ని గొడవలున్నా ఎవరూ బైట పడేవారు కాదు. కాస్త నోరున్న ఏ కోడలయినా ఇంట్లో జరిగే విషయం నచ్చక ‘ఏమిటని’ ప్రశ్నిస్తే, ఆమెని ఇంటిని విడదీసే దుర్మార్గురాలిగా చూసేవారు. ఆమె పుట్టింటివారూ, అత్తింటివారూ కూడా సర్దుకుపొమ్మంటూ నయానా భయానా ఆ కోడలికి బుధ్ధులు చెప్పేవారు.
కానీ ఇప్పుడు ఒంటరి కాపురాలయినా కూడా ఇంట్లో ఉండే ఆ భార్యాభర్తలిద్దరి మధ్యా కూడా సయోధ్య ఉండడం లేదు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసేసి గొడవలు పెట్టేసుకుంటున్నారు. కొంతమంది విషయంలో వారి వారి స్వభావాలు పడక అలా గొడవలు పెట్టుకుంటుంటే, మరి కొంతమంది విషయంలో అటూ ఇటూ ఉన్న వాళ్ల పేరెంట్స్ వాళ్లని రెచ్చగొడుతున్నారు. ఇలాంటి కేసులు ఎక్కువైపోవడం వల్ల ప్రభుత్వం వీరికోసం ఫేమిలీ కోర్టులంటూ కొత్తగా ప్రవేశపెట్టింది. ఈ మధ్య వాటి సంఖ్య కూడా పెరిగింది. ప్రతి జిల్లా లోనూ రెండో మూడో ఈ ఫేమిలీ కోర్టు లుండడం మామూలయిపోయింది.
అంతేకాక పదేళ్ల నించీ ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుంటున్న భార్యాభర్తల కోసం పోలీస్ స్టేషన్‌లో కూడా ఫేమిలీ కౌన్సిలింగ్ లని ఏర్పాటు చేసారు. అలా ఏర్పాటు చేసిన వాటిల్లో మూడు పోలీస్ స్టేషన్లలో కౌన్సిలింగ్ మెంబర్లలో లాయరూ, డాక్టర్లూ, సీనియర్ సిటిజన్లూ, సైకియాట్రిస్ట్ లతో పాటు సైకాలజిస్ట్‌గా ప్రభాకర్ కూడా ఉన్నాడు.
అక్కడికి వచ్చిన ఒక్కొక్క కేసూ వింటుంటే అతనికి మతి పోతోంది. అతను పుట్టి పెరిగిన వాతావరణం వేరు. అప్పటికి ఆడవాళ్లకు ఇంతింత చదువులూ లేవు, ఇలాంటి ఉద్యోగాలూ లేవు. ఏదో వేణ్ణీళ్ళకి చన్నీళ్ళన్నట్టు ఆ రోజుల్లో ఆడవాళ్ళు కూడా టీచరూ, టైపిస్టూ లాంటి ఉద్యోగాలు చేసినా ఇంటి బాధ్యత మటుకు వదిలేవారు కాదు. రెండు పనులూ ఎంతో సమర్థవంతంగా చేసుకుని, ఇంటి సాంప్రదాయం నిలబెట్టే ఆడవాళ్లనే చూసేడతను. అతని దృష్టిలో ఆడదంటే ఎంత చదువుకున్నా మొగుడి మాట వింటూ, ఇంటి గౌరవం నిలబేట్టేదే. అందుకే అతనికి మీనాక్షంటే అంత అభిమానం. డిగ్రీ చదివినా కూడా తన అడుగులకి మడుగులొత్తుతుంది. మీనాక్షిని తల్చుకుంటే అతని గుండె ఉప్పొంగుతుంది. ఆమెని ఎన్నుకోవడం తన జీవితంలో చేసిన అద్భుతమైన పని అని అనిపిస్తూంటుంది.
అందుకే ఇలా మొగుడి మీద, అత్తమామల మీద కేసులు పెడుతున్న ఆడవాళ్ళు ప్రభాకరానికి సమాజానికి పట్టిన చీడపురుగులులా కనిపిస్తారు. ప్రతిచిన్న విషయాన్నీ గృహహింస కింద చిత్రీకరించేసి, ఆ ఆడవాళ్ళు పెడుతున్న కేసులు చూస్తున్నకొద్దీ అతనికి మతిపోతోంది. అందుకే అతని ఆలోచనలు పక్షపాత ధోరణిలోనే ఉండేవి. కానీ, ఈమధ్య ఈమధ్యే కొంచెం కొంచెం మనుషుల మనస్తత్వాలలో వస్తున్న మార్పులు గమనిస్తుంటే అతనికీ ఆ ఆడపిల్లలు చెప్పేది సబబేనేమో ననిపిస్తోంది. కానీ అతని సాంప్రదాయ మనస్తత్వం దానికి ఒప్పుకోవటం లేదు.
