Site icon Sanchika

మురికి మంచిదే

[dropcap]చా[/dropcap]లా ప్రశాంతంగా ఉండే స్వీట్‌ల్యాండ్ పరిసరాలలో మధ్యాహ్నం తరువాత సందడి మొదలవుతుంది. ఆ సమయంలోనే అక్కడ ఉండే పిల్లలంతా చిల్డ్రన్స్ పార్క్‌కి చేరతారు. వాళ్ళ ఆటపాటలు, స్నేహపూరిత గొడవలతో ఆ ప్రాంతం కేరింతలతో నిండిపోతుంది. ఉయ్యాల, జారుడుబల్ల, సీ-సాలతో ఆడుతూ, పార్కు చుట్టు సంతోషంగా తిరుగుతున్నారు పిల్లలు. తల్లిదండ్రులు, నానమ్మ/అమ్మమ్మలు పార్కులోని బల్లలపై కూర్చుని కబుర్లాడుకుంటున్నారు.

రియాన్ పిల్లల బృందానికి నాయకుడు. నాలుగు అయిదేళ్ళ వయసున్న ఆ పిల్లలందరిలోకి రియాన్ పొడగరి, తెలివైన వాడు. సరదాగా ఉంటాడు. దేనికీ భయపడడు. అతనిలో సహజ-నాయకుడి లక్షణాలు ఉన్నాయి. అతని బృందంలో ఉన్న స్నేహితులు రాణి, ఇమ్మి, దేవాంశ్, జో – ఎప్పుడూ రియాన్ మాట వింటారు. వాళ్ళకేదయినా ఇబ్బంది వస్తే, రియాన్‌నే సలహా అడుగుతారు. పార్కులో ఏ రోజు ఏం చేయాలనేది – జారుడుబల్ల ఆడాలా, లేదా పార్కు చుట్టూ నడవాలా, లేదా దాగుడుమూతలు ఆడాలా – అనేది రియాన్ నిర్ణయిస్తాడు.

వాళ్ళ జట్టులో ఇంకో ఇద్దరున్నారు. ఒకటి చిన్న, బొచ్చుతో ఉన్న పసుపు రంగు పిల్లి, ఇంకోటి బూడిద రంగు కుక్కపిల్ల. ఆ రెండూ ఊరకుక్క, ఊరఁబిల్లులే, ఈ పార్కులోనే పుట్టాయి. ఈ చిన్నారులతో కలిసి పెరిగాయి. పిల్లికి ‘మ్యావ్’ అనీ, కుక్కకి ‘భౌభౌ’ అని రియాన్ పేరు పెట్టాడు. వాటికా పేర్లు బాగా నచ్చాయి. ఎవైనా తనని ‘భౌభౌ’ అని పిలిస్తే, కుక్కపిల్ల తోకాడిస్తుంది, తననైవరైనా ‘మ్యావ్’ పిలిస్తే, ముద్దుగా మియావ్ అని అరుస్తుంది

ప్రతీరోజు రియాన్, అతని మిత్రులు పార్క్‌లోకి ప్రవేశించగానే ‘మ్యావ్’, ‘భౌభౌ’ పరిగెత్తుతూ వాళ్ళకి ఎదురువెళ్తాయి. పిల్లలైవరైనా ఆడుకోడానికి బంతి తీసుకొస్తే, ఆ రెండిటికీ ఎంతో సంతోషం… బంతి వెంట పరిగెత్తి, వాళ్ళకి తెచ్చివ్వడం వాటికి గొప్ప సరదా!

వీళ్లందరికిలోకి రియాన్ అల్లరివాడు. బురదనీటి గుంటల్లోకి దూకడం, మట్టిలో దొర్లడం అతనికి బాగా ఇష్టం. ‘మ్యావ్’ని, ‘భౌభౌ’ని ఎప్పుడూ ఒళ్లో కూచోబెట్టుకుంటాడు. ప్రతి రోజూ అతని బట్టల నిండా వాటి మురికి పాదముద్రలు అంటుకుంటూ ఉంటాయి. వాటిని చూసి వాళ్ళమ్మ రోజూ తిడుతుంది, కానీ మర్నాడు రియాన్ అవన్నీ మర్చిపోతాడు. మళ్ళీ మామూలే.

“అమ్మా, ‘మ్యావ్’ ‘భౌభౌ’లు మట్టిలో ఆడుకుంటాయి కదా, మరి నేనెందుకు మట్టిలో ఆడకూడదు?” అని వాళ్ళమ్మని అడుగుతూంటాడు.

