[box type=’note’ fontsize=’16’] రచయిత వేణు నక్షత్రం గారి ‘మౌనసాక్షి’ కథా సంపుటానికి డా. నందిని సిధారెడ్డి గారు వ్రాసిన ముందుమాట ఇది. [/box]
[dropcap]జీ[/dropcap]వన సంఘర్షణలను సమర్థవంతంగా చిత్రించగలిగే అత్యుత్తమ ప్రక్రియ కథ. కవిత్వంలో వీలుకాని విపులత, నవలలో సాధ్యంకాని క్లుప్తత లక్ష్యానుగుణ శిల్పం కథకు మాత్రమే సాధ్యమవుతుంది. సన్నివేశాలయినా, సంఘటనలయినా, సంఘర్షణ సంవాదాలేవైనా సముచితంగా పండుతాయి. సృజనాత్మక సాహిత్య కళారూపాల్లో విశేషమైంది. గత లిఖిత సాహిత్యంలో కవిత్వం, కథ కలసి ఉన్నప్పటికీ ఆధునిక సాహిత్యంలో కవిత్వం నుండి విడివడి కథ సమున్నత గౌరవాన్ని పొందుతున్నది. తెలుగులో కథా సాహిత్యం పుష్కలంగా వెలువడినప్పటికీ, తెలంగాణలో రావలసినంతగా రాలేదన్నని సత్యం. ఈ ప్రాంతం ప్రజా జీవితంలోని ఘర్షణలను, మలుపులను, స్వభావాలను ఎప్పటికప్పుడు అందుకోలేకపోతున్నది. కవిత్వ రూపాలతో పోల్చి చూసినప్పుడు కథారచనలో కొంత వెలితి కనబడుతున్నది. వేణు నక్షత్రం తెలంగాణా కథకు కొత్త కాంతినద్దుతూ వెలిగిస్తున్న కథా సంపుటి ‘మౌనసాక్షి’. వేణు చేయి తిరిగిన కథకుడు. 90వ దశకంలో తెలుగు సాహిత్యంలో బాధ్యతతో కలం తిప్పిన రచయితే. ‘పర్యవసానం’ కథతో ఆలోచనాపరుల్ని ఆకట్టుకున్న రచయిత రెండు దశాబ్దాల జీవన పోరాటం అక్షరాల నుంచి దూరం చేయగలిగినా, ఆలోచనల నుంచి అవగాహన నుంచి విడదీయ లేక పోయింది. లఘు చిత్ర నిర్మాణం వైపు మళ్లి ‘పిలుపు’, ‘ఎంతెంతదూరం’, ‘అవతలి వైపు’ ప్రయోగాలు చేశాడు. వర్తమాన సామాజిక పరిణామాలు మానవీయ విలువలను ఎట్లా క్షోభ పెడుతున్నాయో స్పష్టంగా వివరించాడు. ఇప్పుడు ప్రచురిస్తున్న ఈ పదకొండు కథలు రచయిత పరివేదన ప్రతిబింబిస్తున్నాయి. హృదయమున్న ఏ రచయిత అయినా జరుగుతున్న తీవ్రతకు ఒత్తిడి పడకుండా ఉండలేడు. మనుషులుగా క్షీణిస్తున్న విషాద సందర్భానికి దుఃఖించకుండా తప్పించుకోలేడు. వేణు హృదయమున్న చింతనాపరుడు. రెండు దశాబ్దాల సామాజిక విప్లవోద్యమాలతో కలసి నడచిన భావకుడు. కళ్ళనిండా కలలతో, మనసు నిండా భావోద్వేగాలతో, జీవితమంతా ఆకాంక్షలతో ఉప్పొంగి ఊగిన ఊహాజీవే. కాలం కఠోరమైనది. ఎక్కడెక్కడో తొలిచింది. మరెక్కడో పొడిచింది. చిత్రం ఛిద్రమైంది.
