మ్యూజిక్ మొదలైంది

    1
    5

    [box type=’note’ fontsize=’16’] ఉత్కంఠభరితమైన కథలు రాసే రచయితనే ఉత్కంఠకు గురిచేసిన మగువ కథని హాస్యంగా చెబుతున్నారు భీమరాజు వెంకటరమణమ్యూజిక్ మొదలైంది” కథలో. [/box]

    [dropcap]రా[/dropcap]మనాధం ఎత్తు ఐదున్నర అడుగులు. కానీ అతను ఆరున్నరగా ఫీలవుతాడు. తన నడకలో గాంభీర్యం, చూపులో చురుకుదనం ఉన్నదని అతని నమ్మకం. నడిచేప్పుడు జేమ్స్‌బాండ్ మ్యూజిక్, తనకు మాత్రమే వినపడుతూ అనుసరిస్తుంది. కారణం బహుశా అతను అపరాధ పరిశోధన కథలు రాస్తాడు కాబట్టేమో!

    ఇప్పటివరకూ అతనివి దాదాపు పది కథలు పత్రికల్లో ప్రచురించబడ్డాయి. దాదాపు అంటే ఒకటి తక్కువన్న మాట. రెండురోజుల క్రితం ఒక పత్రికవారు కథతో పాటు రామనాధం ఫోటో కూడా వేస్తారు. దాంతో అతను ప్రముఖ నుండి ప్రఖ్యాత స్థాయికి వెళ్ళినట్లే భావిస్తున్నాడు.

    ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం ఒకటిపై నడుస్తున్నాడు, అటూఇటూ చూస్తూ. తననెవరూ గుర్తు పట్టట్లేదు. తెలుగు పాఠకులపై రామనాధానికి కాస్త ఆగ్రహం కూడా కలిగింది. అంతలో ఎదురుగా వస్తున్న ఓ ముసలావిడ భుజం రామనాధానికి తగిలింది. చేతిలో బ్రీఫ్‌కేస్ క్రింద పడింది. ఇద్దరూ ఒకరి కళ్ళలోకి మరొకరు చూసుకున్నారు. ఆమె తనను గుర్తు పట్టినట్లు అనిపించింది. ఆ పెద్దావిడ డిటెక్టివ్ కథలు చదువుతుందా? ఏమో! ఎందుకు చదవకూడదు? తను ఆకట్టుకునేలా రాస్తాడాయే!

    ఆమె నోటి నుండి “మీరు రచయిత రామనాధం గారు కదూ?” అనే ప్రశ్నకోసం ఎదురు చూస్తున్నాడు. కాస్త బిగుసుకున్నాడు కూడా. కానీ ఆమె “ఆ నల్ల కళ్ళద్దాలు తీసి నడవొచ్చుగా? మాయదారి సంత” అనుకుంటూ వెళ్ళిపోయింది. బ్రీఫ్‌కేస్ తీసుకొని బయలుదేరాడు, మ్యూజిక్‌తో సహా.

    మరో పదడుగులు వేశాక ఈసారి ఒక వ్యక్తి ఎదురుగా వచ్చి అడ్డంగా నిలుచున్నాడు. “యస్! ఇతను ఖచ్చితంగా గుర్తు పట్టాడు. అనవసరంగా పాఠకుల్ని తిట్టుకున్నాను” అనుకొని అతని వైపు ఆతృతగా చూశాడు. అతనూ అంతే ఆతృతగా “సారూ జమ్మికుంట పొయ్యే పేసింజర్ ఏ పాట్ఫాం పైకొస్తది?” అడిగాడు.

    “కనీసం నువ్వైనా మొన్న పత్రికలో నా ఫొటో చూడలేదా మూర్ఖుడా!” అనే అర్థం వచ్చేలా అతని కళ్ళలోకు గుచ్చిగుచ్చి చూశాడు రామనాధం. అతను కూడా “అరే! నీకు గిది కూడా తెల్వదా” అనుకుంటూ పైకి క్రిందికి చిరాకుగా చూసి వెళ్ళిపోయాడు.

