[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]
రాక్షస:
(సబాష్పమ్) కష్టం భోః కష్టమ్!
శ్లోకం:
వృష్ణీనా మివ నీతివిక్రమగుణ వ్యాపార శాన్త ద్విషాం
నన్దానాం విపులేకు లేఽకరుణయా నీతే నియత్యా క్షయమ్,
చిన్తావేశసమాకులేన మనసా రాత్రిం దివం జాగ్రతః
సై వేయం మమ చిత్రకర్మరచనా, భిత్తిం వినా వర్తతే॥ 4
అర్థం:
(స+బాష్పమ్=కన్నీటితో),
అకరుణయా+నియత్యా= జాలిమాలిన విధి చేత (వల్ల), నీతి+విక్రమగుణ+వ్యాపార+శాంత+ద్విషాం=తమ రాజనీతి ప్రతాప గుణాల చర్యల ద్వారా అణచివేయబడిన శత్రువులు గల (శత్రువుల్ని అణచివేసి), వృష్ణీనామ్+ఇవ=వృష్ణి వంశస్తులలో లాగా – నన్దానాం+విపులే+కులే=నందుల విస్తారమైన వంశంలో, క్షయమ్+నీతే+(సతి)=నాశనం కొనితేబడగా (నాశం సంభవించగా), రాత్రిం+దివం=పగలూ రాత్రి, జాగ్రతః+మమ=మేల్కొని ఉన్న నాకు, చిన్తా+ఆవేశ+సమాకులేన+మనసా=ఆలోచనా, ఆవేశాలు కలగలిసిన మనస్సుతో (కలవరపడిన మనస్సుతో), సా+ఇయం+చిత్రకర్మ+రచనా=ఈ చిత్రనిర్మాణమనే చర్య, భిత్తిం+వినా+వర్తతే=గోడ లేకుండానే ఉన్నది.
వ్యాఖ్య:
ఎంతటి రాజనీతిజ్ఞత, వీరత్వం ఉన్నా, వృష్ణి వంశం వారంతా విధికి లొంగి నాశమైపోయారు. కారణం వారి సంతానం ఋషుల్ని అవమానించడం. అలాగే – నందవంశం వారు కూడా చాణక్యుణ్ణి అవమానించిన కారణంగా నాశనమైపోయారు. (అందువల్లనే కావచ్చు) రాత్రింబవళ్ళు శ్రమకోర్చి రాక్షసమంత్రి చేసే (రాజకీయ వ్యూహమనే) చిత్రకల్పన, లేని గోడ మీద బొమ్మ చిత్రించడంగా పరిణమించింది.
వృత్తం:
శార్దూల విక్రీడతం – మ – స – జ -స – త – త – గ – గణాలు.
అలంకారం:
ఉపమ. నందకుల క్షయాన్ని ‘వృష్ణినాం ఇవ’ అని పోలిక చెప్పడం ఇక్కడ కారణం.
గోడలేకుండా చిత్రకర్మను ప్రస్తావించిన అప్రస్తుత విషయం, ప్రస్తుతమైన ‘నందక్షయా’ (గోడ లేక పోవడం) ‘చిత్రకర్మ రచనా’ (చిత్ర విచిత్ర వ్యూహ రచన) అనేవి ప్రస్తావించిన కారణంగా – అంటే; ప్రస్తుతాప్రస్తుత ప్రస్తావన ఉండడం వల్ల ఉత్ప్రేక్షాలంకారం కూడా చెప్పదగివుంది.
(యత్రాస్య ధర్మ సంబంధాత్ అన్యత్వేనోప తర్కితం, ప్రకృతం హి భవేత్పాజ్ఞాస్తా ముత్ప్రేక్షేః ప్రచక్షతే – అని ప్రతాపరుద్రీయం).
