ముద్రారాక్షసమ్ – చతుర్థాఙ్కః – 2

0
2

[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]

మలయ:

యుజ్యతే. అమాత్యస్య గృహ మాదేశయ।

అర్థం:

యుజ్యతే=కావచ్చును, అమాత్యగృహం+ఆదేశయ=రాక్షసఃమంత్రి ఇంటికి తీసుకువెళ్ళు.

భాగు: 

ఇత ఇతః కుమారః

అర్థం:

కుమారః=రాకుమారా, ఇతః+ఇతః=ఇటు, ఇటు.

(ఉభౌ పరిక్రామతః)

(ఉభౌ=ఇద్దరు, పరిక్రామతః=ముందుకు నడుస్తారు).

భాగు:

ఇద మమాత్యగృహమ్। ప్రవిశతు కుమారః

అర్థం:

ఇదం+అమాత్యగృహమ్=ఇదే రాక్షసఃమంత్రి ఇల్లు. కుమారః+ప్రవిశతు=రాకుమారుడు (లోపలికి) వెళ్ళవచ్చును.

మలయ:

ఏష ప్రవిశామి।

అర్థం:

ఏషః+ప్రవిశామి=ఇదిగో, వెడుతున్నాను.

వ్యాఖ్య:

ఇది ఒక ప్రధాన ఘట్టం. మలయకేతువు భాగురాయణుడితో కలిసి రాక్షసఃమంత్రి ఇంటి ముఖద్వారంలో అడుగుపెట్టాడో లేదో – అతని చెవిని, కుసుమపురం నుంచి వచ్చిన కరభకుడికీ, ఆ మంత్రికీ జరిగే సంభాషణ పడింది. దానితో అక్కడే ఆగి – వింటూ, భాగురాయణుడితో తన భావాలు పంచుకుంటున్నాడు మలయకేతువు. ఈ వినికిడి అతడికి రాక్షసఃమంత్రి పట్ల ‘పునరాలోచన’కు కారణం కాగలదు.

రాక్షసః: 

(ఆత్మగతమ్) ఆయే స్మృతమ్ (ప్రకాశమ్) భద్ర, అపి దృష్ట స్త్వయా కుసుమపురే స్తనకలశః?

అర్థం:

(ఆత్మగతమ్=తనలో) ఆయే=ఏమయ్యా (ఆఁ!), స్మృతమ్=జ్ఞాపకం వచ్చింది. (ప్రకాశమ్=పైకి), భద్ర=నాయనా, కుసుమపురే=పాటలీపుత్రంలో, స్తనకలశః=స్తనకలశుడు (స్తనకలశుణ్ణి), అపి+దృష్టః+త్వయా=నీ చేత చూడబడ్డాడా (నువ్వు చూశావా?).

పురుష:

అమచ్చ, అహకిం. (అమాత్య, అథకిమ్)

అర్థం:

అమాత్య=మంత్రివర్యా, అథకిమ్=అవును.

మలయ:

(ఆకర్ణ్య) భాగురాయణ, కుసుమపుర వృత్తాన్తః ప్రస్తూయతే. న తత్ర తావదుపసర్పామః, శృణుమస్తావత్, కుతః…

అర్థం:

(ఆకర్ణ్య=విని), భాగురాయణా!, కుసుమపుర వృత్తాన్తః+ప్రస్తూయతే=పాటలీపుత్ర విషయం ప్రస్తావన జరుగుతోంది. తత్ర+తావత్=అక్కడికి (మంత్రి సమీపానికి) అందువల్ల, న+ఉపసర్పామః=మనం వెళ్ళవద్దు. శృణుమః+తావత్=అంతలో విందాం, కుతః=ఎందుకంటే –

శ్లోకం:

సత్త్వ భఙ్గ భయా ద్రాజ్ఞాం కథయ న్త్యన్యథా పురః

అన్యథా వివృతార్థేషు స్వైరాలా పేషు మన్త్రిణః – (8)

అర్థం:

సత్త్వ+భఙ్గ+భయాత్=మనస్సుకు కష్టం కలగవచ్చనే భయంతో (జంకుతో), మన్త్రిణః=మంత్రులైన వారు, రాజ్ఞాం+పురః=రాజుల ఎదుట, అన్యథా=మరొక విధంగా, కథయన్తి=మాట్లాడుతూంటారు. వివృత+అర్థేషు=మనస్సు విప్పి మాట్లాడే – స్వైర+ఆలాపేషు= స్వేచ్ఛగా (చాటుగా) మాట్లాడే సందర్భాలలో, అన్యథా+(కథయన్తి)=మరొక విధంగా మాట్లాడుతారు.

