ముద్రారాక్షసమ్ – ద్వితీయాఙ్కః – 5

0
2

[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]

రాక్షసః:     

(విలోక్య) అయే విరాధ (ఇత్యర్ధోక్తే) నను ప్రరూఢశ్మశ్రుః! ప్రియంవదక, భుజఙ్గై రిదానీం వినోదయితవ్యమ్. త ద్విశ్రమ్యతా మితః పరిజనేన, త్వ మపి స్వాధికార మశూన్యం కురు.

అర్థం:

అయే=ఓహో! విరాధ! (ఇతి=అనబోయి, అర్ధోక్తే=సగంలోనే ఆగి) విరాధ+ప్రరూఢ+శ్మశ్రుః=(ఏమయ్యా), గడ్డం, మీసాలు బాగా పెరిగిన మనిషీ! (అని అర్థం మార్చి), ప్రియంవదక!, ఇదానీమ్=ఇప్పుడు, భుజఙ్గైః+వినోదయితవ్యమ్=పాములాటతో వినోదించవలసి ఉంది. తత్ (కారణాత్)=అందువల్ల, ఇతః+పరిజనేన+విశ్రమ్యతామ్=ఇక యీ పనివారికి విశ్రాంతి కల్పించు, త్వమ్+అపి=నువ్వు కూడా, స్వ+అధికారం+అశూన్యం+కురు=నీ పరిజనాధిపత్యం చాలించి వెళ్ళు.

ప్రియంవదక:       

తథా. (ఇతి సపరివారో నిష్క్రాన్తః).

అర్థం:

తథా=అలాగే (ఇతి=అని, స+పరివారః+నిష్క్రాన్తః= పనివాళ్ళతో సహా వెళ్ళాడు)

రాక్షసః:

సఖే విరాధగుప్త, ఇద మాసనమ్, ఆస్యతామ్.

(విరాధగుప్తో నాట్యే నోపవిష్టః)  

అర్థం:

సఖే=మిత్రమా, విరాధగుప్త=విరాధగుప్తా!, ఇదం+ఆసనమ్+ఆస్యతామ్=ఇదుగో పీఠం – కూర్చో.

(విరాధగుప్తః+నాట్యేన+ఉపవిష్టః=విరాధగుప్తుడు అభినయపూర్వకంగా కూర్చున్నాడు)

రాక్షసః:

(నిర్వర్ణ్య) అయే, దేవపాదపద్మోపజీవినోఽవస్థేయమ్.

(ఇతి రోదితి)

అర్థం:

(నిర్వర్ణ్య=చూసి) అయే= (అయ్యయ్యో) మిత్రమా, దేవపాదపద్మ+ఉపజీవినః=ప్రభుపాద సేవాపరయాణులైన వాళ్ళకి, ఇయమ్+అవస్థా=ఇదయ్యా పరిస్థితి.

(ఇతి+రోదితి= అంటూ ఏడ్చాడు)

విరాధ:     

అల మమాత్య. శోకేన, నాతిచిరా దమాత్యోఽస్మాన్ పురాతనీ మవస్థా మారోపయిష్యతి।

అర్థం:

అమాత్య=మంత్రివర్యా, అలమ్+శోకేన=దుఃఖం వద్దు, న+చిరాత్=అనతికాలంలోనే, అస్మాన్=మమ్మల్ని, పురాతనీమ్+అవస్థామ్=పూర్వపు స్థితికి, అమాత్యః+ఆరోపయిష్యతి=మంత్రిగారు పైకి తీసుకువెళ్ళగలరు (తమకా సామర్థ్యం ఉన్నది).

రాక్షసః:

సఖే, వర్ణయ కుసుమపుర వృత్తాన్తమ్।

అర్థం:

సఖే=మిత్రమా! కుసుమపుర+వృత్తాన్తమ్+వర్ణయ= (ఏదీ) పాటలీపుత్ర సమాచారం విశదంగా చెప్పు.

విరాధ:    

అమాత్య, విస్తీర్ణః ఖలు కుసుమపుర వృత్తాన్తః। తత్కుతః ప్రభృతి వర్ణయమి?