    రామనాధం నాల్గవ నెంబరు ప్లాట్‌ఫాంకి చేరుకుని అక్కడ ఉన్న గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కి కూర్చున్నాడు. వెంటనే సెల్‌ఫోన్ తీసి తన స్నేహితుడితో “ఆఁ శేఖర్! గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ఎక్కేసాను. ఆరింటికల్లా ఖమ్మం వచ్చేస్తాను. పెళ్ళి చూశాక రాత్రి ఏ బస్సుకో బయలుదేరి హైదాబాద్ వచ్చెయ్యాలి. నన్నాపుతే ఊరుకోను, ముందే చెబుతున్నా. ఉంటా మరి” అని ఫోన్ కట్ చేసాడు. నిజానికి అతను మాట్లాడిన స్థాయికి ఫోన్ అవసరం లేదు. ఖమ్మం వరకూ చక్కగా వినిపిస్తుంది. ఆ మాట కాస్త అవతల కూర్చున్న వ్యక్తి గొణుగుతూ అన్నాడు కూడా.

    కాసేపటికి ఒక యువతి వచ్చింది. భుజానికి ఎయిర్‌బ్యాగ్ చేతిలో చిన్న హ్యాండ్‌బ్యాగ్ ఉన్నాయి. రామనాధానికి అందంగానే కనపడింది. అతని ఎదురు సీట్లో కూర్చుంది .

    “మీరెక్కడిదాకా?” అడిగిందామె. “ఖమ్మం” అన్నాడు కనుబొమ్మలు పైకి లేపి.

    “మీది ఖమ్మమా?” ఆమె మరో ప్రశ్న. “కాదు హైడ్రాబ్యాడ్” మూతిని కాస్త పక్కకు ఇరగదీసాడు.

    “బై ది బై నా పేరు హరిణి! మీ పేరు” అడిగింది.

    “రామనాధం” అన్నాడు గంభీరంగా “ఖమ్మంలో ఎక్కడికెళ్ళాలి?” అడిగిందామె. “గాంధీ చౌక్. అక్కడ నా కొలీగ్ చెల్లెలి పెళ్ళికి” అన్నాడు. “మరి మీరు?” అడిగాడామెను. “నెహ్రూ చౌక్… మా ఇంటికి” వెంటనే చెప్పిందామె. నెహ్రూ చౌక్ అనేది అక్కడ ఉందో లేదో రామనాధానికి తెలియదు. “ఓ, ఐసీ” అన్నాడు.

    రైలు కదిలింది. మొన్నటి పత్రిక బయటకు తీసి బ్రీఫ్‌కేస్ పైన పెట్టాడు. రైలు ఊపందుకుంటోంది. వాకిలి దగ్గర నిలుచున్న ఒకతను పైన పెట్టున్న ఎయిర్‌బ్యాగ్ తీసుకొని ఫ్లాట్‌ఫాం పైకి దూకేశాడు. “నా బ్యాగ్.. నా బ్యాగ్” అంటూ పెద్దగా అరిచాడొకడు. “చైను లాగండి” అని ఒకరు, “రైల్వే పోలీసులకు ఫోన్ చెయ్యండి” అని మరొకరు, ఇలా తాలా ఒక సలహా చెబుతున్నారు. దూకినవాడు పారిపోయాడు.

    వెంటనే అందుకున్నాడు రామనాధం. “అయినా వాకిలి దగ్గర వాటంగా ఎవరైనా బ్యాగు పెడతారటయ్యా? ‘ప్రయాణాలు-దొంగతనాలు’ అని నేనొక కథ రాసాను. అది చదివుంటే నీకిలా జరిగేది కాదు” అన్నాడు.

    బ్యాగు పోగొట్టుకున్న వ్యక్తి నిమ్మకు నీరెత్తినట్లున్నాడు. రామనాధానికి అతని వైఖరి విచిత్రంగా తోచింది. “ఏమిటయ్యా! బెల్లంకొటిన రాయిలా ఉన్నావు ఏదో ఒకటి చెయ్యవా?” అడిగాడు. “పోనీలెండి సార్ వాడి పాపాన వాడేపోతాడు” అన్నాడతను.

