[dropcap]న[/dropcap]మ్మలేక, గాలివీచడం ఆగిపోయిందనుకుంటావ్ గానీ
చెట్ల నిశ్శబ్దాన్ని చదవడం మరచిపోతావ్.
నీకుగా ఒక తొర్రలో ఉడుతలు తిరుగాడడం చూడలేవు.
ఏ పక్షిగూడుకీ చూపుని తిప్పలేవు.
పిపాసీ,..
రాలిపడిన ఆకులన్నీ
విషాదాన్ని రగిలిస్తున్నాయని
దూరం జరగలేవు.
శ్రద్ధగా గుండెని పరికిస్తే
తేమ ఇంకిన డొల్లచప్పుడే కదూ.
మనసు, పెచ్చులూడిన బెరడూ అని
మస్తిష్కం, వేర్లూనిన ఆలోచనలూ
అన్నీ అన్నీ ఒట్టి కట్టెల మూటలేననీ
ఇప్పుడు తెలిసిపోయాక
ఉండీ ఉండని చెట్టు కదలకపోతేనేం.