అర్థం:

అమాత్య=మంత్రివర్యా, కుసుమపుర వృత్తాన్తః+ విస్తీర్ణః+ఖలు=పాటలీపుత్ర సమాచారమైతే చాలా ఉన్నది కదా! తత్=అందువల్ల, కుతఃప్రభృతి+వర్ణయమి?=ఎక్కడ నుండి మొదలుపెట్టి వివరించను?

రాక్షసః:

సఖే, చన్ద్రగుప్త స్యైవ తావ న్నగరప్రవేశాత్ ప్రభృతి అస్మత్ ప్రయుక్తైః తీక్ష్ణరసదాదిభిః కి మనుష్ఠిత మిత్యాదితః శ్రోతు మిచ్ఛామి।

అర్థం:

సఖే=మిత్రమా, చన్ద్రగుప్తస్య+ఏవ+తావత్+నగరప్రవేశాత్+ప్రభృతి=చంద్రగుప్తుడు పాటలీపుత్రంలో ప్రవేశించినది మొదలు, అస్మత్+ప్రయుక్తైః=మనం ప్రయోగించిన (మనచే ఏర్పాటు గావించబడిన), తీక్ష్ణ+రసదాదిభిః=తీవ్ర విషప్రయోగం మొదలైన వాటితో, కిమ్+అనుష్ఠితమ్=ఏమి జరిగిందో, ఇతి+ఆదితః=అనేవాటి వరకు, శ్రోతుమ్+ఇచ్ఛామి= వినాలనుకుంటున్నాను.

వ్యాఖ్య:

నాటకాన్ని చూసేవారికి, చాణక్య – రాక్షస మంత్రులిద్దరూ చేస్తున్న పన్నుగడలకు ముందు ఏమి జరిగిందో కథ తెలియాలి. అందుకు కవి ఇక్కడ అవకాశం తీసుకుంటున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు సమాచారం అవసరమో, హద్దులు కూడా నిర్దేశిస్తున్నాడు. ఇక్కడ “నగర ప్రవేశాత్ ప్రభృతి” అనే వాక్యభాగానికి “పాటలీపుత్ర ప్రవేశమ్” అని కాకుండా, “రాచనగరు ప్రవేశమ్” అని అర్థం చెప్పాలని శ్రీ రామదాసయ్యంగారు గారి భావన. అయితే – నగర ప్రవేశ సందర్భం రాక్షసమంత్రికి ఎరుకే కద! ప్రత్యేకించి రాచనగరు అనకపోయినా – మంత్రి ఉద్దేశం “అస్మత్ ప్రయుక్తైః” ఇత్యాది వాక్యం ద్వారా, ఎక్కడి నుంచి కథ ప్రారంభించాలో స్పష్టమవుతూనే ఉంది. “అస్మత్ ప్రయుక్తైః” – అన్న చోట “మన చారులు ప్రయోగించిన విషప్రయోగం మొదలైన విశేషాలతో ప్రారంభించి…” అని విశాలార్థం ఇక్కడ చెప్పుకోవడం ఉచితం.

విరాధ:   

ఏష కథయామి। అస్తితావత్ – శక యవన కిరాత కాంభోజ పారశీక బాహ్లిక ప్రభృతిభి శ్చాణక్యమతి పరిగృహీతైః చంద్రగుప్త పర్వతేశ్వరబలై రుదధిభి రివ ప్రళయో చ్చలిత సలిలైః సమన్తా దుపరుద్ధం కుసుమపురమ్॥

అర్థం:

ఏషః+కథయామి=ఇదిగో, అదే చెబుతున్నాను. అస్తి+తావత్=అప్పుడేమయిందంటే…, శక+యవన+కిరాత+కాంభోజ+పారశీక+ బాహ్లిక ప్రభృతిభిః=ఆయా పేరిటి సైన్యాలతో, చాణక్య+మతి+గృహీతైః=చాణక్యుడి మనస్సు ఎరిగినవారితో, చంద్రగుప్త+పర్వతేశ్వర+బలైః=చంద్రగుప్త, పర్వతేశ్వర సైన్యాలతో, ఉదధిభిః+ఇవ=సముద్రాల మాదిరిగా, ప్రళయ+ఉచ్చలిత+సలిలైః=ప్రళయకాలంలో నీళ్ళు ఎగసిపడే రీతిలో, సమన్తాత్=అన్ని దిక్కుల నుండి, కుసుమపురమ్=పాటలీపుత్రాన్ని, ఉపరుద్ధం=చుట్టుముట్టడమైనది (చుట్టుముట్టబడింది).