సబ్జెక్ట్‌ని బట్టి ఒకలాగా, తన సాంప్రదాయ ధోరణిని బట్టి ఒకలాగా అనిపిస్తున్న తన సమస్యని మీన్స్ ముందు పెట్టేడు ప్రభాకరం.
దానికి మీన్స్ నుండి చాలా పెద్ద సమాధానమే వచ్చింది.
మన హిందూ చట్టంలో ఒక మహిళ భర్త నుంచి ఎటువంటి సమయాల్లో విడిపోవచ్చో స్పష్టంగా చెప్పారు.
భర్త మతిస్థిమితం లేనివాడయినా, సన్యసించినా, దేశాలు పట్టిపోయి ఏడు సంవత్సరాలయినా తిరిగి రాకపోయినా ఆ భార్య విడాకులు తీసుకోవచ్చని ఉంది. అలా విడాకులు సాఫీగా జరగడాన్ని మూడు ‘C’ ల సిధ్ధాంత మంటారని వివరించాడు మీన్స్. మొదటిది కౌన్సిలింగ్ (Counselling), రెండోది కోఆపరేషన్ (Cooperation ), మూడోది కమ్యూనికేషన్ (Communication).
విడాకులు తీసుకుంటున్నప్పుడు స్త్రీలు, పురుషుల మనోభావాలు వేరువేరుగా ఉంటాయనీ, దానిని కేవ్ అండ్ వేవ్ (Cave and Wave) అంటారనీ కూడా చెప్పాడు. మగవాడు తన మనోభావాలన్నీ ఒక గుహలో దూరిపోయినట్టు తన మనసులో దాచేసుకుంటాడనీ, అదే ఆడవారయితే ఒక కెరటం లాగా ఎగసి ఎగసి బైట పడతారనీ కూడా చెప్పాడు.
అందులో మీన్స్ సమాజంలో టెక్నాలజీ తెచ్చిన మార్పుల్ని ఉటంకిస్తూ, దాని ప్రభావం మనుషుల మనస్తత్వాలలో ఎంత బలంగా ఉందో ఉదాహరణలతో సహా చెప్పేడు.
అంతా విన్న ప్రభాకరం తన దగ్గరికి వచ్చిన ఒక కేసును మీన్స్ ముందు పెట్టాడు.
సంధ్య, వినీల్ పెళ్ళి చేసుకుని సంవత్సర మయింది. విడాకుల కోసం వెళ్ళిన వారిని పోలీస్ శాఖ కౌన్సిలింగ్ కోసం ప్రభాకరం దగ్గరికి పంపారు.
పెళ్ళి సమయానికి వాళ్ళిద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే. సంధ్య బెంగళూర్‌లో పని చేసేది. వినీల్ హైద్రాబాద్‌లో తల్లీ, ఇద్దరు తమ్ముళ్ళతో ఉండేవాడు. భార్యాభర్త లిద్దరి మధ్యా సరిగా మాటామంతీ సరిగా లేకపోవడం వల్ల అపార్థాలు తలెత్తాయి. అమ్మాయిది తప్పని అబ్బాయి తరఫువాళ్ళూ, అబ్బాయిది తప్పని అమ్మాయి తరఫువాళ్ళూ వారి వారి పెద్దరికం నిలబెట్టుకుందుకు అహంభావానికి పోయి సమస్యను మరింత జటిలం చేసారు.
ఇద్దరినీ కలిపి కూర్చోబెట్టి ఎంత కలుపుదామని చూసినా ఇద్దరు ఒప్పుకోలేదు. అప్పుడు మీన్స్ ఒక సలహా చెప్పాడు. ఒక వ్యక్తి ప్రవర్తన అతను పెరిగిన పరిస్థితులపై ఆధారపడి వుంటుందనీ, దానినే సోషల్ సైకాలజీ అంటారనీ అందుకని ఆ భార్యాభర్త లిద్దరూ ఎటువంటి పరిస్థితులలో పెరిగారో విడివిడిగా వాళ్ళిద్దరినీ ప్రశ్నించమన్నాడు ప్రభాకరాన్ని. ఆ పనే చేసాడు ప్రభాకరం.