    “అందులో ఏమీ లేవా ఏంటి? అంత నిర్లక్ష్యంగా ఉన్నావ్” అడిగాడు. “ఎందుకు లేవు? నాలుగు రోజుల్నుంచీ వేసుకొని సిటీలో తిరిగిన ఒక జత మాసిన బట్బలు, ఒక లుంగీ, మూడొంతులు అరిగిపోయిన సబ్బు, నాలుగొంతులూ అయిపోయిన పేస్ట్, వీటన్నిటి మీద ఒక పాత టవలు ఉన్నాయి. బ్యాగు జిప్ తెరిచాడంటే కోమాలోకి పోతాడు దొంగ వెధవ” అన్నాడు చిరునవ్వుతో చీదరింపును జోడిస్తూ. రామానాధం గతుక్కుమన్నాడు. ఎవరి సీట్లలో వాళ్ళు కూలబడ్డారు.

    “అయితే మీరు రచయితా?” ఆశ్చర్యంగా అడిగింది హరిణి. “అఫ్‌కోర్స్! ఇదిగో మొన్న వచ్చిన నా కథ ‘అప్రమత్తం’ అంటూ పత్రిక ఆమె చేతికిచ్చాడు. ఆమె ఎంతో ఆతృతగా తీసుకొని చూసి “మీరు రచయిత రామనాధం గారా? మీ కథలు నేను చదివాను. ఈ పత్రిక ఇంకా కొనలేదు. పేరును బట్టి మీరు చాలా పెద్ద వారనుకున్నా. మీ పేరు రామ్‌నాధ్ అని స్టయిల్‌గా పెట్టుకుంటే మీకు సరిగ్గా సరిపోయేది” అన్నది నవ్వుతూ.

    ఇందాకటి నుంచీ తను వినాలనుకున్న మాటలకంటే ఈ పలుకులు వెయ్యిరెట్లు తీయగా ఉన్నాయి. రామనాధానికి ఒళ్ళు విపరీతంగా పులకించింది. మే నెల ఎండలో రామగుండం నడిరోడ్డు మీద నిలబడి చల్లటి నిమ్మరసం తాగుతున్న అనుభూతి. వీపుమీద చెమటకాయల్ని పొడవాటి స్కేలు సౌజన్యంతో గోముగా గోకుతున్న పరవశం. అతని శరీరంలో అన్ని అవయవాలు వాటి సంతోషాన్ని శక్తికి మించి చాటుతున్నాయి.

    ఆమె కథలో లీనమైపోయింది. ఆమెను ఓరకంట చూడ్డంలో అతనూ విలీనమైనాడు. రైలు పట్టాలమీద కాక ఆకాశంలో పోతున్నటుంది. ఒళ్ళంతా చెవులు చేసుకుని ఆమె కామెంట్ కోసం వేచి ఉన్నాడు.

    “అబ్బ! ఎంత ఉత్కంఠభరితంగా ఉందండీ కథ! అసలు నన్నడిగితే ‘గుండె జబ్బుగలవాళ్ళు, అర్భకులూ ఈ కథను చదవరాదు’ అని కథ మొదట్లోనే ఎర్రక్షరాలతో వేయాలండీ! ఏమి సస్పెన్సండీ బాబూ! చెమటలు పోశాయి చూడండి” అన్నది. పైన ఫ్యాను తిరగకపోవడం ఆమెకు కలిసొచ్చింది. రామనాధం కాలర్ దానంతట అదే పైకి లేచింది.

    “ఈ కథతో నేను మీ అభిమానినైపోయానండీ!” అన్నదామె మెచ్చుకోలుగా చూస్తూ. అతను పెనంమీద పెట్టిన వెన్నముద్దలా అయిపోయాడు. తిరిగి ఘనీభవించడానికి కాస్త సమయం పట్టింది.

