Site icon Sanchika

రంగుల హేల -5: ముందుమాటలూ – మొట్టికాయలూ

[box type=’note’ fontsize=’16’] “ఆత్మీయ పలుకు కోసం అభిమానంతో వచ్చి అడిగిన రచయితల పరిస్థితి ఇలా పరి పరి విధాలు. పేనుకు ఇచ్చిన పెత్తనం మాదిరి రాసే ఇటువంటి ‘ముందుమాటలు’ తమకు అవసరమా అని రచయితలు ఆలోచించుకోవాలి” అంటున్నారు అల్లూరి గౌరీలక్ష్మిరంగుల హేల -5: ముందుమాటలూ – మొట్టి కాయలూ” ఫీచర్‌లో. [/box]

[dropcap]”మీ[/dropcap]కు తెలుసా! ఈ అమ్మాయి ఎంత బాగా పాడుతుందో! ఓ పాట పాడమ్మా!” అంటూ స్టేజి మీద పక్కనే నిలబడి ధైర్యం ఇచ్చే టీచర్స్ లాంటివారు పుస్తకాలకు ముందుమాటలు రాసేవారు.

నవల, కథ, కవిత్వం,నాటకం ఇంకా అనేకమైన  ప్రక్రియలకు సంబంధించిన ఏదయినా ముద్రణలో  పుస్తకంగా వెలువడేటప్పుడు సాహిత్య రంగంలో సీనియర్లూ, లబ్ధప్రతిష్ఠులూ ముందుమాట రాస్తుంటారు.  తమకు గురుభావం ఉన్న వారి దగ్గరికి వెళ్లి రచయితలు అడిగి రాయించుకుంటూ ఉంటారు. పాఠకులు ముందుమాట ఎవరు రాసారో చూసి చదవడం మొదలు పెడుతుంటారు.

ఒకప్పుడు ఇలా పరిచయం రాసేవారు ఓపికగా పుస్తకం అంతా చదివి, అది రచించిన వారి హృదయం, మేధస్సూ ఆకళింపు చేసుకుని రచయితనీ ఆపై ఆ రచననీ ప్రేమగా పరిచయం చేసేవారు. అతని సత్తాని గుర్తించి పట్టుకుని దాన్ని వివరంగా విశ్లేషించి  పాఠకుల్ని రచన చదవడానికి ఉద్యుక్తుల్ని చేసేవారు. రచనలో మెరుపుల్నీ, చమక్కుల్నీ ప్రశంసించేవారు. పుస్తకం లోని విషయాన్ని నిగూఢంగా చెప్పి చదువరికి ఉత్సుకత కలిగించేట్టు రాసేవారు.

రచయితకి సహృదయపు సలహాలిస్తూ, భవిష్యత్తులో అతనింకా మంచి రచనలు చెయ్యడానికి  లోతైన అధ్యయనం చెయ్యమని, కొత్త వస్తువుల్ని తీసుకోమని ఒకట్రెండు సలహాలిచ్చేవారు. ఆ పై చివరిగా రచయిత చిన్న వాళ్ళైతే వారిని  దీవించడం, ప్రోత్సహించడం, సమాన స్థాయి వారైతే అభినందించడం ఆనవాయితీ.

ప్రస్తుత బిజీ, బిజీ ప్రపంచంలో పలు వ్యాపకాలవల్ల  సాహితీ రంగంలో ఉండే వారికి కూడా తగిన సమయమూ , ఓపికా కొరవడుతున్నాయి. ఇతరత్రా వత్తిడుల వల్ల సహృదయమూ ఉండట్లేదు. అధికమైన పనుల వల్ల కర్టసీ పోతున్నది. మునుపటిలా శ్రద్దగా పూజలు చేయించే పండిత పురోహితులు  కరువుగా ఉన్న  చందంగానే ముందు మాటలు రాసే వారిలో శ్రద్ధ లోపిస్తోంది. వాళ్ళు పుస్తకం పూర్తిగా చదవట్లేదు.  ముందుమాటలు ఒక మొక్కుబడిలా తయారవుతున్నాయి. రచన చదివి జీర్ణించుకునే సహనమూ, రచయిత ఆత్మ పట్టుకుని రాసే శక్తి  లేని వారు ఈ మధ్య మరీ ఎక్కువయ్యారు.

ఇంకొందరి పోకడలు విచిత్రంగా ఉంటున్నాయి. కొందరు ప్రతి కథ పేరూ సబ్ హెడ్డింగ్‌లా  రాసి ఆ కథ రాస్తున్నారు. ఇంకొందరు తమ స్వీయ ప్రతిభ వెల్లడించి రచయితని చిన్నబుచ్చుతున్నారు. కొంతమంది థీమ్ అంతా చెప్పేసి పాఠకులకి సస్పెన్స్ లేకుండా చేస్తున్నారు. ఇంకా కొందరు పది సార్లు ఇంటి చుట్టూ తిప్పించుకుని, అయిష్టంగా రాసి రచయితనీ, చదువరినీ నిరుత్సాహపరుస్తున్నారు. కొందరు కఠినాత్ములు ఈ బుక్ చదవక్కరలేదంటూ కూడా రాస్తున్నారు. ఇంకా సిక్‌నెస్ పెరిగిన వాళ్ళు ముందుమాటను సమీక్షగానో, విమర్శగానో కూడా  భావించి రచనను విమర్శిస్తూ తమ ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు.

ముందుమాట రాసిస్తామని మాటిచ్చి మొహం చాటేసే మేధావులూ ఉన్నారు.  ఫ్రస్ట్రేషన్ శాతం ఎక్కువయ్యి వ్యంగ్యం కూడా జోడించి రచయితని కించపరిచిన వాళ్ళు కూడా లేకపోలేదు. ఇంతా చేసి సీనియర్ల చేత అడిగి రాయించుకున్న రచయితలు ఆ ముందుమాటని ముద్రణలో వేసుకోలేక, మానలేక, ఎడిట్ చెయ్యలేక ఇబ్బంది పడుతుంటారు. ఇంకొందరు నవలకు ఫోర్‌వర్డ్ రాస్తూ నవలలో లీనమైపోయి అందులోని పాత్రలకు శుభ కామనలు చెబుతుంటారు. ఇదో విడ్డూరం.

ఆత్మీయ పలుకు కోసం అభిమానంతో వచ్చి అడిగిన రచయితల పరిస్థితి ఇలా పరి పరి విధాలు.  పేనుకు ఇచ్చిన పెత్తనం మాదిరి రాసే ఇటువంటి వారి  ‘ముందుమాటలు’ తమకు అవసరమా? అన్నది  రైటర్స్ ఆలోచించుకోవలసిన విషయం.

అనుభవజ్ఞులుగా పేరుపడ్డ సౌజన్య మూర్తులు కొందరు రచనలోని  సారాన్ని గ్రహించి, రచయిత స్థాయిని గుర్తించి అతడిని ఒక స్థానంలో కూర్చోబెట్టి రచన ఔన్నత్యాన్నీ/ఔచిత్యాన్నీ చెప్పి వెన్నుతట్టి నెమలీక స్పర్శ లాంటి సూచన-సలహాల  నిస్తుంటారు. అంతటి మనసు లేని వారు ముందుమాటలు రాయకపోవడం అందరికీ మంచిది.

 స్నేహపూర్వక పరిచయం  రాసిన వారికి, రాస్తున్న వారికి వందనాలు చెబుదాం !

సహృదయంతో, సహానుభూతితో ముందుమాటలు రాసే వారి కోసం వెతుకుదాం !

Exit mobile version