అథవా –
శ్లోకం:
నేదం విస్మృతభక్తినా, న విషయ
వ్యాసఙ్గ రూఢాత్మనా,
ప్రాణ ప్రచ్యుతి భీరుణా న చ, మయా
నాత్మ ప్రతిష్ఠార్థినా।
అత్యర్థం పరదాస్య మేత్య నిపుణం
నీతౌ మనో దీయతే
దేవః స్వర్గగతోఽపి శాత్రవవధే
నారాధితః స్యాదితి॥ 5
అర్థం:
అథవా= అలా కాదు,
పరదాస్యమ్+ఏత్య= ఇతరుడికి (మలయకేతుడికి) ఊడిగం చేస్తుండి, నిపుణం=మెలకువగా, నీతౌ+మనః+దీయతే=రాజనీతి విషయమై మనస్సు పెట్టడమైనది (పెట్టాను) – (కారణం) మయా=నా చేత (నేను), న+విస్మృత+భక్తినా=రాజభక్తి మరిచిపోయి కాదు, న+విషయవ్యాసఙ్గ+రూఢ+ఆత్మనా=ఇంద్రియలోలత్వంలో మనస్సు తగులుకొనీ కాదు, న+చ+ప్రాణ+ప్రచ్యుతి+భీరుణా=చావు భయం వల్లనూ కాదు; న+ఆత్మ+ప్రతిష్ఠార్థినా=నా స్థిరత్వం కోసమూ కాదు (కీర్తి కోసమూ కాదు), దేవః=నా ప్రభువు, స్వర్గగత+అపి=పరలోక గతుడైనప్పటికీ, శాత్రవ+వధేన=శత్రువుల్ని వధించడం చేత, ఆరాధితః+ స్యాత్+ఇతి=గౌరవింపబడినవాడవుతాడని (ఉద్దేశం).
అలంకారం:
ఇక్కడ ఒక రకంగా కారణమాలాలంకారం బహుశః చెప్పవచ్చు. అయితే యీ కారణాల్ని వ్యతిరేక పదాలతో చెపుతున్నాడు. రాక్షసమంత్రి చేసే ప్రతివ్యూహాలన్నీ ఎందుకో, కారణాలు చెప్పాడు. చరమంగా – పరలోక గతుడైన తన ప్రభువు పట్ల గౌరవం ప్రకటించడం లక్ష్యం. నేతి నేతి వాదంతో ఉద్దిష్ట కారణాన్ని స్థాపించడం ఇక్కడ విశేషం. అయితే – ఇది ఉత్తరోత్తరా కారణ సమర్థకమైన కారణమాలాలంకారం కాజాలదు.
వృత్తం:
శార్దూల విక్రీడతం – మ – స – జ -స – త – త – గ – గణాలు.
రాక్షస:
(ఆకాశ మవలోకయన్ సాస్రమ్) భగవతీ, కమలాలయే, భృశ మగుణ జ్ఞాసి – కుతః.
శ్లోకం:
ఆనన్దహేతు మపి దేవ మపాస్య నన్దం
సక్తాఽసి కిం కథయ వైరిణి మౌర్యపుత్రే।
దానామ్బురాజి రివ గన్ధగజస్య నాశే
తత్రైవ కిం న చపలే ప్రలయం గతాసి॥ 6
అర్థం:
(ఆకాశం+అవలోకయన్= ఆకాశాన్ని చూస్తూ, స+అస్రమ్=కన్నీటితో) భగవతి+కమలాలయే=దేవీ, శ్రీ మహాలక్ష్మీ!, భృశం=మిక్కిలి, అగుణజ్ఞ+అసి=గుణం గ్రహించలేని దానవైపోయావు; కుతః=ఎందుకంటావేమో –
ఆనన్దహేతుం+అపి=ఆనందం కలిగించే వాడైనప్పటికీ, నన్దం+అపాస్య=మా నంద ప్రభువులు వదిలిపెట్టి, వైరిణి+మౌర్యపుత్రే=మాకు శత్రువైన చంద్రగుప్తుడిపై (యందు), కిం+సక్తా+అసి= ఎందుకు మనసుపడ్డావు,? చపలే=చలించే స్వభావం కలదానా!, గన్ధగజస్య+నాశే=ఉత్తమమైన మదపుటేనుగు చనిపోగా, దాన+అంబురాజిః+ఇవ=మదజలాల వలె, తత్ర+ఏవ=అక్కడే, కిమ్+న+ప్రలయం+గతా+అసి=అంతమైపోలేదెందుకు?
