Site icon Sanchika

నా బాల్యం కతలు-12

[box type=’note’ fontsize=’16’] ‘నా బాల్యం కతలు’ అంటూ తన చిన్ననాటి ముచ్చట్లను అందిస్తున్నారు జిల్లేళ్ళ బాలాజీ. [/box]

12. గుడ్డొచ్చె, తోక పాయె… ఢాం ఢాం ఢాం!

[dropcap]ఒ[/dropcap]గరోజు మా పెద్దమ్మ నన్నూ, మా సిన్నక్కనూ పిలిచి…. “మేయ్… నేను నాన్నారం (నారాయణవరం) పోతాండా. ఆడ మంచి ఎంటిక ఉండాదంట. కొనక్కొచ్చి ఈడ మారు బేరానికి అమ్ముకున్నా నాల్రూపాయిలు ఎనకేసుకోవచ్చు. మీ తాతా పెదనాయిన కూడా ఊళ్లో లేరు, మేళానికి పొయ్యుండారు. మీ పెదనాయిన ఈ ఎంటికి యాపారం గురించి ఇన్నేండంటే నన్ను తగులుకుంటాడు. ఆయన లేనప్పుడే నేను పొయ్యిరావటం మంచిది. ఇంటికాడ జాగర్త మే.” అని చెప్పింది.

మా పెద్దమ్మ ఊరికి పోతాఉందని తెలిసేకొందికి నాకు మాంచి ఉసారొచ్చేసింది. “నువ్వు ఊరికి పొయ్‌రా పెద్దమ్మా. మేం ఇంటికాడ జాగర్తగా జూసుకుంటాములే.” అన్నా మా పెద్దమ్మకు దైర్నమిస్తున్నట్టుగా.

ఇంట్లో పెద్దోళ్లు లేపోతే రాజ్జిం మందే గదా! ఎంత సేపు ఆడుకున్నా అడిగేటోళ్లు ఎవురుండారనీ?

“మద్దేనానికి మీ ఇద్దరికి మాత్రమే అన్నం వొండేయ్ మే! ఏదన్నా చారు చేసేటట్టుంటే చెయ్యి, లేదంటే మీ అత్తనడిగి ఇంత చారు తీసకొచ్చి ఇద్దురూ తినేయండి.” అనింది మా పెద్దమ్మ.

“అట్నే పెద్దమ్మా, ఏదో ఒగ చారు జేస్తాలే. యాళ అయితాంది, ఇంగ నువ్వు బయలుదేరు.” అనింది మా సిన్నక్క.

“సందేళకంతా తిరిగొచ్చేస్తాలే, మే! వొకేళ నేవొచ్చేసరికి ఆలీసమైతే… ఈది ఊడ్సి ఒగ ముగ్గర్ర ఏసేయి. బోకులు సుబ్బరంగా కడిగిబెట్టేయి… ఒగటిన్నర తొవ్వ బియ్యమెత్తుకోని రాళ్లేరి, గాలించి, నానబెట్టేయి. నేవొచ్చి వొంటజేస్తాలే” అంటా వంటింట్లోకి పొయ్యి దొంతిలో దాసిన దుడ్డును తీసుకొని ఊరికి ఎలబారింది.

నాలుగడుగులు ఈదిలోకి నడిసి ఏదో గుర్తుకొచ్చి, నాకాడికొచ్చి… “బాలా… మన తెల్లమచ్చల ఎర్రకోడి ఉండ్లా, అది పొదుగుకొచ్చేట్టుంది. పద్దినాలుగా గుడ్లు పెడతాంది. పదీ పదకొండు గంటలప్పుడు గుడ్డు పెట్టేదానికి పెళ్లో (పెరట్లో) కొస్తాది. అప్పుడు జాగర్తగా కాపెట్టుకుని దాన్ని గంపకింద మూసేసినావంటే, అది నిమ్మళంగా గుడ్డు పెట్టేస్తింది. కొంచేపయినాంక గంపనెత్తేసినావంటే అది మళ్లా మేతకెల్లిపోతుంది. గుడ్డును తీసకపోయి మిగతా గుడ్లల్లో పెట్టేయ్, సరేనా…” అనింది.