వృత్తం:

అనుష్టుప్.

అలంకారం:

అర్ధాంతరన్యాసము

భాగు:

యదాజ్ఞాపయతి కుమారః

అర్థం:

కుమారః+యత్+ఆజ్ఞాపయతి=రాకుమారుడు ఆదేశించినట్టే (చేద్దాం).

రాక్షసః:

భద్ర, అపి తత్కార్యం సిద్ధం?

అర్థం:

భద్ర=నాయనా, తత్+కార్యం=ఆ పని, అపి+సిద్ధం=అయిందా?

పురుష:

అమచ్చప్పసాఏణ సిద్ధం. (అమాత్య ప్రసాదేన, సిద్ధమ్.)

అర్థం:

అమాత్యప్రసాదేన=మంత్రివారి అనుగ్రహంతో, సిద్ధమ్=పూర్తయింది.

మలయ:

సఖే భాగురాయణ, కిం తత్కార్యమ్?

అర్థం:

సఖే+భాగురాయణ=మిత్రమా భాగురాయాణా, తత్+కార్యమ్+కిం= ఆ పని ఏమిటంటావ్?

భాగు: 

కుమార, గహనః సచివవృత్తాన్తః నైతా వతా పరిచ్ఛేత్తుం శక్యతే అవహితస్తావ చ్ఛృణు

అర్థం:

కుమార=రాకుమారా, సచివవృత్తాన్తః=రాక్షసఃమంత్రి (ప్రస్తావించే)విషయం, గహనః=నిగూఢమైనది. ఏతావతా+పరిచ్ఛేత్తుం+న+శక్యతే=ఈపాటిగా (ఆషామాషీగా) భేదించడానికి (ముడి విప్పడానికి) వీలుకాదు, తావత్+అవహితః+శృణు=అందువల్ల జాగ్రత్తగా (ఏకాగ్రచిత్తంతో) విను.

రాక్షసః: 

భద్ర, విస్తరేణ శ్రోతు మిచ్ఛామి.

అర్థం:

భద్ర=నాయనా, విస్తరేణ=విపులంగా, శ్రోతుం+ఇచ్ఛామి=వినగోరుతున్నాను.

పురుష:

సుణాదు అనుచ్చో, అత్థి దావ అహం అమచ్చే ణాణత్తో జహ. – కరభఅ. కుసుమపురం గచ్ఛ, మహ వఅణేణ భణ, వేఆలి అం థణకలశం, జహ చాణక్కహదపణ తేసు తేసు అణ్ణా భంగేసు అణుచిట్ఠీఅమాణేసు చందఉత్తో ఉత్తేఅణసమత్థేహి సిలో ఏహి ఉవసిలో అఇదవ్వోత్తి.

(శృణో త్వమాత్యః, అస్తి తావదహ మమాత్యే నాజ్ఞప్తః  -యథా – కరభక, కుసుమపురం గచ్ఛ, మమ వచనేన భణ వైతాళికం స్తనకలశం యథా, చాణక్యహతకేన తేషు తేషు ఆజ్ఞాభఙ్గేషు అనుష్టీయమానేషు చన్ద్రగుప్తః ఉత్తేజనసమర్థైః శ్లోకై రుపశ్లోకయితవ్యః.ఇతి.)

