ముద్దుల వరం

2
2

[box type=’note’ fontsize=’16’] లేఖిని సంస్థ నిర్వహించిన 2021 దీపావళి కథల పోటీలలో ప్రత్యేక బహుమతి గెలుచుకున్న కథ ఇది. రచన కె.కె. భాగ్యశ్రీ. [/box]

[dropcap]”అ[/dropcap]మ్మమ్మకే చాలు ఈ మనవరాలు… ముక్కోటి దేవతల ముద్దులవరాలు…” ఎఫ్.ఎం. రేడియోలోనుంచి శ్రావ్యంగా వినవస్తున్న భానుమతి పాటని వినగానే నుదురు చిట్లించింది సంపూర్ణ.

“కాస్త ఆ రేడియో ఆపుచేస్తారా!” అసహనంగా చెప్పింది అక్కడే కూర్చుని పేపర్ చదువుతున్న ఆనంద్‌తో.

“ఏమైంది పూర్ణా… భానుమతి పాటలంటే చెవి కోసుకుంటావు కదా…” అడిగాడు ఆనంద్ చదువుతున్న పేపర్ మడిచి టీపాయ్ మీద పెడుతూ.

“అందతే లెండి… నాకెందుకో ఈ పాట వినాలనిలేదు…” మూతి ముడిచింది సంపూర్ణ.

ఏదో అర్థమైనట్లుగా నవ్వాడు ఆనంద్.

“చిన్నపిల్లలాగా ఏమిటిది పూర్ణా… మనది కాని దాని మీద మమకారం పెంచుకోవడం తప్పేకదా!” ఆమె బాధ ఎరిగినవాడిలాగా అనునయించాడు ఆనంద్.

“మమకారం పెంచుకోకుండా ఎలా ఉంటానండీ… కళ్ళు తెరవని పసిగుడ్దుని గుండెకి హత్తుకుని లాలించాను. ఏడేళ్ళపాటు కళ్లలో పెట్టుకుని సాకాను. చివరికి, వాళ్ళమ్మ వచ్చి ఇచ్చేయమంటే… గుండె రాయి చేసుకుని అప్పజెప్పేశాను” కన్నీళ్ళు పెట్టుకుంది సంపూర్ణ.

ఆమె ఆవేదన అర్థమైనవాడిలా  ఆమెను ఎదకి హత్తుకుని, తల నిమిరాడు ఆనంద్ ఓదార్పుగా.

తనది అనుకున్న ఆటబొమ్మని వేరెవరో దౌర్జన్యం చేసి ఎత్తుకుపోయినట్లుగా ఏడుస్తున్న పసిపాప కనబడిందామెలో.

“అనఘ వర్ష – మానస్‌ల సంతానం అని నువ్వు మరచిపోతున్నావు పూర్ణా…”

“కావచ్చు… ఉద్యోగం, కెరీర్ అంటూ ఐదునెలల పసిదాన్ని నా దగ్గర వదిలేసి పరుగులు తీసినప్పుడు ఏమైందో… ఈ కన్నవారి మమకారం…”  అంది సంపూర్ణ ఉక్రోషంగా.

“పిచ్చిదానా… మనం కన్న మన అమ్మాయే మనలని వదిలి, వేరే ఇంటికి వెళ్ళిపోయింది. అలాంటిది తను కన్న పాపాయి మనలని అంటిపెట్టుకుని ఉంటుందని ఎలా అనుకుంటున్నావు? వాస్తవాన్ని జీర్ణించుకునే ప్రయత్నం చేయి… కావాలంటే కొన్నాళ్ళపాటు ఢిల్లీ వెళ్ళి నీ మనవరాలి దగ్గరుండి రా” నచ్చచెప్పాడు ఆనంద్.

“బాగుంది సంబడం… అల్లుడింట్లో వెళ్ళి ఎన్నాళ్ళుండమంటారు? అయినా నేను వెళ్తే… మిమ్మల్నెవరు చూసుకుంటారు!” తల అడ్డంగా ఆడించేసింది సంపూర్ణ.

“మెడకేస్తే కాలికేస్తావు… కాలికేస్తే మెడకేస్తావు… నీతో ఎలా పూర్ణా?” నిస్సహాయంగా ముఖం వేలాడేశాడు ఆనంద్.

అతడి వాలకం చూసి నవ్వింది పూర్ణ.

