Site icon Sanchika

ముగ్గురు మిత్రులు

[dropcap]”ర[/dropcap]మేష్ నీవు ఎలాగైనా ఐ.ఐ.టిలో ఇంజినీరింగ్ చేయాల్రా! అది నా కోరిక. అందు కోసం నీవు బాగా చదవాలి” అన్నాడు తండ్రి సింహాద్రినాయుడు.

అదో పల్లె. దాని పేరు లక్కిన పల్లె. ఆ పల్లెలో ఉపాధ్యాయుడిగా పని చేస్తూ జీవితం గుడుపుతున్నాడు సింహాద్రినాయుడు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు పేరు రమేష్. చిన్నోడు పేరు సురేష్. తల్లి గాయత్రి డిగ్రీ చదివింది. కాని ఇంటి పనులు చూసుకుంటుంది.

సింహాద్రినాయుడు పిల్లల చదువు కోసం దగ్గరలోని పట్నానికి వెళ్ళిపోయాడు. అక్కడ పేరుగల ఒక ప్రయివేటు స్కూల్‌ల్లో రమేష్‌ను జాయిన్ చేశాడు. రమేష్ మొదట నుంచి చదువులోనూ, ఆటల్లోనూ చురుకుగా ఉండేవాడు.

రమేష్‌కు కాసులో గోపాల్, కిరణ్ అను ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి మెలిసి ఉండేవాళ్ళు.

గోపాల్ ఒక పల్లెటూరు నుంచి చదువుకొనేందుకు వచ్చేవాడు. ఇతను తండ్రి సుబ్బారావు. అతను రైతు. ఉన్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ పిల్లోడిని చదివించాడు. తన కొడుకు బాగా చదువుకొని చిన్న ఉద్యోగం చేసుకుంటే చాలు అని తాపత్రయం పడుతుండేవాడు. కొడుకును కూడా ఆ కోణంలోనే ప్రోత్సహింస్తుండేవాడు. అయితే గోపాల్‌కు ఆటలంటే చాలా ఇష్టం. అందులోను క్రికెట్ అంటే మహా పిచ్చి. ఖాళీ దొరికినప్పుడల్లా బ్యాటు, బంతి పట్టుకొని గ్రౌండులోకి వెళ్ళేవాడు. గోపాల్ తండ్రికి మాత్రం ఇది నచ్చేది కాదు.

ఒకసారి గోపాల్ స్కూల్ స్థాయి క్రికెట్ పోటీలో పాల్గొన్నాడు. బ్యాటింగ్‌లో ఎన్నో మెరుపులు మెరిపించి ప్రేక్షకుల దృష్టిని ఆటగాళ్ల దృష్టిని గురువుల దృష్టిని ఆకర్షించాడు. వాడు నాయకత్వం వహించిన జట్టుకు ప్రథమ బహుమతి లభించింది. అందరి నుండి అభినందనలు పొందాడు.

రమేష్ పదో తరగతి వరకు చదువులో రాణించాడు. క్లాసుకి వాడే ఫస్ట్. గణితంలో మేటి విద్యార్థిగా ఉపాధ్యాయుల ప్రశంసలు పొందాడు. కాని ఇంటర్మీడియట్ కెళ్లిన తర్వాత వాడి చదువు తన్నగిల్లింది. గోపాల్ ప్రభావంతో క్రికెట్ ఆడడం మొదలెట్టాడు. కాలమంతా ఆటతోనే గడిపాడు.

గోపాల్ ఆట తీరును అందరు మెచ్చుకొనేవారు. ఆ నోట ఈనోట గోపాల్ ఆట గురించి ఒక ప్రయివేటు క్రికెట్ క్లబ్ వరకు చేరింది. వాడికి ఆటల్లో శిక్షణ ఇస్తే బాగుంటుందని భావించి ఆ క్లబ్ వారు గోపాల్ తండ్రి వద్దకు వచ్చారు.

“మీ అబ్బాయికి క్రికెట్‌లో శిక్షణ ఇస్తాం. మాతో పంపించండి మీరేమీ డబ్బులు కట్టనవసరంలేదు. అన్నీ మేమే చూసుకుంటాం” అని అన్నారు.

కాని వాళ్ల నాన్న అలా పంపించుటకు అంగీకరించలేదు.

“వీలు పడదు. వాడి చదువు దెబ్బతింటుంది. ఎందుకూ పనికి రాకుండా పోతాడు. వాడు చదువుకోని ఏదో చిన్న ఉద్యోగం సాధిస్తే చాలు. అదే నాకు పదివేలు” అన్నాడు.

ఆ క్లబ్ వాళ్లు వెనుదిరిగారు. గోపాల్ నిరాశ చెందాడు.

“మా నాన్నకి దీని గురించి తెలియక పోవటం వల్ల ఇలా జరిగింది. నేను క్రికెట్ బాగా ఆడుతున్నప్పటికి నన్నుతల్లిదండ్రులు ప్రోత్సాహించలేదు… ప్రోత్సాహించలేదు. నా కెరీర్ ఇంతేనా” అని లోలోపల బాధపడ్డాడు. అటు చదువు వైపు దృష్టి పెట్టలేక, ఇటు ఆటల వైపు దృష్టి పెట్టలేక కాలం గడిపేశాడు.