“నువ్వు బయల్దేరు పెద్దమ్మా, ఇట్టాంటియన్నీ నాకు జెప్పాల్నా. అంబిలి తాగినంత వీజీగా ఈ పన్లన్నీ నేను సిటికెలో జేసెయ్యనూ…” అన్నాను నేనో గొప్ప పనిమంతుడిలా.

“సరే సరే, జాగర్తో రే. ఎవురూ లేరని ఇద్దురూ కొట్లాడుకోబాకండి.” అని ఊరికి ఎలబారిపొయ్యింది మా పెద్దమ్మ.

“మేయ్… పెద్దమ్మ సెప్పింది. ఇన్నావు గదా? వొంట జేసేసి, ఇంటి దగ్గరంట జాగర్తగా ఉండు.” అంటా నేను ఆడుకునేటందుకు రెడ్డిగుంట కాడికి ఉరకబొయ్యినాను.

“రేయ్, యాడికి పోతావుండావ్? పెద్దమ్మ నిన్ను కూడా ఇంటికాణ్ణే జాగర్తగా ఉండమనింది!” అనింది ఎగతాలిగా.

“నాతో నీకేం పనిమే. నువ్వు జాగర్తగా ఇంటికాణ్ణే ఉండి, ఇంటి పన్లన్నీ చెయ్యి. నేను ఆడుకునేందుకు పోతాండా.” అంటా మా అక్క అరస్తా ఉన్నా లెక్కజెయ్యకుండా రెడ్డిగుంటగాడికి పరుగెత్తితిని.

అంతే! ఆపైన పొద్దు పోవటం కూడా తెలీనంతగా ఆటల్లో పడిపోతిని. ఆడి ఆడి అలసిపోయి, కడుపులో ఆకలేస్తా ఉంటే అన్నానికి ఇంటికి తిరిగొస్తిని.

“ఇప్పుడు టైం ఎంతయితాందో తెలస్తా ఉండాదా దొరకు? రొండు! ఆటల్లో మునిగిపోతే ఇల్లూ వాకిలీ గూడా గుర్తొచ్చేట్టులేదు అయ్యగారికి!” నన్ను జూసి ఈసడించుకుంటా అనింది మా సిన్నక్క.

“నేను ఆట్లాడుకుంటే నీకేం మే? నీకేమన్నా ఒళ్లు బట్టాల్నా?!” అంటిని నేను ఎగతాళిగా.

“నాకు ఒళ్లు బట్టక్కర్లే. ఇంటికాడుండి ఒక్క పనైనా జేసినావా రా నువ్వు. పెద్దమ్మ రానీ, నీకత జెప్తా.” అంటా నన్ను బెదిరించింది మా అక్క. అప్పటికి గానీ…. పెద్దమ్మ జెప్పిన… ‘కోడి గుడ్డుకొచ్చే ఇసయం’ గుర్తుకు రాలేదు నాకు!

ఉన్నపలంగా, ఆపాట్నే పెళ్లోకి పరిగెత్తి, యాడైనా కోడి గుడ్డు పెట్టిందేమోనని ఆదరాబాదరా పెళ్లంతా ఎతికితిని. కానీ, యాడా కనబళ్లే. ‘ఈ ఎర్రకోడి యాడ గుడ్డు పెట్టిందో, ఏం కర్మో? యాడని ఎతికేది?’ అని ఆలోసిస్తా ఇంట్లోకొచ్చి, పద్దినాలుగా పెద్దమ్మ దాసిపెడుతున్న గుడ్ల కాడికి పోతిని. గంపలో గడ్డిమింద గుంపుగా గుడ్లను జాగర్త జేసుండాది పెద్దమ్మ.

ఇన్ని గుడ్లుండాయి కదా, ఈదినం పెట్టిన గుడ్డునుకూడా ఈటిలోనే పెట్టేసినానని అబద్దం ఆడేస్తే పోలా? పెద్దమ్మ తెలిసికుంటిందా ఏమి? పెద్దమ్మను ఎట్టయినా నమ్మించేయొచ్చు. ముందు మా సిన్నక్కను నమ్మించ్చొద్దూ?

ఆటిల్లో నుండి ఒగ గుడ్డును సేతిలోకి తీసుకున్నాను. నేరుగా మా సిన్నక్క కాడికి పొయ్యినాను.