వేణు నక్షత్రం రచయితగా కుదురుకుని, తనను తాను ఓదార్చుకొని, తనలో తొంగి చూసుకుని రాసిన కథలివి. జీవనాడి రక్తం ఉన్నంతసేపు కొట్టుకున్నట్టు కట్టుకున్నట్లుగానే రచనాభిలాష పెట్టిన అలజడికి అక్షర రూపాలివి. కథలు చదువుతుంటే తప్పనిసరిగా గాయపడుతుంటాం. నడుమ నడుమ సరి చేసుకుంటాం.. నడుస్తున్న ప్రయాణానికి, నడచిన చరిత్రకు నిలువుటద్దాలివి. స్వచ్ఛ నిజాయితీతో చేసిన సమీక్షలు, సమాలోచనలు. ఆర్ద్రతకు, అక్షర రూపాలు తెలుగు నేలమీదైనా, తెలంగాణ గడ్డ మీదైనా, అమెరికాలో నైనా రచయితకు మనశ్శాంతి ఉండదు. వేణు అందుకు ఉదాహరణ.
‘పర్యవసానం’, ‘అశ్రువొక్కటి’ రెండు కథలకు విప్లవోద్యమమే నేపథ్యం. మనసు చెమ్మగిలే మంచి కథలు. రవి కిషోర్ అనే విప్లవ కార్యకర్త ప్రమాదం అంచున ఉండి బస్సు ఎక్కుతాడు. బస్సులో ప్రయాణిస్తున్న ఉపాధ్యాయిని అరుణ తన పక్కన కూర్చున్న అతని గురించి చెడుగా ఆలోచిస్తుంది. వెంటాడుతున్న పోలీసుల నుంచి తప్పించుకోవడానికి బస్సు దిగి, తర్వాత ఎన్‌కౌంటర్ మరణం పొందుతాడు. అరుణ లోని అంతర్మథనం ‘పర్యవసానం’ పక్క వాళ్ళ పరిస్థితికి బాధ్యతగా మానవీయంగా చూడాలని నైతిక కోణాన్ని సభ్య సమాజ స్థితిని ఆవిష్కరించిందీ కథ. ‘అశ్రువొక్కటి’ విప్లవోద్యమంలో నెలకొన్న లోపలి కోణాన్ని చిత్రించింది. ఒకే సమాజ మార్పు కోసం ఉద్యమిస్తున్న రెండు వర్గాల నడుమ ఘర్షణ వివరిస్తూనే, ఒకే వర్గంలోని రెండు భిన్న (పట్టణ, అడవి) స్థితుల స్వభావాల వ్యత్యాసాల్ని నిశితంగా చర్చించాడు రచయిత.
జీవన రీత్యా వేణు అమెరికాలో స్థిరపడ్డాడు. అమెరికాలోనే తెలుగువారి జీవితం మనోభావాల ప్రభావం అనివార్యంగా రచయిత మీద పడక తప్పదు. అక్కడే తెలుగు రచయితల సాహిత్యాన్ని ‘డయాస్పోరా’ అంటున్నారు. ఆ ధోరణిలో రచయిత ‘పిలుపు’, ‘వేక్‌అప్’,‘నాతిచరామి’, ‘సూపర్ హీరో’,’వెలితి’ ఐదు కథలు రచించాడు. అమెరికాలో స్థిరపడిన రెండు తెలుగు కుటుంబాల నడుమ సంబంధాలు పిల్లల చదువుల విషయంలో వ్యత్యాసాలు, పోటీ, భరించలేని ఒత్తిడి,తల్లిదండ్రుల ఆకాంక్షలు, బాల్యం కోల్పోయిన పిల్లవాడి మానసిక స్థితికి దర్పణం ‘వేక్‌అప్’. మరో కథ ‘పిలుపు’ పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు గురించి తను సంపాదన దృష్ట్యా కన్నా వారి నుండి బిడ్డను దూరం చేసే ప్రేమరాహిత్య కోణాన్ని చిత్రించింది. ‘నాతిచరామి’ కథ పిల్లల్ని కనలేని స్త్రీ పట్ల మగాడి, మన ఇంటి వారి ప్రవర్తన సున్నితంగా ఆర్ద్రంగా వ వ్యక్తీకరించాడు రచయిత. అమెరికాకు వెళ్లి, ఆధునిక సాంకేతిక విజ్ఞానం తో జీవిస్తున్నా, మారని పురుష స్వభావం స్త్రీని ఎట్లా హింసిస్తుందో బలంగా వివరించాడు. చదువుతుంటే మనం ద్రవీభూతమవ్వాల్సిందే. చదువుల కోసం సంపాదన కోసం తండ్రి బలవంతానా దారి మారిన కళాకారుడి అంతరంగం ‘సూపర్ హీరో’.
