Site icon Sanchika

ముగింపు లేని ప్రహసనం

[dropcap]ఏ[/dropcap]మిటో తెలియదు గాని, ఈ మధ్య ‘పండుగ’ అనే మాట వింటేనే గుండెలు దడదడలాడిపోతున్నాయి. ఏదైనా గుండె జబ్బేమో అని, కార్డియాలజిస్ట్ అయిన మా మరిదికి చూపించుకున్నాను. ఏమీ లేదు పొమ్మన్నాడు. అదెలా కుదురుతుంది? కానీ, లక్ష్మణుడికి సీతంటే ఎంత గౌరవమో, అతనికి నేనంటే అంతే గౌరవం. ఊహూఁ, అందుకని, నేను నమ్మే అందమైన అబద్ధాన్ని నాకు చెప్పి, మా వారికి వేరే విషయం అతను చెప్పుంటాడని అనుకోను.

ఈ రోగానికి పేరేమిటో గాని, ఎవరైనా పండుగ ముచ్చట్లు మొదలెట్టారంటే, నాకు విసుగు, కోపం కలిసిన ఓ విచిత్రమైన అనుభూతి వచ్చి, వెంటనే అక్కణ్ణుండి నన్ను ‘వాకౌట్’ చేసేయమని ఉసిగొలుపుతుంది. ఎవరింటికైనా వెళ్ళామంటే, అమర్యాదయినా అది సాధ్యమే; ఆహాఁ, చేస్తానని కాదు.

మనింట్లో మనం వాకౌట్ చేయడమేమిటి, చోద్యం కాకపోతే? వచ్చిన వాళ్ళని ఆ సోది అపమన్నా, ఆపనందుకు తరిమికొట్టినా, ‘హోస్ట్’ గా నా పాత్రౌచిత్యం దెబ్బ తింటుందిగా? మొత్తానికి ‘హోస్ట్’ గా అయినా, ‘ఘోస్ట్’, ఓ సారీ, ‘గెస్ట్’ గా అయినా నా పంతాన్ని నెగ్గించునే పరిస్థితి లేదు గనుక మనసు బాధపడి, ఆ బాధని మింగలేక, కక్కలేక బహుశః నా గుండెలపై కసి తీర్చుకుని ఉండుంటుంది.

పొందితే అనాయాస మరణం పొందాలి గాని, ఈ దడ పూరిత మరణం నాకొద్దనిపించి, సంతోషం వెతుక్కునేందుకు మా మరిది చెప్పిన ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాను. ఆయన నన్ను మాటల్లో పెట్టి, నాకు ఇష్టమైన పండుగేమిటని అడిగారు. చిన్న పిల్లలా నాకు దీపావళి అంటే ఇష్టమని చెప్తూ, ఏ వయసులో టపాసులు కాల్చడం నేర్చుకున్నానో కూడా చెప్పాను.

“సంక్రాంతి రాబోతోంది కదా! మరి మీకు చక్కెర పొంగలి, బియ్యపు పొంగలి వండడం ఇష్టం లేదా?” అని అడిగారు. “నేను పుట్టి పెరిగిందంతా పట్నంలోనేనండీ! అందుకని నాకు సంబంధించినంత వరకూ అది పెద్ద ముగ్గులేసే పండుగ మాత్రమే!” అన్నాను. “నో, నో, అలా కొట్టి పారేయకండీ! ఎప్పుడైనా పల్లెటూళ్ళో సంక్రాంతి సంబరాలు చూశారా?” అడిగారు ఆయన. “సినిమాలలో చూశానండీ”, జవాబిచ్చాను.

“అలా కాదు; లైవ్‌లో చూడాలి. ఈ మాటు నేను సకుటుంబ సమేతంగా సంక్రాంతికి మా ఊరు వెళ్తాను. మీ కుటుంబం, మీ మరిదిగారి కుటుంబం కూడా వస్తే సంతోషం”, అని ఆయన ఆహ్వానించారు. ఎంత మరిది ఫ్రెండ్ అయితే మాత్రం, పిలుస్తే, ఎగిరి గంతేసి వెళ్ళిపోతామా? నా ఆలోచనలకి బ్రేక్ వేస్తూ, “బహుశః మీకు పండుగలంటే ఉండే భయం పోయి, ఉత్సాహం వస్తుందేమో?” అన్నారాయన.