“హమ్మయ్య… నవ్వావు. పండగొచ్చినట్లుంది నాకు. ఎక్కడుండాల్సిన వారు అక్కడ ఉంటేనే ముద్దు. అదే అందరికీ మంచిది. నువ్వు మనసుని సంబాళించుకోవడం మంచిది…” అన్నాడు ఆనంద్ సంపూర్ణని దగ్గరకు తీసుకుని.

“అంతేనంటారా!” బేలగా అడిగిన భార్యని మరింత దగ్గరగా పొదువుకున్నాడు ఆనంద్.

***

“నాకెందుకో దీన్ని చూస్తే బెంగగా ఉంది మానస్…”  బయట ఆడుతున్న పిల్లలను తమ బాల్కనీలోనుంచే మౌనంగా చూస్తూ నిలబడిన అనఘను ఉద్దేశించి అంది వర్ష.

“అనఘ వచ్చి నెల రోజులే అయింది. ఈ వాతావరణం అదీ కొత్త. అక్కడ మీ అమ్మగారికి బాగా అలవాటు పడింది కదా! అందుకే… మన దగ్గర అడ్జస్ట్ కాలేకపోతోంది” సముదాయించాడు మానస్.

“అది నిజమే అయినా… అది మనలని అపరిచితులని చూసినట్లుగా చూస్తోంది. మనం దీన్ని అమ్మ దగ్గర వదిలి తప్పు చేశామేమో!” తాను చేసినది పొరపాటేమోనని తల్లడిల్లింది మానస.

“అదేమీ కాదులే. నువ్వు  అతిగా ఆలోచించకు. తొందరలోనే అనఘ సెట్ అయిపోతుంది.” భార్యని అనునయించాడు మానస్.

ఇంతలో వర్ష సెల్‌కి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. అది వాళ్ళ పక్కింటి కుసుమ్ చేస్తోంది. వాళ్ళు ఊరెళుతూ వాళ్ళ కుక్క సంరక్షణా బాధ్యత వర్ష వాళ్ళకి అప్పచెప్పారు. ఆ కుక్క వర్ష వాళ్ళకి కూడా అలవాటే కాబట్టి దాన్ని చూసుకోవడం పెద్ద సమస్యగా అనిపించలేదు.

“ఈవిడకి ఇంత పిచ్చేమిటో! పూటపూటా వీడియో కాల్ చేసి చంపుతోంది…” చిరాగ్గా అంటూ… తమ పక్కప్లాట్ దగ్గరకి వెళ్ళింది వర్ష. వీడియో కాల్‌లో, వాళ్ళ గ్రిల్స్ లో గొలుసుకి కట్టి ఉంచిన వారి ప్రాణప్రదమైన శునకరాజాన్ని చూపించి, అది బాగానే ఉందన్న నమ్మకాన్ని  కుసుమ్‌కి కలిగించి తిరిగి తన ఇంట్లోకి వచ్చింది వర్ష.

నోరులేని మూగజీవి పట్ల అంతులేని మమకారాన్ని పెంచుకున్న కుసుమ్‌ని చూస్తే ఆమెకు ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది.

తాము అనఘను తీసుకొచ్చేయడం తల్లికి ఇష్టంలేదు. నెల రోజులుగా తనంత తానుగా ఫోన్ చేసి మాట్లాడింది లేదు. కనీసం ఒక్కమారైనా వీడియో కాల్ చేసి అనఘను చూసే ప్రయత్నం కూడా చేయలేదు.

“అదేంటి నాన్నా… అమ్మ అలా చేస్తోంది.”  బాధగా అడిగింది తండ్రి ఫోన్ చేసినప్పుడోసారి.

“అనఘ వెళ్ళిన తరువాత మీ అమ్మ పరిస్థితి దారుణంగా తయారైందమ్మా… దానిమీద బెంగతో ఇంచుమించు మంచం ఎక్కినట్లుగా తయారైంది. అనఘని చూస్తే మళ్ళీ మీ అమ్మ మదిలో ఏవేవో ఆశలు చిగురిస్తాయి. అందుకే తనని చూడాలని కాని, మాట్లాడాలని కాని ప్రయత్నించడంలేదు.” చెప్పాడు ఆనంద్ గద్గదస్వరంతో.

నిరుత్తరురాలవడం తనవంతైంది.

తాను తప్పుచేసిందా! నో… నో… తన బిడ్డని తాను తెచ్చేసుకోవడం తప్పెలా అవుతుంది!  అది అర్ధం చేసుకోకుండా తల్లి  మూర్ఖంగా హఠం చేసి తన మనసుని నొప్పిస్తోందెందుకు!

