Site icon Sanchika

మృతనదీ తీరంలో

కె.సచ్చిదానందన్ కవితకు బండ్ల మాధవరావు తెలుగు అనువాదం “మృత నదీతీరంలో”.

మృత నదీతీరంలో నేనొక నావికుడ్ని

ఇసుక పొరల్లో ఇంకిపోయిన

నీటి గలగలల సంగీతం కోసం

ఎండిన ఇసుకతిన్నేలకు

చెవి వొగ్గి ఎదురుచూస్తున్నాను

నదిలో స్నానాలాచరిస్తున్నవారో

భక్తితో నాణాలు విసురుతున్నవారో

దృశ్యమానం అవుతున్నారు

 

నీలాకాశంలోకి ఎగురుతున్న సూరీడు

పచ్చటి వరిపొలాలు

మామిడిచెట్లు అరటితోటలు

బారులు తీరిన చెరుకు తోటలు

చేపలు పీతలు

పండుకలు వరదలు

అన్నీ నదీ జ్ఞాపకాల పొరల్లో నిక్షిప్తమైవున్నాయి

 

నదీ తీరాల ఇసుకతిన్నెలు

కలవడాల

విడిపోవడాల

మృతకళేబరాల

రహస్యసంకేతాల్ని

తమలో పొదవిపట్టుకొన్నాయి

 

ముగింపులేని ఓ గాలిపాటతో

నేను కూడా నిలబడివున్నాను

నావి,ఊరొదిలి వెళ్లిన నా మిత్రులవి

బాల్యపుస్మృతులన్నింటిని

ఆ ఇసుక పొరల్లోనే కప్పెట్టాను

 

అనేకానేక నదులను తనలో కలుపుకొనేందుకు

నదీద్వారాలు ఎప్పడూ తెరిచే ఉంటాయి

నదిమీద ఉన్న ఆనకట్ట

భగీరధుని ఓటమిని చూస్తూ నిలబడే ఉంది

 

మూలం – కె.సచ్చిదానందన్,

అనువాదం – బండ్ల మాధవరావు

 

 

Exit mobile version