వ్యాఖ్య:
గంధగజం అంటే: దాని చెంపల నుండి జారే మదజలాల వాసనను శత్రు గజాలు భరించజాలవు – అని అర్థం.
చంద్రగుప్తుణ్ణి ఉద్దేశించి వాడిన ‘మౌర్యపుత్ర’ అనేది మౌర్యుడిగా (మనుమడు) చంద్రగుప్తుణ్ణి నిర్దేశిస్తోంది. అంటే, ముర కొడుకు కొడుకు అనే అర్థం వస్తుంది – అని రామదాసయ్యంగారు. చరిత్ర ప్రకారం ముర కొడుకే మౌర్యుడు – చంద్రగుప్తుడు, మౌర్య వంశ స్థాపకుడు. చంద్రగుప్తుడు మురకు మనుమడనే అర్థం ఇక్కడ వస్తున్నదని సారాంశం.
గంధగజం మరణిస్తే, మదజలాలు కూడా నాశనమవ్వాలి కద! నందుడు గంధగజమైతే అతడి వైభవం (లక్ష్మి) మదజలం కాకపోయిందే – అని రాక్షసమంత్రి ఆవేదన. రాజ్యలక్ష్మిని స్త్రీగా భావిస్తూ కులీనుడైన నందరాజు మరణంతో (పతివ్రత మాదిరి) మరణించకుండా, కులహీనుడైన చంద్రగుప్తుణ్ణి చేరావేమే చపల చిత్తురాలా అని నిష్ఠురం.
అలంకారం:
ఉపమ. “దానామ్బురాజిరివ” అనడం వల్ల ఆ అలంకారం. “నన్దందేవం (గంధగజం) అపాస్య” – అని – ఉపమేయం.
వృత్తం:
వసంత తిలక – త – భ – జ – జ – గగ – గణాలు.
రాక్షస:
అపి చ, అనభిజాతే…
శ్లోకం:
పృథివ్యాం కిం దగ్ధాః
ప్రథితకులజా భూమిపతయః
పతిం పాపే మౌర్యం యదసి
కులహీనం వృతవతీ?
ప్రకృత్యా వా కాశ ప్రభవ
కుసుమప్రాన్త చపలా
పురన్ధ్రీణాం ప్రజ్ఞా
పురుష గుణ విజ్ఞాన విముఖీ॥ 7
అర్థం:
అపి చ=మరియు, అనభిజాతే=కులహీనురాలా,
పాపే=ఓసి పాపాత్మురాలా!, ప్రథిత+కులజాః=ప్రసిద్ధ (రాజ) కులాలలో పుట్టిన, భూమిపతయః=పాలకులు, పృథివ్యాం=నేలమీద, దగ్ధాః+కిమ్=తగులబడిపోయారా ఏమి? యత్=ఎందుకడుగుతున్నానంటే, కులహీనం+మౌర్యం=తక్కువ కులం వాడైన చంద్రగుప్తుణ్ణి, పతిం+వృతవతీ+అసి=భర్తగా ఎంచుకున్నావు. వా=కాకపోతే, పురన్ధ్రీణాం=స్త్రీల (యొక్క), ప్రజ్ఞా =తెలివి, కాశప్రభవ+కుసుమ+ప్రాన్త చపలా=తెల్ల పూల కొసల వలె చంచలమైనదా? ప్రకృత్యా =స్వభావ సిద్ధంగా, పురుష+గుణ+విజ్ఞాన+విముఖీ=పురుషుల సుగుణాలను తెలుసుకోవడంలో ఆసక్తి లేనిదా?
వ్యాఖ్య:
రాజ్యలక్ష్మిని నిందించడంలో రాక్షసమంత్రి నిస్పృహ వ్యక్తమవుతోంది. గొప్ప వంశాల రాజులు ఈ నేల మీద తగలబడిపోయారనా? కులహీనుడైనవాణ్ణి వరించావు? (నీకేం పోయే కాలం వచ్చింది) లేదా – అసలు ఆడవాళ్ళ మనస్సే పురుషుల సుగుణాలు గ్రహించే స్థితిలో లేకుండా రెల్లుపూల కొసల్లాగా చలించిపోతూ ఉంటుందా? – అని ఎద్దేవా చేస్తున్నాడు. – ఈ ఎత్తిపొడుపు పరోక్షంగా చాణక్యుడికీ తగులుతుంది (బ్రాహ్మణ పుట్టుక పుట్టి శూద్రుణ్ణి ఆశ్రయించాలా అని). రాక్షసమంత్రి నిస్సహాయ స్థితికి నిదర్శనం ఇది.
