మువ్వల చర్నాకోల

0
2

[dropcap]”స[/dropcap]ర్! ప్లీజ్. ఇంకెప్పుడూ ఇలా చేయం. రికార్డుల్లో సంతకాలు లేకపోతే రేపటి ప్రాక్టికల్స్‌కు చాలా ఇబ్బంది పడతాం. ఈ ఒక్కసారికి సంతకం పెట్టండి. ప్లీజ్ సార్” అంటూ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదివే విద్యార్థులు ప్రొఫెసర్ రావుగారి కాళ్ళా వేళ్ళా పడుతున్నారు.

“కాలేజ్ వర్క్ కాలేజ్ లోనే. ఇంటికెవరు రమ్మన్నారు మిమ్మల్ని, ప్రాక్టికల్స్‌కు రానివ్వకపోతే ఆగిపోండి. మీ ముగ్గురూ ఫ్రెండ్స్, వర్క్ చెయ్యకపోవటంలో కూడా ఫ్రెండ్‌షిప్‌ను చూపించుకుంటున్నారు.”

“ప్లీజ్ సర్! ఈ ఒక్కసారికే సంతకాలు పెట్టండి. ఇంక ముందెప్పుడూ ఇంటికొచ్చి మిమ్మల్ని విసిగించం. ప్లీజ్ సర్” అంటూ కిరణ్ మరీ ప్రాధేయపడుతున్నాడు.

పవన్ తన రికార్డు తెరచి పట్టుకున్నాడు. మధ్యమధ్యలో టైం చూచుకుంటున్నాడు. ఆదివారం కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఏదో ప్రోగ్రాం పెట్టుకుని వుంటారు. దానికి లేటవుతుందేమోనని మాటిమాటికి టైం చూసుకుంటున్నాడని రావుగారికి అర్థమయ్యింది. అందుకే నాలుగింటికల్లా తన దగ్గరకు వచ్చారు. రికార్డుల్లో సంతకాల కోసం తాపత్రయపడుతున్నారు.

“ఎక్కడకెళ్ళాలి? సాయంత్రం మీ ప్రోగ్రాం ఏమిటి? ఊర్లో వుంటున్నారా? వేరే వూరు వెళ్లాలా?”

“పవన్ కె.టి.యమ్ బండి కొన్నాడు సర్. ఆ సందర్భంగా ‘హాయ్‌లాండ్’లో ఫ్రెండ్స్‌కు పార్టీ ఇస్తున్నాడు.” అని దీపక్ చెప్పాడు.

“మనకు యార్డులో ఎడ్లపందేలు ఈరోజే మొదలు గదా సర్! వాటి ప్రారంభోత్సవానికి మా అభిమాన హీరో వస్తున్నాడు సర్, మా హీరోను చూసి వెంటనే ‘హాయ్‌లాండ్’ కెళ్ళిపోతాం.” అంటూ కిరణ్ తమ ప్రోగ్రాం ఏంటో వివరించాడు.

“మీ హీరోను మాత్రం తప్పనిసరిగా చూడాలి, అవునా? దానికి లేట్ కాకూడదు. అంటే నేను మీ రికార్డుల్లో సంతకాలు వెంటనే పెట్టి పంపించాలి అంతేనా?”

దానికి సమాధానంగా మిత్రులు ముగ్గురూ కొద్దిగా నవ్వారు.

“ముందు మీరు స్థిమితంగా కొంచెంసేపు కూర్చోండి. మనం కొంచెంసేపు మాట్లాడుకుందాం. మీ ప్రోగ్రాం పాడవుతుందని భయపడకండి.”

“అదేం కాదు సర్. యార్డ్‌లో కొచ్చే హీరోను చూడాలి, అంతే.”

