ముద్ద మందారం

2
2

[dropcap]‘ఆ[/dropcap]నంద్’ అనే పిలుపు వినబడేసరికి వరండాలోకి వెళ్లి చూసాడు ఆనంద్..
“శేషు నువ్వా బహుకాల దర్శనం.. రారా లోపలికి రా..” అంటూ చిన్ననాటి స్నేహితుడిని ఇంట్లోకి తీసుకు వెళ్లి కూర్చోమన్నాడు. వంటింట్లోకి వెళ్లి కాఫీ తీసుకువచ్చి ఇచ్చాడు ఆనంద్. చిన్నప్పటి విషయాలన్నీ మాట్లాడుకున్నారు.
“ఔను కాఫీ నువ్వు తెచ్చావు, నీ భార్య పిల్లలు ఏరీ” అని అడిగాడు శేషు.
“నా భార్యని పరిచయం చేస్తాను రా” అంటూ పక్కగది లోకి తీసుకువెళ్లాడు… కాళ్ళు
చాపి లాస్యని బోర్లా పడుక్కోబెట్టి స్నానం చేయిస్తోంది… కూతురితో ఎన్నో కబుర్లు చెప్తోంది… శేషుకి అర్ధం కాక అయోమయంగా చూసాడు ఆనంద్ వైపు..
“ఇలా రా” అంటూ స్నేహితుణ్ణి పెరటివైపు తీసుకెళ్లి చూపించాడు.
“ఇదేమిటి ఇన్ని రకాల మందారాలు?” అని అడిగాడు శేషు.
“అవన్నీ నా కూతురికోసమే…” అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు ఆనంద్..
ఆ కన్నీటి చుక్కల్లోంచి జ్ఞాపకాలు జాలువారాయి.

***

“అమ్మా మందారం చిగురించింది” అంటూ వీధి గుమ్మంలోచే ఒక్క కేక పెట్టింది లాస్య.
అప్పుడే నిద్రలేచిన కూతురికి వంటింట్లో బూస్టు కలుపుతున్న భారతి
“ఏదీ” అంటూ బయటికి వచ్చింది.
“నిజమేనే చిగురించింది” అంటూ కూతురి బుగ్గలు పుణికింది.
“లేతకొమ్మ అని, వాడిపోయిందనీ, చచ్చిపోతుందని అన్నావు” అంది లాస్య.
“నువ్వు ప్రేమగా పెంచావు కదా! అందుకే అది చిగురించింది. పద బూస్టు తాగి స్నానానికి వెల్దువుగాని” అంటూ కూతుర్ని అక్కడి నుంచి లోపలికి తీసుకుపోయింది.

