Site icon Sanchika

నా బాల్యం కతలు-15

[box type=’note’ fontsize=’16’] ‘నా బాల్యం కతలు’ అంటూ తన చిన్ననాటి ముచ్చట్లను అందిస్తున్నారు జిల్లేళ్ళ బాలాజీ. [/box]

15. కిష్ణమూర్తి డాకట్రు కరుణ

[dropcap]మా[/dropcap] అత్త ఎంత నాటు వైదిగం జేసినా అది సంటి బిడ్లకు, కడుపుతో ఉండే ఆండోళ్లకు, బాలింతలకు మాత్రమే పరిమితం. కానీ, మా ఇండ్లల్లోని పెద్దళ్లకు ఒంట్లో బాగా లేకపోతే వోళ్లంతా పొయ్యేది కిష్ణమూర్తి డాకట్రు దగ్గరికే.

రాధాకిష్ణన్ ఈదిలో తన ఇంట్లోనే ఆస్పత్తిరి పెట్టుకోనుండాడు కిష్ణమూర్తి డాకట్రు. మాకు ఆ డాకట్రంటే చానా గురి, నమ్మకం! జొరమొచ్చినా, దగ్గొచ్చినా, వాంతులొచ్చినా, బేదులొచ్చినా, కాళ్లు నొప్పులైనా, వొళ్లు నొప్పులైనా ఏ రోగమొచ్చినా ఆయిని కాడికి బోతే… మాకు టకీమని ఆపాట్నే బాగైపోతింది.

మా పెద్దనాయిన, పెద్దమ్మ, మా తాత, మా మామోళ్లు, అత్తోళ్లు, వోళ్ల పిలకాయిలు, పక్కింటి గణేశన్న, రాజమ్మక్క, వోళ్ల పిలకాయిలు, ఎదురింటి నర్సిమ్ములు మామ, పద్మక్క, వోళ్ల పిలకాయిలు, నీలక్క, అంబిలాయన ఇట్టా మా మంగలోళ్ల కుటుంబాలు ఓ ఆరేడుండాయి పెద్ద ఈదిలో. ఎవురికి వొంట్లో బాగోలేకపోయినా ఆయినకాడికే పొయ్యేటోళ్లం. మరీ నడిసేదానికి ఈలు కాకపోతే ఎళ్లి సెబితే డాకట్రే ఇంటికాడికొచ్చి వైదిగం జేసేటోడు.

ఆయిన మనిసి దిటవుగా ఉండేటోడు. ముఖాన పెద్ద పెద్ద నామాలేసుకుని ఉండేటోడు. కీపాసు పంచెకట్టుతో బలేగా ఉండేటోడు. వాళ్లు పక్కా బ్రామ్మలు. ఆయినింటి ముందరి గదిని వైదిగం కోసరమని పెట్టుకున్నాడు. వైదిగం కోసరం వొచ్చినోళ్లు ఈదిలో కూసుని ఆయిన కోసరం ఎదురుజూస్తా ఉండేటోళ్లు.

వొంట్లో బాగాలేదని డాకట్రు కాడికి ఎవురు పోయినా, ఓపిగ్గా ఇని, బాగా ఇసారించి, రోగానికి కారణాలను కాయితంలో రాసుకుని మందులిచ్చేటోడు. నోట్లో టూబు (థర్మామీటరు) పెట్టి ఎంత జొరముందో జూసేటోడు. కంటి కింది బాగాన్ని కిందికి లాగి, పై బాగాన్ని పైకి లేపి, నాలిక సూపించమనీ… ఇట్టా అన్ని రకాలుగా సూసి, ఆనక వైదిగం జేసేటోడు.

ఒక స్టీలు పాత్రలో ఎప్పుడూ నీళ్లు మరగతా ఉండేవి. నీళ్లను కరెంటుతో మరగబెట్టేటోడు. దాంట్లో రొండు మూడు రకాల సూదులు(నీడిల్స్, సిరంజులు) నీళ్లలో మునిగిపోయి.. అవి ఉడుకెక్కతా అందులోనిండి బుడగలొస్తా ఉండేవి.