    “ఈ కథ రాయడానికి ఎన్నిరోజులు పట్టిందండీ?” అడిగిందామె. రామనాధం విలాసంగా నవ్వుతూ “ఒక గంటలో రాసేసా!” అన్నాడు.

    ఆమె అతన్ని ముద్దుగా చూసింది. అతని మనసు మురిపెంగా మూలిగింది.

    వరంగల్ స్టేషన్ వచ్చింది. ఆమె “ఇప్పుడే వస్తాను” అంటూ వెళ్ళి కాసేపటికి బిస్కెట్ ప్యాకెట్స్‌తో తిరిగొచ్చింది.

    “ఇలా బ్యాగ్ వదిలి వెళ్ళడం మంచిది కాదు. ఒకవేళ నేనే తీసుకొని ఇందాక ఆ దొంగలాగా పారిపోతే? ఈ విషయం మీద నేనొక కథ రాసాను” అన్నాడు నవ్వుతూ.

    “ఎవరెలాంటి వారో ఆ మాత్రం అర్థం కాదాండీ! అసలు మీలాంటి రచయితకు బ్యాగేంటి, ఈ బంగారు గాజులు కావాలన్నా ఇచ్చెయ్యనూ!” అన్నదామె ఓరకంట చూస్తూ. ఆమె మెచ్చుకోలు మాటలకు హావభావాలు ఎలా పెట్టాలో రామనాధానికి తెలియడం లేదు. అన్నిరకాలు ఇందాకట్నుంచీ పెట్టేసాడు. చివరికి నవ్వి ఊరుకున్నాడు.

    “మీలాంటి మేధావులు పరిచయం కావడం నా అదృష్టం” అన్నదామె.

    రామనాధానికి మేధావిలా ముఖం పెట్టక తప్పలేదు.

    రైలు దాదాపు అన్ని స్టేషన్స్‌లో ఆగి వెళుతోంది. దిగే జనం ఎక్కే జనంతో సందడిగా ఉంది. కాసేపటికి డోర్నకల్ స్టేషన్ వచ్చింది. కొందరు దిగారు. కొందరు ఎక్కుతున్నారు.

    “ఎంత సేపటికీ కాఫీ, టీలే గానీ కూల్ డ్రింక్స్ అమ్మేవాళ్ళు రాలేదు. మీకు కూల్ డ్రింక్ ఇచ్చి నా సంతోషాన్ని పంచుకోవాలి, ఒక్క నిముషంలో వస్తాను” అని లేవబోయింది.

    “హరిణిగారూ! మీరు కూర్చోండి, ఒక మంచి అభిమాని దొరికినందుకు నేను ట్రీట్ ఇవ్వాలి” అంటూ ఆమె వారిస్తున్నా వినకుండా ప్లాట్‌ఫామ్ మీదకు వెళ్ళాడు రామనాధం.

    కాసేపటికి రైలు కదిలింది. రెండు ఫ్రూటీలు, చిప్స్ ప్యాకెట్లు పట్టుకొని పరుగున వచ్చి రైలెక్కాడు.

    తను కూర్చున్న చోట చూస్తే హరిణి లేదు. తన బ్రీఫ్‌కేసు కూడా లేదు. ‘నా బ్రీఫ్‌కేస్… నా బ్రీఫ్‌కేస్’ అని పెద్దగా అరవలేకపోయాడు. కారణం ఇందాక బ్యాగు పోగొట్టుకున్న వ్యక్తి ఇంకా ఆ ప్రక్కనే కూర్చొని ఉన్నాడు. మరో కారణం అతను చెప్పినట్టు మాసిన బట్టలు కాకపోయినా ఒక జత ఇస్తే బట్బలు తప్ప అందులో ఇంకేమీ లేవు.

    రామనాధం ఖంగు తిన్నా హంగుగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు. “ఆమె చూడ్డానికి అలా లేదే, ఇలా ఎలా చేసింది?” అని అదోలా ఆలోచిస్తున్నాడు.