సింహాద్రినాయుడు తన కొడుక్కి ఐ.ఐ.టిలో సీటు రావాలని ఆశించాడు. కలలు కన్నాడు. డబ్బులు ఖర్చుపెట్టాడు. రమేష్ మొదట్లో అందుకనుగుణంగానే చదువులో రాణించాడు. అయితే పై తరగతులకెళ్ళిన తర్వాత చదువుకంటే క్రికెట్‌పై దృష్టి పెట్టాడు. క్రికెట్‌ను ప్రేమించాడు.

ఒక రోజు రమేష్ తన స్నేహితులతో క్రికెట్ ఆడుచున్నాడు. తన మిత్రుడు వేసిన ఒక కష్టమైన బాల్‌ను సిక్స్‌గా కొట్టాడు. దానికి వాడెంతో మురిసిపోయాడు. తనను తను ఒక జాతీయ ప్లేయర్‌గా ఊహించుకొని ఆనందించాడు. జాతీయ జట్టులో స్థానం సంపాదించాలని ఆరాటపడ్డాడు. ఇంటర్మీడియట్ చివర్లో రమేష్ ఐ.ఐ.టి ప్రవేశానికి సంబంధించిన టెస్ట్ రాసాడు. దాని ఫలితాలు వెలువడ్డాయి. అందులో క్వాలిఫై కాలేదు. సింహాద్రినాయుడికి ఈ వార్త శరాఘాతమైంది. నిరాశ, నిస్పృహలకు లోనయ్యాడు. “నా కొడుకు నన్ను దెబ్బతీశాడు. వాడి కెరీర్‌ను వాడే పాడుచేసుకున్నాడు. వాడి స్థాయికి తగ్గట్లు చదవలేదు. నా ఆశయాన్ని దెబ్బతీశాడు. నన్ను నవ్వులపాలు చేశాడు. ఇప్పుడేమి చేయను… ఏమి చేయను?” అని మనసులో రోదించాడు. కొడుకుని నానావిధాల దూషించాడు. కొద్దిరోజుల కొలుకోలేకపోయాడు.

సింహాద్రినాయుడు తన కొడుకును జె.ఇ.ఇ. మెయిన్సు కోసం మరో ప్రయత్నం చేయమని కోరాడు. అందుకు రమేష్ అంగీకరించాడు. ఒ సంవత్సరం పాటు కృషి చేశాడు.

***

ఒక రోజు కిరణ్ తండ్రి మూర్తిని కలిశాడు సింహాద్రినాయుడు.

“నమస్కారం సార్” అని పలకరించాడు సింహాద్రినాయుడు. అందుకే అదే రీతిలో స్పందించాడు మూర్తి.

“మా అబ్బాయి రమేష్ చెప్పాడు మీ వాడి గురించి. నేను టి.విలో కూడా చూశాను మీ వాడి నైపుణ్యం ప్రదర్శన. మీకు, మీ అబ్బాయిని అభినందనలు. అసలు మీ వాడు షూటింగ్‌లో ప్రపంచ స్థాయి విజేతగా ఎలా ఎదిగాడు. అందుకు ఏ విధమైన కృషి జరిగింది. తదితర అంశాలు చెప్పండి సార్” అన్నాడు సింహాద్రినాయుడు.

“ఆ అంశాల చెప్పే ముందు నేను ముందుగా వాడి పుట్టుక, బాల్యం గురించి చెప్పవలసి ఉంది” అంటూ ఆరంభించాడు మూర్తి.