అలంకారం:
అర్ధాంతరన్యాసం – నందరాజ్యలక్ష్మి చంచల స్వభావాన్ని ప్రస్తావించి, దానిని స్త్రీ జాతి లక్షణంగా సామాన్యీకరించడం ఇక్కడ ఉంది. “కాశ ప్రభవ కుసుమ ప్రాన్త చపల” అంటూ పోలిక చెప్పడం వల్ల ఉపమాలంకారం కూడ.
వృత్తం:
శిఖరిణి – య – మ – న – స – భ – లగ – గణాలు.
రాక్షస:
అపి చ, అవినీతే – త దహం ఆశ్ర యోన్మూలనే నైవ త్వా మకామాం కరోమి। (విచిన్త్య)
మయా తావత్ సుహృత్తమస్య చన్దనదాసస్య గృహే గృహజనం నిక్షిప్య నగరా న్నిర్గచ్ఛతా న్యాయ్య మనుష్ఠితమ్। కుతః – కుసుమపురాభియోగం ప్రతి అనుదాసీనో రాక్షస ఇతి తత్రస్థానా మస్మాభిః సహ ఏక కార్యాణాం దేవపాదోపజీవినాం నోద్యమః శిథిలీభవిష్యతి। చన్ద్రగుప్తశరీర మభి ద్రోగ్ధు మస్మత్ప్రయుక్తానాం తీక్ష్ణరసదాదీనాం ఉపసంగ్రహార్థం పరకృత్యోపజాపార్థం చ మహతా కో శ స ఞ్చ యేన స్థాపితః శకట దాసః। ప్రతిక్షణ మరాతివృత్తాన్తోపలబ్దయే తత్సంహతి భేద నాయ చ వ్యాపారితాః సుహృదో జీవసిద్ధిప్రభృతయః। తత్కి మత్ర బహునా?
అర్థం:
అపి చ=అంతే కాదు; – అవినీతే=నీతిమాలినదానా (రాజ్యలక్ష్మీ!), తత్=నువ్వు ఆ విధంగా ప్రవర్తించినందువల్ల, ఆశ్రయ+ఉన్మూలనేన+ఏవ=నువ్వు ఆశ్రయించుకున్న ఆధారాన్ని (చంద్రగుప్తుణ్ణి) ఉన్మూలనం (పెకిలించడం) చేతనే, త్వాం=నిన్ను, అకామం=నీ కోరిక నెరవేరనిదానిగా, కరోమి=చేస్తాను (నీ కోరికను అణచివేస్తాను). – (విచిన్త్య=ఆలోచించి), సుహృత్తమస్య+చందనదాసస్య+గృహే=ఆప్తమిత్రుడైన చందనదాసు ఇంట్లో, మయా+తావత్=నేనైతే (నా చేతనైతే), గృహజనం+నిక్షిప్య=కుటుంబాన్ని ఉంచి, నగరాత్+నిర్గచ్ఛతా=పాటలీపుత్రం విడిచి రావడమనేది, న్యాయ్యం+అనుష్ఠితం=సక్రమంగా చేసినట్టే; కుతః=ఎందువలనంటే – కుసుమపుర+అభియోగం+ప్రతి=పాటలీపుత్రంపై దండెత్తడం విషయంలో, రాక్షసః=ఈ రాక్షసమంత్రి, అనుదాసీనః (న+ఉదాసీనః)+ఇతి=ఏమరుపాటుగా లేడు అని, తత్రస్థానాం=అక్కడ వున్న, అస్మాభి+సహ+ఏకకారణ్యం = మాతో పాటుగా ఏకీభావం కలిగిన, దేవపాద+ఉపజీవినాం=నందసేవకుల, ఉద్యమః=ప్రయత్నం (ప్రయత్నాలు), న+శిథిలీ+కరిష్యతి=సడలిపోనివ్వదు (నివ్వవు), చన్ద్రగుప్తశరీరం+అభిద్రోగ్ధుం=చంద్రగుప్తుడి శరీరానికి కీడు తలపెట్టేందుకు, అస్మత్+ప్రయుక్తాన్=మేము నియమించిన (మా చేత ప్రయోగింపబడిన), తీక్ష్ణ+రసదాదీనామ్=తీవ్ర విషాలు చేసేవారిని, ఉపసంగ్రహారార్థం=కూడగట్టేటందుకు,పరకృత్య+ఉపజాపార్థం+చ=శత్రుపక్షంలో బెడిసిపోయినవారిని చీలదీయడం కోసం కూడ, మహతః+కోశ+సఞ్చయేన=బాగా (గొప్ప) ధన సమృద్ధి సమకూర్చడం ద్వారా, శకటదాసః+స్థాపితం=శకటదాసును ఉంచాము (ఉంచబడడ్డాడు). ప్రతిక్షణం=అనుక్షణమూ, అరాతి+వృత్తాన్త+ఉపలబ్ధయే=శత్రుపక్ష సమాచారం సంపాదించడం కోసం, తత్+సంహతి+భేదనాయ+చ=వారిలో వారికి ఐక్యాన్ని చీలదీయడానికీ, సుహృదః+జీవసిద్ధిః+ప్రభృతయః=జీవసిద్ధి మొదలైన మిత్రులు, వ్యాపారితాః=పనిలో వున్నారు (పెట్టబడ్డారు), తత్+కిమ్+అత్ర+బహునా=ఇక వెయ్యి మాటలెందుకు?
శ్లోకం:
ఇష్టాత్మజః సపది సాన్వయ ఏవ దేవః
శార్దూలపోత మివ యం పరిపోష్య నష్టః
తస్యైవ బుద్ధివిశిఖేన భినద్మి మర్మ
వర్మీభవేద్యది న దైవ మదృశ్యమానమ్॥ 8
అర్థం:
ఇష్టాత్మజః=కొడుకు మీద మమకారంతో, దేవః=నందరాజు, సప=తత్ క్షణమే, స+అన్వయః=కులంతో సహా, యం=ఎవనిని, శార్దూలపోతం+ఇవ=పులిపిల్లను వలె, పరిపోష్య=శ్రద్ధగా సాకి, నష్టః=నష్టం పాలయ్యాడో (అంటే: కొడుకుల్లో ఒకడిగా మమకారంతో చంద్రగుప్తుణ్ణి లాలించి పెంచి నందుడు నష్టపోయాడని), తస్య+ఏవ+మర్మ=ఆ పులి పిల్ల వంటి చంద్రగుప్తుడి గుట్టును, బుద్ధి+విశిఖేన=నా మేధ అనే బాణంతో, దైవం+యది+న+వర్మి+భవేత్=విధి (శత్రువుకు) అభేద్య కవచమై రక్షించకుండా ఉంటే, భినద్మి=ముక్కలు చేస్తాను.
అలంకారం:
ఉపమ. (శార్దూలపోతమివ (చంద్రగుప్తం) పరిపోష్య – అనడం కారణం.
బుద్ధివిశిఖేన భినద్మి – అనడం వల్ల పరికరాలంకారం (అలంకారః పరికరః సాభిప్రాయే విశేషణే – అని కువలయానందం). విధి కాపాడకుండా ఉంటే, ఆ పులిని బుద్ధి విశిఖంతో చీలజేస్తానన్నది ఇక్కడ కారణం.
వృత్తం:
వసంత తిలక – త – భ – జ – జ – గగ – గణాలు.