“సినిమా హీరో అంటే మన ఊరు వస్తున్నాడు. దగ్గరగా చూసే అవకాశం వదులుకోగూడడు. వెళ్లి చూస్తారు. కుదిరితే మాట్లాడతారు, సెల్ఫీలు దిగుతారు. ఎంజాయ్ చేస్తారు. ఒక పావుగంటో, అరగంటో వుండి సినిమా వాళ్ళు ఎడ్ల పందాలు ప్రారంభించి సందడి చేస్తారు. వెంటనే వెళ్లిపోతారు. ఆ తర్వాత మన ఎడ్లు ప్రదర్శనకు దిగుతాయి కదా? అవేమీ చూడరా?”

“ఎడ్లనీ, గొడ్లనీ ఏం చూస్తాం సర్, అవి బరువు బండను లాగుతూ అటూ ఇటూ తిరుగుతాయి. చూడటానికి ఏముంటుంది?”

“అలా అనకు పవన్. ఆ బండను లాగుతూ ఆ ఎడ్లు అటూ ఇటూ తిరగటానికి ఎంత కృషి అవసరమో ఆలోచించు. మనది వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. మన ఒంగోలు జాతి పశువులు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి. గోవులూ, ఎడ్లూ, పశువులూ మన సంపద. వీటన్నింటి పట్ల కొంచెమైనా శ్రద్ధ పెట్టాలి మీరు. పట్టణాల్లో వుండేవాళ్ళం మనం. మనకు వాటితో పరిచయం తక్కువ. పట్టణాల్లో కూడా పశు సంపదను ప్రేమించే వాళ్ళున్నారు. గ్రామాల్లో విశాలమైన చావిళ్ళు, పశుగ్రాసపు వాములు, పచ్చిక బయళ్ళూ వుంటాయి. ఇంతకు మించి పశువుల్ని తమ ఇంట్లో పిల్లలతో సమానంగా ప్రేమించే రైతులున్నారు. ఆ రైతులు పాలను ఉత్పత్తి చేస్తేనే మనమంతా కాఫీలూ, టీలు, పెరుగు వాడుకోగల్గుతున్నాం.”

‘ఇప్పుడు కూడా క్లాసు తీసుకుంటున్నారురా బాబూ, ఎప్పటికి వదిలిపెడతారో’ అన్న భావం పవన్ ముఖంలో కనబడింది.

“మనవారికి ఆవులు చాలా పవిత్రమైనవి. ఆవు పాలు ఎంత శ్రేష్ఠమైనవో మీకు తెలియదు. చిన్నప్పుడు ఆవుపాలు తాగి పెరిగితే మీరు ఇంకా చురుగ్గా వుండేవారు. ఇలా సకాలంలో వర్కు పూర్తి చేయకుండా వుండి తంటాలు పడేవారు కాదు. ఈ ఎడ్ల పందాలలోనే ఆవులకు కూడా ప్రదర్శనలు, పోటీలు వుంటాయి. పాల దిగుబడిలోనూ, ఆరోగ్య విషయంలోనూ పోటీ వుంటుంది. సినిమాలు మీరు ఏ ఊళ్లోనైనా చూడొచ్చు. ఇంట్లో కూడా కూర్చుని సినిమాలు చేసుకుని చూడొచ్చు. క్రికెట్ మ్యాచ్ టీ.వీ.లో ప్రసారం అవుతుంటే క్లాసులెగొట్టి వచ్చి చూస్తారు. పొరపాటున మనకు దగ్గర్లో క్రికెట్ మాచ్ జరుగుతుంటే కాలేజ్ ఊసే వుండదు అవునా? కాని మన సంప్రదాయబద్ధమైన పశువుల ప్రదర్శన పోటీలు జరుగుతుంటే మీద ధ్యాసే లేదు. వాటిని చూసేదేముంది అనుకుంటున్నారు.”

ముగ్గురిలో ఎవరూ ఏమీ మాట్లాడలేదు.

