27-2-2022 తేదీన విశాఖ సాహితి అధ్యక్షులు ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి అధ్యక్షతన ప్రముఖ రచయిత శ్రీ ఎం.వెంకటేశ్వరరావు గారి ‘ఏటిలోని కెరటాలు’, ‘బంధాలు – అనుబంధాలు’ పుస్తక ద్వయం ఆవిష్కరణ కార్యక్రమం అంతర్జాల మాధ్యమంలో జరిగినది.
డా.కె.కల్యాణభారతిగారి ప్రార్థనా గీతంతో ప్రారంభమైన సభలో ఆచార్య మలయవాసిని గారు మాట్లాడుతూ, శ్రీ వెంకటేశ్వరరావు గారి కథా సంకలనంలోని కథలు స్త్రీ ప్రధాన ఇతివృత్తాలతో పాఠకులలో ఆలోచన రేకెత్తించేవిగా ఉన్నాయని ప్రశంసించారు.
విజయవాడ నుంచి ప్రముఖ కథారచయిత్రి, వ్యాసకర్త డా. చెంగల్వ రామలక్ష్మి గారు ముఖ్య అతిథిగా పాల్గొని, రెండు పుస్తకాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీ వెంకటేశ్వరరావు గారి ఈ రచనలలో మానవ సంబంధాలు నిలుపుకోవడానికి ఇద్దరు వ్యక్తుల మధ్య నమ్మకం నెలకొనాలనే విషయం అంతర్లీనంగా విశదమౌతుందని, ఇవి యువత తప్పక చదవాలని పేర్కొన్నారు.
డా. దామెర వెంకట సూర్యారావు గారు ‘ఏటిలోని కెరటాలు’ కథా సంకలనం సమీక్ష చేస్తూ, ఈ కథా సంకలనం మానవ సంబంధాలకి ప్రతీకగా నిలుస్తుందని, తమ రచనలలో రచయిత సమాజాన్ని సమగ్రంగా అన్ని కోణాలనుంచి వీక్షించి, ఆవిష్కరించారని పేర్కొన్నారు.
విజయవాడ నుంచి పాల్గొన్న శ్రీ బొడ్డపాటి చంద్రశేఖర్ గారు రచయితతో తమకు కీ.శే. ఎమ్వీయల్ గారి ద్వారా అనుబంధం ఏర్పడిందని తెలియజేసారు. వారు ‘బంధాలు – అనుబంధాలు’ పుస్తక సమీక్ష చేస్తూ, శ్రీ వెంకటేశ్వరరావు గారి రచనలలో స్త్రీ పాత్రల చిత్రణ ఔన్నత్యభరితంగా ఉంటుందని చెబుతూ, రచయిత ప్రతివారిలోను మంచిని చూడగలిగే అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించారు.
రచయిత శ్రీ వెంకటేశ్వరరావు గారు తమ స్పందనలో, తాము చిన్నప్పుడు నూజివీడులోని డిగ్రీ కళాశాలలో చదువుతున్నప్పుడు కీ.శే. ఎమ్వీయల్ గారి శిష్యరికంలోను, వారి ప్రోత్సాహంతోను మొదలైన రచనా వ్యాసంగం ఇప్పటికీ కొనసాగుతున్నదని చెబుతూ, తమ రచనలోని ఇతివృత్తాలు సమాజంలోంచే తీసుకున్నానని, సాహిత్యానికి ఎదో ఒక ప్రయోజనం ఉండాలని తాము నమ్ముతామని తెలియజేసారు.
దేశ విదేశాలనుంచి పలువురు సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు పాల్గొన్న ఈ అంతర్జాల సభకు విశాఖ సాహితి కార్యదర్శి శ్రీ ఘండికోట విశ్వనాధం సమన్వయకర్తగా వ్యవహరించారు.