రాక్షసః:

(శస్త్ర మాకృష్య ససంభ్రమమ్) అయి, మయి స్థితే కః కుసుమపుర ముపరోత్స్యతి? ప్రవీరక, ప్రవీరక క్షిప్ర మిదానీమ్…

అర్థం:

(శస్త్రం+ఆకృష్య=కత్తి దూసి, ససంభ్రమమ్=తడబాటుతో) అయి+మయిస్థితే=అరే! నేనిక్కడ ఉండగా, కుసుమపురమ్+కః +ఉపరోత్స్యతి?=ఎవడు పాటలీపుత్రాన్ని ఆక్రమించుకోగలడు? ప్రవీరక!, ప్రవీరక!

క్షిప్రం=వెంటనే, ఇదానీమ్…=ఇప్పుడే…

శ్లోకం:

ప్రాకారం పరితః శరాసనధరైః

క్షిప్రం పరిక్రమ్యతాం;

ద్వారేషు ద్విరదైః ప్రతిద్విపఘటా

భేదక్షమైః స్థీయతామ్;

త్యక్త్వా మృత్యుభయం ప్రహర్తు మనసః

శత్రోర్బలే దుర్బలే

తే నిర్యాన్తు మయా స హైక మనసో,

యేషా మభీష్టం యశః     13

అర్థం:

ప్రాకారం+పరితః=కోట ప్రాకారం చుట్టూ, శరాసన+ధరైః+క్షిప్రమ్=విలుకాండ్రతో వెంటనే, పరిక్రమ్యతాం=చుట్టుముట్టేలాగ చెయ్యండి. ద్వారేషు=నగర ప్రవేశ ద్వారాలలో, ప్రతిద్విప+ఘటా+భేద+క్షమైః=శత్రువుల గజ సమూహాలను చెదరగొట్టగల, ద్విరదైః=ఏనుగులతో, స్థీయతామ్=నిలువరింపజేయండి. మృత్యుభయం+త్యక్త్వా=మరణభయం విడిచి, శత్రోః+దుర్బలే+బలే=శత్రు సైన్యాన్ని బలహీనమైనదిగా భావించి, ప్రహర్తు+మనసః=చంపే ఉద్దేశం మనసులో గల, యేషాం=ఎవరికైతే, యశః+అభీష్టం=కీర్తియందు ఆసక్తి కలదో, మయా+సహు+ఏకమనసః=నాతో ఏకీభావం కలవారో, తే=అట్టివారు, నిర్యాన్తు=బయలుదేరుగాక!

వ్యాఖ్య:

ఇప్పుడు రాక్షసమంత్రిది చిత్రమైన స్థితి. విరాధగుప్తుడు కడచిపోయిన సంగతి చెపుతున్నా, ఆవేశానికి గురై, అదేదో ఇప్పుడే జరుగుతున్నట్టు భ్రమకు లోనై ప్రకరకుడ్ని పిలుస్తూ, మంత్రి హోదాలో, కోటను కాపాడటానికి అనుసరించదగిన వ్యూహాన్ని ఆదేశిస్తున్నాడు – తానిప్పుడు నందమంత్రి కాడు, తన ఆజ్ఞకు ఏ విలువా లేదు.

ఇప్పుడు జరగనది జరుగుతున్నట్టు భావించి ఉద్రేకపడటం భ్రాంతి.

అలంకారం:

భ్రాంతిమదాలంకారం (ఇట్టి అలంకారం – లేకపోయినా, లేనిది ఉన్నట్టు భ్రాంతి కలిగింది కనుక. – ఈ అలంకార విభాగంలో బహుశా చేర్చవచ్చు).

వృత్తం:

శార్దూల విక్రీడతం – మ – స – జ -స – త – త – గ – గణాలు.

విరాధ: 

అమాత్య, అల మావేగేన। వృత్త మిదం వర్ణ్యతే

అర్థం:

అమాత్య=మంత్రివర్యా, ఆవేగేన+అలం=కలతపడవద్దు, ఇదం+వృత్తం+వర్ణ్యతే=ఈ చెప్పేది ‘జరిగిపోయిన’ సంగతి.

