[box type=’note’ fontsize=’16’] సిరియాలో పసిపిల్లలపై ఆమ్లదాడికి శోకంతో… చివుకుల శ్రీలక్ష్మి అందిస్తున్న కవిత “ముసుగు తీయ్!”. [/box]
మానవత్వం మృగ్యమైననాడు
దానవత్వం వికటాట్టహాసమే!
విలయతాండవపు జోరులో
విచక్షణ లేని పిశాచములు
చెలరేగుతున్నాయి
విశ్వమంతటా!
చాప కింద నీరులా
శాంతి ప్రదేశాలను
ఆవరిస్తూ…
కన్నుమూసి తెరిచేలోగా
కత్తులతో కుత్తుక లనూ
గొడ్డళ్ళతో గళాలనూ
కామంతో కాయాలనూ
మైకంలో మేనులనూ
ఆమ్లాలతో ఆయువులనూ
అరక్షణంలో ఆవిరి చేస్తూ
చేసే విధ్వంసం!!
నీకేం కావాలో నీకే తెలీదు?
ఎవరి ప్రోద్బలమో తెలీదు?
మనుషుల ఉసురు తీసేందుకు
తుపాకీ చేతిలో పట్టిన నరహంతకా!
నీ ఆయువెంతకాలమో?
నీకే తెలీని స్థితి!!!!
ఎక్కడిదీ పాశవికత!
ఎవరు నేర్పిన సంస్కారమిది?
మనసూ-తనువూ కూడా
ఎంత బండబారి
శిలగా మారకపోతే
ఇంత ఘాతుకం!!
ప్రతి మనిషిలో
దైవాన్నే చూడమనే
మతసారం
మదిలో లేదా??
పసిపాపల మోములో
దైవాన్ని చూడలేకపోయావా??
విలపించే చిన్నారుల
తల్లుల ఆక్రోశపు రోదన
నీ చెవులు పడలేదా?
విను.
అందులో రేపు
నీ తల్లి రోదన కూడా
మిళితమవుతుంది
ఎవరో చెపితే వేసుకున్న
రక్కసి ముసుగు
తీసి పారేయి!
నీ నిజరూపం చూడు
మనిషివి కదా!
మానవత్వం కలిగి ఉండు!