Site icon Sanchika

ముద్రారాక్షసమ్ – ద్వితీయాఙ్కః -9

[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]

సిద్ధార్థకః:

అమచ్చ, ఎత్థ కిం జుజ్జఇ? (అమాత్య, అత్ర కిం యుజ్యతే?)

అర్థం:

అమాత్య=మంత్రివర్యా, అత్ర=ఇక్కడ, కిం+యుజ్యతే=తగు విధంగ ఏమి ఉంది?

రాక్షసః:

భద్ర, యన్మహాధనానాం గృహే పతిత స్యైవం విధస్య ఉపలబ్ధి రితి॥

అర్థం:

భద్ర=నాయనా! యత్=కారణం ఎందుకంటే, మహాధనానాం+గృహే=గొప్ప ధనవంతుల ఇంట్లో, పతితస్య=పడిపోయినది, ఏవం+విధస్య+ఉపలబ్ధిః+ఇతి=ఈ విధంగా దొరకడం అనేది (తగిన విధంగానే వుంది) అని –

శకటదాసః:

సఖే, సిద్ధార్థక, అమాత్యనా మాఙ్కితేయం ముద్రా। తదితో బహుత రేణార్థేన భవన్త మమాత్య స్తోషయిష్యతి। దీయ మేషా।

అర్థం:

సఖే+సిద్ధార్థక=మిత్రమా సిద్ధార్థక!, అమాత్య+నామాఙ్కిత+ఇయం+ముద్రా=ఈ ఉంగరం మీద మంత్రివర్యుడి పేరు ఉంది. తత్=ఆ కారణంగా, ఇతః+బహుతరేణ+అర్థేన=ఇచ్చినదానికంటే ఎక్కువ మొత్తంతో, అమాత్యః+భవన్తమ్+తోషయిష్యతి=మంత్రివర్యుడు నిన్ను సంతోషపెట్టగలరు. తత్+ఏషా+దీయతాం=అందువల్ల దీనిని ఇచ్చివెయ్యి (ఇది ఇవ్వబడుగాక).

సిద్ధార్థకః:

అజ్జ, ణం పసాదో ఏసో జం ఇమాఏ ముద్దాఏ అమచ్చో పరిగ్గహం కరేది॥ (ఆర్య, నను ప్రసాద ఏషః, య దస్యా ముద్రాయా అమాత్యః పరిగ్రహం కరో తీతి॥)

(ఇతి ముద్రా మర్పయతి)

అర్థం:

ఆర్య=అయ్యా, అస్యాః+ముద్రాయాః=ఈ ఉంగరం (యొక్క), పరిగ్రహః=స్వీకరణం (తీసుకోవడం), అమాత్యః+కరోతి+ఇతి+యత్=మంత్రివర్యుడు చేస్తాడు అనేది ఏది ఉందో, ఏషః+ప్రసాదః+నను=అది (నన్ను) అనుగ్రహించడమే కద! (మంత్రిగారు యీ ఉంగరాన్ని కోరుకోవడం (నిజానికి) నన్ను అనుగ్రహించడమే కద!).

(ఇతి+ముద్రాం+అర్పయతి=అని – ఉంగరాన్ని అప్పగించాడు.)

రాక్షసః:

సఖే, శకటదాస, అన యైవ ముద్రయా స్వాధికారే వ్యవహర్తవ్యం భవతా

అర్థం:

సఖే+శకటదాస=మిత్రమా! శకటదాస!, అనేన+ఏవ+ముద్రయా= (నా పేరిట ఉన్న) ఈ ఉంగరంతోనే, భవతా=నువ్వు (నీ చేత), స్వ+అధికారే+వ్యవహర్తవ్యం=అధికారం నిర్వహించు (నిర్వహించుబడుగాక).

శకటదాసః:

య దాజ్ఞాపయ త్యమాత్యః

అర్థం:

అమాత్యః+యత్+ఆజ్ఞాపయతి=మంత్రివర్యుడు ఆదేశించినట్టే (చేస్తాను).

సిద్ధార్థకః:

అమచ్చ, విణ్ణవేమి. (అమాత్య, విజ్ఞాపయామి)  

అర్థం:

అమాత్య=మంత్రివర్యా, విజ్ఞాపయామి= (నాదొక) విన్నపము.

