మ్యూజియం సోఫా!

0
2

[dropcap]ఆ[/dropcap] రోజు శనివారం కావడంతో, గుడికెళ్లొచ్చిన శేఖరం ఇంట్లో అడుగు పెట్టీ పెడుతూనే, ఏదో చూడకూడనిది చూసినట్టు, “నో అలా చేయొద్దూ” అని రెండు చెవులూ మూసుకుని గట్టిగా అరిచి, తర్వాత గబ గబా వెళ్ళి, సోఫాలో కాళ్ళు చాపుకుని కూర్చున్న అత్తగారి రెండు కాళ్ళు పట్టుకుని బర, బరా లాగేశాడు. దాంతో ఆమె ధబక్ మంటూ సోఫా నుండి నేల మీద పడ్డంతో, “చచ్చానురా దేవుడో, అమ్మాయ్, అల్లుడు నన్ను సోఫా నుండి లాగేసి కింద పడేసాడే, నా నడుం విరగొట్టేశాడే తల్లీ” అంటూ లబో దిబో అంది.

ఆ అరుపు వింటూనే, పరుగున హాల్లోకి వచ్చిన లలిత, “అయ్యో ఏవిటండీ మీరు చేసిన పని! ఎందుకిలా మా అమ్మని సోఫా నుండి లాగి పడేశారు” అడిగింది ఆమెని జాగ్రత్తగా పైకి లేపుతూ

“నేనేం పడేయలేదు. ఆవిడ్ని సోఫా నుండి కిందకి దించుదామనుకున్నాను. కానీ కంగారులో చేతులు పట్టుకు లేపబోయి, కాళ్ళు పట్టుకు లాగాను అంతే. దాంతో ఆమే కింద పడిపోయింది. అయినా అది ఇంపోర్టెడ్ సోఫా అనీ, దాని విలువ ఇరవై లక్షలనీ తెలుసు కదా. దాని మీద దుమ్ము పడితేనే సహించలేనూ, అలాంటిది దాని మీద మీ అమ్మగారు కాళ్ళు చాపుకుని, ఆ కాళ్ళకి ఆవదం రాసుకుంటున్నారు. ఒక్క చుక్క సోఫా పై పడి మరకా అదీ పడితే, అసహ్యంగా ఉండదూ. పైగా అది తెల్ల రంగు సోఫా కూడానూ” చెప్పాడు సోఫాని జాగ్రత్తగా తన అరచేత్తో తడుముతూ

“ఏంటండీ మీ పైత్యం? ఆ ఇంపోర్టెడ్ తెల్ల సోఫాని ఇరవై లక్షలు పోసి వేలంలో పాడి మరీ కొన్నారు సరే, అది ఎంతో విలువైనదే, కానీ ఇంట్లో దాన్ని ముట్టుకుంటే మాసి పోతుందని అలా చూస్తూ కూర్చోవాలంటే ఎలా అవుతుంది  చెప్పండి. ఇది వరకైతే ఎంచక్కా ఆ పాత సోఫాలో మనమ్మాయిని కూర్చోబెట్టుకుని అన్నం తినిపించేవారు , పాలు తాగించేవారు, ఆడేవారు, గెంతమనే వారు. కానీ ఈ తెల్ల సోఫా కొన్నాక, అవన్నీ మానేశారు.  ఒక్కసారే, స్విచ్ నొక్కినట్టు అంతా మారిపోయింది. ఆ పురాతన సోఫాని, రీమోడెల్ చేసి, రాబిట్ ఇన్ ద మూన్ అని పేరు పెట్టి వేలం వేశారు సరే, కానీ మీరు దాన్ని నిజంగానే చంద్రుడి మీద నుండి తెచ్చిన కుందేలు పిల్లలా చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. అదే నాకు నచ్చడం లేదు” చెప్పింది మూతి విరుస్తూ.

“ఎందుకు నచ్చడం లేదు. ఇప్పుడు ఆ సోఫాతో వచ్చిన నష్టం ఏంటట” అడిగాడు.

“ఏవిటా! మొన్న మీకోసం వచ్చిన వాళ్ళు కాఫీ తాగుతూ, తాగుతూ ఓ రెండు చుక్కల కాఫీని దాని మీద ఒలక బోసారని, కాలి వేలు చితికిన మనిషిలా ఒక్కసారే కై మని పెద్దగా అరిచి చెవులు మూసుకున్నారు. కాఫీ తాగుతున్న వాళ్ళు, ఏం జరిగిందో తెలియక భయంతో కప్పులు టీపాయి మీద పెట్టి, కప్పల్లా గెంతుకుంటూ వెళ్ళి తలుపు చాటున నిలబడ్డారు. ఆ తర్వాత మీరు, ఏం లేదు సోఫా మీద కాఫీ పడింది, క్లీన్ చేయాలి. అందాక ఇదిగో ఈ  కుర్చీల మీద కూర్చోండి అని మొహం మాడ్చుకోవడంతో, వాళ్ళు మొహాలు ఆవదం తాగినట్టు పెట్టుకుని, సగం తాగిన కాఫీ వంక ఆశగా చూస్తూ, పర్లేదు సార్ అంటూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత, పక్కింటమ్మాయి వాళ్ళ బాబుతో వచ్చి నన్ను వ్రతానికి పిలిచింది. ఆమె వెళతానన్నా కూడా నేనే కూర్చోమన్నాను. వాళ్ళ బాబు ఐస్ కోన్ క్రీమ్ తింటున్నాడు. ఆ ఐస్ క్రీమ్ సోఫా పై పడేస్తాడేమో అని మీరు భయపడి, వాడి చేతిలోని ఐస్ క్రీమ్ తీసి ఆమె చూస్తుండగానే డస్ట్ బిన్లో వేసేసారు. ఆమె ఎంత చిన్నబుచ్చుకుందో పాపం. అప్పటి నుండి రమ్మన్నా ఇంట్లోకి రావడం మానేసింది. అయినా ఆ సోఫా మ్యూజియంలో ఉండాలి, మీరు దాన్ని కొని ఇంట్లో పెట్టారు. ఎంత ఖరీదైన వస్తువు అయినా, అది ఇంట్లో ఉన్నపుడు, ఆ వస్తువు చేసే పని ఆ వస్తువు చేస్తేనే అందం. అంతే కానీ, ఆ వస్తువుని మ్యూజియంలో బొమ్మలా చూసి మురిసిపోతే, దాని మనుగడకు అసలు ప్రయోజనం శూన్యం. ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఖరీదైన వస్తువు మాయలో పడి, నలుగురి ధృష్టిలో మీరు చవకబడిపోతున్నారనిపిస్తోంది నాకు” నసుగుతూ లోనికి వెళ్లిపోయిందామె.