***

ఒక వారం క్రిందట సాయంత్రం స్కూల్ నుంచి వస్తూ పక్కవీధిలో ఎవరో కోసి పడేసిన మందార కొమ్మల్లోనుంచి ఒక లేతకొమ్మను తనతో తీసుకువచ్చింది లాస్య.
“అమ్మా ఎంత ఎర్రగానో పూచేది ఈ మందార. కొమ్మలన్నీ కోసేశారు. మనం వేసుకుందామే” అంది లాస్య.
“పొద్దున్న ఎప్పుడనగా కోసేసారో బాగా వాడిపోయి ఉంది. పైగా లేత కొమ్మ బతకదురా తల్లీ” అని ఎంత చెప్పినా వినలేదు. నాటి చూద్దామని పట్టుపట్టింది. పిల్ల కోరిక కాదనలేక ఒక పాత బకెట్టు తెచ్చి మట్టి నింపి మందార కొమ్మను పాతింది భారతి. ఆ కొమ్మ ఇపుడు చిగురు పెట్టేసరికి లాస్య ఆనందానికి అంతులేకుండా పోయింది.
రోజూ ఉదయం సాయంత్రం ఒక అరగంట ఆ మొక్క దగ్గరే గడుపుతూ “ఆకులు ఎప్పుడు వేస్తావమ్మా… ఎప్పుడు మొగ్గ పెడతావమ్మా..” అంటూ మందార మొక్కని అడుగుతూ ఉండేది.
మరో వారం గడిచింది. మందార మొక్కకి నాలుగైదు ఆకులు వచ్చాయి.
“అమ్మా నాలుగాకులు వచ్చాయికదా! ఇప్పుడు మొగ్గపెడుతుందా?” అంటూ అడిగేది లాస్య.
మరో వారానికి పక్క రెమ్మలు కూడా వచ్చేయి.సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసరికి రేపు “నీ మందారకి మొగ్గవొస్తుంది చూడు” అని అమ్మ చెప్పింది.
సంబరపడుతూ పాలుతాగి మూతైనా తుడుచుకోకుండానే మొక్కదగ్గరికి పరిగెత్తింది.
“బుజ్జి బంగారం ఎక్కడున్నావు” అంటూ పరీక్షగా వెతికింది. పచ్చని రెమ్మల మాటున రానా, వద్దా అని ఆలోచిస్తున్నట్లు చిట్టి మొగ్గ కనిపించింది.
“అమ్మా ఇది రేపే పూచేస్తుందా” అని అడిగింది తల్లి కొంగుపట్టుకుని లాగుతూ…
“లేదమ్మా ముద్దమందారం కదూ ఒక నాలుగైదురోజులు పడుతుంది. ఇవాళ శనివారం కదా! బహుశా మంగళ వారం పూస్తుందేమో!”అంది తల్లి.
ఆదివారమంతా ఆ మొక్కతోడిదే లోకమయ్యింది లాస్యకి.
“తప్పమ్మా అలా ఆస్తమాను అటే చూడకూడదు” చెప్పింది తల్లి.
“చూస్తే ఏమౌతుంది.”
“నువ్వు అదేపనిగా చూస్తున్నావని మొక్కకి భయమేసి మొగ్గని దాచేస్తుంది. అప్పుడు నీకు పువ్వు కనిపించదు.”
“అమ్మో అయితే చూడనులే” అని ఇంట్లోకి వెళ్ళిపోయింది.
చెప్పినమాట వినే లాస్య నిద్రలేస్తూనే ఒక సారి మళ్లీ సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఒకసారి మాత్రమే మొక్కని చూసేది.
మంగళ వారం ఉదయాన్నే “అమ్మా ఇంకా పూవు పూయలేదు” అంది లాస్య.
“రేపటికి పూస్తుంది లేమ్మా”
“నిజంగా”
“నిజంగానే”
బుధవారం ఉదయాన్నే చిక్కని ఎర్రని రంగులో ఎంతో అందంగా పూచిన మందారాన్ని చూస్తూ మురిసిపోయింది లాస్య.
“చూడమ్మా ఆ పువ్వు మొక్కకి అలాగే ఉంటే అంత త్వరగా వాడిపోదు. నువ్వు స్కూల్ కి వెళ్లి రా!” అని కూతురి చెయ్యపట్టుకుని ఇంట్లోకి లాక్కు వచ్చింది.
రెండు వీధుల అవతలే లాస్య స్కూలు. బడివిడిచిన పదినిమిషాలలో ఇంట్లో ఉండేది. అందులోనూ ఈ రోజు పువ్వు పూసిన ఆనందంలో ఇంకా ముందుగానే వచ్చేయ్యాలి. ఇంకా రాలేదు అనుకుంటూ బయటకు వచ్చి సందు చివరవరకు చూసింది. నాలుగున్నర కావస్తోంది రాలేదు. ఇంట్లోకి బయటకి కాలుకాలిన పిల్లిలా తిరుగుతోంది.. వొళ్ళంతా నీరైపోతోంది.. నోరు పిడచకట్టుకు పోతోంది. ఐదు, అయినా లాస్య రాలేదు. భారతిలో కంగారు ఎక్కువయ్యింది. చుట్టుపక్కల వారిని అడిగింది. భర్తకి ఫోన్ చేసింది. ఒక వేళ పక్కింట్లోకి వెళ్లిందేమోనని బయటినుంచే అడిగింది.
