Site icon Sanchika

ముద్రారాక్షసమ్ – ప్రథమాఙ్కః – 16

[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]

చాణక్యః:

శార్ఙ్గరవ, శార్ఙ్గరవ!  

శిష్యః:

(ప్రవిశ్య)

ఉపాధ్యాయ, ఆజ్ఞాపయ!

అర్థం:

శార్ఙ్గరవ, శార్ఙ్గరవ!

(ప్రవిశ్య=ప్రవేశించి), ఉపాధ్యాయ=గురువుగారూ, ఆజ్ఞాపయ=ఆదేశించండి.

చాణక్యః:

కి మేష కలకలః?  

అర్థం:

ఏష కలకలః+కిమ్= ఆ సందడి ఏమిటి?

శిష్యః:

(విభావ్య) ఉపాధ్యాయ, ఏష ఖలు శకట దాసం వధ్యమానం వధ్యభూమే రాదాయ సమపక్రాన్తః సిద్ధార్థకః॥

అర్థం:

(విభావ్య=పరికించి చూసి), (పరులెవరూ లేరని గమనించుకుని), ఉపాధ్యాయ=గురుదేవా! ఏష+ఖలు+వధ్యమానం+శకటదాసం=ఇదేమిటంటే, మరణశిక్ష పడిన శకటదాసును, వధ్యభూమేః+ఆదాయ=శ్మశానం నుంచి తీసుకువచ్చి, సిద్ధార్థకః=సిద్ధార్థకుడు, సం+అపక్రాన్తః=కనుమరుగయ్యాడు (పారిపోయాడు).

చాణక్యః:

(స్వగతమ్) సాధుసిద్ధార్థక, కృతః కార్యారమ్భః (ప్రకాశమ్) ప్రసహ్య కి మపక్రాన్తః? (సక్రోధమ్) వత్స, ఉచ్యతాం భాగురాయణో యథా త్వరితం సంభావయేతి  

అర్థం:

(స్వగతమ్=తనలో), సాధు=భేషు! సిద్ధార్థక!, కార్యారమ్భః+కృతః=పని మొదలైంది (మొదలుపెట్టబడింది), (ప్రకాశమ్=పైకి) ప్రసహ్య+కిమ్+అపక్రాన్తః?=తెగించి పారిపోయాడా? (సక్రోధమ్=కోపంగా) వత్స=నాయనా, ఉచ్యతామ్+భాగురాయణః=భాగురాయణుడితో చెప్పు (చెప్పబడుగాక), యథా=ఏమనంటే, త్వరితం+(ఏనం)+సంభావయ+ఇతి=వెంటనే వాడిని పట్టుకొమ్మని చెప్పు.

శిష్యః:

(నిష్క్రమ్య ప్రవిశ్య చ) (సవిషాదమ్) ఉపాధ్యాయ, హా ధిక్ కష్టమ్! అపక్రాన్తో భాగురాయణోఽపి॥

అర్థం:

(నిష్క్రమ్య=వెళ్ళి, ప్రవిశ్య+చ=తిరిగివచ్చి), (సవిషాదమ్=విచారంగా) ఉపాధ్యాయ=గురువుగారూ, హా! ధిక్ కష్టమ్!=అయ్యయ్యో, కష్టం వచ్చిపడింది, భాగురాయణః+అపి+అపక్రాన్తః=భాగురాయణుడు కూడా చెయ్యిదాటిపోయాడు.

చాణక్యః:

(స్వగతమ్) వ్రజతు. కార్యసిద్ధయే. (ప్రకాశమ్ సక్రోధమివ) వత్స, ఉచ్యన్తా మస్మద్వచనాద్ భద్రభట పురుషదత్త డిఞ్గరాత బలగుప్త రాజసేన రోహితాక్ష విజయవర్మాణః, శీఘ్ర మనుసృత్య గృహ్యతాం దురాత్మా భాగురాయణ, ఇతి  

అర్థం:

(స్వగతమ్=తనలో), కార్యసిద్ధయే=పని జరపడం కోసం, వ్రజతు=వెళ్ళనీ. (ప్రకాశమ్=పైకి, సక్రోధం+ఇవ=కోపంతో అన్నట్లుగా)… వత్స=నాయనా, భద్రభట, పురుషదత్త, డిఞ్గరాత, బలగుప్త, రాజసేన, రోహితాక్ష, విజయవర్మాణః=ఈ పేర్లు గల ఏడుగురినీ, మత్+వచానాత్+ ఉచ్యతామ్= నా మాటగా చెప్పాలి, “దురాత్మా+భాగురాయణః=దుర్మార్గుడైన భాగురాయణుడిని (అతడిని), శీఘ్రం+అనుసృత్య=తొందరగా వెంటాడి, గృహ్యతాం=పట్టుకోవాలి (అతడు పట్టుకోబడాలి)”, ఇతి=అని -.