ఆలోచనలో పడ్డాను. ఇంట్లో పని మనిషి, వంట మనిషి, చాకలి – ఇలా బోలెడు మంది సహాయంతో ఇల్లు నడిపిస్తున్న ఉద్యోగస్థురాలిని. అక్కడ ఇంటి పనుల్లోనూ, పై పనుల్లోనూ ఓ చెయ్యి వేయకపోతే ఎలా? పైగా, ప్రతీ ఇంట్లోనూ కొన్ని పద్ధతులుంటాయి. తెలిసో తెలియకో వాటిని మీరితే బాగుండదు.

“ఏమిటీ, ‘పల్లెటూళ్ళలో కట్టుబాట్లు ఎక్కువ, నేను అడ్జస్ట్ అవగలనా?’ అని ఆలోచిస్తున్నారా?” అని అడిగారు ఆ మైండ్ రీడర్. “మీకెలా తెలుసు?” అనేశాను అనాలోచితంగా. ఆయన నవ్వి, “మీ మనసులో ఏదో భయం ఉంది. నిర్భయంగా నాతో పంచుకోండి”, అన్నారు.

నా మనసు దీపావళి పండుగ వైపు వెనుదిరిగింది. నా ఫ్లాష్‌బాక్‌ని డాక్టర్‌కి వినిపించింది.

$$$

ఉండేది మద్రాసు(చెన్నై)లో కాబట్టి అక్కడ దీపావళికి అందరూ తమ శక్తి కొద్దీ చుట్టుపక్కల వాళ్ళతో స్వీట్లు, హాట్లూ పంచుకుంటారు. వాటిని ఇంట్లో తయారు చేసుకునేవారు అప్పుడప్పుడు వారం రోజుల ముందే తమ ప్రయత్నాలు మొదలు పెడతారు. ఏదో ఇద్దరం ఉద్యోగాలు వెలగబెడుతున్నాం కదా అని దీపావళి పాకేజ్‌ని స్వీట్‌షాప్‌లో కొని పంచేసేవాళ్ళం.

ఎంతమందికి ఇవ్వదలుచుకుంటే అంత పెద్ద పాకేజ్, అంత ఎక్కువ ఖర్చూను. పిండి కొద్దీ రొట్టె గనుక, మిగిలిన వాళ్ళు ఇంట్లో చేశారు, మనమెందుకు ఖరీదైనవి ఇవ్వాలని పంతం పెట్టుకోకుండా, కక్కుర్తి పడకుండా మంచి మంచి పాకేజీలు కృష్ణా స్వీట్స్‌లోనో, గ్రాండ్ స్వీట్స్‌లోనో కొని కాలనీ అంతా పంచేవాళ్ళం.

ఈ మాటు కరోనా రావడం వల్ల బయట కొని పంచే ధైర్యం నాకు లేకపోయింది. పైగా, కాలనీ కమిటీ వాళ్ళు బయట కొన్న తినుబండారాలు పంచవద్దని కోరారు కూడా! దొరికిన సమయంలో ఎన్ని ఐటెమ్స్ కుదిరితే అన్నే చేద్దామని నేను మా వంటవాడితో పూనుకున్నాను. జంతికలు, రిబ్బన్ పకోడా, తెలుగు వారికి ఇష్టమైన బందర్ లడ్డూ చేద్దామని డిసైడ్ అయ్యాం.

ఇన్నేళ్ళుగా మా నిర్లక్ష్యానికి గురైన జంతికల గొట్టం మొహం మాడ్చుకుంది. ఆ మాడ్పు (దాన్ని ‘చిలుము’ అంటారని ‘స్వర్ణ కమలం’ చూసిన వాళ్ళందరికీ ఎరుకని నేను వేరే చెప్పనక్కరలేదు అనుకుంటా!)ని తగ్గించేసరికి ఓ అరకిలో పై చిలుకు చింతపండు ‘స్వాహా’ అయిపోయింది.