“మేయ్, ఎంత అదురుష్టం. మన కోడి మన పెళ్లోనే గుడ్డు పెట్టి పొయ్యుండాది. ఇదో సూడు…” అని అరసేతిలో ఉన్న గుడ్డును సూపిస్తిని. “మన కోడా? ఇది దాని గుడ్డా? యాడునింది?” అని నాకల్లా అనుమానంగా జూసింది.

“ఔను మే! ఇప్పుడే పెళ్లంతా ఎతికితిని. బాయికాడ మల్లి సెట్టు మూలగా ఈ గుడ్డు కనిపించింది. వెంటనే తీసకొచ్చి నీకు సూపిస్తా ఉండా! పొయ్యి మిగతా గుడ్డల్లో పెట్టేస్తా!!” అని లోపలికి పొయ్యి మిగతా గుడ్లమద్దెన దాన్ని నైసుగా పెట్టేస్తిని.

మా సిన్నక్క నా మాటల్ని నమ్మినట్టే ఉండాది. దాని కంటికే గుడ్డును సూపిస్తిని గదా?! ఇంకేం మళ్లా?

ఆ సాయంత్రం నాలుగో గంటకంతా మా పెద్దమ్మ నాన్నారం నుండి తిరిగొచ్చేసింది. ఎంటిక కొనలేకపోయిందంట. ఎంత బేరమాడినా రేటు కుదరలేదని యాష్టకు పోతా ఉండాది. కోపంతో రుసరుసలాడతా ఉండాది.

మా సిన్నక్క సీకటి పడకముందే ఇంటి ముందు నీళ్లు జల్లి, ముగ్గు పెట్టి, ఇంటిపనుల్లో మునిగిపొయ్యింది. నేను పెళ్లోకి పొయ్యి మూతీ కాళ్లూ సేతులు కడుక్కుంటా ఉండాను.

అప్పుడు… ఊరంతా తిరుక్కోని మెల్లింగా దొంగలాగా పెళ్లోకి అడుగుపెట్టింది తెల్లమచ్చల ఎర్రకోడి. ‘ఓసి నా దొంగ కోడీ. యాడాడ తిరుక్కోని, ఎంత నైసుగా వొస్తా ఉండావో సూడూ దొరసానిలాగా. యాడ పెట్టినావే నీ గుడ్డును తల్లే? గుడ్డుపోతే పొయ్యే, ఎట్టనో ఒగట్టా గుడ్డును లెక్క జెప్పేస్తిని. ఇప్పుడు నిన్ను పట్టి గంపకింద మూసి పెట్టేస్తే… పెద్దమ్మ కోపాన్ని కొంచిమయినా తగ్గించొచ్చు!’ అనుకున్నాను మణుసులో.

రోజూ సీకటి పడేకొందికి అది ఒకసోట గుడుగుప్పున వొదిగితే, మా పెద్దమ్మ దాన్ని పట్టుకొని గంపకింద మూసిపెట్టటం రొండు మూడుసార్లు సూసుండాను. కానీ ఈ దినం అది వొదగక ముందే దాన్ని పట్టుకోని గంపకింద మూసిపెట్టాలని అనుకుంటిని. దాన్ని పట్టుకునేందుకు దాని ఎంటబడితిని. అది నాకు అందకుండా అడ్డదిడ్డంగా పరుగెత్తతా ఉండాది. నా సేతికి సిక్కకుండా నైసుగా జారిపోతా నన్ను ఉడకాడిస్తా ఉండాది. కొక్కొక్కొక్కొక్కొక్కొ… అని అరస్తా నన్ను పెళ్లంతా పరిగెత్తిస్తా ఉండాది. రొండుమూడుసార్లు నాకు సిక్కినట్టే సిక్కి సిటికెలో తప్పించుకునింది. దాంతో నాకు పంతం ఇంకా పెరిగిపోయింది.

కోడి అరుపు శబ్దానికి దానికేమో అయ్యిందని మా సిన్నక్క గబగబా పెళ్లోకొచ్చింది. దాని ఎనకనే మా పెద్దమ్మ కూడా వొచ్చింది. వాళ్లను పట్టించుకోకుండా, నేను రొండు సేతులూ ముందుకు సాపి కబడీ ఆటగాడు కూతకు పొయ్యేవాడిలాగా కోడి ఎనక పడినాను. ఇద్దరమూ పరుగుపందెం ఆడినాము.