రాక్షసః:

(నిఃశ్వస్య) కష్టం! వృత్త మిదం! మయా పునర్ జ్ఞాతం, స ఏ వాయం కాల ఇతి. (శస్త్ర ముత్సృజ్య) త్వ మత్ర సంగ్రామకాలే….

అర్థం:

(నిఃశ్వస్య=నిట్టూర్చి) కష్టం=అయ్యో! వృత్తం+ఇదం!=ఇది జరిగిపోయిన సంగతా! సః+ఏవ+కాలః+ఇతి= ఇప్పటి సంగతే అనుకుని, మయా+జ్ఞాతం=నేను భావించాను (నాచే అనుకొనబడినది). (శస్త్రం+ఉత్సృజ్య=ఆయుధాన్ని విడిచిపుచ్చి), అత్ర=ఇక్కడ, త్వమ్=నువ్వు (నందరాజు) సంగ్రామ+కాలే…. =యుద్ధ సమయంలో…

శ్లోకం:

య త్రైషా మేఘనీలా చరతి గజఘటా

రాక్షస స్తత్ర యాయా,

దేత త్పారిప్లవామ్భఃప్లుతి తురగ బలం

వార్యతాం రాక్షసేన।

పత్తీనాం రాక్షసోఽన్తం నయతు బల మితి

ప్రేషయ న్మహ్య మాజ్ఞా,

మజ్ఞాసీః ప్రీతి యోగాత్ స్థిత మివ నగరే

రాక్షసానాం సహస్రమ్॥    14

అర్థం:

యత్ర=ఎక్కడైతే, ఏషా+మేఘనీలా+ఘటా=మబ్బు వంటి నల్లని ఏనుగుల సమూహం, (ఉన్నదో) తత్ర=అక్కడ, రాక్షసః+యాయాత్=రాక్షసుడు వెళ్ళాలి గాక! ఏతత్=యీ, పారిప్లవ+అంభఃప్లుతి=వరదనీరు మాదిరిగా ఉరకలు వేసే, తురగ+బలమ్=గుర్రపుదండు, రాక్షసేన=రాక్షసుడు (చేత) వార్యతామ్=నిరోధించుగాక! (బడుగాక!). పత్తీనాం+బలం=కాలిబంట్ల సైన్యాన్ని, రాక్షసః=రాక్షసుడు, అన్తం+నయతు=సంహరించుగాక!, ఇతి=అని, మహ్యమ్+ఆజ్ఞా+ప్రేషయన్=నన్నుద్దేశించి ఆజ్ఞలను పంపుతూ, ప్రీతి యోగాత్= (నా పట్ల) అనురాగం వల్ల, నగరే=రాచనగరులో, రాక్షసానాం+సహస్రమ్+స్థితం+ఇవ=వెయ్యిమంది రాక్షసులున్నారా అన్నట్టుగా, అజ్ఞాసీః=భావించావే!!

వృత్తం:

స్రగ్ధరావృత్తం. మ-ర-భ-న-య-య-య గణాలు.

వ్యాఖ్య:

ఒకడు కాదు, వెయ్యిమంది రాక్షసులు అండగా ఉన్నారని నమ్మకం పెట్టుకున్నావే, ఏమి చేయగలిగాను? అని రాక్షసమంత్రి తనకు ఇష్టుడైన నందరాజును తలచుకుని విచారిస్తున్నాడు.

‘పత్తి’ – అనే సైనిక విభాగానికి ఒక లెక్క ఉంది. కేవలం కాల్బలమే కాదు. ఒక రథం+ఒక ఏనుగు+మూడు గుఱ్ఱాలు+ఏడుగురు కాలిబంట్లు ఉండే దళం అని అర్థం. అశ్వదళంలో కేవలం అశ్వాలు, గజఘటంలో కేవలం గజాలు – కాక – ‘పత్తి’ అనే మరొక  బలమైన సైనిక విభాగం అని అర్థం చెప్పుకోవాలి.