శిష్యః:

తథా. (ఇతి నిష్క్రమ్య పునః ప్రవిశ్య సవిషాదమ్) హా ధిక్! కష్టమ్! సర్వ మేవ తన్త్ర మాకులీభూతమ్, తేఽపి ఖలు భద్రభట ప్రభృతయః ప్రథమతర ముష స్యే వాపక్రాన్తాః

అర్థం:

తథా=అలాగే -(ఇతి=అని, నిష్క్రమ్య=వెళ్ళి, పునః+ప్రవిశ్య=మళ్ళీ వచ్చి,  స+విషాదమ్=విచారంగా), హా ధిక్! కష్టమ్!=అయ్యయ్యో కష్టం వచ్చిపడింది. సర్వం+తంత్రం+ఏవ=మొత్తం మనుగడే, ఆకులీభూతమ్=చెడిపోయింది (చెదిరిపోయింది). తే+భద్రభట ప్రభృతయః+అపి=భద్రభటుడు మొదలైన (ఏడుగురు), ఉషసి+ఏవ=తెల్లవారుతుండగానే, ప్రథమతరం+ అపక్రాన్తః+ఖలు=మొదటనే పారిపోయారే!

చాణక్యః:

(స్వగతమ్) సర్వథా శివాః సన్తు పన్థానః। (ప్రకాశమ్) వత్స, అలం విషాదేన. పశ్య.    

అర్థం:

(స్వగతమ్=తనలో), సర్వథా=అన్ని విధాలా, (తే)+పన్థానః=వారి దారులు, శివాః+సన్తు=శుభకారకాలు అగుగాక! (ప్రకాశమ్=పైకి), అలం+విషాదేన=విచారించకు. పశ్య=చూడు, వత్స=నాయనా.

శ్లోకం:

యే యాతాః కి మపి ప్రధార్య హృదయే
పూర్వం, గతా ఏవ తే;
యే తిష్ఠన్తి భవన్తు తేఽపి గమ నే
కామం ప్రకామోద్యమాః ;
ఏకా కేవల మేవ సాధనవిధౌ
సేనా శతేభ్యోఽధికా
నన్దోన్మూలన దృష్టవీర్య మహిమా
బుద్ధి స్తు మాగా న్మమ. 26

అర్థం:

యే=ఎవరైతే, పూర్వమ్=ఇంతకు ముందే, కిమ్+అపి+హృదయే+ప్రధార్య=మనస్సులో ఏదో పెట్టుకుని, యాతాః=వెళ్ళిపోయారో, తే=వారు, గతాః+ఏవ=విడిచి వెళ్ళిపోయినట్టే! యే=ఎవరైతే, తిష్ఠన్తి=ఉన్నారో, తే+అపి=వారు కూడా, గమనే=వెళ్ళిపోవడం విషయమై, ప్రకామ+ఉద్యమాః=గట్టిగా ప్రయత్నిస్తున్నవారే, కామం=మిక్కిలిగా, భవన్తు=ఉండనీ – ఏకా+కేవలం+ఏవ=ఒకే ఒక్కటి మాత్రమే, మమ+బుద్ధిః=నా బుద్ధి (ఆలోచన), సాధన+విధౌ= కార్యసాధన విషయమై, సేనా+శతేభ్యః+అధికా=నూరు సైన్యాల కంటే ఎక్కువ, నన్ద+ఉన్మూలన+దృష్ట+వీర్య+మహిమాః=నందవంశాన్ని రూపుమాపడంలో ఋజువైన సామర్థ్యం, మా+ఆగాత్=విడిచిపోకుండుగాక.

వృత్తం:

శార్దూల విక్రీడితం. మ-స-జ-స-త-త-గ గణాలు.

అలంకారం:

కావ్యలింగాలంకారం. ఎవరు వెళ్ళినా వెళ్ళనీ – నందుల్ని నిర్మూలించిన నా బుద్ధి కౌశలం పోకుండా ఉంటే చాలు – అన్న సమర్థన కారణం (సమర్థనీయ స్యార్థస్య కావ్యలిఙ్గం సమర్థనమ్ – అని కువలయానందం)

వ్యాఖ్య:

పోయిన వాళ్ళనీ పోనీ – పోదలుచుకున్నవాళ్ళనీ ప్రయత్నించుకోనీ – నా బుద్ధి బాగుంటే చాలు అని చాణక్యుడి ధీమా – నిజానికి ఈ ‘పారిపోవడాలు’ కూడా మన పన్నుగడలో భాగమేరా నాయానా – అని శిష్యుణ్ణి సేదదీర్చడం ఇక్కడ వ్యంగ్యం.