రాక్షసః:

బ్రూహి, విస్రబ్ధమ్

అర్థం:

విస్రబ్ధమ్=సందేహించకుండా, బ్రూహి=చెప్పు.

సిద్ధార్థకః:

జాణాది ఎవ్వ అమచ్చో జహ చాణక్క వడుకస్స విప్పిఅం కదుఅ ణత్థి పుణో పాడలిఉత్తే పవేసో త్తి, ఇచ్ఛామి అహం అమచ్చచలణే ఎవ్వ సుస్సూసిదుమ్

(జానా త్యే వామాత్యో, యథా చాణక్య వటుకస్య విప్రియం కృత్వా నాస్తి పునః పాటలీపుత్రే ప్రవేశ ఇతి ఇచ్ఛా మ్యహం అమాత్యస్య చరణా వేవ శుశ్రూషితుమ్)

అర్థం:

యథా+చాణక్య+వటుకస్య+విప్రియం+కృత్వా=చాణక్య కుర్రాడికి నచ్చనిది చేసి, పాటలీపుత్రే+పునః+ప్రవేశః+నాస్తి+ఇతి=పాటలీపుత్రంలో మళ్ళీ ప్రవేశించబడమనేది కుదరదు – అని, అమాత్యః+జానాతి+ఏవ=మంత్రివర్యులు ఎరిగినదే! అమాత్యస్య+చరణౌ+ఏవ+శుశ్రూషితుమ్=మంత్రివర్యుడి పాదాలనే (పాదాల వద్దనే) సేవించుకోవాలని, అహం+ఇచ్ఛామి=నేను కోరుకుంటున్నాను.

రాక్షసః:

భద్ర, ప్రియం నః। కింతు త్వదభిప్రా యాపరిజ్ఞానాన్తరితోఽయ మస్మదనునయః। త దేవం క్రియతామ్!

అర్థం:

భద్ర=నాయనా!, నః+ప్రియం=మాకిష్టమే. కిం+తు=ఎందుకంటే, – త్వత్+అభిప్రాయ+అపరిజ్ఞాన+అన్తరితః+అయం+అస్మత్+అనునయః=నీ అభిప్రాయం నాకు ఎరుకపడలేదు కనుక యీపాటి ఆలస్యం చేశాను. తత్+ఏవం+క్రియతామ్=అందువల్ల (తప్పక) అలాగే చెయ్యి.

సిద్ధార్థకః:

(సహర్షమ్) అనుగిహిదో హ్మి। (అనుగృహీతోఽస్మి)  

అర్థం:

(సహర్షమ్=సంతోషంగా) అనుగృహీతః+అస్మి= (తమ) దయ (దయచూడబడ్డాను).

రాక్షసః:

శకటదాస, విశ్రామయ సిద్ధార్థకమ్!

అర్థం:

శకటదాస, సిద్ధార్థకమ్+విశ్రామయ=సిద్ధార్థకుడి విశ్రాంతి కలిగించు.

శకటదాసః:

తథా (ఇతి – సిద్ధార్థకేన సహ నిష్క్రాన్తః).

అర్థం:

తథా=అలాగే, (ఇతి=అని, సిద్ధార్థకేన+సహ+నిష్క్రాన్తః=సిద్ధార్థకుడితో కలిసి వెళ్ళాడు).

రాక్షసః:

సఖే, విరాధగుప్త, వర్ణయ వృత్త శేషమ్. అపి క్షమన్తేఽస్మదుపజాపం చన్ద్రగుప్త ప్రకృతయః?

అర్థం:

సఖే+విరాధగుప్త=మిత్రమా! విరాధగుప్తా!, వృత్త+శేషమ్+వర్ణయ= (ఇక) మిగిలిన విశేషాలు చెప్పు. చన్ద్రగుప్త+ప్రకృతయః=ప్రస్తుతం చంద్రగుప్త రాజ్యప్రజలు, అస్మత్+ఉపజాపం=మన భేదోపాయాలను, అపి+క్షమన్తే=సహిస్తున్నారా?

విరాధ:

అమాత్య. బాఢం క్షమన్తే, యథా ప్రకాశ, మనుగచ్ఛన్త్యేవ.

అర్థం:

అమాత్య=మంత్రివర్యా. బాఢం=అవును (తప్పక), క్షమన్తే=సహిస్తున్నారు, యథా+ప్రకాశం+అనుగచ్ఛన్తి+ఏవ=బాహటంగానే (మనల్ని) అనుసరిస్తూ ఉన్నారు.

