ముద్రారాక్షసమ్ – ప్రథమాఙ్కః – 3

0
2

[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]

చాణక్య:

త న్మయాఽప్యస్మి న్వస్తుని న శయానేన స్థీయతే.

యథా శక్తి క్రియతే తద్గ్రహణం ప్రతి యత్నః. కథ మివ.

ఆత్ర తావత్ వృషలపర్వతకయో రన్యతరవినాశేఽపి

చాణక్య స్యాపకృతం భవ తీతి విషకన్యయా

రాక్షసే నాస్మాక మత్యన్తోపకారి మిత్రం

ఘాతిత స్తపస్వీ పర్వతక ఇతి సఞ్గారితో

జగతి జనాపవాదః లోక ప్రత్యయార్థం।

అస్యై వార్థ స్యాభివ్య క్త యే “పితా తే చాణక్యేన

ఘాతిత” ఇతి రహసి త్రాసయిత్వా భాగురాయణే

నాప వాహితః పర్వతక పుత్రో మలయకేతుః।

శక్యః ఖ ల్వేష రాక్షసమతిపరిగృహీతోఽపి

వ్యుత్తిష్ఠమానః ప్రజ్ఞయా నిగ్రహీతుం। న పున రస్య

నిగ్రహాత్ పర్వతకవధోత్పన్నం రాక్షసస్య అయశః

ప్రకాశీభవత్ ప్రమార్ష్టుమ్। ప్రయుక్తా శ్చ స్వపక్ష

పరపక్షయో రను రక్తాపరక్త జన జిజ్ఞాసయా

బహువిధ దేశ వేషభాషాచార సఞ్చార వేది నో

నానావ్యఞ్జనాః ప్రణిథయః। అన్విష్యతే చ

కుసుమపుర వాసినాం

నన్దామాత్యసుహృదాం నిపుణం ప్రచార గతమ్।

తత్తత్కారణ ముత్పాద్య, కృతకకృత్యతామాపాదితాః

చన్ద్రగుప్తసహోత్థాయినో భద్రభట ప్రభృతయః

ప్రధాన పురుషాః। శత్రుప్రయుక్తానాం చ తీక్ష్ణ

రసదాదీనాం ప్రతివిధానం ప్రతి అప్రమాదినః

పరీక్షిత భక్తయః క్షితిపతి ప్రత్యాసన్నాః

నియోజితా స్త త్రాప్త పురుషాః.

అస్తి చ అస్మాకం సహాధ్యాయి mgpharmacie.com

మిత్రమ్ ఇన్దుశర్మా నామ బ్రాహ్మణః। స చౌశనస్యాం

దణ్ణనిత్యాం చతుఃషష్ట్యఞ్గే జ్యోతిశ్శాస్త్రే చ పరం

ప్రావీణ్య ముపగతః। స మయా క్షపణక లిఞ్గధారీ

నన్దవంశవధ ప్రతిజ్ఞానన్తర మేవ కుసుమపుర

ముపనీయ సర్వనన్దామాత్యైః సహ సఖ్యం

గ్రాహితః। విశేషతశ్చ తస్మిన్ రాక్షసః

సముత్పన్న విస్రమ్భః, తే నేదానీం మహత్

ప్రయోజన మనుష్ఠేయమ్ భవిష్యతి। త దేవ

మస్మత్తో న కిఞ్చిత్ పరిహాస్యతే। వృషల ఏవ

కేవలం ప్రధాన ప్రకృతి ష్వస్మా స్వారోపిత

రాజ్యతన్త్రభారః సతతమ్ ఉదాస్తే। అథవా యత్

స్వయ మభియోగదుఃఖై రసాధారణై రపాకృతం

త దేవ రాజ్యం సుఖయతి।

కుతః….

అర్థం:

ఈ సుదీర్ఘమైన అత్మగతం ద్వారా, చాణక్యుడు తన రాజకీయ వ్యూహాన్ని బయటపెడుతున్నాడు.