అర్థం:

అమాత్య+శృణోతు=మంత్రివర్యులు విందురుగాక!, అస్తి+తావత్+అమాత్యేన+ఆజ్ఞప్తః (అస్మి)+యథా=ఆ విధంగా అమాత్యుల చేత ఏమని ఆదేశింబడ్డానంటే – ‘కరభకా!, కుసుమపురం+గచ్ఛ=పాటలీపుత్రానికి వెళ్ళు, వైతాళికం+స్తనకలశం=వైతాళికుడైన స్తనకలశుణ్ణి (స్తనకలశుడికి), మమ+వచనేన+భణ=నా మాటగా చెప్పు – యథా=ఏమంటే, చాణక్యహతకేన=చాణక్య గాడి చేత, అనుష్టీయమానేషు+తేషు+తేషు+ఆజ్ఞాభఙ్గేషు=ఆయా (రాజా)దేశాలను ఉల్లంఘించే సందర్భాలలో – ఉత్తేజన+సమర్థైః=రెచ్చగొట్టగల, శ్లోకైః=ప్రశంసావాక్యాలతో, చన్ద్రగుప్తః=చంద్రగుప్తుడు, ఉపశ్లోకయితవ్యః=కీర్తించబడాలి’ ఇతి=అని.

వ్యాఖ్య:

చాణక్యుడు, రాజాజ్ఞను ధిక్కరించి, ఉల్లంఘించే సందర్భాలు కనిపెట్టి – చంద్రగుప్తుడి ఆధిక్యాన్ని (చక్రవర్తిత్వాన్ని) గుర్తు చేసే వైతాళిక గీతాలతో రెచ్చగొట్టాలి. ఆ విధంగా చాణక్యుడి పట్ల ఆ రాజుకి వైముఖ్యం కలిగించాలని రాక్షసమంత్రి ఎత్తుగడ అన్నమాట. ఈ పని చేయడానికి వైతాళికుడైన స్తనకలశుణ్ణి ప్రోత్సహించడానికి కరభకుణ్ణి రాక్షసమంత్రి నియోగించాడని సారాంశం.

రాక్షసః: 

భద్ర తత స్తతః…

అర్థం:

భద్ర=నాయనా, తతః+తతః=ఆ తరువాత ఏమైంది?

కరభ:

తదో మఏ పాడలిఉత్తం గదుఅ సుణావిదో అమచ్చసందేసం వేతాళిఓ థణకలసో. ఏత్థంతరే ణందఉల విణాస దూణస్స పోరజణస్స పరితోసం సముత్పాదఅన్తేణ రణ్ణా ఆఘోసిదో కౌముదీమహోసవో. సో ఆ చిరకాల పరివట్టమాణో జణిద పరిచఓ అభిమద వధూజణ సమాగమో విఅ ససిణేహం మాణిదో ణఅర జణేణ.

(తతో మయా పాటలీపుత్రం గత్వా శ్రావితః అమాత్య సన్దేశః వైతాళికః స్తనకలశః అత్రాన్తరే, నన్దకుల వినాశ దూనస్య పౌరజనస్య పరితోషం సముత్పాదయతా రాజ్ఞా ఘోషితః కౌముదీమహోత్సవ, స చ చిరకాల పరివర్తమానో జనితపరిచయో ఽభిమత వధూజన సమాగమ ఇవ సస్నేహం మానితో నగరజనేన)

అర్థం:

తతః= (మంత్రివర్యుల ఆదేశం) తరువాత, మయా=నేను (నా చేత) పాటలీపుత్రం+గత్వా=పాటలీపుత్రానికి వెళ్ళి, వైతాళికః+స్తనకలశః=వైతాళికుడైన స్తనకలశకుడు (స్తనకలశుడికి), అమాత్య+సన్దేశః+శ్రావితః=అమాత్యుల వారి సందేశం వినిపించడం జరిగింది (వినిపించాను). అత్రాన్తరే=ఈలోగా – నన్దకుల+వినాశ+దూనస్య=నందవంశం నాశనమైపోయిందని దుఃఖం అనుభవిస్తున్న, పౌరజనస్య=నగరవాసులకు, పరితోషం+ సముత్పాదయతా=సంతోషం కలిగింపదలచిన, రాజ్ఞా=(చంద్రగుప్త) రాజు చేత, కౌముదీమహోత్సవః+ఘోషితః=వెన్నెల పండుగ (జరుపుకోవాలని) ప్రకటించడం జరిగింది, స+చ+చిరకాల+పరివర్తమానః=అది కూడా చాలాకాలం నుంచి (వాడుకలో) ఉంటూ వస్తున్నది కావడం వల్ల, జనిత+పరిచయః=ప్రజలకు పరిచయంగా తెలిసినది (కొంతకాలం ఇటీవల మరుగునపడినా), అభిమత+వధూజన+సమాగమః+ఇవ=ఇష్టురాలైన కాంతా పునస్సమగం మాదిరి, స+స్నేహం=ఆదరపూర్వకంగా, నగరజనేన+మానితః=నగరవాసుల చేత (ఆ ప్రకటన) ఆదరింపబడినది.

