Site icon Sanchika

ముద్రారాక్షసమ్ – పఞ్చమాఙ్కః – 5

[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]

మలయ:

(విలోక్య) ఆర్య, ‘అలఙ్కార త్రయం శ్రీమతా యదనుప్రేషితం తదుపయాత మితి యల్లిఖతం, తన్మ ధ్యాత్ కి మిద మేకమ్? (నిర్వర్ణ్య స్వగతమ్) కథం! తాతేన ధృతపూర్వ మిద మాభరణమ్. (ప్రకాశమ్) ఆర్య, కుతో ఽయ మలఙ్కారః?   

అర్థం:

(విలోక్య=చూసి), ఆర్య=అయ్యవారూ, ‘శ్రీమతా+యత్+అనుప్రేషితం+అలఙ్కారత్రయం=మీ ప్రభువు చేత పంపబడిన మూడు నగలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వీకరించడమైనది’ అంటూ, యత్+లిఖితం=ఉత్తరంలో ఏది వ్రాయబడిందో, తత్+మధ్యాత్= (ఆ అలంకారత్రయంలో) మధ్యలో, ఇదం+ఏకం+కిమ్=ఈ ఒకటీ ఏమిటీ? (నిర్వర్ణ్య=పరికించి చూసి, స్వగతమ్=తనలో) కథం!=ఎలాగా, ఇదం+ఆభరణమ్=ఈ నగ,  తాతేన+ధృతపూర్వం=మా నాయన ఇదివరకు ధరించినది. (ప్రకాశమ్=పైకి) ఆర్య=అయ్యవారూ, అయం+అలఙ్కారః+కుతః=ఈ నగ ఎక్కడిది?

రాక్షసః:

వణిగ్భ్యః క్రయా దధిగతః.  

అర్థం:

వణిగ్భ్యః+క్రయాత్=వర్తకుల నుంచి (వలన) కొనడం వల్ల (ద్వారా), అధిగతః=వచ్చింది.

మలయ:

విజయే, అపి ప్రత్యభిజానాసి భూషణ మిదమ్?   

అర్థం:

విజయే=విజయా, ఇదమ్+భూషణమ్=ఈ నగను, అపి+ప్రత్యభిజానాసి=గుర్తుపట్టగలవా?

 ప్రతీ:

(నిర్వర్ణ్య, సబాష్పమ్) కుమార, కహం ణ పచ్చభిజాణామి? ఇదం సుగిహీదణామ ధేయేణ పవ్వదీస రేణ ధారిద పువ్వమ్. (కథం న ప్రత్యభిజానామి? ఇదం సుగృహీతనామ ధేయేన పర్వతేశ్వ రేణధారితపూర్వమ్.)  

అర్థం:

(నిర్వర్ణ్య=పరికించి చూసి, స+బాష్పమ్=కన్నీటితో), కథం+న+ప్రత్యభిజానామి=ఎందుకు గుర్తుపట్టలేను? ఇదం=ఇది, సుగృహీతనామధేయేన+పర్వతేశ్వరేణ=ప్రసిద్ధుడైన పర్వతేశ్వరుని చేత, ధారితపూర్వమ్=వెనుక ధరింపబడినదే!

మలయ:

(సబాష్పమ్) హా! తాత!    

(స+బాష్పమ్=కన్నీటితో) హా!+తాత!=అయ్యో తండ్రీ!

శ్లోకం:

ఏతాని తాని తవ భూషణ వల్లభస్య,

గాత్రోచితాని కులభూషణ భూషణాని

యైః శోభితో ఽసి ముఖచన్దకృతావభాసో

నక్షత్రవా నివ శరత్సమయ ప్రదోషః. (16)

అర్థం:

(హే!) కులభూషణ=వంశాలంకారమైన వాడా (తండ్రీ!), ఏతాని+తాని= (ఏ నగలైతే ఉన్నాయో) అవి, భూషణ+వల్లభస్య=నగల పట్ల మోజు గల, తవ=నీ యొక్క, గాత్ర+ఉచితాని+భూషణాని=శరీరానికి తగిన నగలు (కలిగి), యైః+ముఖచన్దకృత+అవభాసః=ఏ ముఖ చంద్రకాంతితో కూడుకున్నదైన, నక్షత్రవాన్+శరత్+సమయ+ప్రదోషః+ఇవ=శరత్కాలపు మునిమాపు మాదిరి, శోభితః+అసి=వెలుగొందావు.

వృత్తం:

వసంత తిలక – త – భ – జ – జ – గగ – గణాలు.

అలంకారం:

ఉపమ (ఉపమాయత్ర సాదృశ్యలక్ష్మీరుల్లసతి ద్వయోః – అని కువలయానందం).