రాక్షసః:

సఖే, కిం తత్ర ప్రకాశమ్?

అర్థం:

సఖే=మిత్రమా, తత్+ప్రకాశమ్+కిమ్=’బహిరంగంగా’ అంటే ఏమిటి?

విరాధ:

అమాత్య, ఇదం తత్ర ప్రకాశమ్। మలయ కేతోరపక్రమణాత్ ప్రభృతి, కుపిత శ్చన్ద్రగుప్త శ్చాణక్య స్యోప రీతి। చాణక్యోఽప్యతిజితకాశితయా సహమాన శన్ద్రగుప్తం తై స్తై రాజ్ఞాభఙ్గైశ్చన్ద్రగుప్తస్య చేతఃపీడా ముపచినోతి। ఇత్థ మపి మ మానుభవః।

అర్థం:

అమాత్య=మంత్రివర్యా. తత్+ప్రకాశమ్+ఇదం=అక్కడ బహిరంగపడినది ఇది – మలయకేతోః+అపక్రమణాత్+ప్రభృతి=మలయకేతువు తప్పించుకున్ననాటి నుంచి, చాణక్య+ఉపరి=చాణక్యుని మీద, చన్ద్రగుప్తః+కుపితః+ఇతి=చంద్రగుప్తుడు కోపంతో ఉన్నాడనీ -. చాణక్యః+అపి=చాణకుడు కూడా, అతి+జితకాశితయా=తన విజయానికి మిక్కిలి గర్వంతో, అసహమానః=సహించజాలని వాడై, చన్ద్రగుప్తం=చంద్రగుప్తుడిని, తైః+తైః= ఆయా, ఆజ్ఞా+భఙ్గై=ఆదేశాలను ఉల్లంఘించడం ద్వారా, చన్ద్రగుప్తస్య=చంద్రగుప్తుడి (యొక్క), చేతః+పీడా=మనోవ్యధను, ఉపచినోతి=పెంచుతున్నాడు. మమ+అనుభవః+అపి+ఇత్థమ్=నాకు కూడా యీ అనుభవం ఉంది (ఇది స్వయంగా నాకూ తెలుసు).

రాక్షసః:

(సహర్షమ్) సఖే, విరాధగుప్త, గచ్ఛ త్వం అనే నై వాహితుణ్ణిక చ్ఛద్మనా పునః కుసుమపురమ్। తత్ర మే ప్రియ సుహృ ద్వైతాళిక వ్యఞ్జనః స్తనకలశో నామ ప్రతి వసతి। స త్వయా మద్వచనా ద్వాచ్యః యథా చాణక్యేవ క్రియమాణే ష్వాజ్ఞాభఙ్గేషు చన్ద్రగుప్త సముత్తే జనసమర్థైః శ్లోకై రుప శ్లోక యితవ్యః, కార్యం చ అతినిభృతం కరభక హస్తేన సందేష్టవ్య మితి।

అర్థం:

(సహర్షమ్=సంతోషంగా) సఖే+విరాధగుప్త=మిత్రమా! విరాధగుప్తా!, త్వమ్=నువ్వు, అనేన+ఆహితున్డిక+ఛద్మనా+ఏవ=ఈ పాములాడించేవాడి వేషంతోనే, కుసుముపుర+గచ్ఛ=పాటలీపుత్రానికి వెళ్ళు. తత్ర=అక్కడ, మే+ప్రియ+సృహృత్=నాకు ఆప్త మిత్రుడు, సన్తకలశః+నామ=సన్తకలశుడనే పేరిటివాడు, వైతాళిక+వ్యఞ్జనః=వైతాళిక వేషంలో, ప్రతివసతి=నివసిస్తున్నాడు. సః+త్వయా+మత్+వచనాత్+వాచ్యః=వాడికి నా మాటగా చెప్పు (నీ చేత నా మాటగా వాడు చెప్పబడాలి), యధా=ఏమని అంటే – “చాణక్యేన+క్రియమాణేషు+ఆజ్ఞాభఙ్గేషు=చాణక్యుడి వల్ల జరిగే ప్రతి ఆదేశోల్లంఘన విషయంలో (ఉల్లంఘనల సందర్భాలలో), సుముత్తేజన+సమర్థైః+శ్లోకైః=రెచ్చగొట్టే శక్తిమంతమైన ప్రశంసావాక్యాలతో, ఉపశ్లోకయితవ్యః=పొగడాలి (పొగడబడాలి), కార్యం+చ=పని జరిగాక (చేసిన పని), అతి+నిభృతమ్=మిక్కిలి రహస్యంగా, కరభక+హస్తేన=కరభకుడి ద్వారా, సందేష్టవ్యమ్+ఇతి=నాకు తెలియజేయాలి – అని” -.