“ఇంకొకటి రెండు విషయాలు చెప్పి వదిలేస్తాను. బాగా ఎండలు కాసేటప్పుడు ఎండ దెబ్బ రాకకుండా, దప్పికతో బాధపడకుండా కొబ్బరినీళ్ళు త్రాగించి పశువుల్ని సేదతీర్చే రైతులున్నారు. దోమల బారిన పడకుండా దోమతెరలు కట్టటం, నిరంతర గాలి ప్రసారం కోసం ఫాన్ల క్రిందనే పశువుల్ని సంరక్షించటం ఈనాడు సర్వసాధారణమైనది. పశువులకు కూడా ఎంతో బలవర్థకమైన ఆహారాన్ని ఇస్తున్నారు. ఇలాంటి పోటీలకు తీసుకురావాలంటే ఆ రైతు ఎన్నో వ్యయప్రయాసలకోరుస్తున్నాడు. ఏ లారీలలాంటి వాటిల్లోని పశువులతో కలసి ప్రయాణం చెయ్యాలి. పోటీలకు వచ్చిన చోట కొత్త వాతావరణంలో ఆ పశువులు ఇమడగలగాలి. ప్రదర్శన తిలకించటానికి సమీప ప్రాంతాల నుండి వేలాదిగా ప్రజలు పోగవుతారు. వాళ్ళందరినీ చూసి అవి బెదిరిపోకుండా చూసుకోవాలి. ఈ కార్యక్రమంలో సహకారం అందించటానికి ఎంతోమంది పశువైద్య నిపుణుల అవసరం కూడా ఎంతో వున్నది. ఎప్పటికప్పుడు వాటిని పరీక్షిస్తూ వుండాలి. ఇవన్నీ నేను చెప్పటం కాదు. మీరు వెళ్ళి స్వయంగా చూసి రండి. మీ అభిమాన హీరోతో పాటు మన రైతన్నను, అతను పెంచి పోషించే పశుసంపదనూ గమనించండి. మన తెలుగువారి సంప్రదాయబద్ధమైన విషయాలు పాడి, పంటా, చేతివృత్తుల ప్రదర్శన వుంటాయి. వ్యవసాయ శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్త కొత్త విత్తనాల్ని రైతులకు చూపిస్తారు. యువకులైన మీరు ఇలాంటి సందర్శన ఎక్కడ దొరుకుతుంది? కె.టి.యమ్. బండి కొనుక్కున్నావు. సంతోషం. వేలు ఖర్చుపెట్టి ‘హాయ్‌లాండ్’లో పార్టీ ఇవ్వాలనుకుంటున్నావు. ఆ ఖర్చుతో ఇక్కడి కొచ్చిన సందర్శకులకు తలా ఒక గ్లాసెడు మంచి మజ్జిగ ఇప్పించు. ఎంతో మందికి దప్పిక తీరుతుంది. ‘హాయ్‌లాండ్’ అక్కడే వుంటుంది. ఎప్పుడైనా వెళ్ళచ్చు. కాని ఈ ప్రదర్శన వుండదు గదా? మనకి వచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. నా మాట విని ఒక్కసారి అక్కడికెళ్ళి ఆ ప్రదర్శన చూడండి. నేను కూడా రోజూ వెళ్ళి చూస్తాను.”

“తప్పకుండా సర్! ఎడ్లపందాల పోటీలు చూచి వచ్చి ఆ విశేషాలన్నీ మీకు చెప్తాం” అంటూ ముగ్గురూ బయటకి నడిచారు.