శరత్సమయ నక్షత్రవాన్ ప్రదోషః ఇవ శోభితోఽసి – అంటూ పర్వతేశ్వరుడికి పోలిక చెప్పడం కారణం.

రాక్షసః:

(స్వగతమ్) కథం! పర్వతేశ్వరేణ ధృతపూర్వాణీ త్యాహ. వ్యక్త మే వాస్య భూషణాని. (ప్రకాశమ్) ఏతా న్యపి చాణక్యప్రయుక్తేన వణిగ్జనే నాస్మాసు విక్రీతాని!  

అర్థం:

(స్వగతమ్=తనలో) కథం!=ఎలాగ, పర్వతేశ్వరేణ=పర్వతరాజు చేత, ధృత+పూర్వాణీ=పూర్వం ధరించబడినవి, ఇతి+ఆహ=అని అన్నాడు. అస్య+భూషణాని=అతడి నగలు అని, వ్యక్తం+ఏవ=స్పష్టమే. (ప్రకాశమ్=పైకి) ఏతాని+అపి=ఇవి కుడా, చాణక్య+ప్రయుక్తేన=చాణక్యుడు నియమించిన, వణిక్+జనేన=వర్తకుడి చేతనే, అస్మాసు=మా విషయమై, విక్రీతాని=అమ్మబడ్డాయి. (చూ. ద్వితీయాంకం – చివరివాక్యాలు).

మలయ:

ఆర్య, తాతేన ధృతపూర్వాణాం, విశేషత శ్చన్ద్రగుప్త హస్తగతానాం వణిగ్విక్రయ ఇతి న యుజ్యతే, అథవా యుజ్యత ఏ వైతత్. కుతః…    

అర్థం:

ఆర్య=అయ్యవారూ, తాతేనధృతపూర్వాణాం=నా తండ్రి పూర్వం ధరించగా, విశేషతః=అందునా, చన్ద్రగుప్త+హస్తగతానాం=చంద్రగుప్తుడి చేతికి చిక్కినవై, వణిక్+విక్రయం+ఇతి=వర్తకులు అమ్మినవని, న+యుజ్యతే=తగిన విధంగా కనిపించడంలేదు (నమ్మదగినదిగా కనిపించడం లేదు), అథవా=కాని పక్షంలో, ఏతత్+యుజ్యత+ ఏవ=ఇది తగి ఉండవచ్చు కూడా. కుతః=ఎందుకంటే –

శ్లోకం:

చన్ద్రగుప్తస్య విక్రేతు రధికం లాభ మిచ్ఛతః

కల్పితా మూల్య మేతేషాం క్రూరేణ భవతా వయమ్. (17)

అర్థం:

అధికం+లాభం+ఇచ్ఛతః=ఎక్కువ లాభం కోరుకుంటూన్న వాడై – విక్రేతుః=అమ్మే, చన్ద్రగుప్తస్య=చంద్రగుప్తుడికి – క్రూరేణ+భవతా=నిర్దయ గల తమ చేత, ఏతేషాం=వీటికి, వయమ్+మూల్యం+కల్పితం=మేము వెలగా చేయబడ్డాం.

వృత్తం:

అనుష్టుప్.

అలంకారం:

అనుమానాలంకారం (సాధ్యసాధన నిర్దేశేత్వనుమానముదీర్యతే – అని ప్రతాపరుద్రీయం).

సాధ్య ప్రతీతి కోసం సాధనాన్ని నిమిత్తం చేయడం- లక్షణం.

ఇక్కడ అధిక లాభం సాధ్యప్రతీతి. చంద్రకేతువును మూల్యం చేయడం సాధనం.

రాక్షసః:

(స్వగతమ్) అహో సుశ్లిష్టో ఽభూ చ్ఛత్రు ప్రయోగః. కుతః…  

అర్థం:

(స్వగతమ్=తనలో) అహో=ఆహా! శత్రు+ప్రయోగః=శత్రువు చేసిన పన్నాగం, సుశ్లిష్టః+అభూత్=బిగింపుగా అదిరిపోయింది. కుతః=ఎందుకంటే…

శ్లోకం:

లేఖోఽయం న మ మేతి నోత్తరపదం,

ముద్రా మదీయా యతః

సౌహార్దం శకటేన ఖణ్డిత మితి

శ్రదేయ మేత త్కథమ్?

మౌర్యే భూషణవిక్రయం నరపతౌ

కో నామ సమ్భావయేత్?

తస్మా త్సం ప్రతిపత్తి రేవ హి వరం.