విరాధ:

య దాజ్ఞాపయ త్యమాత్యః (ఇతి నిష్క్రాన్తః)

అర్థం:

యత్+అమాత్యః+ఆజ్ఞాపయతి=మంత్రివర్యుడు ఆదేశించినట్టే (చేస్తాను). (ఇతి=అని, నిష్క్రాన్తః=వెళ్ళాడు).

పురుషః:

(ప్రవిశ్య) అమచ్చ, ఏసో ఖు సఅడదాసో విణ్ణవేది – ఏదే ఖు తిణ్ణ అలంకారసంజోఅ విక్కీయన్ది. తా పచ్ఛఙ్ఖీక రేదు అమచ్ఛో. (అమాత్య, ఏష ఖలు శకటదాసో విజ్ఞాపయతి – ఏతే ఖలు త్రయోఽలంకార సంయోగా విక్రీయన్తే. తస్మాత్ప్రత్యక్షీ కరో త్వమాత్యః – ఇతి.)

అర్థం:

(ప్రవిశ్య=ప్రవేశించి) అమాత్య=మంత్రివర్యా, ఏషః+శకటదాసః+విజ్ఞాపయతి+ఖలు=ఈ శకటదాసు (మీకు) విన్నవిస్తున్నాడు కదా, (ఏమని అంటే) – ఏతే+త్రయః+అలంకార+సంయోగాః=ఈ మూడు విధాల నగల జతలూ, విక్రీయన్తే=అమ్మజూపుతున్నారు (చూపబడుతున్నాయి). తస్మాత్ (కారణాత్)=అందువల్ల, అమాత్యః+ప్రత్యక్షీ+కరోతు=మంత్రివర్యులు చూడాలి గాక! (ఒక పరి చూడండి).

రాక్షసః:

(విలోక్య) అహో మహార్హాణ్యాభరణాని, భద్ర, ఉచ్యతాఽమస్మద్వచనా చ్ఛకటదాసః, పరితోష్య విక్రేతారం, గృహ్యతా మితి.

అర్థం:

(విలోక్య=చూపించిన నగలను చూసి), అహో=ఆహా! ఆభరణాని+మహార్హాణి=ఈ నగలు ఎంతో గొప్పవి. భద్ర=నాయనా, శకటదాసః+అస్మత్+వచనాత్+ఉచ్యతామ్=శకటదాసుకు నా మాటగా చెప్పు (చెప్పబడుగాక), విక్రేతారం+పరితోష్య=అమ్మే మనిషిని సంతోషపెట్టి, గృహ్యతామ్ =తీసుకోమను (తీసుకొనుబడుగాక!).

పురుషః:

తథా – (ఇతి నిష్క్రాన్తః)

అర్థం:

అలాగే. (ఇతి=అని, నిష్క్రాన్తః=వెళ్ళాడు).

రాక్షసః:

యావ దహ మపి కుసుమపురాయ కరభకం ప్రేషయామి, (ఉత్థాయ) అపినామ దురాత్మన శ్చాణక్యా చ్చన్ద్రగుప్తో భిద్యేత? అథవా, సిద్ధ మేవ నః సమీహితం పశ్యామి। కుతః…

అర్థం:

యావత్+అహం+అపి=ఇంతలో (అంతలో) నేను కూడా (అంటే విరాధగుప్తుడు పాటలీపుత్రానికి వెళ్ళేంతలో), కరభకం+కుసుమపురాయ+ప్రేషయామి=కరభకుణ్ణి పాటలీపురానికి పంపిస్తాను, (ఉత్థాయ=కూర్చున్నచోట నుంచి లేచి), దురాత్మనః+చాణక్యాత్=దుర్మార్గుడైన చాణక్యుడి నుంచి, అపినామ+చన్ద్రగుప్తః+భిద్యేత=చంద్రగుప్తుణ్ణి విడదీసే అవకాశం సాధ్యమేనా?, అథవా=కాకపోతే – నః+సమీహితం+సిద్ధం+ఏవ=మా కోరిక తీరినట్టే, పశ్యామి=చూస్తున్నాను. కుతః=ఎలాగంటే…