వ్యాఖ్య:

యుద్ధాలు, అలజడులు కారణంగా కొంతకాలం కౌముదీ మహోత్సవానికి నగర ప్రజలు దూరమైనా, రాజు మళ్ళీ ‘జరుపుకోండి’ అని ప్రకటించడంతో – తమకి చాలాకాలంగానే పరిచయమై ఉన్న ఆ పండుగ జరుపుకోవడానికి వారు ఉత్సాహపడ్డారు. ఇంకొక కారణం ఏమంటే: ఆ నగరవాసులకు నందవంశం నాశనమైపోయిందనే దుఃఖం ఏమైనా ఉంటే, దానిని మరపించడానికీ ప్రకటన చంద్రగుప్తుడు చేశాడని – కరభకుడు అనుసంధానిస్తున్నాడు.

రాక్షసః: 

(సబాష్పమ్) హా! దేవ! నన్ద!

శ్లోకం:

కౌముదీ కుముదానన్దే జగ దానన్ద హేతునా

కీదృశీ సతి చన్ద్రేఽపి నృపచన్ద్ర త్వయా వినా। – (9)

అర్థం:

(సబాష్పమ్=కన్నీటితో) హా+దేవ+నన్ద=అయ్యో! నంద ప్రభువా!

కౌముదీ=కౌముది అనే మహోత్సవం, కు+ముద+ఆనన్దే=నీచులకు ఆనందం కలిగించే – (చన్ద్రే+సతి)= చంద్రుడి పేరిట రాజు ఉండగా – కుముద+ఆనన్దే+చన్ద్రే+అపి=కలువలకు ఆనందం కలిగించే (నిజమైన) చంద్రుడు ఉన్నప్పటికీ, – నృప+చన్ద్ర=రాజశ్రేష్టువైన నందుడా! జగత్+ఆనన్ద+హేతునా=లోకానికి (నిజమైన) ఆనంద కారకుడవైన, త్వయా+వినా=నువ్వు లేకుండా, కీదృశీ= ఏ పాటిది?

వృత్తం:

అనుష్టుప్.

అలంకారం:

వ్యతిరేకాలంకారం (వ్యతిరేకో విశేషశ్చేదుపమా నోపమేయయోః – అని కువలయానందం). చంద్రుడు కుముదానందుడు, నందుడు జగదానందుడు అని పోల్చడం గమనించదగినది.

కరభ:

తదో సో లోఅలో అణాణందభూదో అణిచ్ఛంతస్స ఏవ తస్స ణివారిదో చాణక్కహదఏణ. ఎత్థంతరే షణకలసేణ చంద ఉత్త సముత్తేజిఆ సిలో అపరిపాటీ పవట్టిదా.