వినీల్ వాళ్ళింట్లో పెద్దకొడుకు. తనకి ఇంకా ఇద్దరు తమ్ముళ్ళున్నారు. అతను పదో తరగతి చదువుతుండగా తండ్రి చనిపోతే తల్లి చాలా కష్టాలు పడి పిల్లల్ని చదివించింది. అందుకే అతనికి తల్లీ, తమ్ముళ్ళతో విడదీయలేని బంధం.
సంధ్య ఆ ఇంట్లో పెద్దమ్మాయి. ఆమెకి ఒక చెల్లెలుంది. సంధ్యకి పన్నెండళ్ళుండగా తండ్రి చనిపోయాడు. తల్లి ఉద్యోగం చేసి పిల్లలిద్దర్నీ పెద్ద చేసింది. ఆ ఉద్యోగ బాధ్యతల్లో పిల్లల్ని సరిగ్గా చూడగలనో లేదో నని ఇద్దర్నీ హాస్టల్లో పెట్టి చదివించింది. చుట్టాలూ, స్నేహితులూ కూడా ఎలాంటి సాయం చెయ్యకపోవడంతో వాళ్ళు ఆర్ధికంగా చాలా బాధపడ్డారు. తల్లి తెచ్చే డబ్బు తోనే సరిపెట్టుకోవలసొచ్చేది. సహజంగా సంధ్య నలుగురిలో కలిసే పిల్ల కాదు. బిడియస్తురాలు. నెమ్మదైనది. అందుకే ఎవరూ స్నేహితులు కూడా లేరు. తల్లితోనూ, చెల్లితోనూ కూడా చనువు తక్కువే.
డిగ్రీ పూర్తి చేసేక సంధ్యకి మంచి ఉద్యోగం వచ్చింది. తెలిసినవాళ్ళు వినీల్ సంబంధం తీసుకొచ్చారు. అప్పటికి వినీల్ ఒక మల్టీ నేషనల్ కంపెనీలో పని చేస్తున్నాడు. రెండువైపులవాళ్లకీ అన్నీ నచ్చడంతో ఇద్దరికీ పెళ్ళైంది. సంధ్య బెంగళూర్‌లో ఉద్యోగం వదిలేసి హైద్రాబాదు భర్త దగ్గరికి వచ్చేసింది. సంధ్య మళ్ళీ ఎక్కడా ఉద్యోగంలో చేరలేదు.
మొదటి నెల బాగానే గడిచింది. ఆ తర్వాత నుంచే గొడవలు మొదలయ్యాయి. భర్త సంపాదనంతా తల్లికీ, తమ్ముడికీ ఇచ్చేస్తున్నాడని అత్తగారితో గొడవ పెట్టుకుని వేరే కాపురం పెట్టించింది సంధ్య. తమ వల్ల మొగుడూపెళ్ళాలు విడిపోకూడదని వినీల్ తల్లి వేరు కాపరానికి ఒప్పుకుంది. వేరే వచ్చాక కొన్నాళ్ళు సంధ్య బాగానే ఉంది. కానీ తర్వాత అతన్ని తల్లికీ తమ్ముడికీ డబ్బు లివ్వకుండా అతని క్రెడిట్ కార్డులన్నీ తన చేతిలో పెట్టమంది. వినీల్ దీనికి ఒప్పుకోలేదు, తల్లికి డబ్బు లివ్వడం మానలేదు.
ఒకరి మాట ఇంకొకరు వినకపోవడం వల్ల ఇద్దరిమధ్యా గొడవలు ఎక్కువయ్యాయి. అవి తీవ్రస్థాయికి చేరేసరికి తనపై గృహహింస జరిగిందంటూ సంధ్య పోలీస్ స్టేషన్‌కి వచ్చింది. పోలీస్ వాళ్ళు వెంటనే కంప్లైంటు తీసుకోకుండా ముందు వీళ్ళిద్దరినీ కౌన్సిలింగ్‌కి పంపుదామనే ఉద్దేశ్యంతో ఆ కేసుని ప్రభాకర్ దగ్గరికి పంపించారు. అలా సంధ్యా, వినీల్ ప్రభాకర్ దగ్గరికి రావడం జరిగింది.