న గ్రామ్య మత్రోత్తరమ్. (18)

అర్థం:

అయం+లేఖం=ఈ ఉత్తరం, న+మమ+ఇతి=నాది కాదని, న+ఉత్తర+పదం=సమాధానం కాదు; యతః=కారణమేమంటే, ముద్రా+మదీయం=దానిపై ఉన్న ముద్ర నాది, సౌహార్దం=స్నేహభావం, శకటేన=శకటదాసు చేత, ఖణ్డితం+ఇతి=తెంపబడింది, ఏతత్+కథిమ్+శ్రద్ధేయమ్=అనే విషయాన్ని ఎలాగ తలుస్తాను, నరపతౌ+మౌర్యే=చంద్రగుప్తుడి యందు, భూషణవిక్రయం=నగల అమ్మకం (చంద్రగుప్తుడు నగలమ్మాడని), కః+నామ+సంభావయేత్=ఎవడు అనుకుంటాడు? తస్కాత్=ఆ యీ కారణాల వల్ల, అత్ర=ఈ విషయమై, సంప్రతిపత్తిః+ఏవ=అంగీకరించడమే మేలు కద! గ్రామ్యం+ఉత్తరం+న=పామరమైన సమాధానం కుదరదు.

వృత్తం:

స్రగ్ధర – మ – ర – భ – న – య – య – య – గణాలు.

అలంకారం:

కారణమాల – (గుమ్భః కారాణమాలా స్యాత్ యథా ప్రాక్‌ప్రాన్త కారణైః – అని కువలయానందం).

ఇక్కడ నేరం అంగీకరించక తప్పని పరిస్థితిని సూచించే కారణాలను, వరుసగా చెప్పడం కారణం.

వ్యాఖ్య:

రాక్షసుడు ఏ విధంగానూ తగు సమాధానం చెప్పగల అవకాశం లేదు. ఒప్పుకోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చాడు.

తనపై వచ్చిన నేరారోపణ విన్నాక సమాధానానికి మరో దారి లేక అంగీకరించడాన్ని సంప్రతిపత్తి అంటారని – శ్రీరామదాసయ్యంగారు యీ ప్రమాణ శ్లోకం ఉదహరించారు:

శ్రుత్వాభియోగం ప్రత్యర్థీ

యది తంప్రతి పద్యతే

సాతుసంప్రతిపత్తి స్యాత్

శాస్త్ర విద్భిరుదాహృతా.

మలయ:

ఏత దార్యం పృచ్ఛామి.    

అర్థం:

ఆర్యం=అయ్యవారిని, ఏతత్+పృచ్ఛామి=ఈ విషయంలో అడుగుతున్నాను (అడగదలిచాను).

రాక్షసః:

(సబాష్పమ్) కుమార, య ఆర్యస్తం పృచ్ఛ, వయ మిదానీ మనార్యాః సంవృత్తాః.  

అర్థం:

(స+బాష్పమ్=కన్నీటితో) కుమార=రాకుమారా, యః+ఆర్యః+తం+పృచ్ఛ=ఎవడు పూజ్యుడో వాని నడుగు, ఇదానీం=ప్రస్తుతం, వయం+అనార్యాః+సంవృత్తాః=పూజించదగనివారమై మేమున్నాం.

మలయ శ్లోకం:

మౌర్యో ఽసౌ స్వామిపుత్రః, పరిచరణపరో

మిత్రపుత్ర స్త వాహం;

దాతా సోఽర్థస్య తుభ్యం స్వమతమనుగత.

స్వంతు మహ్యం దదాసి;

దాస్యం సత్కారపూర్వం నను సచివపదం

తత్ర, తే స్వామ్య మత్ర;

స్వార్థే కస్మిన్ సమీహా పున రధికత రే

త్వా మనార్యం కరోతి?. (19)

అర్థం:

అసౌ+మౌర్యః=ఈ చంద్రగుప్తుడు, తవ=నీకు, స్వామి+పుత్రః=ప్రభు కుమారుడు, పరిచరణ+పరః=నీ సేవను కోరుకునే వ్యక్తి; అహం=(మరి నేను), తవ=నీకు, మిత్రపుత్రః=స్నేహితుడి కొడుకుని; సః=అతడు, తుభ్యం=నీకు (నీ కొఱకు), స్వ+మతం+అనుగతః=తన ఇష్టానుసారం, అర్థస్య+దాతా=ధనం ఇచ్చే వ్యక్తి; త్వం+తు=నువ్వైతే, మహ్యం=నాకు (నా కొఱకు) దదాసి=ఇస్తావు. తత్ర=అక్కడ (మౌర్యుని వద్ద), సచివపదం=మంత్రి పదవి; సత్కారపూర్వం+దాస్యం+నను=సన్మానంతో కూడిన దాస్యమే కద! అత్ర=ఇక్కడ, తే=నీకు, స్వామ్యం=ప్రభు పదవి; పునః=మఱి, కస్మిన్+అధికతరే+స్వార్థే=ఏ అదనపు స్వార్థంతో, సమీహా=కోరిక, త్వాం+అనార్యం+కరోతి=నిన్ను అపూజనీయుడిగా చేస్తోంది?