(తతః స లోకలోచనానన్దభూతో ఽనిచ్ఛత ఏవ తస్య నివారిత శ్చాణక్య హతకేన. అత్రాన్తరే స్తనకలశేన చన్ద్రగుప్త సముత్తేజికా శ్లోకపరిపాటీ ప్రవర్తితా॥)

అర్థం:

తతః=పిమ్మట, సః+లోకలోచన+ఆనన్దభూతః (ఉత్సవః)=ఆ లోకుల కళ్ళకు ఆనందం కలిగించే ఉత్సవాన్ని, అనిచ్ఛతః+ఏవ=ఇష్టం లేకనే, తస్య+చాణక్య+హతకేన=ఆ చాణక్య గాడి చేత, నివారితః=ఆపివేయడం సంభవించింది. అత్రాన్తరే=ఈ సందర్భంగా, స్తనకలశేన=వైతాళికుడు స్తనకలశుడి చేత, చన్ద్రగుప్త+సముత్తేజికా+శ్లోకపరిపాటీ=చంద్రుగుప్తుడికి ఉద్రేకం కలుగజేసే ‘ప్రశంసా ప్రస్తావన’, ప్రవర్తితా=చేయడం జరిగింది.

రాక్షసః: 

కీదృశీ సా?

అర్థం:

సా=ఆ ప్రస్తావన, కీదృశీ=ఎటువంటిది?

పురుష:

(సత్త్వోద్రేకస్యేత్యాది పూర్వోక్తం పఠతి).

అర్థం:

(పూర్వోక్తం=ఇదివరకు చెప్పబడిన, ‘సత్త్వోద్రేకస్య+ఇతి’+ఆది=సత్త్వోద్రేకస్య మొదలైన శ్లోకాలు, పఠతి=చదువుతాడు.)

రాక్షసః: 

(సహర్షమ్) సాధు స్తనకలశ, సాధు। కాలే భేద బీజ ముప్త, మవశ్యం ఫల ముపదర్శయతి। కుతః…

అర్థం:

(స+హర్షమ్=సంతోషంగా), సాధు+స్తనకలశ+సాధు=బాగుందయ్యా, స్తనకలశా, బాగుంది. కాలే=సకాలంలో, భేద+బీజం=భేదోపాయమనే విత్తనం, ఉప్తం=నాటబడింది, ఫలం=ఫలితాన్ని,  అవశ్యం=తప్పక, ఉపదర్శయతి=చూపిస్తుంది. కుతః=ఎందుకంటే-

శ్లోకం:

సద్యః క్రీడారసచ్ఛేదం ప్రాకృతో ఽపి న మర్ష యేత్

కింను లోకాధికం తేజో బిభ్రాణః పృథివీపతి – (10)

అర్థం:

క్రీడారస+ఛేదం=ఆటలో మాధుర్యాన్ని భంగపరచడాన్ని, ప్రాకృతః+అపి=అతి సామాన్యుడు కూడా, న+మర్షయేత్=సహించడు. లోకాధికం+తేజః+బిభ్రాణః=లోకాతీతమైన తేజస్సు వహించే, పృథివీపతి=ప్రభువు, కిం+ను=ఎట్లా సహిస్తాడు?

వృత్తం:

అనుష్టుప్.

అలంకారం:

అర్థాపత్తి (కైముత్యేనార్థసంసిద్ధిః కావ్యార్థాపత్తి రిష్యతే – అని కువలయానందం). “ఇదే ఇలాగైతే, దాని విషయం చెప్పేదేం వుంది?” అనే కైముతిక న్యాయం ఉంటే – అది కావ్యార్థాపత్తి అవుతుంది.

మలయ:

ఏవ మేతత్.

అర్థం:

ఏవం+ఏతత్=అది అంతే!

రాక్షసః:

తత స్తతః…

అర్థం:

(ఆఁ), తతః+తతః=తరువాత (ఏమైంది?)

కరభ:

తదో చందఉత్తేణ అణ్నాభంగ కలుసినేణ వసంగ సూచిదం అమచ్చగుణం వసంసిఅ అపబ్భసిందో అహిఆరాదో చాణక్క హదఓ. (తత శ్చన్ద్రగుప్తే నాజ్ఞాభఙ్గ కలుషితేన ప్రసఙ్గ సూచిత మమాత్య గుణంప్రశ స్యాపభ్రంశింతో ఽధికారాచ్చాణక్య హతకః).