గట్టిగా చెప్పాలంటే నాకు కించిత్ భయం కూడా వేసింది, ఈ డొక్కు గొట్టాన్ని వాడి, తయారు చేసిన చిరుతిళ్ళ వల్ల మా చుట్టుపక్కవల వాళ్ళకి సుస్తీ గిస్తీ ఏమీ చేయదు కదా, అని. ఏమైతేనేం, ఓ పట్టు వదలని విక్రమార్కురాలిలా, మా పనమ్మాయి శాంతి, పది-పదిహేను సార్లు తోమి, ఎండబెట్టి, తోమి, ఎండబెట్టి, ఎలాగో అలాగ ఆ పారంపర్య గొట్టపు మేని బంగరు ఛాయని పునరుద్ధరించింది.

లైన్ క్లియర్ అవడంతో తరువాతి పనుల్లో పడ్డాం. రోజూ చపాతీలు చేసే చేతికి జంతికల పిండి కలపడం పెద్ద కష్టం కాకూడదని విష్ణు బియ్యపు పిండిని మెత్తగా కలుపుతున్నప్పుడు నేను తల దూర్చలేదు. ఉప్పు, ఇంగువ, జీలకర్ర దగ్గరుండి కావలసిన పాళ్ళలో కలిపించాను.

గొట్టంలో పిండి కూరి, ఒక వాయి వేయిస్తూ, జంతికలని ‘సిమ్’‌లో పెట్టి వేయించాలని, ‘హై’లో పెడితే, గట్టి పడతాయని, రంగు బ్రౌన్‌లోకి మారకముందే తీసెయ్యాలని చూపించి, మిగిలినవి అతణ్ణి వేయమన్నాను. వంటిల్లు అంతా ఇంగువ ఘుమఘుమలతో నిండిపోతే వీరానందం పొందాను నేను.

***

రిబ్బన్ పకోడా పిండి కూడా మా వాడు కలుపుతున్నప్పుడు నేను ఉప్పు, కారం, వాము, ఇంగువ వరకే జోక్యం చేసుకున్నాను. విషయం అర్థం చేసుకున్న విష్ణు, బిళ్ళ మార్చి, పిండి కూరి, పరపరా వేయించేశాడు. కమ్మని వాసన మిమ్మల్ని కమ్ముకుంది. విజయ గర్వంతో మేమిద్దరం ఆ సువాసన పీల్చుకున్నాం.

***

బందర్ లడ్డూ పత్తిపనితో కూడినది గనుక చేసినవి రుచి చూసే టైమ్ కూడా లేదు. సెనగపిండి కలిపి జంతికలని చేసుకుని, వాటిని మిక్సీలో పిండి కొట్టి, దాన్ని జల్లించాం. పిండి అటూ-ఇటూ పడేసరికి మా వాడు సణుగుడు మొదలెట్టాడు. “అమ్మా, దీన్ని చేయడానికి ఎంత టైమ్ పట్టుద్దో, క్లీనింగ్ కి కూడా అంతే పట్టుద్ది. తల ప్రాణం తోకలోకి వచ్చేసింది”, అని గొణిగాడు. “డిన్నర్ తర్వాత నేను సాయం చేస్తానులే”, అని ఓపిక లేకపోయినా మాటివ్వక తప్పలేదు.

ముందు తీగ పాకం కోసం, ఆ తరువాత జల్లెడ పట్టిన పిండిని కలపడం కోసం గరిటె తిప్పడానికి, భుజం గట్టిగా పట్టేసి, పై ప్రాణాలు పైనే పోయేలా చేసింది. మా విష్ణు తాను చూసుకుంటానని, నన్ను వెళ్ళి రెస్ట్ తీసుకోమన్నాడు. యాలకు పొడి తీసేసే ముందు వేసి, బాగా కలిసేలా చూడమని చెప్పి, బయటకి వచ్చాను. కొంతసేపటికి ఒక ప్లేట్లో మినప సున్నుండల్లాంటి గుండ్రాలు, రిబ్బన్ పకోడాలు, జంతికలు పెట్టి, రుచి చూడమని తెచ్చాడు విష్ణు. అలసి, సొలసి ఉన్న నేను ఆశ్చర్యంగా, “మనం చేసినవి లడ్డూలు కదా! సున్నుండలు కావు కదా!” అన్నాను.