వృత్తం:

స్రగ్ధర – మ – ర – భ – న – య – య – య – గణాలు.

రాక్షసః:

కుమార, ఏవ మయుక్త వ్యాహారిణా నిర్ణయో దత్తః  భవతు తవ కో దోషః?  

మౌర్యో ఽసౌ స్వామిపుత్రః…. (5-19)

ఇతి యుష్మ దస్మదో ర్వ్యత్య యేన పఠతి.

అర్థం:

‘మౌర్యః+అసౌ+స్వామిపుత్రః’ – అనే శ్లోకాన్ని, యుష్మత్+అస్మదోః=యుష్మత్ – అస్మత్ (నీ – నా అనే వాటి), వ్యత్యయేన=అటు ఇటుగా మార్చి, పఠతి=చదువుతాడు.

(ఇదే శ్లోకంలో పదాల మార్పు చేసి చదవడం వల్ల ఇప్పుడు అర్థం రాక్షసుడి పరంగా మారుతోంది).

మౌర్యో ఽసౌ స్వామిపుత్రః, పరిచరణపరో

మిత్రపుత్ర స్తు మే త్వం

దాతా సోఽర్థస్య మహ్యం స్వమతమనుగతోఽ.

హంతు తుభ్యందామి;

దాస్యం సత్కారపూర్వం నను సచివపదం

తత్ర, మే స్వామ్య మత్ర;

స్వార్థే కస్మిన్ సమీహా పున రధికత రే

మా మనార్యం కరోతి?

వ్యాఖ్య:

మలయకేతువు ‘నువ్వు’ అంటూ సంబోధిస్తూ చేసిన ఆరోపణల జాబితానే, తిరగవేసి ‘నేను’ అని మార్చి రాక్షసుడు తన నిర్దోషిత్వాన్ని ప్రకటించడం ఈ శ్లోకంలోని విశేషం.

“మౌర్యుడు నాకు స్వామిపుత్రుడు. నా సేవ కోరే వ్యక్తి. నువ్వేమో నాకు స్నేహితుడి కొడుకువి. అతడి అభిప్రాయాలను అనుసరిస్తే నాకతడు ధనం ఇస్తాడు. నీకు అయితే నేనే ఇస్తాను. అక్కడ మంత్రిపదవి గౌరవపూర్వక దాస్యం. ఇక్కడ  నేను స్వామిత్వం నెరపుతున్నాను. ఏ స్వార్థం వల్ల మిక్కిలి కోరిక కారణంగా నన్ను అపూజనీయుణ్ణిగా పరిగణించాలి? (నేను నీవాడనే, నేనెందుకు అనార్యుణ్ణి? – అని ప్రశ్న).

మలయ:

(లేఖం అలఙ్కరణస్థగికాం చ నిర్దిశ్య.) ఇద మిదానీం కిమ్?    

అర్థం:

(లేఖం=ఉత్తరాన్ని, అలఙ్కరణ+స్థగికాం+చ=నగ ఉన్న పెట్టెను, నిర్దిశ్య=చూపించి), ఇదం+ఇదానీం+కిమ్=ప్రస్తుతం ఇదేమిటి?

రాక్షసః:

(సబాష్పమ్) విధి విలసితమ్, కుతః…    

అర్థం:

(స+బాష్పమ్=కన్నీటితో) విధి+విలసితమ్=నా దురదృష్టం (విధి విలాసం), కుతః=ఎందుకంటే…

శ్లోకం:

భృత్యత్వే పరిభావధామని సతి

స్నేహా త్ప్రభూణాం సతాం

పుత్రేభ్యః కృతవేదినాం కృతధియాం

యేషాం న భిన్నావయమ్

తే లోకస్య పరీక్షకా క్షితిభృతాః

పాపేన యేన క్షతా

స్త స్యేదం విపులం విధే ర్విలసితం

పుంసాం ప్రయత్నచ్ఛిదః. (20)

అర్థం:

భృత్యత్వే=సేవకధర్మంలో, పరిభావధామని సతి=అవమానానికి అవకాశం ఉండగా, స్నేహాత్=మైత్రివల్ల, కృతవేదినాం=కృతజ్ఞులు, కృతధియాం=బుద్ధిమంతులూ అయిన, ప్రభూణాం+సతాం=పాలకులైన,యేషాం=ఎట్టివారికి (నందులకు), పుత్రేభ్యః=కొడుకుల కంటే, వయం=మేము (నేను), అభిన్నాః=పరాయివాడిని కామో (కానో) – తే+లోకస్యపరీక్షకా=మంచి చెడ్దలు ఎంచి చూడగల ఆ, క్షితిభృతాః=రాజులు, యేన+పాపేన=ఎట్టి పాపం కారణంగా ( ఏ దురదృష్టం కారణంగా), క్షతా=గాయపడ్డారో (వధింపబడ్డారో), తస్య+పుంసాం+ప్రయత్నచ్ఛిదః=అట్టి వారి పురుష ప్రయత్నాన్ని నాశనం చేసే, విధే+విపులం+విలసితం=విస్తృతంగా విధి ఆడే ఆట! – (నన్నూ దోషిని చేసింది – అని నిర్వేదం).