తత్+మయా=ఆ విధంగా ప్రయత్నానికి ఉద్యమించిన నేను (నా చేత) కూడా, అస్మిన్+వస్తుని=ఈ విషయంలో, శయానేన=నిద్రపోయేవాడి స్థితిలో, న+స్థీయతే=ఉండతగదు, తత్‌గ్రహణం+ప్రతి=రాక్షసమంత్రిని పట్టుకునే విషయమై, యథాశక్తి=శక్త్యానుసారం, యత్నః=ప్రయత్నం, క్రియతే=చేయవలసి ఉంది (చేయబడవలసి ఉంది), కథం+ఇవ=ఏ విధంగా అంటే, అత్రతావత్=ఈ విషయంలో, వృషల+పర్వతకయోః=చంద్రగుప్త, పర్వతకుల ఇద్దరి, అన్యతరవినాశే+అపి=పరస్పర వినాశ సందర్బంలో కూడా, చాణక్యస్య+అపకృతం=చాణక్యుడి అపకారం, భవతి+ఇతి=ఉండి తీరుతుందని, – విషకన్యయా=విషకన్యతో (ఆమెను ప్రయోగించడం ద్వారా) – రాక్షసేన=రాక్షసుని వల్ల, అస్మాకం+మామే+అత్యన్త+ఉపకారి+మిత్రం=ఎంతో ఉపకారిగా ఉండే మిత్రుడు, తపస్వీ+పర్వతకః=పాపం పర్వతకుడు, ఘాతితః=చావుకు గురయ్యాడు. (చంపబడ్డాడు) – ఇతి=అని, జగతి=లోకంలో, జనాపవాదః=పుకారు, సంచారితః=ప్రచారంలో పెట్టడమైనది, లోక+ప్రత్యయార్థం=లోకం నమ్మడం కోసం – అస్యైవ+అర్థస్య=ఈ ఉద్దేశ్యాన్ని, (కి) అభివ్యక్తయే=ప్రకటించే నిమిత్తం – తే+పితా=నీ తండ్రి, చాణక్యేన=చాణక్యుడు (చాణక్యుని చేత), ఘాతితః=చంపించాడు (చంపబడ్డాడు), ఇతి=అని -. రహసి=రహస్యంగా త్రాసయిత్వా=భయపెట్టి (పెట్టబడి), భాగురాయణేన=భాగురాయణుడి చేత, పర్వతకపుత్రం మలయకేతుః=పర్వతక పుత్రుడు మలయకేతుణ్ణి (మలయకేతువు), అపవాహితః=ఏమారేలాగ చేశాడు (చేయబడ్డాడు), రాక్షసమన్త్రి+పరిగృహేతః+అపి=రాక్షసమంత్రి తెలివికి చిక్కినవాడైనప్పటికి, ఏషః=ఇతడు, వ్యుత్తిష్ఠమానః+అపి= దండెత్తి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ (దండెత్తగలవాడైనా), ప్రజ్ఞయా+నిగ్రహీతుం=నేర్పుతో నిరోధించడానికి (చిక్కకుండా ఆపడానికి), శక్యః+ఖలు=సాధ్యమైనవాడే కద!

అస్య+నిగ్రహాత్=అతడిని నిరోధించడం వల్ల, ప్రకాశాభేవత్=బయటపడనున్న, పర్వతకవధోత్పన్నం=పర్వతక హత్యా కారణంగా పుట్టిన,  రాక్షసస్య+అయశః=రాక్షసమంత్రికి అంటిన అపకీర్తి, ప్రమార్ష్టుమ్=తుడిచి వెయ్యడానికి, న+పునః=వీలుపడనిది మాత్రమే కాదు; స్వ+పర+పక్షయోః=మన, పర పక్షాలలో, అనురక్త+అహరక్త+జన+జిజ్ఞాసయా=ఇష్టులెవరు, ద్వేషించేవారెవరు? అని మనుషుల్ని గుర్తించే (తెలుసుకునే) ఉద్దేశంతో, బహువిధ+దేశభాషా+ఆచార+సంచారవేదినః=అనేకదేశాల, భాషల, ఆచార వ్యవహారాలు ఎరిగిన, నానావ్యంజనాః=అనేక వేషాలు ధరించగల, ప్రణిథయః=గూఢచారులు, ప్రయుక్తాః+చ=పనిలో ఉన్నారు కూడా (ప్రయోగింపబడ్దారు).