ఒకరోజు మధ్యాహ్నం పిల్లలు పార్కుకి వచ్చేసరికి ఏదో తేడాగా అనిపించింది. ‘మ్యావ్’, ‘భౌభౌ’ల జాడ లేదు. అవి లేవన్న సంగతి మొదట రియాన్ గుర్తించాడు. మిత్రులందరినీ పోగు చేసి వెతకడం ప్రారంభించాడు. పొదల వెనకాల, బల్లల క్రింద, పక్షుల గూళ్ళ వెనకాల కూడా… అన్ని చోట్లా వెదికారు, కాని అవెక్కడా కనిపించలేదు.

“ఎక్కడికి వెళ్ళుంటాయి? వాటికేమీ అయ్యుండదు కదా!” అన్నాడు రియాన్ బాధగా. వాడిలో విచారం!

పిల్లలు తమ తల్లిదండ్రుల వద్దకి వెళ్ళి కుక్కపిల్లా, పిల్లిపిల్లా కనబడడం లేదని చెప్పారు. అయితే పెద్దవాళ్లంతా తమ తమ చర్చలలో నిమగ్నమై, వీళ్ళ మాటలు పట్టించుకోలేదు. చివరికి విన్నా,  విషయం తేలికగా తీసుకున్నారు.

“అవెక్కడి వెళ్తాయి? తినడానికి ఏవైనా వెతుక్కుంటున్నాయేమో! కాసేపయితే అవే వచ్చేస్తాయిలే” అన్నారు.

సాయంత్రమైపోయింది. ‘మ్యావ్’, ‘భౌభౌ’ల ఆచూకీ తెలియలేదు!

2

ఆ రాత్రి రియాన్‌కి సరిగా నిద్రపట్టలేదు. ‘మ్యావ్’ గురించి ఓ చెడ్డ కల వచ్చింది, అది ఓ భారీ చిక్కుదారిలో చిక్కుబడిపోయినట్లు, బయటకి ఎలా రావాలో తెలియక సాయం కోసం ‘మియావ్’ ‘మియావ్’ అంటూ అరుస్తోంది. అయితే దాని అరుపులు ఎవరికీ వినబడడం లేదు. దాని కళ్ళల్లో నీరు నిండుతుండగా, మొత్తం చిక్కుదారంతా… భయంకరంగా ఊగిపోతోంది..

“రియాన్… లే! కంగారు పడకు.. కల వచ్చినట్టుంది…” అంది వాళ్ళమ్మ వాడిని నిద్ర లేపింది. ఆ రోజు ఆదివారం…. అంటే మాములు రోజులకన్నా ఒక గంట ముందే పార్కుకి వెళ్ళొచ్చు. ఆ రోజంతా రియాన్ ‘మంచి పిల్లాడి’లా నడుచుకున్నాడు, సాయంత్రం నాలుగు అవగానే ఇంట్లోంచి పరిగెత్తి, నేరుగా పార్కుకి చేరాడు.

రియాన్ వాళ్ళమ్మ తనకి ఇష్టమైన బల్ల మీద కూర్చోగానే, రియాన్ ‘మ్యావ్’, ‘భౌభౌ’ల కోసం పార్కంతా వెతకడం మొదలుపెట్టాడు. రియాన్ తొందరగా వచ్చేశాడు, మిగతా పిల్లలు ఇంకా పార్క్‌కి రాలేదు. అందుకని ఒక్కడే వెతకసాగాడు. పెద్ద జారుడుబల్లని దాటాడు, ఉత్తరం దిక్కున హద్దుగా కట్టిన పెద్ద గోడ దగ్గరికి చేరాడు.

వాటిని పేరు పెట్టి పిలుస్తూ, ‘మ్యావ్’, ‘భౌభౌ’ ఎక్కడున్నారు? అంటూ వెతుకుతున్నాడు. కాని అవెక్కడా కనబడలేదు. ఇక ఆశ వదిలేసుకుని వెనుదిరుగుతుండగా, దూరం నుంచి పిల్లి పిల్ల ములుగు సన్నగా వినబడింది. ఆ ములుగు వినబడుతున్న దిశగా కదిలాడు. “నువ్వేనా ‘మ్యావ్’?” అంటూ అరిచాడు. గోడకి అవతలి వైపున ఉన్న పెద్ద ఇనుప చెత్త కుండీ నుంచి పిల్లి పిల్ల గొంతు వినబడుతోంది. అయితే దాని గొంతు ఇంకా అస్పష్టంగానే ఉంది. దగ్గరికి చేరేసరికి ఓ కుక్కపిల్ల అరుపు కూడా సన్నగా వినబడింది. “నువ్వేనా ‘భౌభౌ’?” అని అడుగుతూ చెత్తకుండీ దగ్గరికి చేరాడు రియాన్.