వృత్తం:

శార్దూల విక్రీడితం – మ – స – జ – స – త – త – గ గణాలు.

మలయ:

(సరోషమ్) కి మద్యాపి నిహ్నూయత ఏవ. విధేః కిలై త ద్వ్యవసితమ్, న లోభస్య. అనార్య.    

అర్థం:

(స+రోషమ్=కోపంగా) కిమ్=ఏమీ, అద్+యపి+నిహ్నూయత+ఏవ=ఇంకా ఇప్పటికీ (సత్యాన్ని) మూసిపెడుతున్నావే! ఏతత్+విధేః+వ్యవసితమ్+కిల=ఇది విధి విలాసమా?, న+లోభస్య=ప్రలోభానిది కాదా? అనార్య=దుష్టుడా!

శ్లోకం:

కన్యాం తీవ్రవిషప్రయోగవిషమాం

కృత్వా కృతఘ్న త్వయా

విశ్రమ్భ ప్రవణః పురా మమ పితా

నీతః కథా శేషతామ్.

సంప్ర త్యాహిత గౌరవేణ భవతా

మన్త్రాధికారే రిపౌ

ప్రారబ్ధాః ప్రలయాయః మాంసవ దహో

విక్రేతు మేతే వయమ్. (21)

అర్థం:

కృతఘ్న=చేసిన మేలు మరిచే నీచుడా! త్వయా=నీ చేత (నీ వల్ల), పురా=పూర్వం, తీవ్రవిషప్రయోగవిషమాం=గాఢమైన విషప్రయోగం వల్ల ప్రమాదకారిగా మారిన, కన్యాం=కన్యను, కృత్వా=సిద్ధం చేసి, విశ్రమ్భ ప్రవణః+(మమ) పితా=మిక్కిలిగా నిన్ను నమ్మిన (నా) తండ్రి, కథాశేషతామ్+నీతః=కీర్తిశేషుడిగా చేయబడ్డాడు. సంప్రతి=ఇప్పుడేమో, మన్త్రాధికారే+ఆహిత+గౌరవేణ=మంత్రిపదవిపై ఆదరణతో (ప్రలోభంతో) – ఏతే+వయమ్=ఈ మేము, భవతా=నీ చేత, ప్రలయాయః=వైపరీత్యం సంభవించడం కోసం (నా నాశం కోరి), మాంసవత్=మాంసం మాదిరి, రిపౌః+విక్రేతు=శత్రువుకు అమ్మేయ్యడానికి, ప్రారబ్ధాః=సిద్ధపడ్డవాడవయ్యావు.

వృత్తం:

శార్దూల విక్రీడితం – మ – స – జ – స – త – త – గ గణాలు.

రాక్షసః:

(స్వగతమ్) అయ మపరో గణ్ణ స్యోపరి స్ఫోటః, (ప్రకాశమ్ కర్ణౌపిధాయ) శాన్తం పాపమ్, శాన్తం పాపమ్, నాహం పర్వతేశ్వరే విషకన్యాం ప్రయుక్త వాన్.    

అర్థం:

(స్వగతమ్=తనలో) అయం=ఇది, అపరః=మరొక, గణ్ణస్య+ఉపరి+స్ఫోటః=పుండుపై మరొకసారి చిదుకు (గోరుచుట్టపై రోకటిపోటు), (ప్రకాశమ్=పైకి, కర్ణౌపిధాయ=చెవులు మూసుకుని), శాన్తంపాపమ్+శాన్తంపాపమ్=పాపం శాంతించుగాక! పాపం శాంతించుగాక!, అహం+పర్వతేశ్వరే+విషకన్యాం+న+ప్రయుక్తవాన్=పర్వతరాజుపై నేను విషకన్యను ప్రయోగించలేదు.

మలయ:

కేన తర్హి వ్యాపాదిత స్తాతః?    

అర్థం:

తర్హి=అయితే, తాతః+కేన+వ్యాపాదితః=మా తండ్రిని ఎవరు చంపారు (ఎవరి చేత చంపబడ్డాడు?)

రాక్షసః:

దైవ మత్ర ప్రష్టవ్యమ్.    

అర్థం:

అత్ర=ఈ విషయంలో, దైవమ్+ప్రష్టవ్యమ్=విధిని ప్రశ్నించాలి.

మలయ:

(సక్రోధమ్) దైవ మత్ర ప్రష్టవ్యమ్! న క్షపణకో జీవసిద్ధిః?    