రాక్షసః:    

తతః సమన్తా దుపరుద్ధం కుసుమపుర మవలోక్య బహుదివసప్రవృత్త మతిమహ దుపరోధవైశస ముపరి పౌరాణాం పరివర్తమాన మస హమా నేతస్యామ వ్యవస్థాయాం పౌరజనాపేక్షయా సురఙ్గా మేత్య అపక్రాన్తే తపోవనాయ దేవే సర్వార్థసిద్ధౌ, స్వామివిరహాత్ ప్రశిథిలీకృతప్రయత్నేషు యుష్మద్బలేషు, జయఘోషణావ్యాఘా తాది సాహసానుమితేషు అన్తర్నగరవాసిషు, పున రపి నన్దరాజ్య ప్రత్యానయనాయసురఙ్గయా బహిరపగతేషు యుష్మాసు. చన్ద్రగుప్త నిధనాయ యుష్మత్ప్ర యుక్తయా విషకన్యయా ఘాతితే తపస్విని పర్వతేశ్వరే.

సఖే – పశ్యాశ్చర్యమ్…

అర్థం:

తతః=పిమ్మట, సమన్తాత్+ఉపరుద్ధం+కుసుమపురం+అవలోక్య=అన్ని వైపుల నుండి ముట్టడికి గురైన పాటలీపురాన్ని చూసి, బహుదివస+ప్రవృత్తమ్=చాలా దినాలుగా వున్న, అతిమహత్+ఉపరోధవైశసమ్+ఉపరి=చెప్పనలవి కాని ఆక్రమణ వల్ల ఏర్పడిన కష్టాల కారణ (మైన) మీదట, పౌరాణాం+పరివర్తమానం+అసహమానే=నగరవాసుల తారుమారైన పరిస్థితులు భరించలేక – తస్యామ్+అవస్థాయాం=అట్టి క్లిష్ట పరిస్థితిలో, పౌరజన+ఆపేక్షయా=నగరవాసుల క్షేమం కోరి, సురఙ్గాం+ఏత్య=సురంగ మార్గంలో ప్రవేశించి (అనుసరించి), దేవే+సర్వార్థసిద్ధౌ+తపోవనాయ+అపక్రాన్తే (సతి)=సర్వార్థసిద్ధి మహారాజు తపోవనానికి తరలిపోగా (తమరు వెళ్ళగా), స్వామి+విరహాత్=ప్రభువు దూరమైననందుకు, ప్ర+శిథిలీకృత+ప్రయత్నేషు+యుష్మత్+బలేషు=తమ సైన్యాలలో కార్యదీక్ష సడలిపోగా, – జయఘోషణా+వ్యాఘాత+ఆది+సాహస+అనుమితేషు=విజయ ప్రకటనాన్ని ప్రకటించే విషయంలో, పురజనులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా (సాహసించగా) – పునః+అపి+నన్దరాజ్య+ప్రత్యానయనాయ=తిరిగి నందరాజ్యాన్ని తీసుకురావడం కోసం, సురంగయా+బహిః+అపగతేషు+యుష్మాసు=సురంగ మార్గం ద్వారా తమరు బయటకు తప్పుకోగా – చన్ద్రగుప్త+నిధనాయ=చంద్రగుప్తుణ్ణి చంపడం కోసం, యుష్మత్+ప్రయుక్తయా=మీరు ప్రయోగించిన (ప్రయోగించ ఉద్దేశించిన), విషకన్యయా=విషకన్య చేత (విషకన్యతో), తపస్విని+పర్వతేశ్వరే+ఘాతితే=పాపం (నిరపరాధి) పర్వతేశ్వరుడు చంపబడగా, సఖే=మిత్రమా!, ఆశ్చర్యమ్+పశ్య…=ఏమి జరిగిందో చూడు!

వ్యాఖ్య:

ఇక్కడ – జరిగిపోయిన విషయాలను ఏకరువు పెట్టడం ద్వారా – రాక్షసమంత్రి చేత, కడచిన కథ చెప్పిస్తున్నాడు కవి. రెండు ముఖ్య విషయాలు – పాటలీ నగరం ముట్టడి ఫలితంగా నందరాజు సర్వార్థసిద్ధి తప్పించుకుని అరణ్యాలకు వెళ్ళిపోయాడు. చంద్రగుప్తుణ్ణి చంపడానికి ఉద్దేశించిన విషకన్య ద్వారా చంద్రకేతుడి తండ్రి పర్వతేశ్వరుడు చంపబడ్డాడు. అది ఆశ్చర్యకర విశేషం రాక్షసమంత్రికి! ఈ సంభాషణ రాక్షసమంత్రి సర్వార్థసిద్ధి నుద్దేశించి సంబోధించినది.