ఆ  తర్వాత కొద్దిరోజులకి, తిరుపతి కొండ మీదకి కజిన్ బ్రదర్స్‌తో కలిసి బయలుదేరాడు శేఖరం. అయితే కొండ మీదకి వెళ్తున్నపుడు, “లలితా, పొద్దున్న రోడ్డు పక్కన తాగిన టీ ప్రభావం అనుకుంటాను, కొంచెం కడుపు తిప్పుతున్నట్టుందే. నాకు అసలే మలుపుల్లో కార్ కూడా పడి చావదు” అన్నాడు శేఖరం వికారపు మొహంతో.

అంతే, ఆ మాట వింటూనే, ఏదో పిడుగు పడ్డట్టు, శేఖరం పిన్ని కొడుకు గిరి,  హఠాత్తుగా కార్‌ని పక్కకి  ఆపేసాడు. తర్వాత కిందకి దిగి “అన్నయ్యా ఓ సారి దిగండి” అన్నాడు.

“ఎందుకూ ఇప్పుడు పెద్దగా కడుపు తిప్పట్లేదులే తమ్ముడూ, ఇంకా కడుపు తిప్పితే అప్పుడు ఆపమని చెప్పి, మనస్ఫూర్తిగా కక్కుకుంటాలే” చెప్పాడు చిన్న నవ్వుతో .

ఇంతలో వెనకాలే వస్తున్న మరో తమ్ముడు రవి, విషయం తెలుసుకోవాలని అతనూ కార్ ఆపాడు.

“ఆ సోదరా, అన్నయ్యకి కడుపు తిప్పుతోందట, కాస్త మీరు మీ కార్‌లో అన్నయ్యని ఎక్కించుకోకూడదూ” అన్నాడు గిరి బ్రతిమాలుతున్నట్టుగా

“ఆ.. అమ్మా, ఆశ, దోస, అప్పడం. నాదీ కొత్త కారే,  ఆయన కారులో ఏమైనా చేస్తే నా కారు కంపు అయిపోతుంది. కనుక  ఓ పని చేద్దాం” అని ఇద్దరూ ఒకరి చెవిలో ఒకరు గుసగుసగా  ఏదేదో మాట్లాడుకున్నారు. కట్ చేస్తే, అటుగా పోతున్న ఓ డొక్కు టికెట్ సర్వీస్ జీపుని చేయి ఊపి మరీ ఆపి, అందులో ముందు సీట్లో శేఖరాన్ని కూర్చోబెట్టారు . “ఇప్పుడు కక్కు వచ్చినా చిక్కు లేదన్నయ్యా” ముక్తకంఠంతో అని వారి కార్లలో వారు వెళ్ళి పోయారు

తల కొట్టేసినట్టైంది శేఖరానికి. దాంతో, కోపంతో రగిలిపోయాడు, అవమానంతో ఉడికిపోయాడు, ఆవేశంతో ఊగిపోయాడు. కానీ ఓ క్షణం తర్వాత ఆలోచనలో పడిపోయాడు. తను కూడా ఇంపోర్టెడ్ సోఫాతో చేస్తోందేవిటి? ఈ విషయంలో లలిత చెప్పిందే కరెక్ట్ అనుకున్నాడు. తర్వాత దర్శనం అదీ అయిపోయాక,  తిరుపతి నుండి ఇంటికి వచ్చాక, ఆ సోఫా వంక దీర్ఘంగా చూశాడు. అప్పటికే ఇల్లు తుడుస్తున్న పని మనిషి, శేఖరం వంక చూసి, కాస్త వణికి పోతూ, “అయ్యగారూ, ఆ మరక తుడుస్తానండీ.ఇపుడే ఫ్యాన్ తుడుస్తుంటే, దుమ్ము పడి అలా కనిపిస్తోంది. దానికి గాను నన్ను పనిలోంచి మాత్రం తీసేయకండీ ప్లీజ్” చెప్పింది చిన్న వణుకుడు స్వరంతో.

ఆ సోఫా తనని,  ఇతరులకి ఎలా చూపుతోందో, తనలో వచ్చిన మార్పేవిటో అర్థం చేసుకున్నాడు. తర్వాతి రోజు దాన్ని హాల్లో నుండి తీయించేసి, అక్కడ మళ్ళీ పాత సోఫా వేయించాడు .దానిని ఆన్లైన్ లో పెట్టి కాస్త తక్కువ ధరకి అమ్మేసాడు.

అది చూసిన లలిత, “హమ్మయ్య, ఇతని తమ్ముళ్ళు వేసిన ప్లాన్ పారింది” అనుకుంది మనసులో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here