అర్థం:

(స+క్రోధమ్=కోపంగా) అత్ర+దైవమ్+ప్రష్టవ్యమ్=ఈ విషయం విధిని అడగాలా? న+క్షపణకః+జీవసిద్ధిః=సన్న్యాసి జీవసిద్ధి కాడా?

రాక్షసః:

(స్వగతమ్) కథమ్! జీవసిద్ధి రపి చాణక్య ప్రణిధిః? హన్త!, రిపుభిర్మే హృదయ మపి స్వీకృతమ్!    

అర్థం:

(స్వగతమ్=తనలో) కథమ్=ఎలాగూ!, జీవసిద్ధిః+అపి=జీవసిద్ధి కూడా, చాణక్య+ప్రణిధిః=చాణక్య గూఢచారా? హన్త=అయ్యో!, రిపుభిః=శత్రువుల చేత, మే+హృదయం+అపి=నా గుండె కాయ సైతం, స్వీకృతమ్=తీసుకోబడిందా? (అపహరించబడిందా?)

మలయ:

(సక్రోధమ్) భాసురక, ఆజ్ఞాప్యతాం సేఖర సేనః – య ఏతే రాక్షసేన సహ సుహృత్తా ముత్పా ద్యాస్మ చ్ఛరీర ద్రోహేణ చన్ద్రగుప్త మారాధయితు కామాః పఞ్చ రాజానః కౌలూత శ్చిత్రవర్మా మలయనృపతిః సింహనాదః కాశ్మీర పుష్కరాక్షః సిన్ధురాజః సుషేణః పారసీకాధిపో మేఘనాధః ఇతి. ఏతేషు త్రయం ప్రథమే మదీయాం భూమిం కామయన్తే తే గమ్భీరశ్వభ్ర మభినీయ పాంశుభిః పూర్యన్తామ్. ఇతరౌ హస్తి బల కాముకౌ హస్తి నైవ ఘాత్యేతామ్, ఇతి.    

అర్థం:

(స+క్రోధమ్=కోపంగా) భాసురక!, సేఖరసేనః+ఆజ్ఞాప్యతాం=శేఖరసేనుడు ఆదేశించబడుగాక – యత్=ఏమనంటే – రాక్షసేన+సహ=రాక్షసమంత్రితో కలసి, సుహృత్తాం+ఉత్పాద్య=స్నేహం నెరిపి, అస్మత్+శరీర+ద్రోహేణ=నా శరీరంపై కుట్రపన్ని, చన్ద్రగుప్తం+ఆరాధయితు+కామాః=చంద్రగుప్తుణ్ణి సేవించాలని కోరికలతో ఉన్న – కౌలూతః+చిత్రవర్మా=కులూతాధిపతి చిత్రవర్మ, మలయనృపతిః+సింహనాదః=మలయ దేశాధిపతి సింహనాదుడు, కాశ్మీరః+పుష్కరాక్షః=కాశ్మీర దేశాధిపతి పుష్కరాక్షుడు; సిన్ధురాజః+సుషేణః=సింధు రాజు సుషేణుడు, పారసీకాధిపః+మేఘనాధః=పారశీక రాజు మేఘనాధుడు – పఞ్చ+రాజానః=అనే యీ అయిదుగురు రాజులూనూ – ఏతేషు+ప్రథమే+త్రయం=వీరిలో మొదటి ముగ్గురు, మదీయాం+భూమిం+కామయన్తే=నా రాజ్యాన్ని (నా ఏలుబడిలో ఉన్న ప్రదేశాన్ని) కోరుకుంటున్నారు. తే=వారు, గమ్భీర+శ్వభ్రం+అభినీయ=లోతైన గోతిలోకి లాగబడి, పాంశుభిః+పూర్యన్తామ్=మట్టితో కప్పబడాలి. ఇతరౌ+హస్తిబల+కాముకౌ= (నా) గజబలాన్ని కోరుకుంటున్న మిగిలిన ఇద్దరు, హస్తినా+ఏవ=ఏనుగును ప్రయోగించడం ద్వారానే ఘాత్యేతామ్=చంపబడుదురు గాక, ఇతి=అని.