శ్లోకం:

మౌర్యస్తేజసి సర్వభూతలభుజా

మాజ్ఞాపకో వర్తతే,

చాణక్యోఽపి మదాశ్రయా దయ మభూ

ద్రా జేతి జాతస్మయః,

రాజ్యప్రాప్తికృతార్థ మేక, మపరం

తీర్ణ ప్రతిజ్ఞార్ణవం,

సౌహార్దా త్కృతకృత్య తైవ నియతం

లబ్ధాన్తరా భేత్స్యతి     23

అర్థం:

మౌర్యః=చంద్రగుప్తుడు, తేజసి=అధికార వైభవం విషయంలో (ప్రభుకాంతి వల్ల), సర్వ+భూతల+భుజామ్=రాజ్యపాలకులందరికీ, ఆజ్ఞాపక+వర్తతే=ఆదేశించే స్థితిలో ఉన్నాడు. చాణక్యః+అపి= (ఇటు చూస్తే) చాణక్యుడు కూడా – “అయం=ఇతడు, మత్+ఆశ్రయాత్=నాతో చేరి ఉండడం వల్లనే, రాజా+అభూత్+ఇది=రాచరికంలో (పాలకుడై) ఉన్నాడ”ని, జాత+స్మయం=గర్వంతో ఉన్నాడు.

రాజ్యప్రాప్తి+కృతార్థం+ఏకం=రాజ్యం దక్కడమనే పని తీరిందని ఒకడిని, అపరం=మరోకడిని, తీర్ణ+ప్రతిజ్ఞా+అర్ణవం=ప్రతిజ్ఞా సముద్రం దాటడమైనదని, కృత+కృత్యతా+ఏవ=వారి వారి అవసరాలు తీరిపోవడమే, నియతం=తప్పనిసరిగా, లబ్ధ+అంతరా=ఎడము కలిగినదై (ఎడాన్ని పెంచి), సౌహార్దాత్+భేత్స్యతి=స్నేహాన్ని చెరుస్తుంది (స్నేహాన్ని విడదీస్తుంది).

వ్యాఖ్య:

చాణక్యుడికి నందవంశాన్ని నాశం కావించడమనే ప్రతిజ్ఞా, చంద్రగుప్తుడికి సర్వంసహాచక్రవర్తిత్వం దక్కడమనే లాభమూ నెరవేరిపోయాయి కనుక, ఎవరి అహంకారాలు వారి కుండడం వల్ల ఇక పరస్పరాశ్రయం అవసరం తీరి స్నేహం చెడిపోయే అవకాశం పుష్కలంగా ఉందని రాక్షసమంత్రి నమ్ముతున్నాడు – మొదటి అంకంలో చాణక్యుడు రాక్షసమంత్రిపై ప్రయోగించే రాజనీతికి, రెండవ అంకంలో రాక్షసమంత్రి చంద్రగుప్తుని పట్ల అనుసరించే వ్యూహరచన ప్రేక్షకులకు ప్రత్యక్షమౌతున్నాయి.

అలంకారం:

సాధ్య ప్రతీతి కోసం సాధన నిర్దేశం చేయడం. అనుమానాలంకారం అని ప్రతాపరుద్రీయం. (సాధ్యసాధన నిర్దేశేత్వనుమానముదీర్యతే).

వృత్తం:

శార్దూల విక్రీడతం – మ – స – జ -స – త – త – గ – గణాలు.

(ఇతి నిష్క్రాన్తాః సర్వే)

(ఇతి=ఈ విధంగా, సర్వే+నిష్క్రాన్తాః=అందరూ వెళ్ళారు).

 ముద్రా రాక్షస నాటకే భూషణ విక్రయోనామ

ద్వితీయాఙ్కః

ముద్రారాక్షస నాటకే=ముద్రారాక్షసమనే నాటకంలో, భూషణ+విక్రయః+నామ= ‘నగలు అమ్మడం’ అనే పేరుగల – ద్వితీయ+అఙ్కః=రెండవ అంకం ముగిసినది.

(సశేషం)

Exit mobile version