సంధ్యా, వినీల్.. ఇద్దరూ పెరిగిన పరిస్థితులు విడివిడిగా విన్న ప్రభాకర్ ఈ విషయాలన్నీ మీన్స్‌కి చెప్పాడు. అప్పుడు మీన్స్ ఈ కేసుని విశ్లేషించాడు.
అధ్యాయం 18
భార్యాభర్త లిద్దరి మధ్యా కమ్యూనికేషన్ గేప్ చాలా ఉందన్నాడు. తండ్రి పోయాక వినీల్‌కి తన తల్లితోనూ, తమ్ముళ్ళతోనూ అనుబంధం బాగా పెరిగిందనీ, కానీ సంధ్య హాస్టల్లో ఉండడం వల్ల, చెల్లెలికీ ఆమెకీ ఏడేళ్ళ వ్యత్యాసం ఉందడం వల్ల ఎవరితోనూ అనుబంధమే లేకుండా పెరిగిందనీ చెప్పాడు.
సంధ్యని ఏ శలవులకి కలిసినా సంధ్య తల్లి ఎప్పుడూ కూతురికి డబ్బుకున్న ప్రాముఖ్యత గురించే చెప్పేది. డబ్బుని జాగ్రత్తగా చూసుకోవాలని, ఎప్పుడూ దాన్ని వదులుకోకూడదనీ చెప్పేది. అది సంధ్య బుర్రలో బాగా నాటుకుపోయింది. అసలు ఆమె వినీల్‌ని పెళ్ళి చేసుకుందుకు కారణం కూడా మల్టీ నేషనల్ కంపెనీలో అతను సంపాదిస్తున్న జీతం చూసే. అందుకే తను ఉద్యోగం కూడా మానేసి, అతను తల్లీ తమ్ముళ్ళ మీద డబ్బు వృథా చెయ్యకుండా చూసుకోవాలనుకుంది.
అంతేకానీ తల్లీ పిల్లల మధ్యా, అన్నదమ్ముల మధ్యా ఉండే అనుబంధాలలోని ఆనందం ఆమెకి తెలీదు. ఆమె తల్లి ఎంతసేపూ డబ్బు మీద నీ పట్టే ఉంచుకో, లేకపోతే నాలాగే బాధపడవలసొస్తుంది అని చెపుతుండడంతో ఆ డబ్బు కోసం అస్తమానం వినీల్‌తో గొడవ పెట్టుకునేది.
కేసుని ఇంతగా విశ్లేషించాక మీన్స్ మరో మాట కూడా చెప్పాడు. ఒక బంధాన్ని ఏర్పరచుకునేటప్పుడు ఆ వ్యక్తి ఎటువంటి పరిస్థితులలో, ఎటువంటి విలువలతో పెరిగాడో తెలుసుకోవాలనీ, అలా వ్యక్తి పెరిగిన విధానమే అతని ప్రవర్తనని నిర్దేశిస్తుందనీ కూడా చెప్పాడు.
వివాహబంధం సవ్యంగా సాగాలంటే వాళ్ళు ఈ నిజాలను గ్రహించాలనీ. అందుకని సంధ్యనీ, వినీల్‌నీ కూర్చోబెట్టి వారి వివాహబంధం నిలబడడానికి వాళ్ళు వారి ప్రవర్తనని ఎలా మార్చుకోవాలో థెరపీలా చెప్పమన్నాడు.
ప్రభాకరం మీన్స్ చెప్పినది స్టెప్ బై స్టెప్ చేసాడు.
సంధ్యకీ, వినీల్‌కి అయిదునెలల్లో పన్నెండుసార్లు కౌన్సిలింగ్ చేసాడు. అందులో ఇద్దరికీ విడివిడిగా రెండుసార్లు చేసాడు. ఒక వ్యక్తి అనుకున్నట్టే ఎదుటిమనిషి ప్రవర్తించాలంటే జరిగే పని కాదనీ, ఏ వ్యక్తికి ఆ వ్యక్తే స్వతంత్రుడనీ వాళ్ళిద్దరికీ అర్థమయ్యేలా చెప్పాడు. ఏ బంధమైనా నిలబడాలంటే ఆ ఇద్దరు వ్యక్తులూ కూడా ఎదుటి మనిషి ఆలోచనలు కూడా గ్రహించాలని చెప్పాడు. బంధం నిలబెట్టుకుందుకు ఇద్దరూ ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవాలనీ, కమ్యూనికేషన్ గాప్ వల్ల గొడవలకు అవకాశముందనీ చెప్పాడు.
