ముద్రారాక్షసమ్ – ప్రథమాఙ్కః – 13

0
4

[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]

చాణక్యః:

భోః శ్రేష్ఠిన్, చన్ద్రగుప్తే రాజ న్యపరిగ్రహః ఛలానామ్। తత్సమర్పయ రాక్షసస్య గృహజనమ్! అచ్ఛలం భవతు భవతః।

అర్థం:

భోః+శ్రేష్ఠిన్=అయ్యా శెట్టిగారూ, చన్ద్రగుప్తే+రాజని=చంద్రగ్రుప్త ప్రభువు విషయంలో, ఛలానామ్=మాటల టక్కరితనం, అపరిగ్రహః=చెల్లదు (స్వీకారం కాదు), తత్=అందువల్ల, రాక్షసస్య+గృహజనమ్=రాక్షసమంత్రి కుటుంబాన్ని, సమర్పయ=అప్పగించు, భవతః=నీకు, అచ్ఛలం+భవతు=మాట తప్పిదం ఉండకుండు గాక!

చన్దన దాసః:

అజ్జ, ణం విణ్ణవేమి ఆసీ అహ్మఘరే అమచ్ఛ రక్ఖసస్స ఘంఅణోత్తి. (ఆర్య, నను విజ్ఞాపయామి। ఆసీ దస్మద్గృహే అమాత్య రాక్షసస్య గృహజన ఇతి.)

అర్థం:

ఆర్య=అయ్యవారూ, అస్మత్+గృహే=నా ఇంట్లో, అమాత్య+రాక్షసస్య+గృహజనం=రాక్షసమంత్రి కుటుంబం, అసీత్+ఇతి= (ఒకప్పుడు) ఉన్నదని, విజ్ఞాపయామి+నను=విన్నవించుకున్నాను కదా!

చాణక్యః:

అ థేదానీం క్వ గతః?

అర్థం:

అథ=అయితే, ఇదానీం=ఇప్పుడు, క్వ+గతః?=ఎక్కడకు వెళ్ళింది?

చన్దన దాసః:

ణ జాణామి (న జానామి)

అర్థం:

న+జానామి=నేనెరుగను.

చాణక్యః:

(స్మితం కృత్వా) కథం న జ్ఞాయతేనామ? భోః శ్రేష్ఠిన్, శిరసి భయ, మతిదూరే తత్ప్రతీకారః॥

అర్థం:

(స్మితం+కృత్వా=చిరునవ్వు నవ్వి), న+జ్ఞాయత్+నామ+కిమ్?=’నాకు తెలిసిరాలేదు’ – అంటే ఎలాగ?, భోః+ శ్రేష్ఠిన్=ఇదిగో శెట్టిగారూ, శిరసి+భయం=నెత్తి మీద భయం (వ్రేలాడుతోంది), తత్+ప్రతీకారః=అందుకు విరుగుడు ఉపాయం (రాక్షసమంత్రి నెరవేర్చగలడని నువ్వనుకుంటున్నది), అతి+దూరే=సుదూరం.

చన్దన దాసః:

(స్వగతమ్)

శ్లోకం:

ఉపరి ఘణాఘణరడిఅం దూరే దఇతా కిమేద దా వడిఆం?

హిమవది దివ్వోసహిఓ సీసే సప్పో సమావిట్ఠో -21

(ఉపరి ఘనాఘనరటితం దూరే దయితా, కి మేత దాపతితమ్?

హిమవతి దివ్యౌషధయః శీర్షే సర్పః సమావిష్టః॥)

అర్థం:

ఉపరి=(ఆకాశం)పైన, ఘనాఘన+రటితమ్=వాన మబ్బు ఉరుము(తున్నది),  దయితా=ప్రేయసి, దూరే=దూరంలో (ఉంది), హిమవతి=హిమాలయంలో, దివ్య+ఔషధయః=మహత్తరమైన మూలికలు (ఉన్నాయి), శీర్షే=నెత్తిమీద, సర్పః+సమావిష్టః=(త్రాచు)పాము కూర్చుని ఉన్నది (తిష్ఠవేసింది), కిమ్+ఏతత్+అపతితమ్?=ఇది ఇలాగ వచ్చి పడిందేమిటి?

వ్యాఖ్య:

వర్షఋతువులో ప్రియులు ప్రియా విరహంతో తపిస్తూంటారు. ఇప్పుడీ శ్లోకంలో ‘దూరే దయితా’ అనే వాక్యాన్ని రాక్షసమంత్రి దూరంగా ఉండిపోయాడే అని స్థితికి సంకేతంగా గ్రహించాలి. నిజానికి రాక్షసమంత్రి చందనదాసుకి ప్రేయసి కాజాలడు కదా! ఇష్టుడైన మంత్రి దూరంగా ఉండిపోయాడే! అనేది మాత్రమే చందనదాసు భావం. అలాగే – హిమాలయాలలో గొప్ప ఔషధులున్నాయి, నెత్తి మీద పాము తిష్ఠవేసింది అనడం కూడా ఇక్కడ ప్రమాద సూచన. హిమవత్పర్వతమంత దూరంగా, చాణక్యమంత్రాంగం అనేది పాము విషానికి విరుగుడు కాగల ఓషది. రాక్షసమంత్రి అందుబాటులో లేడు. తలకెక్కబోయే విషాలకు విరుగుడు హిమాలయ ఔషధుల్లో లభ్యం. చాణక్య కుటిల నీతి ఇలాగ అనుకోకుండా నెత్తి మీదకు వచ్చి కూర్చుంది – ఇప్పుడెలాగ? – అని చందనదాసు సమస్య.

వృత్తం:

ఆర్య.

అలంకారం:

దీపకాలంకారం.

ఏకవాక్యతతో కూడిన ప్రకృతాప్రకృతాలకు ధర్మసామ్యం వల్ల ఔపమ్యం స్ఫురిస్తే అది దీపకం (ప్రస్తుతాప్రస్తుతానంతు సామన్తే తుల్యధర్మతః। ఔపమ్యం గమ్యతే యత్ర దీపకం తన్నినద్యతే – అని ప్రతాపరుద్రీయం). ‘దూరస్థదయిత’ – ‘హిమవత్‌స్థిత ఓషధి’ అప్రస్తుత విషయాలనైనా, ప్రస్తుత సందర్భంలో ‘దూరస్థిత రాక్షసమంత్రి’కి ఉపమానాలు కావడం చేత, కొందరు ఇక్కడ నిదర్శనాలంకారం అని కూడా అంటున్నారు (వాక్యార్థయోః సదృశయోరైక్యారోపో నిదర్శనా – అని కువలయానందం).

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here