అర్థం:

తతః= ఆ మీదట, ఆజ్ఞాభఙ్గ+కలుషితేన=తన ఆదేశం పాటింపబడలేదని కలగిన మనస్సుతో, చన్ద్రగుప్తేన=చంద్రగుప్తుని చేత, ప్రసఙ్గ+సూచితం=మాటల సందర్భంగా సూచింపబడిన, అమాత్య+గుణం+ప్రశంసయా=రాక్షసమంత్రిని అభినందించడంతో, ప్రశంసయా=మెచ్చుకోలుతో, చాణక్య+హతకః=చాణక్యగాడు, అధికారాత్+అపభ్రంశింతః=అధికారం నుండి తొలగింపబడ్డాడు.

మలయ:

సఖే, భాగురాయణ, గుణప్రశంసయా దర్శిత శ్చన్ద్రగుప్తేన రాక్షసే పక్షపాతః॥

అర్థం:

సఖే+భాగురాయణ=మిత్రమా భాగురాయణా, గుణప్రశంసయా=సుగుణాలను మెచ్చుకోవడంతో, చన్ద్రగుప్తేన=చంద్రగుప్తుడి చేత, రాక్షసే=రాక్షసమంత్రి విషయంలో, పక్షపాతః+దర్శితః=తన మొగ్గు చూపడం జరుగుతోంది.

భాగు: 

న తథా గుణ ప్రశంసయా, యథా చాణక్యవటో ర్నిరాకరణేన।

అర్థం:

తథా+గుణ+ప్రశంసయా+న=గుణాలను మెచ్చుకోవడం ఒక్కటే కాదు; యథా+చాణక్యవటోః+నిరాకరణేన=చాణక్య కుర్రవాడిని తిరస్కరించడం వల్ల కూడా (చంద్రగుప్తుడి మొగ్గు బయటపడింది).

రాక్షసః:

కిమయమేవైకః కౌముదీమహోత్సవ ప్రతిషేధ శ్చన్ద్రగుప్తస్య చాణక్యం ప్రతి కోపకారణ ము తాన్యద ప్యస్తి?

అర్థం:

అయం+కౌముదీమహోత్సవ+ప్రతిషేధః+ఏక+ఏవ=ఈ కౌముదీమహోత్సవాన్ని రద్దు చేయడం ఒక్కటే, చాణక్యం+ప్రతి=చాణక్యుడి పట్ల, చన్ద్రగుప్తస్య=చంద్రగుప్తుడి, కోపకారణం+కిమ్=కోపానికి కారణమా? ఉత=లేదా, అన్యత్+అపి=మరొకటేదైనా (కారణం)కూడా ఉన్నదా?

మలయ:

సఖే చన్ద్రగుప్తస్యాపరకోప కారణాన్వేషణేన కిం ఫల మేష పశ్యతి?

అర్థం:

సఖే=మిత్రమా (భాగురాయణా!), ఏషః=ఈ రాక్షసమంత్రి, చన్ద్రగుప్తస్య=చంద్రగుప్తుని, కోప+కారణ+అన్వేషణేన=కోపానికి గల కారణాలను వెదకడం చేత, కిం+ఫలం=ఏ ఫలితాన్ని, పశ్యతి=గమనిస్తున్నాడు?

భాగు: 

కుమార, మతిమాం శ్చాణక్యో న నిష్ప్రయోజన మేవ చన్ద్రగుప్తం కోపయిష్యతి; న చ కృతవేదీ చన్ద్రగుప్త ఏతావతా గౌరవ ముల్లఙ్గయిష్యతి. సర్వథా చాణక్య చన్ద్రగుప్తయోః పుష్కలకారణా ద్యో విశ్లేష ఉత్పద్యేత, స ఆత్యన్తికో భవిష్యతీతి।

అర్థం:

కుమార=రాకుమారా, మతిమాన్+చాణక్యః=తెలివైన చాణక్యుడు, నిష్ప్రయోజనం+ఏవ=ఏ లాభం లేకుండానే, చన్ద్రగుప్తం=చంద్రగుప్తుని పట్ల, న+కోపయిష్యతి=కోపం కలిగించుకోబోడు. కృత+వేదీ=చేసిన మేలు మరవని, చన్ద్రగుప్తః=చంద్రగుప్తుడు, ఏతావతా=ఇంతలో, గౌరవం+న+చ+ఉల్లఙ్గయిష్యతి=చాణక్యుడి పట్ల మర్యాద తప్పడం అనేది ఉండదు. సర్వథా=అన్ని విధాలా, పుష్కలకారణాత్=అనేక కారణాల మూలంగా, యః+విశ్లేషః+ఉత్పద్యేత=ఏ దూరమైతే పుట్టిందో (భేదాలు సంభవించాయో),సః+ఆత్యన్తికః+భవిష్యతి+ఇతి=అది హద్దు మీరినదే అవుతున్నది (బహుశా చిరకాలం ఉండేదే అవుతుంది).

కరభ: 

అత్థి అణాం వి, చందఉత్తస్స కోపకారణమ్। ఉవే క్ఖిదో దేణ ఆవక్కమంతో మలఅకేదూ అమచ్చరక్ఖత్తి. (అస్త్యన్య దపి చన్ద్రగుప్తస్య కోపకారణమ్। ఉపేక్షితో ఽనే నాపక్రామన్ మలయకేతుః అమాత్య రాక్షస ఇతి).

అర్థం:

చన్ద్రగుప్తస్య=చంద్రగుప్తుని, కోపకారణమ్=కోపానికి కారణం, అన్యత్+అపి+అస్తి=మరొకటి కూడా ఉంది. ఉపేక్షితః+అనేన=ఇతడు పట్టించుకోకుండా ఉండడం వల్లనే, మలయకేతుః+అమాత్యరాక్షస=మలయకేతూ, రాక్షసులిద్దరూ, అపక్రామన్=తప్పించుకోపోయారు, ఇతి=అని.

రాక్షసః: 

శకటదాస, హస్త తలగతో మే చన్ద్రగుప్తా భవిష్యతి ఇదానీం చన్దనదాసస్య బన్ధనా న్మోక్షస్తవ చ పుత్రదారైః సహ సమాగమః

అర్థం:

శకటదాస=శకటదాసా!, చన్ద్రగుప్తః=చంద్రగుప్తుడు, మే+హస్తతలగతః=నా అరచేతికి చిక్కినవాడు, భవిష్యతి=కాగలడు. ఇదానీం=ఇప్పుడు, చన్దనదాసస్య=చందనదాసుకు, బన్ధనాత్+మోక్షః=నిర్బంధం నుంచి విడుదల, తవ=నీ, పుత్ర+దారైః+సహ+సమాగమః=నీకు భార్యాపుత్రులతో కలయిక కూడా (సాధ్యం).

మలయ:

సఖే, భాగురాయణ, హస్తతలగత ఇతి వ్యాహరతః కో ఽస్యాభిప్రాయః?

అర్థం:

సఖే=మిత్రమా, భాగురాయణా!, ‘హస్తతల+గతః’=అరచేత చిక్కాడు, ఇతి+వ్యాహరతః=అని అనడంలో, అస్య+అభిప్రాయః+కః= ఇతడి (రాక్షసుడి) అభిప్రాయం ఏమిటి?

భాగు: 

కి మన్యత్? చాణక్యా దపకృష్టస్య చన్ద్రగుప్త స్యోద్ధరణా న్న కిఞ్చి త్కార్య మవశ్యం పశ్యతి।

అర్థం:

కిమ్+అన్యత్=ఇంకొకటేమి ఉంటుంది?, చాణక్యాత్+అపకృష్టస్య=చాణక్యుని నుంచి విడిపోయిన, చన్ద్రగుప్తస్య=చంద్రగుప్తుణ్ణి (చంద్రగుప్తుడి యొక్క), ఉద్ధరణాత్=పైకెత్తడాన్ని మించి, కిఞ్చిత్+కార్యం=ఏ కొంచెం కారణం కూడా, అవశ్యం=తప్పకుండా, న+పశ్యతి=కనిపించడం లేదు.

రాక్షసః: 

భద్ర, హృతాధికారః క్వ సాం ప్రత మసౌ వటుః?

