[box type=’note’ fontsize=’16’] మన దేశం నిజంగా ఎప్పుడు గౌరవించబడుతుందో చెబుతున్నారు కాకర్ల హనుమంత రావు “నా దేశం – నా స్వగతం” అనే కవితలో. [/box]
[dropcap]ఈ[/dropcap] ధాత్రి – కాలాగ్ని పూనీత
ఈ ధాత్రి –విశ్వ వందిత
అయితేనేం
కన్యాశుల్కాన్ని – సహగమనాన్ని
వేల సంవత్సరాలుగా నడిపించుకొచ్చింది!
ఈ ధాత్రి – సస్యశ్యామల దివ్యగాత్రి
ఈ ధాత్రి – శాంతి సామరస్యాల విశ్వనేత్రి
అయితేనేం
రైతు బలవన్మరణాల సమాధిసీమ
తరతరాలుగా మతం మారణ కాండల యుద్ధకాండ!
ఈ ధాత్రి – సహన రాగాల దివ్యమంత్రం
ఈ ధాత్రి – ఆధ్యాత్మిక మంత్ర తంత్రం
అయితేనేం
మందిరాల్ని, మసీదుల్ని కూల్చేసుకుంది
దొంగ సాధువులకి నీరాజనమిచ్చింది!
ఈ ధాత్రి – సుమసుందరి, మధురభాషిణి
ఈ ధాత్రి – హిమానీపులకిత సుందర దరహాసిని
అయితేనేం
మన స్త్రీ గౌరవాన్ని తూకం వేసి మరీ అమ్మేసింది
పేదల్ని నోరెత్తకుండా అణచివేసింది!
ఈ ధాత్రి మాటల్లో సమ్మోహనాస్త్రం
ఈ ధాత్రి చేతల్లో అవ్యక్త శస్త్రం
అయితేనేం
ప్రపంచానికి గురువుననుకుంటోంది
ప్రవవచనాలిస్తే అంతే చాలనుకుంటోంది!
సమతావాదం నిజమైనపుడు
సామ్యవాదం బలపడినపుడు
అపుడే, నిజంగా అపుడే-
ఈ ధాత్రి నిజమైన అగ్ని పునీత అవుతుంది.
ఈ ధాత్రి నిజమైన విశ్వవందిత అవుతుంది.