శ్లోకం:

కర్ణే నేవ విషాఙ్గ నైకపురుష

వ్యావాదినీ రక్షితా

హన్తుం శక్తి రివార్జునం బలవతీ

యాచన్ద్రగుప్తం మయా। 

సా విష్ణో రివ విష్ణుగుప్త హతక

స్యాత్యన్తిక శ్రేయసే

హైడిమ్బేయ మి వేత్య పర్వతనృపం

తద్వధ్య మే వావధీత్॥     15

అర్థం:

కర్ణేన+ఇవ= కర్ణుని మాదిరిగా, ఏకపురుష+వ్యావాదినీ=ఒకే వ్యక్తిని చంపగల సామర్థ్యం వున్న, బలవతీ+యా+శక్తిః=మిక్కిలి సమర్థమైన ‘శక్తి’, అర్జునం+హన్తుం+ఇవ=అర్జునుణ్ణి వధించడానికి ఉద్దేశించిన విధంగా – యా+విషాఙ్గనా=(నేను రూపొందించిన) విషకన్య, బలవత్+ఏకపురుష+వ్యావాదినీ= (అది కూడా) ఒక్క వ్యక్తినే పరిమార్చగల సమర్థత కలదై, చన్ద్రగుప్తం+హన్తుం=చంద్రగుప్తుణ్ణి చంపడానికి, రక్షితః=జాగ్రత్త చేయబడింది. సా=ఆ విషకన్య, విష్ణోః+అత్యన్త+శ్రేయసే=విష్ణువుకు మిక్కిలి ఇష్టుడి (అర్జున) క్షేమం కోరి, తత్+వధ్యం+ఏవ=అతడే చంపవలసి ఉన్న, హైడిమ్బేయం+ఏత+ఇవ=హిడింబ కొడుకు ఘటోత్కచుడిపై ప్రయోగించబడినట్లు (పొందింపబడినట్లు), విష్ణుగుప్త+హతకస్య= ఆ విష్ణుగుప్త చచ్చినాడికి, ఆత్యన్తికశ్రేయసే=గట్టి మేలు కోరదగినవాడి (చంద్రగుప్తుడి) కోసం, పర్వతనృపం+తత్+వధ్యం+ఏవ=తానే చంపవలసి ఉన్న (విష్ణుగుప్తుడు) పర్వతరాజును, ఏత్య=పొంది (ప్రయోగింపబడి), అవధీత్=చంపింది.

వ్యాఖ్య:

కర్ణుడు అర్జున వధ కోసం దాచిన (ఏకపురుష వధ్యమైన) ఇంద్రశక్తి ‘విష్ణు మాయ’ కారణంగా – అతడిని చంపకుండా, ఘటోత్కచుణ్ణి వధించినట్లు – విష్ణుగుప్త చచ్చినాడి ‘మాయ’ కారణంగా – అతడికిష్టుడైన చంద్రగుప్తుడిని చంపడం కోసం సిద్ధం చేసిన విషకన్య, పర్వతేశ్వరుడిని చంపివేసింది కదా! అని రాక్షసమంత్రికి ఆశ్చర్యంతో కూడిన ఆవేదన.

ఇక్కడ రాజకీయం ఏమంటే: మాట ఇచ్చిన ప్రకారం పర్వతరాజుకివ్వవలసిన అర్ధరాజ్యం ఎగగొట్టి, అతడిని పరిమార్చవలసిన అవసరం విష్ణుగుప్తుడికి (చాణక్యుడికి) ఉంది. ఆ పని విషకన్యాప్రయోగం ద్వారా జరిగిపోయింది.

అలంకారం:

కర్ణనేవ- శక్తిరివ- విష్ణోరివ-హైడిమ్బేయమివ – అనే పదాలలో ‘ఇవ’ ప్రయోగం ఉన్నందున ఉపమాలంకారం. ‘విష్ణు’ ప్రయోగం ద్వారా మహావిష్ణువు, విష్ణుగుప్తుడు – అనే అర్థ స్వారస్వం సరిపోవడం వల్ల శ్లేషానుప్రాణితం.