    ఆమె వస్తుందని అటూ ఇటూ చూస్తూనే ఉన్నాడు. ఆమె ఎటునుంచీ రాలేదు.

    కాసేపటికి ఖమ్మం స్టేషన్ వచ్చేసింది. దిగి బయటకు నడిచాడు. చేతిలో బ్రీఫ్‌కేసు లేదు. జేమ్స్‌బాండ్ మ్యూజిక్కూ లేదు. ఆటో ఎక్కి కళ్యాణమండపానికి చేరుకున్నాడు. లోపలకెళ్ళి అటూఇటూ చూస్తున్నాడు. ముహూర్తానికి ఇంకా చాలా సమయం ఉంది. పెళ్ళి జనాలు కొందరు అక్కడక్కడా గుంపులుగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. అంతలో “రచయిత రామనాధ్ గారు స్వాగతం” అన్న మాటలు వినిపించాయి. ఒళ్ళు ఝల్లుమంది. తలతిప్పి చూస్తే హరిణి, కాస్త ప్రక్కగా నిలబడి ఉంది. చేతిలో బ్రీఫ్‌కేస్.

    ఆమెను చూసి రామనాధం విగ్రహంలా అయిపోయాడు. కాసేపు నిశ్శబ్దం. అతను తేరుకునే లోపు “రండి! మా శేఖర్ అన్నయ్య దగ్గరకు తీసుకెళతాను” అన్నది. “మీరు శేఖర్ చెల్లెలా? అయితే పెళ్ళికూతురు?” అడిగాడు.

    “మా అక్క” అని మాత్రం చెప్పింది. ఇద్దరూ నడుస్తున్నారు. అతనికి విషయం విచిత్రంగా ఉంది.

    ప్రక్కన టేబుల్ మీద ఉన్న కూల్ డ్రింక్స్‌లో ఒకటి తీసి అతనికిస్తూ, “ఎంత పని చేసిందండీ కూల్ డ్రింకు” అన్నది నవ్వు ఆపుకుంటూ. అంతలో ఎవరో “హాయ్ రాగిణి!” అని పలకరిస్తూ వెళ్ళారు.

    రామనాధానికి షాకుమీద షాకు. భరించే స్థితిలో లేడు. “మీ పేరు హరిణి కదా, ఆమెవరో రాగిణి అంటుందేమిటి?” అడిగాడు.

    “మా అన్నయ్య ద్వారా నా పేరు మీకు తెలుసుంటుందేమో అని ముందు జాగ్రత్తగా మార్చి చెప్పాను” మెల్లగా చెప్పింది.

    “ఇంతకీ నన్ను ఎలా టార్గెట్ చెయ్యగలిగారు?” అడిగాడు. అతని ముఖంలో ఉక్రోషం ఉబికి వస్తోంది.

    “అనుకోకుండా మీరెక్కిన బోగీలోనే నేనూ ఎక్కాను. కాకపోతే కాస్త అవతలగా కూర్చుని ఉన్నాను. మీరు మా అన్నయ్యతో ఫోన్‌లో మాట్లాడిన తీరుతో ఈ వ్యవహారానికి ఆహారం దొరికింది. మీ దగ్గరకొచ్చి కూర్చున్నాను. ఈమధ్య మీ మేనేజర్ రిటైర్ అయినపుడు తీసిన మీ ఆఫీసు గ్రూఫ్ ఫొటోలో మా అన్నయ్య ప్రక్కనున్న మిమ్మల్ని చూసిన జ్ఞాపకంతో మీరే అని నిర్ధారించుకున్నాను. మీ గురించి మా అన్నయ్య అప్పుడప్పుడూ చెబుతుంటాడు” అన్నదామె.

    ఇదరూ మెట్లెక్కుతున్నారు. “మీరు ఉత్కంఠ రేకెత్తించే రచయిత కదా, మిమ్మల్ని కాస్త ఉత్కంఠపరచాలని సరదాగా అలా చేసాను. మిమ్మల్ని చూస్తుంటే నా మీద పీకలదాకా కోపం వచ్చినట్లుంది” అన్నది.