రోగికి సూది ఎయ్యాలనుకుంటే ఇనుప పట్టుగర్రతో ఒక సూదిని(సిరంజి) ఎత్తుకుని దానికి అవసరమయ్యే సూది మొనను(నీడిల్) అమర్చి బాటిల్లోని మందును ఎక్కించి రోగి జబ్బల్లోకి గానీ, పిర్రల్లోకి గానీ గుచ్చి ఏసేటోడు. నాలుగైదు మందులు రాసిచ్చేటోడు. రోగులకు ఏమేమి తినాలో, ఏమేమి తినకూడదో పత్తెం గూడా పెట్టేటోడు.

ఆయిన ఏ రోగాన్నయినా ఇట్టే నయిం జేసే అస్తవాసున్న డాకట్రని మా వోళ్లల్లో ఒగ నమ్మకం బలింగా ఏర్పడిపోయింది.

ఒగసారి మా పెద్దనాయినకు వొంట్లో బాగాలేక నన్ను తోడు పెట్టుకొని డాకట్రుకాడికి ఎలబారినాడు. ఇద్దరమూ నడుసుకుంటా ఆయిన కాడికి పొయ్యేకొందికి… ఆడ ఒగరిద్దరు రోగులు ఆయిన పిలుపు కోసరం ఎదురుసూస్తా ఉండారు.

మా వొంతు రాగానే డాకట్రు మా పెద్దనాయిన్ను జూసి, “ఏం గోయిందసామీ… ఇట్టొచ్చినావు?” అని పలకరించినాడు.

మా పెద్దనాయిన కీసు గొంతుతో వొంట్లో బాగోలేదని జెప్పినాడు. “గొంతు కూడా రాసుకుపోయినట్టుండాదే… ఏ ఊరికి మేళానికి పొయ్యింటివి?” అని అడిగినాడు.

మా పెద్దనాయిన నాసరం వాయిస్తాడనీ, పెండ్లిండ్లకూ, పండగలకూ, విశేషాలకూ గిరాకీ తగిలితే సుట్టుపక్కలుండే ఊళ్లకు మేలానికి పొయ్ వొస్తుంటాడని డాకట్రుకు బాగా తెలుసు.

“కీలపట్టుకు పోయింటిని సామీ…” అన్నాడు మా పెద్దనాయిన.

“నగిరి దగ్గిరుండే కీలపట్టే గదా…”

“అవును సామీ…”

“ఇంకేముందీ, సరీ పోయింది. ఆ నీళ్లు తాగుంటావు. జలుబు జేసుంటుంది. దాని ఎనకే జొరమూ వొచ్చుంటాది.”

మాట్లాడతానే ఇసయం అర్థమై, మా పెద్దనాయిన జబ్బకు సూది గుచ్చి, దుడ్డుకోసరం సెయ్యి ముందుకు జాపినాడు.

మా పెద్దనాయిన తల గోక్కుంటా నిలబడినాడు. ఆయిన కాడ దుడ్డు లేనట్టుంది.

“ఏమట్టా తల గోక్కుంటా ఉండావు. నీకాడ దుడ్డు లేదా ఏందీ? ఇదీ అప్పేనా?…” అని జెప్పి మాకల్లా జూసి, ఒక పుస్తకం తీసి మద్దెలోనిండి మా పెద్దనాయిన పేరుతో ఉండే ఒగ కాయితాన్ని బయటికి తీసినాడు.

అది మా పెద్దనాయిన డాకట్రుకు అప్పుండే లెక్క కాయితం.

ఆ కాయితంకల్లా జూస్తా… “ఇప్పటికే నువ్వు నలభై రొండు రూపాయిలుండావు అప్పు. ఈ మూడు రూపాయిలతో కలుపుకొని నలభై అయిదు రూపాయిలయ్యే.” అని లెక్క రాసి, “లెక్క పెరిగిపోతా ఉండాది. వొచ్చే నెల్లో ఏమీ మిగల్చకుండా అప్పు తీర్చేయ్, తెల్సిందా?” అన్నాడు మా పెద్దనాయిన్ని ఎచ్చరిస్తున్నట్టుగా.

“అట్టాగే సామీ…” అని ఆడ్నుంచి మేము కదలబోయినాము.

