నా అసలు నీడ

0
4

[box type=’note’ fontsize=’16’] సొంత ఊరిని, అక్కడి ప్రకృతిని, మిత్రులను తలచుకుంటూ, ఆ ఊరు తనకెంత ధైర్యాన్నిస్తుందో చెబుతున్నారు డా. విజయ్ కోగంటి “నా అసలు నీడ” అనే వచన కవితలో. [/box]

[dropcap]ఆ[/dropcap]కుపచ్చని నీడై నిలచిన మా వూరే
నా చిన్న తనపు జాడ
ఎప్పటికీ

చెరువు వడ్డున ఒంటి కాలిపై
తపస్సు చేసే కబోది పక్షుల చెట్టూ
చెరువులో అలల అవతల పెద్ద కళ్ళతో
కవ్వించిన ఆ తామరలూ కలువలూ
దూరంగా మంద్రంగా మోగే గుడిగంటా
నా కలల వేదికకు ఎప్పటికప్పుడు
రంగులతెరలు కడతాయి
ఆనంద సంగీతమూ అమరుస్తాయి

అల్లరి కొంకికర్రతో లాగి తెంపుకున్న
కొన్ని దొంగవూహలు
నవ్వుల సీమచింతలై
వామనకాయలై
రాలిపడుతుంటాయి

అంతులేని చల్లని కలలా పారుతూ వచ్చి
తనతో కబుర్లాడమని
కవ్వించిన ఆ యేరు
తలచినపుడల్లా సేదతీర్చి
ఎగుడు దిగుడుల జీవితపు
ప్రవాహపాఠం చెపుతూంటుంది

మమ్మల్ని సాహసవీరులని చేసేందుకు
కొండకొమ్మున నిలిచి
పిలిచి పలకరించి
మా జేబు సంచులనిండా
వజ్రపుతునకల బంకముక్కలను నింపిన
ఆ తుమ్మ చెట్టు
గాఢమైన బంధాన్ని పెంచుతూ
ధైర్యాన్నిచ్చే పెద్దన్నే అవుతుంది

రహస్యంగా
కాగితపు పొట్లంలో
స్నేహితులు దాచి తెచ్చిన
మిఠాయి మాటలు
ఎప్పటికీ నోరూరించి
నవ్విస్తూ మనసును
తీపి చేస్తూ నిలుస్తాయి

ఈ పట్టణపు నడిరోడ్ల
రణగొణలమధ్య
కృత్రిమంగా చిక్కుకున్న నన్ను పిలుస్తూ
ప్రేమగా నిస్సహాయంగా
ఇంకా దగ్గరగా ఓదార్చేందుకు
చేతులు చాస్తూ
మా వూరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here