(ఉత్థాయ) ఏష దురాత్మనో భద్రభటప్రభృతీ నాహరామి। (ప్రత్యక్షవత్ ఆకాశే లక్ష్యం బధ్వా, ఆత్మగతమ్) దురాత్మన్, రాక్షస, క్వేదానీం గమిష్యసి? ఏషోఽహ మచిరాత్ భవన్తమ్…

అర్థం:

(ఉత్థాయ=తాను కూర్చున్న చోటు నుంచి లేచి) ఏషః+భద్రభట+ప్రభృతీన్=ఈ భద్రభటాదుల్ని, అహరామి=తిరిగి పట్టుకువస్తాను.(ప్రత్యక్షవత్=ఎదుట ఉన్నట్లుగా, ఆకాశే=ఆకాశంలో, లక్ష్యం+బధ్వా=దృష్టి నిలిపి, ఆత్మగతమ్=తనలో) దురాత్మన్=దుర్మార్గుడా!, రాక్షస=రాక్షసమంత్రీ!, ఇదానీం=ఇప్పుడు (నా ఉచ్చులో పడ్డాకా), క్వ+గమిష్యసి?=ఎక్కడకు పోగలవు? ఏషః+అహం=ఇదిగో యీ నేను, భవన్తమ్=నిన్ను, అచిరాత్=తొందరలోనే…

శ్లోకం:

స్వచ్ఛన్ద మేక చర ముజ్జ్వలదానశక్తి
ముత్సేకినా మదజలేన విగాహ్యమానమ్
బుద్ధ్యా నిగృహ్య వృషలస్య కృతే క్రియాయా
మారణ్యకం గజ మివ ప్రగుణీ కరోమి. – 27

అర్థం:

స్వచ్ఛందం=తన యిష్టానుసారం, ఏక+చరం=ఒంటరిగా తిరిగే, ఉజ్జ్వలదానశక్తిమ్=అధిక బలం గల, ఉత్సేకినా=ఉరకలు వేస్తున్న (ఉప్పొంగుతున్న), మదజలేన+విగాహ్యమానమ్=మదజలంతో మునిగితేలుతున్న (మదమెక్కిన), ఆరణ్యకం+గజం+ఇవ=అడవి ఏనుగు మాదిరిగా (ఉన్న), భవన్తమ్=నిన్ను, బుద్ధ్యా=బుద్ధిబలంతో, నిగృహ్య=నిలువరించి, వృషలస్య+కృతే=చంద్రగుప్తుడి కోసం, క్రియాయా=అవసర కార్యంలో, ప్రగుణీం+కరోమి=వశపరుచుకుంటాను.

వృత్తం:

మదన వృత్తం. త-భ-జ-జ-గగ – గణాలు.

అలంకారం:

ఉపమాలంకారం. – మదమెక్కి ఒంటరిగా అడవిలో తిరిగే ఏనుగుకీ, పాటలీపుత్రం నుంచి తప్పించుకుపోయి ఒంటరిగా ఎక్కడో ధైర్యంగా తిరుగుతున్న రాక్షసమంత్రికీ, పోలిక – ‘మదగజ మివ ప్రగుణీమ్ కరోమి’ అని. ‘ఇవ’ అనే పదం ద్వారా సూచించడం కారణం.

(ఉపమాయత్ర సాదృశ్య లక్ష్మీరుల్లసతి ద్వయోః అని – కువలయానందం).

ఇక్కడ ఉపమానోపమేయాలు ఉపమా వాచకం స్పష్టం.

వ్యాఖ్య:

గుణం అనే పదానికి త్రాడు అనే అర్థం కూడా ఉంది. ‘ప్రగుణీ కరోమి’ అంటే గట్టి తాడుతో బంధిస్తాను (తాడు విసురుతాను) అని అర్థం.

(ఇతి నిష్క్రాన్తాః సర్వే)

(ఇతి=అని, సర్వే=అందరూ (అన్ని పాత్రలు), నిష్క్రాన్తాః=వెళ్ళిపోతారు).

ముద్రారాక్షస నాటకే ముద్రాలాభోనామ

ప్రథమాఙ్కః

ముద్రారాక్షస నాటకే=ముద్రారాక్షసమనే నాటకంలో, ముద్రాలాభః+నామ=’ఉంగరం దొరకడం’ అనే పేరుగల – ప్రథమాఙ్కః=తొలి అంకం ముగిసినది.

(సశేషం)

Exit mobile version