విడిగా సంధ్యని కూర్చోబెట్టి, ప్రతి విషయాన్నీ డబ్బుతో చూడకూడదనీ, డబ్బుకు దక్కని అనుబంధం, ఆత్మీయతా కూడా ఉంటాయనీ, కేవలం తల్లి మాటలు విని వినీల్‌ని అపార్థం చేసుకోవద్దనీ, సంధ్య మాట వినడంటూ ఆమె అనుకుంటున్నది తప్పనీ, తల్లీ, తమ్ముళ్ళతో పాటు వినీల్ అతని సంపాదనలో ఎక్కువ భాగం తన కుటుంబం కోసం కూడా వినియోగిస్తున్నాడనీ చెప్పాడు.
అలాగే వినీల్‌ని కూడా కూర్చోబెట్టి సంధ్య అతనిని నమ్మి వెంట వచ్చిందనీ, తల్లీ తమ్ముళ్ళతో పాటు ఆమెకి కూడా సమయం కేటాయించి అప్పుడప్పుడు బైటకి తీసుకెళ్ళడం, చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం లాంటివి చెయ్యాలనీ చెప్పాడు.
వినీల్, సంధ్యా వారి వివాహం విడాకులదాకా వెళ్ళకుండా ప్రభాకర్ చెయ్యగలిగాడు. ఇలా మీన్స్ చెపుతున్న పరిష్కారాలన్నీ సక్సెస్ అవుతుండడంతో ప్రభాకరం దగ్గరికి కేసులు ఎక్కువగా రావడం మొదలైంది.
ఒక్కడూ అన్నీ చూసుకోలేక సైకాలజీలో మాస్టర్స్ చేసిన ఇద్దరిని తనకి సాయంగా పెట్టుకున్నాడు.
ఈ ప్రాక్టీస్‌లో చాలా బిజీ అయిపోడంతో ఉద్యోగానిక్కూడా రిజైన్ చేసేసి పూర్తిగా తన క్లినిక్కే నడుపుకుంటున్నాడతను. తన కుటుంబం దర్జాగా బతకడమే కాకుండా మరో నలుగురికి ఉద్యోగాలిచ్చే స్థాయికి వచ్చేడతను. దీనికంతటికీ కారణం మీన్స్ అనే అతని నమ్మకం. అందుకే రోజు కోసారైనా మీనాక్షి దగ్గర ఆ మీన్స్ ప్రసక్తి తేకుండా ఉండలేడు. అలా రోజూ మీన్స్‌ని తల్చుకుని అతనిపట్ల తన కృతజ్ఞతను చూపించుకుంటున్నట్టు భావిస్తాడతను.
అలాగే సన్మానాలంటూ జరిగితే అవి జరగాల్సింది నిజానికి తనకి కాదనీ, చక్కటి సలహాల నిచ్చి తన్నింతటివాణ్ణి చేసిన మీన్స్‌కనీ ప్రభాకరం నిశ్చితాభిప్రాయం. ఇన్నేళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో మీన్స్ తనకి ఎంతగా సహాయపడ్డాడో చెపుదామని మీన్స్‌కి మెయిల్ చెయ్యడానికి కంప్యూటర్ ముందు కూర్చున్నాడతను. తల్చుకుంటున్నకొద్దీ అతని మనసు మీన్స్ పట్ల కృతజ్ఞతతో నిండిపోతోంది. ఊళ్ళో తనకి లభించిన గౌరవం, ఈ డబ్బూ ఇవన్నీ అతను పెట్టిన భిక్షే కదా అనుకుంటూ తన మనసులోని భావాలన్నీ విడమరిచి చెప్తూ, మీన్స్‌కి కృతజ్ఞతలు చెప్పేడతను. అంతేకాకుండా ఒకసారి మీన్స్‌ని తనింటికి రమ్మనీ, అతన్ని సత్కరించుకునే అవకాశం తనకిమ్మనీ ఎంతో అభిమానంగా వేడుకున్నాడు. ఎంత చెప్పినా తనివితీరటం లేదతనికి. ఈసారి మీన్స్ కనక స్వయంగా వచ్చి కలవకపోతే ఇంక మాట్లాడనని బెదిరింపు కూడా జోడించి మరీ కంప్యూటర్ ముందు నుంచి లేచేడతను.
(ముగింపు వచ్చే వారం)