“సారీ అమ్మా, మధ్యలో ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉండిపోయి, రంగు మారడం గమనించలేదు”, అన్నాడు. రేపు జనాలకిస్తే, వాళ్ళు దాన్ని చూసి, ‘బంగాళా భౌ భౌ’ అనో, ‘అరటిపండు లంబా లంబా’, అనో పొరబడే ప్రమాదముంది కదా! నా పరువేం కాను? వెయిట్, వెయిట్, మా కాలనీలో తెలుగు వాళ్ళు ఎవరూ లేరు. ఉన్న వాళ్ళు మెగా స్టార్ సినిమాయే చూస్తే, గీస్తే, యాక్షన్ సినిమాలు చూస్తారు గాని ‘చంటబ్బాయ్’ అనే కామెడీ చూస్తారని, చూసుంటారనీ అనుకోను. థాంక్ గాడ్, ఈ గండం గడిచింది.

‘దేవుడా, రుచి బాగుండాలి’, అనుకుంటూ లడ్డూ ముక్కని నోట్లో పెట్టుకుంటే ఉగాది పచ్చడిలోని మూడు రుచులు గోచరించాయి – తీపి, చేదు, ఉప్పు. తీపి ఉండాల్సిన రుచి. ఉండీ ఉండనట్టున్న చేదు, రంగు మారడం వల్ల వచ్చిన రుచి. మరి ఉప్పో? విష్ణుని అదే అడిగాను. “సర్ప్రైజ్ అమ్మా”, అన్నాడు. అయోమయంగా చూస్తున్న నాతో, “మీరు స్నాక్స్‌లో వేసిన ఉప్పుని గమనించాను. జంతికలు ఉప్పు లేకుండా బాగోవని నేనే కలిపేశా!” అని గొప్ప కొట్టాడు.

“స్వీట్లో ఉప్పా? ఇదేమన్నా టూత్ పేస్ట్ ప్రకటనా?” అని అరిచినంత పనిచేశాను. “ఉప్పులేనిదే రుచి ఉండదని మా బామ్మ చెప్పేదండీ. ఉప్పుని ప్రేమించినట్టు, ఒక రాజకుమార్తె తన తండ్రిని ప్రేమించిందంట కదండీ”, అని గుణసుందరి కథ నాకు చెప్పబోయాడు. నేను ఉదాసీనంగా, “ఇంట్లో గులాబ్ జామూన్ పాకెట్ ఉందా?” అని అడిగాను. విష్ణు చెక్ చేయడానికి వంటింట్లోకి వెళ్ళినప్పుడు, ఒక జంతిక నోట్లో వేసుకున్నాను.

‘కొరకరాని కొయ్య’ అనే నానుడికి నిగూడార్థం వేరే ఉన్నా కూడా, ఇటువంటి జంతికల నుండే పుట్టుంటుంది అని నేను గ్రహించాను. చిన్నప్పుడు మా మామ్మ గారు చెప్పేవారు, నావి ఎలుక పళ్ళని. అందుకే కొరక గలిగాను.

“మొన్నామధ్యన ఎప్పుడో ఒక సగం వాడగా మిగిలిన గులాబ్ జామూన్ ఇదిగో, ఇలా రబ్బర్ బ్యాండ్ వేసి ఉంది అమ్మా. ఎక్స్‌పైరీకి మూడు నెలలున్నాయి”, పాకెట్ ని చూపిస్తూ అన్నాడు, నా మనసు తెలిసిన విష్ణు. సరే అది నువ్వు చేసేస్తావా, నన్నో చెయ్యి వెయ్యమంటావా?” విసుగ్గా అడిగాను. “నేను చేస్తానమ్మా”, అన్నాడు అతను.