“లేదమ్మా మాఇంటికి రాలేదు. శేఖర్ బయటకి వెళ్ళాడు ఇంకారాలేదు”అంది.
స్కూల్ దగ్గరకి వెళ్ళింది అక్కడ ఎవరూ లేరు. ఆ చుట్టుపక్కల అంతా వాకబుచేసి కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి వచ్చింది. ఇంతలో భర్త ఆనంద్ వచ్చాడు. బావురుమంటూ తానుచేసిన ప్రయత్నాలన్నీ చెప్పింది.. ఆనంద్ పోలీసు రిపోర్టు ఇచ్చి వచ్చాడు. లాస్య కనబడలేదన్న విషయం అందరికీ తెలిసింది.. తెల్లవార్లు చుట్టుపక్కల వాళ్ళు అందరూ తలో దిక్కు వెతికారు. ఫలితం శూన్యం.
పిల్ల దొరకాలని ఎన్నోదేవుళ్ళకి మొక్కుకుంది. “ఏమండీ నా పిల్లని తీసుకు రండీ.. అది లేకుండా బతకలేనండీ..” అని రోదిస్తూ ఆనంద్ షర్ట్ పట్టుకుని ఊపుతూ అడుగుతున్న భారతిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది.
ఈ లోగా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది.
కూతురు జాడ తెలిసే ఉంటుంది అనుకుని కళ్ళను తుడుచుకుని, ఫోన్ అందుకున్నాడు. అవతలి నుంచి… “మీ అమ్మాయి దొరికింది, గవర్నమెంటు హాస్పిటల్ కి రండి” అని చెప్పడంతో ఆ వీధి వాళ్ళతోపాటు భారతీ ఆనంద్‌లు హాస్పిటల్‌కి చేరుకున్నారు.హాస్పిటల్ అంతా రోగులతో కిక్కిరిసి ఉంది. జనాలని దాటుకుంటూ పోలీసుల వెనకాలే వెళ్తున్నారు… క్యాజువాలిటీ వార్డు, మెటర్నరీ వార్డు, ఆపరేషన్ థియేటర్, అన్నీ దాటుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో అర్ధం కాలేదు… హాస్పిటల్ కాంపౌండ్ చివరన ఉన్న పోస్టుమార్టం గది దగ్గరికి వెళ్ళేసరికి ఆనంద్‌కి గుండె ఆగినంత పని అయ్యింది… ఏడ్చి ఏడ్చి భారతి కళ్ళల్లో కన్నీటి చుక్కలు ఇంకిపోయాయి. మాట మూగబోయింది. ఊపిరి స్తంభించింది. ఒక్కక్షణం నిశ్శబ్దం..
“ఏమండీ మన పిల్ల దొరికింది… నవ్వుతూ ఉంది చూడండి.. లాస్యా లే అమ్మా ఇప్పుడు పడకేంటి?
నా బంగారు తల్లివి కదూ, మందార పువ్వు చూద్దువు గాని రా అమ్మా!” అని భారతి పిలుస్తూ ఉంటే అందరికీ గుండెలు తరుక్కు పోయాయి.
“అదిరా సంగతి అప్పటి ఉంచి ఇదే పరిస్థితి. మందులు వాడినా ఫలితం లేకపోయింది.”
“ఇంతకీ నిందితుడు ఎవర్రా?” అడిగాడు శేషు.
“ఏం చెప్పమంటావ్? మన నీడను మనమే నమ్మలేని రోజులు వచ్చాయి. ఎవరికి ఎప్పుడు ఏ బుద్ధులు పుడతాయో చెప్పలేం. మొక్క మొగ్గని దాచుకున్నట్లుగా నా చిన్నారి తల్లిని దాచుకోలేకపోయాం. నమ్మిన వాడిచేతిలో మోసపోయాం. ఖాళీ సమయాల్లో ‘అన్నా’ అంటూ పక్కింటి శేఖర్ దగ్గరకు వెళ్ళేది. వాడే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది.
“ఆ దుర్మార్గుడికి శిక్ష పడిందా?”
“శిక్ష వాడికే కాదు ఒక్కగానొక్క కూతురు పోవడంతో మతిస్థిమితం లేక నా భార్యకు, నాకు శిక్షే” అన్నాడు ఆనంద్.
“నీ కొచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఇక నీ భార్యే నీ కూతురు” అని ఓదార్చాడు శేషు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here