యార్డు ఆవరణలోనికి చేరుకున్నారు మిత్రులు ముగ్గురూ. గాలరీలన్నీ జనంతో కిక్కిరిసి వున్నాయి. అభిమాన సినీహీరో ఊరేగింపు దగ్గరగా వచ్చినట్లున్నది. బాణాసంచా పేలుళ్ళు గట్టిగట్టిగా వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన రైతొకరు తాను పెంచుకునే పెంపుడు గుర్రాన్ని బాగా అలంకరించి తీసుకువచ్చారు. హీరోగార్ని జీపులో నుంచి దింపి ఆ గుఱ్ఱమెక్కించారు. సినిమాల్లో గుర్రపుస్వారీ అనుభవమే కాబట్టి చేతిలో కమ్చీని బట్టి, విలాసంగా స్వారీ చేసుకుంటూ లోపలికి వచ్చాడు. ప్రేక్షకులు తమ చప్పట్లతో హృదయపూర్వక స్వాగతం చెప్పారు. లోపలి మైదానంలో రెండు బలిసిన పొట్టేళ్ళతో పూన్చిన చిన్న బండినొకదాన్ని సిద్ధంగా వుంచారు హీరో గారి కోసమే. పొట్టేళ్ళ స్వారీ కూడా కన్నులపండువగా చేసి చూపించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. తర్వాతి కార్యక్రమం ఎడ్ల బల ప్రదర్శన ప్రారంభించటం.

రెండు పళ్ళు కలిగివున్న ఎద్దులను పోటీలోకి దించారు. వయసులో చిన్నవి కాబట్టి ఒకటో నంబరు రాతిని కట్టి ప్రదర్శనను హీరోగారి చేత ప్రారంభింపచేశారు. ప్రారంభోత్సవం ముగియగానే ప్రేక్షకులనుద్దేశించి చిన్న ఉపన్యాసం చేశాడు. వెంటనే వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయాడు.

సినీహీరో కాబట్టి ఆయన ఏం చేసినా ప్రేక్షకులకు ఆనందమే. టాపులేని జీపులో రోడ్డు ప్రయాణం చేసినా, గుఱ్ఱపు స్వారీతో లోపలికి వచ్చినా, పొట్టేళ్ళు పూన్చిన బండిలో విహరించినా అన్నీ అద్భుతమే. ఆయన్ని అభినందిస్తూ చప్పటే చప్పట్లు, ఈలలు, కేకలలో ప్రాంగణమంతా దద్దరిల్లేటట్లు తమ హర్షధ్వానాలను తెలియజేశారు.

ఎడ్లజతలు ఒక్కొక్కటి ప్రదర్శనకొస్తున్నాయి. పోటీలో పాల్గొనేవారు తమ తమ జతలను శుభ్రంగా వుంచారు. గులాం కొట్టి తీసుకొచ్చారు. ఎడ్ల తలపై కుచ్చులతోను, మూపురం దగ్గర, వీపుపైన పూలదండలతో నడుంపట్టీలతో అలంకరించారు. ఈ ఎడ్ల జత, ఎన్ని నిముషాల టైంలో ఎన్ని మీటర్ల దూరం బరువు బండను లాగగలిగిందో రిఫరీ మైకులో పెద్దగా చెప్తున్నాడు. రైతులు తమ తమ ఎడ్ల జతలు మిగతా జతల కన్నా తక్కువ టైంలో ఎక్కువ దూరం బండను లాగాలని ఆతృత పడుతున్నారు. ఎడ్లతో కూడా నడిచేవారిని, వాటిని “మీ మువ్వల చర్నాకోలతో కొట్టవద్దనీ, ఛో, ఛో అంటూ తోకల్ని మెలిపెట్టి పరిగెత్తించటానికి ప్రయత్నించవద్దనీ” రిఫరీ సూచనలిస్తున్నాడు.

ఎడ్లవయసును బట్టి లాగుడు బండ నెంబరు పెరుగుతూ వుంటుంది. వేరే జిల్లాల నుంచి కూడా వచ్చి ఈ పోటీలో పాల్గొంటూ వుంటారు. ముందు వచ్చిందనుకున్న జత అంతలోనే వెనుకపడిపోతూ వుంటుంది. వెనుకపడిపోయిందనుకున్న ఎడ్లజత మరొక జత మరీ నెమ్మదిగా నడవటం వలన ముందుస్థానంలోకి వెళ్తూవుంటుంది. ఎడ్ల జతల యజమానులకే కాదు, ప్రేక్షకులకు చాలా ఉత్కంఠగా వుంటుంది.