సివరికి అది నా సేతికి సిక్కనే సిక్కింది. నా సేతికి దాని తోక దొరికింది. అది తప్పించుకొని పారిపోకుండా తోకను గెట్టిగా పట్టుకున్నాను. అది దాని రెక్కలను టపటపలాడిస్తా ముందుకు ఉరికేటందుకు ప్రెయత్నిస్తా ఉండాది.

“వొరే వొరే… దాన్ని వొదిలి పెట్టరా!” అని నన్నుజూసి గెట్టిగా అరిసింది మా పెద్దమ్మ.

కానీ అది పారిపోతిందేమోనని దాని తోకను ఇంకా గెట్టిగా బిగించి పట్టుకున్నాను. తోకను వొదిలి పెట్టకుండా గెట్టిగా ఎనక్కు లాగినాను. అది మళ్లీ ఈసారి ముందుకు గుంజింది.

రాన్రానూ నాలో బలమూ, పంతమూ పెరగసాగినాయి. “వొరే, వొదిలిపెట్టరా దాన్ని! సస్తుందో ఏమో, వొదలరా దొంగ నాబట్టా!” అని అరస్తా నాకాడికొచ్చింది మా పెద్దమ్మ. ఈసారి నేను గెట్టిగా దాన్ని ఎనక్కీ అది ముందుకూ ఒకేసారి గుంజటంతో దాని తోక కాస్తా కుచ్చుగా ఊడి నా సేతికొచ్చేసింది. అంతే! ఇదే వాటమనుకోని ఎర్రకోడి ఎగిరి ఎట్నో పారిపోయింది. సూసుకుంటే నా సేతిలో కోడితోక మాత్రమే మిగిలింది. “దొంగ నాబట్టా, వొదిలి పెట్టరా అంటే కూడా వొదిలి పెట్టకుండా దాని తోకను పట్టుకోని గుంజేసినావు కదరా శనిబట్నోడా. మన ఒంట్లోనిండి ఒగ ఎంటిక పెరికితేనే మనకెంత నొప్పుంటాది రా. అట్టాంటిది దాని తోకను పట్టుకోని మొత్తంగా లాగేసినావు కదరా ముదనష్టపోడా!” అంటా నామింద తిట్ల దండకం అందుకొనింది మా పెద్దమ్మ.

“గుడ్డు పెట్టే కోడికి తోకను లేకండా సేసినావు కదరా శెనిబట్నోడా. ఆ నొప్పికి అది రేపు గుడ్డు పెడ్తాతో, లేదో?”

“పెద్దమ్మా, వీడు మద్దేనం కూడా కోడి గుడ్డు పెట్టే సమయానికి ఇంట్లో లేడు. నేనే కోడొచ్చే సమయానికి దాన్ని కాపెట్టుకొని గంపకింద మూసిపెట్టి గుడ్డును తెచ్చి ఇంట్లో దాసినాను.” అని జెప్పింది మా సిన్నక్క,

“అబద్దం, నేనే పెళ్లో నుండి గుడ్డును తెచ్చి దాసినాను. గుడ్డును దానికి కూడా సూపెట్టినాను.” అని నా అబద్దాన్ని మళ్లీ రెట్టించి జెప్పినాను. “పదరా, జూద్దాం!” అని నన్నూ బరబరమని లాక్కూంటా ఎల్లి గుడ్లను లెక్కబెట్టింది మా పెద్దమ్మ.

“మీ అక్కా పెట్టి, నువ్వూ పెట్టుంటే ఒగటి ఎక్కువుండాల గదా? కరెట్టుగానే ఉందంటే ఈణ్ణుండే నువ్వు గుడ్డును దొంగిలించి ఉండాల. దొంగతనాలు కూడా సెయ్యటం మొదలుబెట్టినావా నాబట్టా!” అని నన్ను రెండుపీకింది మా పెద్దమ్మ.

నా సేతిలో నుండి కోడి తప్పించుకు పారిపోయినట్టు, మా పెద్దమ్మ నుండి తప్పించుకోని బయిటికి ఉడాయించినాను నేను.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version