అర్థం:

భద్ర=నాయనా, అసౌ+వటుః=ఈ (చాణక్య) పిల్లగాడు, హృత+అధికారః=అధికారం పోగొట్టుకున్నవాడై, సాంప్రతం=ఇప్పుడు, క్వ=ఎలా ఉన్నాడు?

కరభ: 

తహిం ఎవ్వ పాడలిఉత్తే పడివసది. (తస్మి న్నేవ పాటలీపుత్రే ప్రతివసతి.)

అర్థం:

తస్మిన్+పాటలీపుత్రే+ఏవ= ఆ పాటలీపుత్రంలోనే, ప్రతివసతి=ఉంటున్నాడు.

రాక్షసః: 

(సావేగమ్) భద్ర, తత్రైవ ప్రతివసతి? తపోవనం న గతః ప్రతిజ్ఞాం వా పునర్నసమారూఢవాన్?

అర్థం:

(స+ఆవేగమ్=ఆందోళనగా) భద్ర=నాయనా, తత్ర+ఏవ+ప్రతివసతి=అక్కడే ఉంటున్నాడా?, తపోవనం+న+గతః=తపోవనానికి పోలేదా?వా=లేదా, పునః+ప్రతిజ్ఞాం+సమారూఢవాన్=మళ్ళీ ప్రతిజ్ఞ గాని చేశాడా?

కరభ: 

అమచ్చ, తపోవణం గచ్ఛది త్తి సుణీ అది. (అమాత్య. తపోవనం గచ్ఛతీతి శ్రూయతే.)

అర్థం:

అమాత్య=మంత్రివర్యా, తపోవనం+గచ్ఛతి+ఇతి=తపోవనానికి వెడతాడు అని – శ్రూయతే=(మాట) వినిపిస్తోంది.

రాక్షసః: 

శకటదాస, నేద ముపపద్యతే – పశ్య –

అర్థం:

శకటదాస, ఇదం+న+ఉపపద్యతే=ఇది జరగదయ్యా – పశ్య= చూడు.

శ్లోకం:

దేవస్య యేన పృథివీతల వాసవస్య

స్వాగ్రాసనాపనయనా న్నికృతి ర్న సోఢా।

సోఽయంస్వయంకృత నరాధిపతే ర్మనస్వీ

మౌర్యా త్కథం ను పరిభూతి మిమాం సహేత॥   – (11)

అర్థం:

పృథివీతల+వాసవస్య+దేవస్య=భూలోక ఇంద్రుడని అనిపించుకున్న నందరాజు (యొక్క), స్వ+అగ్రాసన+అపనయత్=తాను ఎత్తుపీటపై కూర్చుని ఉండగా లాగి పడవేసిన, నికృతి=అవమానం (అవమానాన్ని), యేన+న+సోఢా=ఎవని చేత సహింపబడలేదో, సః+అయం=ఆ యీ చాణక్యుడు, మనస్వీ=ఆత్మప్రత్యయం కలవాడు (పౌరుషవంతుడు). స్వయంకృత+నరాధిపతేః+మౌర్యాత్= స్వయంగా తానే రాజుగా నిలిపిన మౌర్య చంద్రగుప్తుడి వల్ల (జరిగిన), ఇమాం+పరిభూతిం=యీ అవమానాన్ని, కథం+ను+సహేత=ఎలాగ భరిస్తాడు?

వృత్తం:

వసంత తిలకం – త- భ – జ – జ – గ గ – గణాలు.

అలంకారం:

యః నికృతిం న సోఢవాన్, అనేన తేన మనస్వినా ఇయం పరిభూతిం సహ్యేత?

మౌర్యుడు చేసిన అవమానం సహించజాలకపోవడానికి కారణంగా, అతడిని తానే రాజును చేయడంతో పాటు, చాణక్యుడి ఆత్మాభిమానం కారణాలుగా చెప్పడం వల్ల కావ్యలిఙ్గం అలంకారం (సమర్థనీయ స్యార్థస్య కావ్యలిఙ్గం సమర్థనమ్ – అని కువలయానందం).

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here