విష్ణు గులాబ్ జామూన్ తయ్యారు చేస్తుండగా, రిబ్బన్ పకోడాని నేను రుచి చూశాను. ఇది కూడా తగులడింది, కానీ మెత్తగా! కర్మ కాలడం అంటే ఇదేనేమో! కారం నిండిన నోరు చుర్రుమంది. మంచి నీళ్ళు తాగి, చిందిన సెనగపిండిని నేను శుభ్రం చేయడం మొదలెట్టిన కొద్దిసేపటికే విష్ణు, “అయ్యో”, అనో గావుకేక పెట్టాడు. ‘కొంపదీసి వీడి మీద నూనె చిందలేదు కదా’, అని భయపడుతూనే అటు తిరిగాను.

విష్ణు సిరప్‌లో వేసిన గోళీకాయల్లాంటి గులాబ్ జామూన్ లని చూపిస్తూ, “పాకం ఊరి పెద్దవి అవాలి కదమ్మా.. అలా అవడం లేదు”, అన్నాడు. ఒకటి తీసి దాన్ని ‘ఉఫ్.. ఉఫ్’ అని ఊదుకుని స్పూన్ తో గుచ్చి చూశాను. లాభం లేదు, జంధ్యాల గారు వెనుకటికి చెప్పినట్టు, ఆ గులాబ్ జామూన్ మేకులు కొట్టుకోవడానికి పనికి వచ్చేటట్టుంది.

ముట్టుకుని చూశాను. అలాగే ఉంది. గోకి చూశాను – ఉడికిన బంగాళాదుంపకి తోలు ఊడి వచ్చినట్టు, గులాబ్ జామూన్ తాలూకు పై పెచ్చు, లోపలి గట్టి పిండానికి విడాకులిచ్చింది. విష్ణు వారిస్తున్నా వినకుండా, రుచి చూశాను. బాగానే ఉంది. మరి, ఆ గట్టి పిండం ఎందుకు మెత్తబడనట్టు? చేసే ప్రయోగమేదో నా మీదే చేసేసుకోవాలి అనిపించి, దాన్ని కొరికాను. పచ్చి పచ్చిగా ఉంది. మరి సిరప్ ఎలా ఇంకుతుంది?

అప్పుడు బల్బ్ వెలిగింది, పెట్టిన ఆ రబ్బర్ బ్యాండ్ వదులయ్యి, పిండి పాడయ్యిందేమోనని. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం, ఆ బుద్ధి ముందే ఉండలిగా! నా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయ్యి, నోరంతా తీపి పోయి వగరుగా అనిపించింది. “ఏం చేద్దామమ్మా వీటితో?” అడిగాడు విష్ణు. “మట్టిలో వెయ్యి; చీమలు, పురుగులూ తింటాయి”, అన్నాను.

అప్పుడే నా చిన్నప్పటి పాఠమొకటి గుర్తొచ్చింది. వలలోంచి జారిపడిన చేపను తలచుకున్న జాలరి, ప్రాణ దానం చేశానని అనుకుంటాడట. అలాగే రుచి కుదరని స్వీట్లతో నేను క్రిమి కీటకాదులకి విందు భోజనం పెట్టానని అనుకోవాలా? టేస్టీగా ఉండుంటే, ‘మాయాబజార్’ లో ఘటోత్కచుడిలా లాగించేద్దును కదా!

నా ఆలోచనలు ఇలా బాధావృతమై ఉండి, అసలు విషయాన్ని మరచిపోయాయి. మరుసటి రోజే దీపావళి. మరి, చుట్టుపక్కల వాళ్లకేమి ఇస్తాం? ఎవరూ బయట కొన్నవి పంచకూడదని డిసైడ్ అయ్యాం కదా! మా కాలనీ వాట్సాప్ గ్రూప్ లో ఇలా ఓ మెసేజ్ పెట్టాను:

‘అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీకో చప్పటి వార్త- పిల్లలకీ, పెద్దలకీ కూడా ఇష్టమైన పిండివంటలు చేశాను. స్వీట్లో ఉప్పు కలిసింది. ఒక సేవరీ అతి గట్టిగాను, మరొకటి కాస్త మెత్తగాను, కారంగానూ వచ్చాయి. అన్నింట్లోనూ రుచి బాగానే ఉంది. అయినా బ్రహ్మాండంగా లేదు. మిమ్మల్ని నిరాశ పరుస్తున్నందుకు క్షమాపణలు.’