చెత్తకుండీలో పెద్ద అలజడి రేగింది. మియావ్, మియావ్ అనే అరుపులు, భౌ భౌ అనే అరుపులు ఏకస్వరంలో వినిపిస్తున్నాయి. ఇనుప చెత్తకుండీ గోడలని గోళ్ళతో గీకుతున్న శబ్దం వస్తోంది.

ఏం జరిగి ఉంటుందో రియాన్ ఊహించాడు. తినడానికి ఏవైనా దొరుకుతాయేమోనని ‘మ్యావ్’, ‘భౌభౌ’లు ఆ చెత్తకుండీ పైకి ఎక్కి ఉంటాయి, అక్కడ్నించి జారి లోపలికి పడిపోయుంటాయి.  నిన్నటి నుండి అక్కడ చిక్కుపడిపోయాయవి. చెత్తకుండీ ఎత్తుగా ఉంది, రియాన్ దాన్ని అందుకోలేకపోయాడు. ఎగిరెగిరి అందుకోవాలని చూశాడు.

“రియాన్, ఏం చేస్తున్నావ్?” అని వినిపించడంతో వెనక్కి తిరిగాడు. తన నేస్తాలు తన వైపు పరిగెత్తుకు వస్తూ కనిపించారు. జరిగినదంతా వాళ్ళకి చెప్పాడు. “పెద్దవాళ్ళకి చెప్దాం” అంది ఇమ్మీ. తనూ, రాణి పరిగెత్తుకుంటూ పెద్దవాళ్ల దగ్గరికి వెళ్ళారు. ఈలోపు జో, దేవాంశ్ మోకాళ్ళ మీద వంగున్నారు. తమ వీపుల మీద ఎక్కి చెత్తకుండీని అందుకోమని రియాన్‌కి చెప్పారు. అలాగే చేశాడు రియాన్. చెత్తకుండీ లోపలికి తొంగి చూశాడు.

అవి రెండూ అక్కడ ఉన్నాయి. పాపం! దాదాపుగా చెత్తలో కూరుకుపోయాయి. మురికిగా, ఎంతో ఆకలిగా కనిపించాయి.

“కంగారు పడద్దు. నేనొస్తున్నా…” అంటూ రియాన్ లోపలికి దూకబోయాడు. సరిగ్గా అదే సమయంలో రెండు చేతులు అతన్ని వెనకనుంచి గుంజి, కిందకి దింపాయి. అది వాళ్ళమ్మ.

“నువ్వాగు, నేను వాటిని బయటకు తీస్తాను…” అంటూ ఆమె తన చేతులను చెత్తకుండీలోకి పోనిచ్చి, ‘మ్యావ్’, ‘భౌభౌ’లను బయటకు తీసింది. వాటిని ఒంటికి హత్తుకుని, వీపులపై అరచేత్తో రాసింది. ఆ రెండు ముడుచుకొని ఉండి, ఆమె ప్రేమని ఆస్వాదించాయి.

దగ్గర్లోని టీ కొట్టు నుండి దేవాంశ్, ఇమ్మీ వాళ్ళ అమ్మలు ఒక పాత్రలో పాలు తెచ్చారు. పాలని కుక్కపిల్ల, పిల్లి పిల్ల ముందు పెట్టారు. పాపం! అవెంతో ఆకలితో ఉన్నాయి. వెంటనే పాలు జుర్రుకోడం మొదలుపెట్టాయి!

“అమ్మా! చూడు, నీ చేతులు బట్టలు ఎంత మురికిగా వున్నాయో” అన్నాడు రియాన్.

“నాకు తెలుసు. అయితే ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు చేతులకి మురికి అంటుకున్నా పర్వాలేదు. అటువంటి మురికి మంచిదే! ఇది నేనీ రోజు నీ నుంచే నేర్చుకున్నాను…” అందామె.

“లవ్ యూ అమ్మా!” అంటూ రియాన్ వెళ్ళి అమ్మను హత్తుకున్నాడు. అక్కడున్న అందరూ నవ్వేశారు. వాళ్లని చూస్తూ ‘మ్యావ్’, ‘భౌభౌ’లు సంతోషంగా కూతలు పెట్టాయి.

ఆంగ్ల మూలం: అవిషేక్ గుప్తా

తెలుగు: కొల్లూరి సోమ శంకర్

Exit mobile version