    రామనాధాన్ని చూడగానే శేఖర్ “హలో రామూ! రా కూర్చో” అని అహ్వానించాడు.

    “క్రింద నీకోసం అడుగుతుంటే పైకి తీసుకొచ్చానన్నయ్యా!” అన్నదామె ఏమీ తెలియనట్టు. రామనాధం పళ్ళు పటపట కొరకాలనుకొని… విరమించుకున్నాడు.

    “రాగిణి ఇక్కడే ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నది. ఒక పనిమీద హైదాబాద్ వెళ్ళి ఆమె కూడా ఇప్పుడే వచ్చింది. మా నాన్న లేడు కదా. ఈమే ఇక్కడ ఇంటి పెద్ద. పదిమంది మగరాయుళ్ళతో సమానం” అంటూ పరిచయం పూర్తి చేశాడు శేఖర్.

    “బాగా తెలివి, ధైర్యం గల అమ్మాయన్న మాట” అన్నాడు రామనాధం ఆమె వైపు అదోలా చూస్తూ..

    “అదే మా బెంగ. వచ్చే ఏడాదిలోగా ఈమెనూ ఒక్క అయ్య చేతిలో పెట్టాలి. అంతంత మాత్రం వాడు ఈ గడుగ్గాయిని తట్టుకోలేడు” అన్నాడు శేఖర్.

    “ఆ అయ్య ఎవరోగానీ కుయ్యో మొర్రో అనాల్సిందే!” అన్నాడు రామనాధం, ఆమెను ఆట పట్టిస్తూ. శేఖర్ పెద్దగా నవ్వాడు.

    వచ్చిన చిరుకోపాన్ని చిరునవ్వుగా మారుస్తూ అతని వైపు చూసింది రాగిణి. ఆ నవ్వులో “ఎవర్నో కాదు, తమర్నే కుయ్యో మొర్రో అనిపిస్తా” అనే సంకేతాలు రామనాధానికి కనపడుతున్నాయి.

    “నేను సిద్ధం” అన్నట్లుగా ఆమెవైపు చూసాడు. ఎప్పుడూలేని సిగ్గు ఆమెను ఆవహించింది. వడి వడిగా క్రిందకు వెళ్ళిపోయింది.

    రాత్రి పెళ్ళి వైభవంగా జరిగింది. భోజనాలు అయ్యాక అందరికీ వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరాడు రామనాధం. రాగిణితో పాటు శేఖర్, వాళ్ళ అమ్మ కూడా గేటు దాకా వచ్చారు. “మీ కథలు చాలా ఉత్కంఠభరితంగా ఉంటాయి రామనాధం గారు!” అన్నది రాగిణి.

    “వదు తల్లీ! మళ్ళీ మొదలుపెట్టకు. పడ్డ ఉత్కంఠ చాలు. ఇకపై భక్తి కథలు వ్రాసుకుంటూ ఈ శేష జీవితం గడిపేస్తా” అన్నాడు నమస్కారం పెడుతూ. అందరూ పెద్దగా నవ్వారు. రామనాధం కళ్యాణమండపం బయటకు వచ్చాడు…

    దగ్గర్లో ఉన్న ఆటో స్టాండు వైపు ఆలోచిస్తూ నడుస్తున్నాడు. తన కథల్లో దొంగను పట్టుకోవడం కోసం డిటెక్టివ్ ఎన్నో ఎత్తులు వేసి ప్రయాస పడాల్సొచ్చేది. కానీ నిజ జీవితంలో తన మనసును దొంగిలించిన దొంగ వెంటనే దొరికిపోయింది. ఊహించని రీతిలో తన ఊహా సుందరి దొరికింది… అన్వేషణ ముగిసింది… మనసు మురిసింది… బ్రీఫ్‌కేస్ పట్టిన చెయ్యి బిగిసింది… నడక మారింది… మ్యూజిక్ మొదలైంది.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here