ముద్రారాక్షసమ్ నాటక కథా పరిచయం

0
3

[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడు అంకాల  రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]

[dropcap]మ[/dropcap]గధ సామ్రాజ్యాన్ని సుమారు నూరేళ్ళు పరిపాలించిన నందవంశ పాలకులు నవనందులుగా ప్రసిద్ధులు. వీరు శిశునాగుడికి పదకొండవ తరం వారని పురాణ ప్రసిద్ధి. మహాపద్మనందుడు, అతడి ఎనిమిది మంది కొడుకులు నవనందులు. వీరందరూ మహా వీరులు. నందుడు, సునందుడు, ఉపనందుడు, ప్రనందుడు, లోకనందుడు, కురునందుడు, ప్రియనందుడు, మిత్రనందుడు, వినందుడు – వీరి పేర్లన్నీ ఒకానొక కథనం – చారిత్రకంగా చూస్తే –

నందవంశంలో సర్వార్థసిద్ధి ‘నవకోటిశ తేశ్వరుడ’ని ప్రసిద్ధి వహించి రాజ్యపాలన చేశాడు. అతడికి రాజకులానికి చెందిన సునంద పట్టపురాణి. ‘ముర’ అనే ఆమె శూద్రకులస్థురాలు మరొక భార్య. పెద్ద భార్య కొడుకులు ‘అష్టనందులు’ కాగా – మురకు ఏకైక పుత్రుడు చంద్రగుప్తుడు.

సర్వార్థసిద్ధికి వక్రనాశుడు మొదలైనవారు సమర్థులైన మంత్రులు. వారిలో మహా మేధావి, రాజనీతి చతురుడు, నందవంశ పరమ విధేయుడు రాక్షసమంత్రి. –

ప్రస్తుత నాటక కథా నేపథ్యం, క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్ది. అనగా – మౌర్య చంద్రగుప్తుడు మగధను పరిపాలించిన కాలంలో (క్రీ.పూ. 321 – క్రీ.పూ. 297) తొలినాళ్ళు.

ఒకానొక సందర్భంలో, అప్పటికి పాలకులైన నందవంశం వారు తనపట్ల అమర్యాదకరంగా ప్రవర్తించి అవమానించినందుకు క్రోధం వహించి – చాణక్యుడనే మహా మేధావి, పగ సాధించి – నందవంశాన్ని సమూలంగా నిర్మూలించి – మౌర్య చంద్రగుప్తుడికి మగధ సింహాసనాన్ని కట్టబెట్టాడు.

ఆ కాలంలో రాజధాని పాటలీపుత్రం నుంచి రాక్షసమంత్రి చాకచక్యంగా తప్పించుకుని వెళ్ళిపోయాడు. నందవంశ నాశకుడైన చాణక్యుని మీద, మౌర్య చంద్రగుప్తుని మీద ప్రతీకారానికి వ్యూహాలు రచించడం ప్రారంభించాడు.

పాటలీపుత్రంలోను, రాజ్యంలో ఇతర చోట్ల చాణక్య గూఢచారులు, రాక్షసమంత్రి గూఢచారులు, – ఎత్తుకు పై ఎత్తులు నడుపుతున్నారు.

రాక్షసమంత్రి చంద్రకేతువు అనే మ్లేచ్ఛరాజు ఆశ్రయంలో ఉన్నాడు. ఆ రాజు, నందులకు అనుకూలుడై, చాణక్యుడి కుట్ర కారణంగా బలవన్మరణం పాలైన పర్వతేశ్వరుడి కొడుకు.

మౌర్య చంద్రగుప్తుణ్ణి  యుద్ధంలో పరిమార్చి చంద్రకేతుణ్ణి మగధ సింహాసనం ఎక్కించాలని రాక్షసమంత్రి పథకం. ఆ విధంగా – తన ప్రియతమ ప్రభువులైన నందుల పట్ల, చాణక్యుడు చేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చడం లక్ష్యం.

ఉత్కంఠభరితమైన ఆ కాలంలో, చాణక్యమంత్రికి, తన గూఢచారుల్లో ఒకడి ద్వారా, రాక్షసమంత్రి చేతి వేలి ఉంగరం – అతడి పేరు చెక్కి ఉన్న ఉంగరం – అనుకోకుండా చేజిక్కింది. దాని సాయంతో, చాణక్యుడు, రాక్షసమంత్రి వ్యూహాలను భగ్నం చేయడం – ఈ ‘ముద్రారాక్షసం’ నాటకంలో ప్రధాన ఇతివృత్తం. అందుకే నాటకానికి ‘రాక్షసమంత్రి ఉంగరం’ అనే పేరు సార్థకమైంది.

‘ముద్రారాక్షసం’ ఏడంకాల రాజకీయ నాటకం. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైనది. ఈ నాటకంలో ప్రేమ కలాపాలు గాని, విదూషకుడి హాస్యాలాపాలు గాని, మచ్చుకి కూడా కనిపించవు.

నాటక రచయిత విశాఖదత్తుడు. ఇతడు సామంత వటేశ్వరదత్తుడి మనుమడు. భాస్కరదత్త మహారాజు కొడుకు. – ఇతడి కాల నిర్ణయంలో అభిప్రాయభేదాలున్నాయి. నాటక రచన క్రీ.శ. 460 – క్రీ.శ. 600, – క్రీ.శ. 8వ శతాబ్ది అని పలు తీరుల వాదాలున్నాయి. అవి ఇదమిత్థంగా తేలేవి కావు. – విశాఖదత్తుడనే ఒకానొక రాజు, యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడని మనం గ్రహిస్తే చాలు.

ఈ ‘ముద్రారాక్షసమ్’ నాటకంలో చంద్రగుప్తుడు నాయకుడు, చంద్రకేతువు ప్రతినాయకుడుగా కనిపించినా – ఉభయవర్గాలలలో, కథ నడిపించినవారు మాత్రం, ఇద్దరు మంత్రులే! –

– ఇది, మహా మేధావి రాక్షసమంత్రి జాతకాన్నే తిప్పేసిన ఒక ఉంగరం కథ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here