కుసుమపుర వాసినామ్=పాటలీపుత్రంలో నివసించేవారిలో, నందామాత్య+సుహృదాః=నందుల మంత్రి రాక్షస మిత్రుల, ప్రచారగతం=నడవడులన్నీ, నిపుణం=నేర్పుగా, అన్విష్యతే+చ=కనిపెట్టడం కూడా (జరుగుతోంది), తత్+తత్+కారణం+ఉత్పాద్య=ఆయా కారణం కల్పించి, కృతక+కృతాం+ఆపాద్యమానాః= (రాజుపట్ల) ఉత్తుత్తి కోపం అభినయించగల, చంద్రగుప్త+సహ+ఉత్థాయినః=(సమయం వస్తే) చంద్రగుప్త పక్షాన పైకి లేవగల, భద్రభట+ప్రభృతయః=భద్రభటుడు మొదలైన, ప్రధాన పురుషాః=ముఖ్య వ్యక్తులు (సిద్ధంగా ఉన్నారు), తత్ర=అంతఃపురంలో, శత్రు+ప్రయుక్తానాం=శత్రువులు ప్రయోగించే, తీక్ష్ణ+రసాదీనాం=తీవ్రమైన విషప్రయోగాలకు, ప్రతివిధానం+ప్రతి=విరుగుడులు చేసే విషయమై, అప్రమాదినః+పరీక్షిత=ప్రమాదం లేని, బాగా పరీక్షింపబడిన, భక్తయః=ప్రభుభక్తులు, క్షితిపతి+ప్రత్యాసన్నాః=చంద్రగుప్తుణ్ణి వెన్నంటి ఉండేలాగా, ఆప్త పురుషాః=ప్రియవ్యక్తులు, నియోజితాః=నియమించబడ్డారు. అస్మాకం+సహాధ్యాయి మిత్రం=మాతో కలిసి చదువుకున్న మిత్రుడు, ఇందుశర్మనామ+బ్రాహ్మణః=ఇందుశర్మ అనే బ్రాహ్మణుడు, తస్తి+చ= ఉన్నాడు కూడా, సః+చ=అతడు కూడా, ఔశనసం+దండనీత్యాం=శుక్రుడి దండనీతిశాస్త్రంలోనూ, చతుఃషష్టిచ+జ్యోతిఃశాస్త్రే=అరవై నాలుగు అంగాలు కల జ్యోతిఃశాస్త్రంలోనూ, పరం+ప్రావీణ్యం+ఉపగతః=సాటిలేని పాండిత్యం సంపాదించినవాడు, సః+క్షపనక+లింగధారి=అతడు క్షపణకుడనే పేరుతో, మయా=నా చేత (నా ప్రోత్సాహంతో), నందవంశవధప్రతిజ్ఞా+అనంతరం=నందకులాన్ని నిర్మూలిస్తాననే ప్రతిజ్ఞకు పూనుకొన తర్వాతనే, కుసుమపురం+ఉపనీయ= పాటలీపుత్రానికి తీసుకురాబడి (నేను పిలుచుకొని రాగా), సర్వ+నందఅమాత్యైః+ సహ=నందమంత్రులందరితోను, సఖ్యా+గ్రాహితః= స్నేహం చేసేలాగ ఏర్పాటు చేయబడ్డాడు.