అర్జున-కర్ణ-చంద్రగుప్త-ఘటోత్కచ-పర్వతేశ్వర-విష్ణు ప్రస్తావనలతో – పర్వతరాజుపై విషకన్యా ప్రయోగానికి ఉదాహరణగా భారత ఘటనా ప్రస్తావన దృష్టాంతంగా చూపడం వల్ల దృష్టాంతాలంకారం కూడా చెప్పదగి ఉన్నది.

(చేద్బింబ ప్రతిబిమ్బత్వం దృష్టాన్తస్తదలంకృతః – అని కువలయానందం).

వృత్తం:

శార్దూల విక్రీడతం – మ – స – జ -స – త – త – గ – గణాలు.

విరాధ:     

అమాత్య, దైవ స్యాత్ర కామచారః. కిం క్రియతామ్?

అర్థం:

అమాత్య=మంత్రివర్యా, అత్ర+దైవస్య+ కామచారః=ఈ విషయంలో విధి సంకల్పం అలాగ (ఇష్టానుసారం) నడిచింది. కిం+క్రియతామ్?=ఏమి చేసేది?

రాక్షసః:

తత స్తతః

అర్థం:

తతః+తతః= (సరే) ఆ తరువాత?…

విరాధ: 

తతః పితృవధత్రాసా దపక్రాన్తే కుమారే మలయకేతౌ, విశ్వాసితే పర్వతక భ్రాతరి వైరోచకే, ప్రకాశితే చ చన్ద్రగుప్తస్య నన్దభవన ప్రవేశే, చాణక్య హతకేన ఆహూ యాభిహితాః సర్వ ఏవ కుసుమపుర నివాసినః సూత్రధారాః, యథా సాంవత్సరి కాదేశా దర్ధరాత్ర సమయే చన్ద్రగుప్తస్య నన్దభవన ప్రవేశో భవిష్యతి తతః పూర్వద్వారా త్ప్రభృతి సంస్క్రియతాం రాజభవనమితి. తతః సూత్రధారై రభిహితమ్. ఆర్య, ప్రథమ మేవ దేవస్య చన్ద్రగుప్తస్య నన్దభవన ప్రవేశ ముపలభ్య సూత్రధారేణ దారువర్మణా కనక తోరణ న్యాసాదిభిః సంస్కార విశేషై సంస్కృతం ప్రథమ రాజభవన ద్వారమ్. అస్మాభి రిదానీ మభ్యన్తరే సంస్కార ఆధేయఃఇతి. తత శ్చాణక్య వటునా అనాదిష్టే నేవ సూత్రధారేణ దారువర్మణా సంస్కృతం రాజభవనద్వార మితి పరితుష్టే నేవ సుచిరం దారువర్మణో దాక్ష్యం ప్రశ స్యాభిహితమ్ – అచిరా దస్య దాక్ష్యస్య అనురూపం ఫల మధిగమిష్యసి దారువర్మన్.ఇతి..

అర్థం:

తతః=ఆ తరువాత (పర్వతేశ్వరుడు చనిపోయాక), పితృవధ+త్రాసాత్=తండ్రి వధ వల్ల కలిగిన భయంతో (భయం వల్ల), కుమారే+మలయకేతౌ+అపక్రాన్తే (సతి)=పర్వతేశ్వర కుమారుడు మలయకేతువు పలాయనం చిత్తగించగా – పర్వతక భ్రాతరి+వైరోచకే+విశ్వాసితే(సతి)=పర్వతేశ్వర సోదరుడైన వైరోచనుడికి నమ్మకం కలగజేయగా – చన్ద్రగుప్తస్య+నన్దభవన+ప్రవేశే+ప్రకాశితే (సతి)=చంద్రగుప్తుడి యొక్క పూర్వపాలకుడైన నందుడి భవనంలో ప్రవేశ సందర్భాన్ని వెల్లడించగా – సర్వః+ఏవ+కుసుమపుర+నివాసినః+సూత్రధారాః=పాటలీపుత్రంలో ఉన్న నిర్మాణ కార్మికులను (వడ్రంగులు మొదలైనవారిని), చాణక్యహతకేన+ఆహూయ=చాణక్య చచ్చినాడి (చేత) పిలిపించి (పిలిపించబడి), అభిహితాః=(ఇలాగ) చెప్పాడు…