ఒకింత ఆసక్తిగానే ఎడ్లపందాలు చూస్తున్నారు. ‘బోర్‌గా ఏం లేదు. బాగానే వుంది’ అనుకున్నారు మిత్రులు ముగ్గురూ. ఆ తర్వాత అవుల్ని కట్టివేసిన షెడ్లవైపుకు వెళ్ళి చూశారు. ఆవులూ, వాటితోపాటు కొన్ని చిన్నిదూడలూ వున్నాయి. వాటిల్లో ఒక కపిలగోవు కూడా వున్నది. బాగా బలిష్టంగా, ఆరోగ్యంగా వున్నది. ఇటీవలి కాలంలో వీటికి చాలా ప్రాధాన్యం పెరిగింది. అక్కడ వున్నవాటిలో మరొక రెండు ఆవులు కూడా నిండుగా, పుష్టిగా, కామధేనువుల్లా వున్నాయి. తప్పకుండా ఇవి పోటీలో ప్రైజులు గెలుచుకుంటాయని భావించారు.

వరుసగా వున్న షెడ్లలో కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేసి వున్నాయి. మొదటి స్టాల్లో వరికంకులతో చేసిన అందమైన గుత్తులు నాలుగువైపులా వేలాడదీయబడివున్నాయి. రంగురంగుల ఊలు వుపయోగించి దాని సహాయంతో వరికంకులను బంధించి గుత్తిలాగా తయారుచేశారు. అవి చూట్టానికి పెద్ద సైజులో వున్నాయి, చాలా ఆకర్షణీయంగా కూడా వున్నాయి, కంకుల నుండి వడ్ల గింజలు రాలకుండా కళాత్మకంగా, గుచ్ఛంలాగా మలిపిన రైతు నేర్పరితనమూ తెలుస్తున్నది. రకరకాల వరి విత్తనాల్ని కూడా ప్రదర్శనకుంచారు. ఏ విత్తనం ఎన్ని రోజుల్లో కోతకొస్తుందో, ఎంత దిగుబడి ఇస్తుందో, చీడపీడల్ని ఎలా తట్టుకుంటుందో వ్యవసాయ శాఖవారు చెప్తున్నారు.

రెండవ స్టాల్లో రకరకాల కూరగాయలు కనపడుతున్నాయి. ముఖ్యంగా పెద్ద సైజులో వున్న రంగురంగుల కాప్సికమ్‌ను పేర్చివుంచారు. ముల్లంగి, కీరదోస, పొడవాటి బీన్స్, కారట్ ఇవన్నీ ప్లాస్టిక్ బుట్టల్లో సర్దివున్నాయి. మన ప్రాంతంలో వీటిని ఏ నేలలో పండించవచ్చో లాంఫారం నుంచి వచ్చిన వ్యవసాయ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.

మూడవ స్టాల్లో మసాలా పెట్టి వేయించిన చేపముక్కలూ, రొయ్యలూ ప్లాస్టిక్ కవర్లలో పెట్టి అమ్మకానికుంచారు.

మామూలు తినుబండారాల స్టాల్స్ చాలా వున్నాయి. రేపట్నుంచి వ్యవసాయ పరికరాల స్టాల్ కూడా ఏర్పాటవుతుందని చెప్తున్నారు. పెద్ద పెద్ద వాళ్లంతా ఈ పోటీలు చూడటానికి వస్తారని మైకులో చెప్తున్నారు. ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వుంటాయని కూడా మైకులో వినపడుతున్నది.

