ముందుకు రానీ

14
52

ప్రపంచ మానవ
స్వతంత్ర సమాజమా
ఎక్కడ.. నువ్వెక్కడ?
పీడిత ప్రజల నీడను వీడని
నిరంకుశమా కుశలమా నరక కూపమా?
పరోపకారం పరమ ధర్మం
యుగాలనీతి గతాల ఖ్యాతి
ఏమైంది? ఎటు పోయింది?
దేవుడి సేవలో జీవుడు బలి
జీవుడి సేవలో దేవుడు బలి
బలి.. బలి.. బలి..
పర మతాల మనుషుల నాశనం చేయని
ప్రవక్త.. ఎక్కడ? నువ్వెక్కడ?
ఎవ్వరు? అదెవ్వరు?
మహిమాన్వితుడు – మృత్యుంజయుడు
కారణజన్ముడు – కాలరూపుడు
ఎక్కడ ఎక్కడ అదెక్కడ
వెట్టి చాకిరి వెట్టి విధానం
బానిసత్వం మానసిక దాస్యం
చేయనిదెవరు? చేస్తుందెవరు?
ఎందుకు? ఎందుకు? మీకెందుకు?
స్వర్గం, నరకం, వరం, శాపం
పాపం, పుణ్యం, ప్రలోభం
భూత ప్రేత పిశాచ శాకిని
డాకిని, యక్షి..
గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుష
పాలసముద్రం – పెరుగు నది
ఏది ఏది కనపడదేది
కావాలా.. కావాలా..
చిలక జోస్యం.. రేఖా శాస్త్రం
శాస్త్ర ప్రమాణం కానీ శాస్త్రం
చాలు చాలు ఇక ‘సోది’ చాలు
ఆటవిక సమాజపు ‘ఆగాలు’ చాలు
ఆధునిక సమాజపు ‘యాగాలు’ చాలు
కర్మవాదం – మర్మవాదం
తపో శక్తి – వర ప్రసాదం
జపతాపాల జాడ్యం పోనీ
పోనీ పోనీ పాడైపోని
భ్రమలు – బ్రాంతులు
దోపిడి – దుర్మార్గం
సకల వివక్షలు – చీలికలు
అణచివేతలు – అల్లకల్లోలాలు
మూఢనమ్మకం – అజ్ఞానం
ఉన్మాదం – ఉగ్రవాదం
నయవంచన – వికృత చేష్టలు
నీచ సంస్కృతి నాశనం కానీ
రాత్రి పగలు – ఎండా వాన
రైతు కూలీ కర్షక కార్మిక
పొలం, పరిశ్రమ, గని
కానీ కానీ కాయా కష్టం కానీ
చెమట చుక్కల ఏరులు పారనీ
నవ సమాజ శ్రేయస్సు దేయం కానీ
రానీ రానీ
ప్రపంచ మానవ
స్వతంత్ర సమాజం ముందుకు రానీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here