పురుషః:

తథా. (ఇతి నిష్క్రాన్తః)     

అర్థం:

తథా=అలాగే. (ఇతి=అని, నిష్క్రాన్తః=వెళ్ళాడు)

మలయ:

(సక్రోధమ్) రాక్షస రాక్షస, నాహం విశ్రమ్భఘాతీ రాక్షసః మలయ కేతుః ఖల్వహమ్. తద్గచ్ఛ, సమా శ్రీయతాం సర్వాత్మనా చన్ద్రగుప్తః. పశ్య…    

అర్థం:

రాక్షస+రాక్షస=క్రూర రాక్షసుడా, అహం+విశ్రమ్భఘాతీ+రాక్షసః+న= నేను విశ్వాసఘాతకుడైన రాక్షసుడిని కాను. అహం+మలయకేతుః+ఖలు=నేను మలయకేతుణ్ణి కద! తత్+గచ్ఛ=అందువల్ల, వెళ్ళిపో! సర్వాత్మనా=అన్ని విధాలా, చన్ద్రగుప్తః+సమాశ్రీయతాం=చంద్రగుప్తుణ్ణే ఆశ్రయించు. పశ్య=చూడూ…

శ్లోకం:

విష్ణుగుప్తం చ మౌర్యం చ సమ మప్యాగ తౌ త్వయా

ఉన్మూలయితు మీశోఽహం త్రివర్గ మివ దుర్ణయః. (22)

అర్థం:

త్వయా+సమం=నీతో కలసి, ఆగతౌ=వచ్చిన, విష్ణుగుప్తం+చ+మౌర్యం+చ=విష్ణుగుప్తుడిని, చంద్రగుప్తుడిని కూడా, దుర్ణయః+త్రివర్గం+ఇవ=కుత్సిత ప్రవర్తన ధర్మార్థ కామాలనే మూడు పురుషార్థాల వలె, ఉన్మూలయితుం=పెళ్ళగించడానికి, అహం+ఈశః=నేను తగినవాడినే!

భాగు:

కుమార, కృతం కాలహరణేన. సాంప్రతం కుసుమపురోపరోధా యాజ్ఞాప్యనన్తా మస్మద్బలాని.    

అర్థం:

కుమార=రాకుమారా, కృతం కాలహరణేన=అయిన కాలహరణం చాలు. సాంప్రతం=ఇప్పుడు, కుసుమపుర+ఉపరోధాయ=పాటలీపుత్ర ఆక్రమణ కోసం, అస్మత్+బలాని=మన సైన్యాలు, ఆజ్ఞాప్యన్తాం=ఆదేశింపబడుగాక! (మన సైన్యాలను ఆదేశించు).

శ్లోకం:

గౌడీనాం లోధ్రధూళీ పరిమళ బహులాన్

ధూమయన్తః కపోలాన్

క్లిశ్నన్తః కృష్ణిమానం భ్రమరకులరుచః

కుఞ్చిత స్యాలకస్య

పాంసుస్తమ్బా బలానాం తురగఖురపుట

క్షోభలబ్ధాత్మలాభాః

శత్రూణా ముత్తమాఙ్గే గజమదసలిల

చ్ఛిన్న మూలాః పతన్తు. (23)

అర్థం:

గౌడీనాం=గౌడ(స్త్రీల) యొక్క, కపోలాన్=చెక్కిళ్ళను, లోధ్రధూళీపరిమళ+బహులాన్=లొద్దుగు పూల పుప్పొడి పరిమళాలు నిండినవానిని, ధూమయన్తః=పొగబారచేస్తూ, భ్రమరకుల+రుచః=తుమ్మెద సమూహాల (నల్లని) కాంతులుగల, కుఞ్చితస్య=వంకరైన, అలకస్య=ముంగురుల (యొక్క),కృష్ణిమానం=నల్లదనాన్ని, క్లిశ్నన్తః=సన్నబరుస్తున్నవి కాగా, బలానాం=సేనల (యొక్క), తురగ+ఖురపుట+క్షోభ+లబ్ధ=గుఱ్ఱాల గిట్టల తాకిడితో పుట్టిన, పాంశు(సు)+స్తమ్బాః=ధూళి రాశులు (స్తంబరూపంగా పైకి లేచిన దుమ్ము), గజ+మద+సలిల+ఛిన్న+మూలాః=ఏనుగుల మదజలంతో తెగిన అడుగుభాగాలు కలవై (ధూళి స్తంభాల అడుగు భాగాలు నశించినవై), శత్రూణాం=వైరుల (యొక్క), ఉత్తమాఙ్గే=తలపై, పతన్తు=పడాలి గాక!

వృత్తం:

స్రగ్ధర – మ – ర – భ – న – య – య – య – గణాలు.

అలంకారం:

ఉదాత్తాలంకారం (తదుదాత్తం భవేద్యత్ర సమృద్ధం వస్తు వర్ణ్యతే – అని కువలయానందం). ఇక్కడ యుద్ధ సందర్భ సంరంభాన్ని ఆలంకారికంగా విస్తృతంగా చెప్పడం కారణం.

ఉత్ప్రేక్షాలంకారంగా కూడా పరిగణింపదగును.

యుద్ధభూమిలో లేచిన గుఱ్ఱాల గిట్టల ధూళి శత్రుభార్యల శిరస్సును క్రమ్ముకో గాక! అనే తీరున వర్ణించడం కారణం. (సంభావనాస్యాదుత్ప్రేక్షౌ వస్తుహేతు ఫలాత్మనా – అని కువలయానందం).