విశేషతః=ప్రత్యేకించి, రాక్షసః=రాక్షసమంత్రి, తస్మిన్=వాడియందు, సముత్పన్న+విస్రమ్భః=గొప్పనమ్మకం పెట్టుకునే విధంగా చేయబడ్డాడు (నమ్మకంతో ఉన్నాడు), ఇదానీం=ఇప్పుడు, తేనః=వాడు (క్షపణక నామంతో ఉన్న ఇందువర్మ చేత), మహత్+ప్రయోజనం=గొప్ప ప్రయోజనాన్ని, అనుపేష్ఠం+భవేత్=ఆచరించవలసి ఉంది (బడవలసి ఉంది), తత్=అట్టి ఆలోచనలో ఉన్న నేను (నా వల్ల), కించిత్+న+పరిహాస్యతే= కొంచెం కూడా లోటు రానివ్వడం లేదు, వృషలః+ఏవం=చంద్రగుప్తుడే, ప్రధాన ప్రకృతిషు+అస్మాసు=ప్రధానామాత్యుడైన నా మీద (అస్మాసు=మా మీద, పూజ్యతలో బహువచనం), ఆరోపిత+రాజ్యతంత్ర+భారః=రాజ్యం నడిపే భారాన్ని పడజేసి, సతతం=ఎల్లప్పుడూ, ఉదాస్తే=పట్టించుకోనట్టున్నాడు. అథవా=కాకపోతే, అసాధారణైః+అభియోగదుఃఖైః=అసాధ్యంగా మీద పడిన పనుల కష్టభారంతో, అపాకృతం+ఏవ=విడిచి పుచ్చబడిన, రాజ్యం+ఏవ=రాజ్యం మొత్తమే, సుఖయతి=సుఖంగా ఉంటుంది. (ఈ భారం నా మీద బలవంతంగా పడింది, ఈ భారం లేకపోతేనే నాకిష్టం), కుతః=ఎలాగంటావా!… (విను).

వ్యాఖ్య:

చాణక్యుడు, కథలోకి మనల్ని తీసుకువెడుతూనే, రాజ్యం ప్రస్తుత స్థితినీ, దానిని సుస్థిరపరచడానికి తాను చేసిన, చేస్తున్న వ్యూహరచననీ బయటపెట్టడమే కాదు, నందమంత్రి రాక్షసుణ్ణి ఏమార్చి జరుపుతున్న గూఢచర్యాన్ని కూడా బయటపెడుతున్నాడు.

అ) పర్వతకుడిని హతమర్చింది తానే అయినా, రాక్షసుడే అని పాటలీపుత్రంలో ప్రచారం చేసి, పర్వతక పుత్రుడితో రాక్షసమంత్రికి స్నేహం కలిసే అవకాశం కల్పించడం కోసం, రహస్యంగా మలయకేతుడికి చాణక్యుడే చంపించాడని వార్త చేరవేశాడు.

ఆ) స్వపక్ష, పరపక్షాల అభిమానుల్ని తెలుసుకునేందుకు అనుభవజ్ఞులైన గూఢచారుల్ని ఏర్పాటు చేశాడు.

ఇ) నందామాత్యామిత్రుల్ని కనిపెట్టే ఏర్పాటు చేశాడు.

ఈ) భద్రభటాది మిత్రుల్ని మలయకేతువు దగ్గరకు సేవకు పంపించాడు.

ఉ) విషప్రయోగాలకు విరుగుడు చేసేవాళ్ళని నియమించాడు.

ఊ) తన మిత్రుడు ఇందుశర్మను నందమంత్రులకు విశ్వాసపాత్రుణ్ణి చేశాడు.

ఇవన్నీ కూడా కేవలం చాణక్యుడు తన మీద చంద్రగుప్తుడు బలవంతంగా పెట్టిన రాజ్యభార నిర్వహణ కోసం చేశాడు. నిజానికి ఈ భారం నుంచి తప్పుకోవడమే తనకు నిజమైన సుఖమని నమ్మిన వ్యక్తి – అందువల్లనే, రాక్షసమంత్రిని లొంగదీసి, చంద్రగుప్తుడికి మంత్రిని చెయ్యాలని తాపత్రయపడుతున్నాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here