‘సాంవత్సరిక+ఆదేశాత్=జ్యోతిష్కుల ఆజ్ఞ ప్రకారం, అర్ధరాత్ర+సమయే= (నేటి) సగం రాత్రి వేళ, చన్ద్రగుప్తస్య+నన్దభవన+ప్రవేశః+భవిష్యతి=చంద్రగుప్తుడు నందుని భవనంలో ప్రవేశ కార్యక్రమం జరుగుతుంది’- ఇతి=అని

(ఇంకా) తతః=అందుమూలంగా, పూర్వద్వారాత్+ప్రభృతి=తూర్పు ద్వారం నుంచి (అక్కడ ప్రారంభించి), రాజభవనమ్+సంస్క్రియతాం=రాజభవనం అలంకరణ జరగాలి (అలంకరించబడాలి)- ఇతి=అని.

తతః=ఆ మీదట, సూత్రధారైః=నిర్మాణ కార్మికులు (వారి చేత), అభిహితమ్=ఇలా చెప్పారు (చెప్పబడింది) – ‘ఆర్య= అయ్యా, ప్రథమం+ఏవ=తొలుతనే, దేవస్య+చన్ద్రగుప్తస్య=చంద్రగుప్త ప్రభువు (యొక్క), నన్దభవన+ప్రవేశం+ ఉపలభ్య=నందుని భవన ప్రవేశాన్ని ఎరిగినవాడై, సూత్రధారేణ+దారువర్మణా=కార్మికులలో ఒకడైన దారువర్మ (చేత), కనకతోరణన్యాస+అదిభిః=బంగారు తోరణం (కమాను) ఏర్పరచడం మొదలైన, సంస్కార+విశేషైః=ప్రత్యేక అలంకరణలతో, ప్రథమ+రాజభవన ద్వారమ్=తొలిదైన రాజభవన ద్వారం, సంస్కృతమ్=అలంకరించాడు (అలంకరించబడింది). అస్మాభిః=(ఇక) మేము (మా చేత), ఇదానీమ్=ఇప్పుడు, అభ్యన్తరే+సంస్కార+ఆధేయః=భవనం లోపల అలంకరణమే చేపట్టాలి’, ఇతి=అని.

తతః=తరువాత, చాణక్య+వటునా=చాణక్య ‘చిన్నవాడు’ (పిల్లగాడు), సూత్రధారేణ+దారువర్మణా+అనాదిష్టేన+ఏవ=కార్మికుడైన దారువర్మ ఆదేశం లేకుండానే (స్వతంత్రించి), రాజభవన+ద్వారం+సంస్కృతం+ఇతి+పరితుష్టేన+ఇవ=రాజభవన ద్వారం అలంకరించినందుకు సంతోషించినవాడివలె, దారువర్మణః+దాక్ష్యం+సుచిరం+ప్రశస్య=దారువర్మ పనితనాన్ని చాలసేపు పొగిడి, అభిహితమ్=ఇలా అన్నాడు (చాణక్యుడి చేత ఇలా చెప్పబడ్డాడు దారువర్మ) – ‘దారువర్మన్=దారువర్మా, అస్యత్+దాక్ష్యస్య+అనురూపం+ఫలమ్=ఈ పనితనానికి తగిన పారితోషికం, అచిరాత్=త్వరలోనే, అధిగమిష్యసి=పొందగలవు’. ఇతి=అని.

వ్యాఖ్య:

దారువర్మ అనేవాడు తన ఆదేశం లేకుండా స్వతంత్రించి రాజభవన ప్రథమ ద్వారం దగ్గర ఒక బంగారు తోరణాలంకారం చేశాడు. – ఈ రహస్యాన్ని కనిపెట్టి చాణక్యుడు అతడి పనితనాన్ని ప్రశంసిస్తున్నట్లు కనబడుతూ పారితోషికం ఉంటుందని కూడా ప్రకటించాడు. ‘చాణక్య హతకుడు’, ‘చాణక్య వటువు’ అని విరాధగుప్తుడు సంబోధించడంలో ఉద్దేశం, అతడు తమ పన్నకాలకు అడుగడుగునా అడ్డుపడుతున్నాడనే అసహనంతో కూడిన యీసడింపు గమనించవచ్చు. చాణక్యుడు వేయి కళ్ళతో చంద్రగుప్తుడిని కాపాడుతున్నాడని గమనింపు కూడా -.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here