“బిడ్డ పుట్టగానే అందరు తల్లిదండ్రుల లాగానే మేము ఆనందపడ్డాం. కానీ ఏడాది తిరగానే మా సంతోషం ఆవిరైంది. కిరణ్ పుట్టకతోనే మూగ, చెవుడు అని తెలిసింది. మొదట్లో బాధ పడ్డాం. ఆ తర్వాత మాకు మేము ధైర్యం చెప్పుకున్నాం. బిడ్డలోన స్థైర్యాన్ని నింపాలనుకున్మాము. మా కొడుకును గొప్ప స్థానంలో చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వాడ్ని అందరి పిల్లలాగే పెంచాము. మిగతా పిల్లలలాగే పాఠశాలలో చేర్పించాం. చిన్నప్పటి నుంచే వాడిలో చాలా నైపుణ్యులుండేవి. చక్కని బొమ్మలు గీసేవాడు. పాఠశాల స్థాయిలో క్రీడల్లో రాణించేవాడు. ఇవన్నీ గమనించాం. మిగతా పిల్లల్ని మించి ప్రతిభ ఉందని నమ్మాము. తొమ్మిదేళ్ళ వయసులో కిరణ్ తైక్వాండోలో అద్భత ప్రదర్శన కనబరిచాడు. బ్లాకు బెల్ట్ కూడా సొంతం చేసుకున్నాడు. అయితే షూటింగ్ వైపు రావడం విచిత్రంగా జరిగింది. చిన్నప్పటి నుంచి ఎక్కువగా బొమ్మ తుపాకీలతో ఆడుకోనే కిరణ్ ఒక రోజు సికింద్రాబాద్‌లో గగన్ నారంగ్ ఆరంభించిన గన్ ఫర్ గ్లోరీ అకాడమీ పోస్టర్ చూసి అందులో చేరాలని నిర్ణయించుకున్నాడు. మాతో చెప్పాడు. మేము వాడి మాట కాదనలేక వాడిని ప్రోత్సహించాము. అక్కడ నుండి వాడి జీవిత గమనమే మారిపోయింది. ఓసారి నాగపూర్ నగరంలో ఎయిర్ రైఫిల్ విభాగంలో జూనియర్ ప్రపంచ కప్ పోటీలు జరిగాయి. కిరణ్ కూడా పాల్గొన్నాడు. పతకం కోసం షూటర్లు పోటీపడుతున్నారు. వారంతా శరీరక లోపం లేని వారు. ప్రత్యర్థులను తలదన్నే అద్భుత ప్రదర్శన చేసి చాంపియన్‌గా స్వర్ణం సాధిచాడు కిరణ్. స్టేడియం హర్షధ్వానాలతో మారుమోగింది” అని మూర్తి ఆనందబాష్పాలు వదులుతూ ముగించాడు.

“ఇంతకూ మీ అబ్బాయి రమేశ్ ఏమి చేస్తున్నాడు?” అడిగాడు మూర్తి.

“మా వాడు లక్నోలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్‌లో చేరాడు. వాడికింకా క్రికెడ్ పిచ్చిపోలేదు. అందుకే ఈ మధ్య వాడి కోరికను కాదనక స్థానిక క్రికెట్ శిక్షణా క్లబ్‌లో చేర్చాను” అన్నాడు సింహాద్రినాయుడు.

“ఇప్పటికైనా పిల్లల మనోభావాలను గౌరవించినందుకు ధన్యవాదాలు” అన్నాడు మూర్తి. తల దించుకున్నాడు సింహాద్రినాయుడు.

“పిల్లలలో నైపుణ్యాలను గుర్తించి తదనుగుణంగా ప్రోత్సహించడమే తల్లిదండ్రుల కర్తవ్యం” అని మూర్తి అన్నాడు.

***

గోపాల్ తన కిష్టమైన క్రికెట్ ఆడేందుకు తగిన ప్రోత్సాహం ఇంటి దగ్గర నుంచి లేనందున అటు ఆటపైనగాని ఇటు చదువుపైనగాని శ్రద్ధ చూపక ఇంటర్మీడియట్ మధ్యలో ఆపేశాడు. చెడు తిరుగుళ్లకు అలవాటయ్యాడు. పొలం పని చేసుకున్నాడు. తర్వాత కొంత కాలానికి పెళ్లి చేసేశాడు వాళ్ల నాన్న.

***

ఆ రోజు లక్కినపల్లి ఊరిలో అమ్మవారి జాతర జరిగింది. రమేష్ ఆహ్వానం మేరకు మిత్రులు గోపాల్, కిరణ్‌లు అక్కడ కొచ్చారు. ముగ్గురు మిత్రులు అక్కడ కలుసుకున్నారు. ఆనందంతో ఒకరినొకరు పలకరించుకన్నారు.

“ఏరా గోపాల్ నీ క్రికెట్ ఎంతవరకొచ్చింది?” అని అడిగాడు రమేష్.

“తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకపోతే ఎంత ఆసక్తి ఉన్నా, ఎంత నైపుణ్యమున్నా వృథాయేన్రా” అని నిట్టూర్చాడు గోపాల్.

“ఒకప్పుడు మా ఇద్దరి కంటే క్రికెట్టులో రాణించేవాడివి. ఇలా అయ్యిందేమిట్రా” అని సానుభూతి చూపాడు రమేష్.

“నీ పరిస్థితి ఏమిట్రా?” అన్నడు గోపాల్ రమేష్ వైపు చూస్తూ.

“బెంగుళూరులో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. క్రికెట్‌లో శిక్షణ తీసుకున్నప్పటికీ అప్పటికే నా వయసు మించిపోవడం వల్ల అనుకున్న స్థాయికి ఎదగలేకపోయాన్రా” అన్నాడు రమేష్.

‘మన ముగ్గురం ఇలా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది’ అనే భావాన్ని వ్యక్తపరుస్తూ చేతి మూడు వేళ్ళు పట్టుకుని మిత్రులకు చూపుతూ సంజ్ఞ చేస్తూ ఇద్దరి మిత్రుల భుజాలపై చేతులు వేశాడు కిరణ్.

ముగ్గురు హృదయాలు సంతోషంతో ఉప్పొంగాయి.

Exit mobile version