వ్యాఖ్య:
మొదటి అంకం ప్రారంభంలో చాణక్య వ్యూహాన్ని విస్తరంగా వివరించినట్టే, రెండవ అంకం ప్రారంభిస్తూనే రాక్షసమంత్రి వ్యూహ ప్రకటనతో కవి ప్రారంభించాడు. చిత్రం! – చాణక్యుడి వ్యూహాలకు ఆధారమైన శకటదాస, జీవసిద్ధి, రసదాది ప్రయోక్తలే రాక్షసమంత్రి ‘తన మనుషులు’గా నమ్ముకోవడంలో అసలైన నాటకీయత ఉంది. నందరాజు, ప్రమాదం గుర్తించకుండా చంద్రగుప్తుణ్ణి మాలిమి చేసి, వంశనాశం కొనితెచ్చుకున్నాడని రాక్షసమంత్రి వేదన – చంద్రగుప్తుడు ‘శార్దూలపోతం’ అయితే, శార్దూలం ఎవరు? నందుడే కదా! – చంద్రగుప్తుడి పరాక్రమ ప్రశంసతో పాటు ప్రితృద్రోహిని శిక్షించాలనే ఆగ్రహం ఇక్కడ గమనించదగినది.
(తతః ప్రవిశతి కఞ్చుకీ)
(తతః=అనంతరం, (అంతలో) కఞ్చుకీ+ప్రవిశతి=కఞ్చుకి ప్రవేశిస్తున్నాడు).
వ్యాఖ్య:
సంస్కృత నాటకాలలో కఞ్చుకి పాత్ర వృద్ధుడు, విరక్తుడు. అంతఃపురానికి పెద్ద దిక్కు. నిర్లిప్తుడు.
“అంతఃపుర చరో వృద్ధో విప్రో గుణగణాన్వితః” అని లక్షణం.
కఞ్చుకి:
శ్లోకం:
కామం నన్ద మివ ప్రమథ్య జరయా
చాణక్యనీత్యా యథా
ధర్మో మౌర్య ఇవ క్రమేణ నగరే
నీతః ప్రతిష్ఠాం మయి।
తం సంప్ర త్యుపచీయమాన మను మే
లబ్ధాన్తరః సేవయా
లోభో రాక్షసవజ్జయాయ యతతే
జేతుం న శక్నోతి చ॥ 9
అర్థం:
చాణక్యనీత్యా+యథా=చాణక్యుడి నీతితో వలె, నన్దం+ఇవ=నందుని వలె (తథా=అదే విధంగా), జరయా=వార్ధక్యంతో, క్రమేణా=మెల్లమెల్లగా, కామం+ప్రమథ్య=కోరికను అణచివేసి, మయి=నా విషయంలో, నగరే+మౌర్యం+ఇవ=ఈ పట్టణంలో చంద్రగుప్తుడి లాగా, ధర్మః+ప్రతిష్ఠాం+నీతః=ధర్మాన్ని నిలబెట్టడం జరిగింది. సంప్రతి=ఇప్పుడు, సేవయా+మే లోభం=సేవించడమనే లోభగుణం, లబ్ధాంతరః (లబ్ధ+అంతరః)=మరొకరిని ఆశ్రయించవలసి వచ్చింది. రాక్షసాత్=రాక్షసమంత్రి నుంచి, ఉపచీయమానం=అభివృద్ధి పొందుతున్న, తం+అను+జయాయ+యతేత్=దానిననుసరించి జయం పొందాలని ప్రయత్నిస్తోంది. జేతుం=జయించడానికి, న+శక్నోతి=సాధ్యపడడం లేదు.
వ్యాఖ్య:
చాణక్య వ్యూహ ఫలితంగా నందుడు నశించి నగరంలో చంద్రగుప్తుడు బలపడ్డాడు. నా వరకు నాలో కోరిక అనేది అణగిపోయి వేరొకరిని ఆశ్రయించుకు బతికే పరిస్థితి వచ్చింది అని కంచుకి ఆవేదన.
ఇది ఎటువంటిదంటే – రాక్షసమంత్రి వేరొకరిని ఆశ్రయించి జయం కోరుతున్న మాదిరిగా వుంది. అది జరగని పని. అలాగే నా ముసలి వయస్సు పరిస్థితి కూడా వుంది అని పోలిక.
అలంకారం:
ఉపమ. – విఫలమనోరధుడు కాక తప్పని స్థితిలో వున్న రాక్షసమంత్రి విజయకాంక్ష లాగే, కోరిక తీరజాలని నా వార్ధక్య పరిస్థితి కూడా పరసేవతో తృప్తిపడవలసిన దశలో వుందని పోలిక.
వృత్తం:
శార్దూల విక్రీడతం – మ – స – జ -స – త – త – గ – గణాలు.
(సశేషం)