ఇక చూసుకోవాలి, ఓదార్పు మెసేజ్‌లు వెల్లువెత్తాయి. ‘‘జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి’, అన్నారు పెద్దలు. మీకు నచ్చినది మరొకళ్ళకి నోరూరించేట్టుగా ఉండవచ్చు. బాధ పడకండి’, అని ఒకరన్నారు. ‘ప్రతీ ఏడూ, నేను తయారు చేస్తున్న యావరేజ్ చిరుతిళ్ళు మీరు మెచ్చుకుని తినడం లేదూ? నా పాక శాస్త్ర ప్రావీణ్యం ఏ పాటిదో నాకు తెలుసు. మీ ఇంట్లో రుచిలేని తిళ్ళు కూడా బాగుంటాయి లెండి’, అని మరొకరు, ఇలా అందరూ ఊరడించే సరికి నేను మళ్ళీ మామూలు మనిషినయ్యాను.

$$$

“సింపుల్. మీ ప్రాబ్లం అర్థం అయిపోయింది. అలవాటు లేని పని, అనుకోని పరాజయం – ఈ రెండూ మిమ్మల్ని కృంగదీశాయి. మందులు వేసుకుంటే చాలు, మీ దడ పారిపోతుంది. అన్ని పండుగలూ ఒకలాగే గడవవు కదా! డోంట్ వర్రీ, మీరంతా మా ఊరికి రండి. పిల్లలకి మీ కాలపు ఆటలు, అలవాట్లు నేర్పించండి చాలు”, అన్నారు సైకియాట్రిస్ట్.

***

పచ్చని పొలాలు దాటిన తరువాత ఉన్న లంకంత ఇల్లు డాక్టర్ గారిది. ఇంటి ముందు బోలెడంత చోటుంది గనుక పేడనీళ్ళ కళ్ళాపి జల్లించి, పిల్లలందరినీ ముగ్గులు వేయడంలోనూ, వాటికి రంగులు అద్దడంలోనూ ఎంగేజ్ చేశాను. కుండలోంచి బయటికి వస్తున్న పొంగలి, రథం, చెఱుకు గడలు – ఇలా ఈ పండుగకి సరిపడే ముగ్గులు ఇంటి చుట్టూతా పెట్టేశాం. మా చిన్నప్పుడు ఆడిన ‘బెచ్చాట’ ఆడమని వాళ్ళని ప్రోత్సహించాను. కాస్సేపు అలా పొలాల వెంబడి తిరిగి, వాటర్ టాంక్ లో మేమంతా సేద తీరాం.

వంటింట్లోంచి వస్తున్న ఘుమఘుమలు మా ఆకలి పెంచి, భోజనపు పిలుపు కోసం ఎదురుచూసేలా చేశాయి. డాక్టర్ గారి భార్య వడ్డిస్తూ, “సారీ అండీ, బూరెల్లో పూర్ణం చీదేసింది. అప్పాలలో తీపి తక్కువయ్యింది. పులిహోరేమో కొంచెం బిరుసూ, పులుపూ ఎక్కింది. రుచికి మాత్రం అన్నీ బాగానే ఉన్నాయి సుమండీ!” అని, నొచ్చుకున్నారు. “ఫరవాలేదు లెండి, ఇంత మందికి వంట చెయ్యాలంటే, కొలతలు కాస్త అటూ-ఇటూ అవుతాయి కదా”, అని ఆవిడకి ధైర్యం చెప్పాను.

అప్పుడే నాకు అనిపించింది, తిళ్ళలో కాస్త అటూ-ఇటూ అవడమన్నది ఒక ముగింపు లేని ప్రహసనమని, వండే వాడికే ఆ బాధ అర్థమౌతుందని.

***ఇప్పటికి సమాప్తం***

Exit mobile version