వారం పదిరోజులపాటు జరిగే కార్యక్రమం ఇది. ప్రదర్శన పూర్తయిన ఎడ్లని, ఆవుల్ని అక్కణ్ణుంచి వెంట వెంటనే యజమానులు తమ ఊరుకు తరలించుకుపోతున్నారు. కొత్త జతలు వస్తూనే వున్నవి.

జత ఎడ్లూ ఒకరివే కాకుండా ఇద్దరి యజమానులకు చెందిన చెరొక ఎద్దును కూడా చేర్చి జతగా మార్చి పోటీలోకి దించుతున్నారు. పోటీలో పాల్గొన్న యజమానులందరకూ ప్రోత్సాహక బహుమతులూ, సర్టిఫికెట్లు ఇస్తున్నారు. రేపటి నుండి రాబోయే సందర్శకులలో మంత్రుల, యమ్.పి.ల, యమ్.ఎల్.ఎ.ల పేర్లు ప్రకటిస్తున్నారు. ప్రదర్శనలో గెలుపొందిన ఎడ్లజతలకు భారీగానే దాతలు నగదు బహుమతులూ ఇవ్వనున్నారని తెలియజేస్తున్నారు.

మిత్రులు ముగ్గురూ యార్డ్ అంతా కలియదిరిగి చూశారు. ‘ఎడ్లు, బండ లాగుడు పోటీ’ ఇదొక్కటే వారికి తెలిసిన సమాచారం. కాని ఇక్కడకొచ్చి చూస్తే విషయం చాలా గొప్పగావున్నది. ఇదంతా సర్ చెప్పటం వల్లే చూడగలిగారు. ఎంతమంది శ్రమపడితే ఈ కార్యక్రమం సజావుగా నడుస్తుందో అర్థమయింది. ప్రేక్షకులను, కరెంటు వారిని అప్రమత్తంగా వుండాలని హెచ్చరికలు వినపడుతున్నాయి. ఇదంతా ఒక పెద్ద పండుగలాగా వున్నది. ఇక్కడికి రాకపోతే ఈ పండుగలో పాలుపంచుకోలేకపోయేవాళ్ళం అనుకున్నారు. హాయ్‌లాండ్ వెళ్ళలేకపోయామన్న నిరుత్సాహం కొంచెమైనా లేదు. అక్కడున్న ఒక రైతు చేతిలోని మువ్వల చర్నాకోలను అడిగి తీసుకుని దానిని పరిశీలించి చూశారు మిత్రులు ముగ్గురూ. యార్డ్‌లో చివరగా జనతా కాంటీన్ ఉన్నది. తినుబండారాలన్నీ స్వల్పలాభాలకు అమ్ముతున్నారు. ‘వచ్చినవారందరికీ తలా ఒక గ్లాసు మంచి మజ్జిగ ఇప్పించు’ అన్న సర్ మాట గుర్తుంది పవన్‌కు. ఈ కాంటీన్ వాళ్ళకు చెప్పి రేపటి రోజున ఆ పని పూర్తి చేయాలనుకున్నాడు. పచ్చిగడ్డి మోపులు పెట్టుకుని అమ్మకానికి కూర్చున్నారు కొందరు. వాళ్ళతో బేరం మాట్లాడి పది మోపులు కొన్నారు. వాళ్ళచేతే ఆ గడ్డిని మోయించుకొచ్చి షెడ్లలో కట్టివేసివున్న పశువులకు దాణాగా వాడమని అక్కడున్నవారికి చెప్పారు. అక్కడున్న ఎడ్ల మీద ఆవుల మీద చేతులు వేసి దగ్గరగా నిలబడి పవన్ తన చేతిలో మువ్వల చర్నాకోల పైకెత్తి పట్టుకుని మరీ సెల్ఫీలు తీసుకున్నారు.

‘సర్ ఈపాటికి వచ్చేసి ప్రేక్షకుల్లో కూర్చుని వుంటారు. రేపు కాలేజ్‌లో కలసి ఈ వివరాలన్నీ చెప్పాల’నుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here