‘మృగాల మధ్య’ మతోన్మాదుల అమానుషత్వాన్ని, ‘మౌనసాక్షి’ సభ్యసమాజ అమానవీయతను, ‘కౌముది’ నిజ ప్రేమ త్యాగాన్ని ప్రబలంగా చిత్రించాయి.
ప్రతి కథలో వేణు ‘నక్షత్రం’లా మెరుస్తుంటాడు. బాధ్యత తెలిసిన రచయిత. తనదైన భావజాలమున్న రచయిత కనపడకుండా ఉండలేడు. పాత్రల్లోనో, సంభాషణల్లోనో, కథనంలోనో రచయిత బహిర్గతం కాక తప్పదు. వేణు సమాజం పట్ల మనుషుల పట్ల బాధ్యతాయుత రచయిత.
“జీవితాన్ని ఎవరికి నచ్చినట్టు కాకుండా తమకు నచ్చినట్లు జీవించడం అనే సత్యం, దానిలో ఉండే సంతృప్తి వారిద్దరి మాటలు స్పష్టంగా అర్థమైంది. సూపర్ హీరో పాత్ర మనోగతమే అయినా అది రచయిత దృష్టి కోణమే. “పోటీపడి- అవసరం లేకపోయినా ప్రెస్టేజ్‌కి పోయే కార్లు కొనడం, ఇల్లు కొనడం – ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందో…. దేర్ షుడ్ బి ఏ లిమిట్ రాజి – ఎస్ మన పాపని ఎక్కడికి పంపడం లేదు” (పిలుపు) సంభాషణలో భాగమే. అయినా రచయిత చెప్పదలచిన సారమిదే.
మనుషుల ప్రాణాలకు విలువలేని రాజ్యంలో – ఆర్తులు, అన్నార్తుల కేసి, జాలిచూపు లేని కర్కశలోకంలో – రైలు పరుగులు తీస్తుంది. దానితోపాటు మనుషులూ (మౌనసాక్షి) ఇదొక ఒక కథ ముగింపు. కథనమైనా రచయిత అంతర్మథనమే.
పదకొండు కథల్లో మానవీయకోణం నిబిడీకృతమైందనిపిస్తుంది. రచయిత ‘సామాజిక దృక్పథం’ చదువరులకు అవగతమౌతుంది. మంచి కథలు చదివించే లక్షణం, ఆలోచింపజేసే గుణముండాలి. వేణు కథల్లో ఈ రెండు గుణాలు పుష్కలంగా కనిపిస్తాయి. ఆధునిక కాలపు సాంకేతిక సమాచార విజ్ఞానంతో వీగే మనుషుల మనస్తత్వాన్ని పట్టుకోవడంలో రచయిత విజయం సాధించాడు. ఇష్టంగా ఈ కథలు చదివితే మనుషులు ఎవరైనా మరింత మానవీయంగా తయారవుతారు అని నేను భావిస్తున్నాను.
మూడు దశాబ్దాలుగా వేణు నాకు తెలుసు. రాయగలిగే ఉండి రాయలేక పోవడాన్ని నేను స్వీకరించ లేను. కథారచనను సీరియస్‌గా తీసుకుంటే వేణు మంచి కథలు రాయగలడు. మనుషుల్ని మనుషులుగా తీర్చటానికయినా మరిన్ని మరిన్ని కథలు రాయాలని కోరుతూ వేణుకు శుభాభినందనలు.
***
రచన: వేణు నక్షత్రం
పుటలు: 145
వెల: ₹ 100/-
ప్రచురణ: నక్షత్రం ప్రచురణలు
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
సంపత్ కుమార్ బెల్లంకొండ
302, శ్రీ శివ గంగ టవర్స్,
మంజీరా నగర్, రోడ్ నెంబర్ 9,
ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్ 500010
ఫోన్: 9908519151