(సపరిజనో నిష్క్రాన్తో మలయకేతుః)

(మలయకేతుః=మలయకేతుడు, స+పరిజనః+నిష్క్రాన్తః=తన పరివారంతో సహా వెళ్ళిపోయాడు).

రాక్షసః:

(సావేగమ్) హా ధిక్కష్టమ్! తేఽపిఘాతితా శ్చిత్రవర్మాదయ స్తపస్వినః తత్కథం సుహృద్వినాశాయ రాక్షస శ్చేష్టతే, న రిపు వినాశాయ! తత్కి మిదానీం మన్దభాగ్యః కరవాణి?    

అర్థం:

[స+ఆవేగమ్=ఆవేదనతో (ఆందోళనగా)] హా+ధిక్+కష్టమ్=అయ్యో! ఛీ! – ఎంత కష్టం!, తపస్వినః+చిత్రవర్మాదయః+(తే+అపి)ఘాతితా=పాపం! ఏమీ ఎరుగని ఆ చిత్రవర్మా మొదలైన వారు చంపబడ్దారు. తత్=ఆ కారణంగా, కథం+సుహృత్+వినాశాయ=అయితే – స్నేహితులు నాశనం కావడం కోసం, రాక్షసః+చేష్టతే=రాక్షసుడు ప్రవర్తిస్తున్నాడా, రిపువినాశాయ+న=శత్రునాశం కోసం కాదా! తత్=ఇక మీద, ఇదానీం=ఇప్పుడు, మన్దభాగ్యః (అహం)=దురదృష్టవంతుడైన నేను, కిమ్+కరవాణి=ఏం చేయను?

శ్లోకం:

కిం గచ్ఛామి తపోవనం? న తపసా

శామ్యే త్సవైరం మనః.

కిం భర్తౄ ననుయామి? జీవతి రిపౌ

స్త్రీణా మియం యోగ్యతా.

కిం వా ఖడ్గ సఖః పతా మ్యరిబలే?

నై తచ్చ యుక్తం భవే.

చ్చేత శ్చన్దన దాస మోక్షరభసం

రున్ధ్యాత్ కృతఘ్నం న చేత్. (24)

అర్థం:

కిం+తపోవనం+గచ్ఛామి=తపోవనానికి వెళ్ళిపోనా ఏమి? స+వైరం+మనః=శత్రుత్వం నిండిన మనస్సు, తపసా+న+శామ్యేత్=తపస్సువల్ల శాంతిని పొందదు; కిం+భర్తౄన్+అనుయామి=(పోనీ) ప్రభువుల వెంట పోనా (మరణించనా)?, రిపౌ+జీవతి (సతి)=శత్రువు కళ్ళ ఎదుట బ్రతికుండగా, ఇయం=ఈ పని, స్త్రీణా+యోగ్యతా=ఆడువారు చేయదగినది; వా=కాదంటే, ఖడ్గ+సఖః=కత్తే తోడుగా, అరిబలే+పతామి+కిం=శత్రు సైన్యం పైకి దూకనా ఏమి? -ఏతత్+చ=ఇదీ, న+యుక్తం+భవేత్=తగినది కాదు. చేతః= (నా) మనస్సు, కృతఘ్నం+న+చేత్=మేలు మరిచేది కానట్టైతే, ఏతత్+చన్దనదాస+మోక్ష+రభసం=ఈ చందనదాసుని విడిపించే తొందరగలది గాన, న+రున్ధ్యాత్=ఆపదగినది కాదు.

వృత్తం:

శార్దూల విక్రీడితం – మ – స – జ – స – త – త – గ గణాలు.

వ్యాఖ్య:

రాక్షసుడు అన్ని విధాల ఒంటరివాడైపోయాడు. నిస్పృహ అలుముకున్నా, చందనదాసుని రక్షించాలనే కాంక్ష అతడికి కర్తవ్య నిర్దేశంగా తోచింది. తపస్సు కాదు, మరణం కాదు, ముందు వెనకలు మరిచి యుద్ధంలోకి దూకడం కాదు, ఆప్తమిత్రుడి ప్రాణం రక్షించడం ప్రస్తుత కర్తవ్యం అని నిర్ధారించుకున్నాడు.

(ఇతి నిష్క్రాన్తాః సర్వే)

(ఇతి=ఈ విధంగా, సర్వే= అందరూ, నిష్క్రాన్తాః= వెళ్ళారు).

ముద్రా రాక్షస నాటకే కూటలేఖోనామ

పఞ్చమాఙ్కః

ముద్రారాక్షసమనే నాటకంలో, ‘కూటలేఖ’ అనే పేరుగల – అయిదవ అంకం ముగిసినది.

(సశేషం)

Exit mobile version