[dropcap]అ[/dropcap]భివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతమవడం, పట్టణీకరణ విపరీతంగా పెరిగిపోవడంతో, గ్రామాల్లో పనులు లేనివారు బతకడానికి పట్టణానికి వచ్చేస్తున్నారు. పట్టణవాసులకు కావల్సిన చౌక లేబర్ కోసం ఇలాంటి వలసలను ప్రోత్సహిస్తూంటారు. ఇలా వచ్చేవారిలో స్కిల్డ్, అన్‌స్కిల్డ్ లేబరే కాక, ఎలాగొలా బతకడానికి వచ్చేసేవాళ్ళుంటారు. తాము పనిచేసే ప్రదేశానికి దగ్గరగా, ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ గుడిసెలు వేసుకుంటారు. పట్టణాలలో సామాన్యంగా ఖాళీ స్థలాలు ఉండవు. అందుకుని మురికి నాలాలు, ప్రభుత్వ స్థలాలు, ఎవరికీ చెందని స్థలాలలో గుడిసెలు వేసుకుంటారు. కొన్ని గుడిసెలు క్రమంగా బస్తీలుగా మారతాయి. బస్తీ అంటే ఆంధ్రాలో పట్టణం అని అర్థం. కాని తెలంగాణలో బస్తీ అంటే వాడ అని అర్థం. ఇరుకిరుకు స్థలాలు, పారిశుద్ధ్యపు కొరత, కరెంట్, నీళ్ళు లేని పరిస్థితులలో వాళ్ళున్న ప్రదేశాలు మురికివాడలుగా తయారవుతాయి.
గతంలో ప్రభుత్వ స్థలాలు, ఎవరికీ చెందని స్థలాలను కబ్జా చేయడానికి కొందరు నాయకులు అరాచకశక్తులను ప్రోత్సహించి అక్కడ గుడిసెలు వేయించేవారు. గుడిసెవాసుల తరపున ప్రభుత్వంతో పోట్లాడి కరెంట్, నీళ్ళు తెప్పించేవారు. వాళ్ళను ఆ నాయకుడి ఓట్‌బ్యాంకుగా పెంచి పోషించేవారు. పాతబస్తీలో కబ్జాలకు, మురికివాడలకు ఒక రాజకీయపార్టీ పేరు పొందింది. ఇలా జనాలతో ఎక్కడబడితే అక్కడ గుడిసెలు వేయించి నాయకులుగా ఎదిగినవారు కూడా ఉన్నారు. కొత్తగా వచ్చినవారి నుండి అద్దెలు వసూలు చేయడం, జులుం చేయడం, అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించడం లాంటి పనులతో దాదాలు, ఛోటామోటా లీడర్లు వారిని గుప్పిట్లో పెట్టుకోడానికి ప్రయత్నిస్తుంటారు. కనీసావసరాలు ఏర్పరుస్తామనీ, గుడిసెలు స్వంతం చేయిస్తామనీ, డబ్బులు వసూలు చేస్తూ నాయకులుగా చలామణి అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు.
మూసీలో నాలల పక్కనే వున్న మురికివాడలు, పారిశ్రామిక కేంద్రాలు, రసాయనిక ఫ్యాక్టరీల పక్కనే వెలసిన మురికివాడలలో వుండే మనుషులు ఆ దుర్వాసనని భరిస్తూ ఆ అనారోగ్య వాతావరణంలో ఎలాగొలా బతకడానికి అలవాటైపోతారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం మరో సమస్య. కరెంట్, నీళ్ళు కరెక్ట్‌గా వస్తాయన్న గ్యారంటీ లేదు. రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు వున్నా ఆ ఇంటిమీద యాజమాన్యపు హక్కులు మాత్రం వుండవు. ఆడవాళ్ళు పాచిపనుల మీద ఆధారపడగా మగవాళ్ళు ఎక్కువగా అడ్డా కూలీలు, దినసరి కూలీలు, పారిశుద్ధ్యపు కూలీలు, చిల్లర వ్యాపారులుగా చాలీచాలని జీవితాన్ని కొనసాగిస్తున్నారు. సిటీ సెంటర్లలలో లేదా సిటీ నాలల పక్కనుండి మురికివాడలను తొలగించి, వారికి దూరంగా ఇల్లు కట్టిస్తామంటే ఎవరూ ముందుకు రారు. ఎంత ఇబ్బందిగా వున్నా, అందులోనే వుండడానికి ఇష్టపడతారు తప్ప ఆ ప్రాంతాన్ని వదులుకుని వెళ్ళిపోవడానికి ఎవరూ ఇష్టపడరు. భారీగా కురిసే వర్షాలకు ఆ నాలాలు తట్టుకోలేవనీ, కుంచించుకుపోయిన నాలాలను విస్తరింపచేయటానికి, నాలల పక్కన వున్న ఇళ్ళను కూల్చివేయటానికి మునిసిపాలిటీవాళ్ళు రావటం, వాళ్ళు పని ప్రారంభించేలోపుల రాజకీయ నాయకులు ఊడిపడడం, పెద్ద గొడవలు… ఆపై కోర్టులు కలగజేసుకోవడంతో వెడల్పు పనులు వాయిదా పడతాయి. అలా స్థిరపడిపోయిన మురికివాడలు క్రమంగా కిక్కిరిసిపోతూ అనారోగ్యానికి, నిరుద్యోగానికి, అవాంఛనీయ శక్తులకు ఆవాసంగా మారతాయి.
(“అభాగ్య జీవనాల భాగ్యనగరం – The Voice of Slums” – రచన: కవిని ఆలూరి, పేజీలు 90. వెల రూ.80/-. అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో లభ్యం.)