వర్ష హృదయం నలిబిలి అయ్యింది.

***

“మేరీ స్నూపీ కే బినా మై జీ నహీ సక్తీ… ముఝే మేరీ స్నూపీ చాహియే…” పొగిలిపొగిలి ఏడుస్తున్న కుసుమ్‌ని ఓదార్చడం బ్రహ్మ ప్రళయం అయిపోతోంది అక్కడున్నవారికి.

స్నూపీకి ఏదో జబ్బు చేస్తే పశువుల వైద్యుడికి చూపించారు. అది ప్రమాదకరమైన జబ్బని, ఇంట్లో ఉన్నవారికి కూడా సోకే అవకాశం ఉందని అనుమానం వ్యక్తపరచి, దాన్ని ఏదన్నా హోంలో చేర్చమని ఆయన సలహా ఇచ్చాడు.

బ్లూక్రాస్ వారికి ఫోన్ చేస్తే… ఆరోజు పొద్దున్నే వచ్చి స్నూపీని తీసుకెళ్ళారు. అదుగో… అప్పటినుంచీ కుసుమ్ పచ్చి మంచినీళ్ళు ముట్టుకోకుండా ఒకటే ఏడుపు.

ఇక ఎవరేం చెప్పినా ఆమె ఊరుకోదని అర్థమైపోయాక మెల్లగా ఆమెని విడిచిపెట్టి తమ ఇంట్లోకి వచ్చిపడ్డారు వర్ష, మానస్‌లు.

“అబ్బ! ఏమిటి మానస్… ఆవిడ ఏడుపులు – పెడబొబ్బలు! మనిషి దూరమైతే కూడా ఇంతలా బాధపడడం మానేశారు జనాలు… ఈవిడేమిటో… ఇంత రాగాలు తీస్తోంది!” అసహనంగా అంది వర్ష.

“కొందరంతే వర్షా… ఎమోషనల్‌గా ఉంటారు. తమకి కావలసినది దూరమైతే అస్సలు భరించలేరు. అది మనిషైనా…పశువైనా సరే….” అన్నాడు మానస్.

అతడు వెళ్ళిపోయాడే కాని, అతడన్న మాటలు మాత్రం ఆమెని వెంటాడాయి. అనఘ ఏం చేస్తోందోనని గదిలోకి తొంగిచూసింది. చేతిలో పిల్లిబొమ్మని పట్టుకుని తదేకంగా దానికేసే చూస్తూ కూర్చుంది. అది… సంపూర్ణ కొనిపెట్టిన బొమ్మ. అదంటే అనఘకి ప్రాణం.

ఏదో లోకంలో ఉన్నట్లుగా అలా కూర్చున్న అనఘని చూస్తే వర్ష మనసు నలిబిలి అయ్యింది. ఎప్పుడు చూసినా అలా… ఏదో పోగొట్టుకున్నదానిలా ఉంటోంది. ఆ ఈడు పిల్లలకి ఉండాల్సిన ఉత్సాహం, చురుకుదనం మచ్చుకన్నా లేకుండా… అలా మందకొడిగా ఉంటున్న కూతురుని చూస్తే ఎద బాధతో మూల్గింది. ఇది ఇలాగే కొనసాగితే అనఘ పరిస్థితి ఏమిటి! తానేమైపోతుంది!

నిజానికి అనఘ మీద తనకున్న హక్కేంటి!? కన్నదన్న మాటేగాని, ఏనాడన్నా దాని మంచి-చెడ్డ చూసిందా!! కళ్లలో పెట్టుకుని సాకిన తన కన్నతల్లి దాని ప్రతి కదలికనీ చూసి తాదాత్మ్యం చెందింది. దాని జిలిబిలి పలుకులకి మురిసిపోయింది. అది బుడిబుడి అడుగులేస్తే పులకించిపోయింది.

కేవలం, ఆలోచనాశక్తిలేని ఒక మూగజీవిని పెంచిన కుసుమ్, అది దూరమైతే తట్టుకోలేక తల్లడిల్లిపోతోంది . అలాంటిది… అనఘ బాల్యాన్ని సంపూర్తిగా అనుభవించిన తల్లి, ఒక్కసారిగా అది దూరమైతే ఎలా సహించగలదు!

ఆలోచనలో పడింది వర్ష.

***

“అనఘ నీమీద బెంగపెట్టుకుందట… సరిగ్గా తినడంలేదట. స్కూల్లో కూడా యాక్టివ్‌గా ఉండడంలేదట…” ముక్తసరిగా చెప్పాడు ఆనంద్ ఆ రాత్రి.

సంపూర్ణ కలవరపడింది. ముఖంలో ఏదో అశాంతి.

“అవును మరి! నాకు అంత అలవాటుపడిన పిల్లని ఒక్కసారిగా తీసుకెళ్ళిపోతే బెంగ పెట్టుకోక ఏంచేస్తుంది!” పుల్ల విరిచినట్లుగా అంది సంపూర్ణ.

ఆనంద్ మనసు చివుక్కుమంది. అర్ధాంగి వైఖరి సబబుకాదని అతడి మనసుకి అనిపిస్తోంది.

‘కొన్నాళ్ళుగా ఒకేచోట పాతుకుపోయిన మొక్కని హఠాత్తుగా పీకేసి వేరే చోట నాటితే ఏమౌతుంది! కొత్త వాతావరణానికి అలవాటుపడి, బతికి బట్టకట్టడానికి దానికి కొద్దిసమయం పడుతుంది. ఒక్కోసారి కొత్త వాతావరణానికి అలవాటుపడలేక మొక్క చచ్చిపోతుంది కూడా. అదే… మొక్కను పెకిలించేటప్పుడు, జాగ్రత్తగా చుట్టూ ఉన్న మట్టితో సహా పెల్లగించి, అలానే తీసుకెళ్లి నాటితే రెండుమూడు రోజులకే నవజీవనంతో కళకళలాడుతుంది. పాపం! ఇప్పుడు అనఘ పరిస్థితి అదే… ఇది ఇలాగే కొనసాగితే!’ ఆలోచించడానికే భయమేసింది ఆనంద్‌కి.

“నువ్వేమీ అనుకోనంటే ఒక్కమాట సంపూర్ణా… అనఘ నీ నుంచి దూరంగా వెళ్ళిపోవడం బాధను కలిగించే విషయమే. కాదనను. కాని, దాన్ని కన్నవారికి కూడా దానిమీద ఆశలు, కోరికలు ఉంటాయి కదా!  దాన్ని కాదనడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. అనఘ అక్కడ ప్రశాంతంగా, తన కన్నవారితో కలిసి ఉండేందుకు తగిన తోడ్పాటునందించడం పెద్దవాళ్ళుగా మన ధర్మం. నాకు తోచింది చెప్పాను. ఇక నీ ఇష్టం.” స్పష్టంగా చెప్పేసి పక్కకు తిరిగి పడుకున్నడు ఆనంద్.

***

“అనఘని తిరిగి అమ్మ దగ్గరకి పంపేద్దామనుకుంటున్నాను మానస్.” ఆరోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ చెప్పింది వర్ష దిగులుగా.

“అదేంటి!?” ఆశ్చర్యపోయాడు మానస్.

“తను ఇక్కడ ఉండలేకపోతోంది. అమ్మకోసం ఆరాటపడుతోంది. ఎక్కడో అక్కడ తను సుఖంగా ఉండడమే మనం కోరుకోవాల్సింది.” కన్నీళ్ళు ఆపుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తోంది వర్ష.

ఆమెలోని కన్నతల్లి మనసు ఎంతగా నలిగిపోతోందో అర్థమైన మానస్ ఆమెను ఎడమచేత్తో  దగ్గరకు లాక్కుంటూ “కూల్ వర్షా…కూల్” అన్నాడు లాలనగా.

ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. కళ్ళు తుడుచుకుని, చేయికడుక్కుని తలుపు తెరిచిన వర్ష తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. తలుపుకవతల నిలబడిన సంపూర్ణను చూసి ఆనందం పట్టలేక ‘అమ్మా’ అంటూ కౌగలించుకుంది.

“అనఘా… ఎవరొచ్చారో చూడు…” అంటూ ఆనందాతిరేకంతో అరిచింది వర్ష.

లోపలనుంచే అమ్మమ్మని కనిపెట్టిన అనఘ రివ్వున పరుగెత్తుకొచ్చి అమ్మమ్మని కరుచుకుపోయింది.

సంపూర్ణ మనసు ఉప్పొంగిపోయింది. వాత్సల్యంగా అనఘ తల నిమురుతూ  తృప్తిగా కళ్ళు మూసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here