“యాడికి బోతా ఉండావు. మాతర్లకు దుడ్డు ఉండాదా?” అని అడిగినాడు డాకట్రు.

అందుకు మా పెద్దనాయన – “లేదు సామీ,” అని మళ్లా నేల జూపులు జూసె.

“మరి నీ వొంట్లో ఉండే రోగమెట్లా తగ్గితింది.” అని తనకాడుండే మాతర్లనిండి రొండు రకాలు నాలుగేసి మాతర్లిచ్చే.

ఆ మాతర్లు తీసుకుని మా పెద్దనాయిన డాకట్రుకు దండాలు పెట్టె. వాటిని ఎప్పుడెప్పుడు ఏసుకోవాలో డాకట్టు జెప్పింది ఇని, మేము బయటికొచ్చిన తర్వాత, నేను మా పెద్దనాయిన్ని అడిగితి “ఈ మాతర్లు ఊరికే ఇచ్చినాడా పెద్దనాయన?”

“ఊరికే ఎందుకిస్తాడు? దీని మొత్తం కూడా నా లెక్కలో జమజేస్తాడు.” అని నవ్వినాడు మా పెద్దనాయిన.

“ఆ…” అని నేను నోరు తెరిస్తిని.

“రాస్తే రాయనీలే రా. ఎప్పుడో ఒకప్పుడు ఉండేటప్పుడు ఇస్తాం. ఇప్పుడు మనకు వైదిగం జేసి రోగం బాగజేస్తా ఉండాడా లేదా, అది సూడాల్రా ముందు. నిజంగా ఆయిన మనబోటి లేనోళ్లకు దేముడ్రా.” అన్నాడు చేతులెత్తి మొక్కతా.

ఇంగొకసారి… మా మామోళ్ల నాయినకు నిండా ఒళ్లు బాగలేకుండా అయిపోయింది. ఏమి తిన్నా వోంతులు అయిపోతా ఉండాది. మనిసి బాగా సన్నబడిపోయినాడు. డాకట్రు దెగ్గిరికి పోదామంటే రానంటే రానని మొండికేసినాడు. ఇట్టకాదని మా అత్త, డాకట్రును ఇంటికాడికే తీసకరమ్మని మా మామని కిష్టమూర్తి డాకట్రు దెగ్గిరికి అంపించింది.

మా మామ డాకట్టు దెగ్గిరికి పొయ్యి ఇసయం జెప్పి, ఇంటికాడికి రమ్మని ఏడుకున్నాడు. అర్ధగంటలో వొస్తాను పదమని జెప్పి తిప్పి అంపించినాడు. మా మామ ఇంటికొచ్చి, డాకట్రు వొచ్చేకొందికి గదినంతా సుద్దంగా పెట్టమని మా అత్తకు జెప్పి సుద్దం చెయ్యించినాడు. ఇంతలో… బయిటినిండి “నటేశన్… యానైక్కాల్ నటేశన్ (ఏనుగుకాలు నటేశుడు)… వీడు ఇద్దానే (ఇల్లు ఇదే కదా?)” అన్న డాకట్రు గొంతు ఇనిపించింది. డాకట్టు మాక్కొక్కరికీ ఒక్కో పేరుపెట్టి [మా పెద్దనాయినను కుడిమి అమట్టన్ (పిలక మంగలి)] ఇట్టా పిలిచే అలవాటుంది.

మా మామ ఆదరాబాదరాగా బయటికి పొయ్యి డాకట్రును లోపలికి పిలచకొచ్చినాడు. బాగా సన్నబడిపోయి, ముఖం పీల్చకపోయిన రోగిని చూసి డాకట్రే ఆచ్చర్యకపోయినాడు. “ఏం నటేశన్, ఎందుకిట్టా పడకేసినావు? మేళానికి పోలేదా?” అని అడగతా ఆయన్ను పరీచ్చించి సూది ఏసినాడు.

మా మామోళ్ల నాయిన నడుము దెగ్గిర దాసిన ఐదురూపాయిలు తీసి డాకట్రుకు ఇయ్యబోయినాడు.

దాన్ని తీసుకోకుండా “నువ్వు బలహీనంగా ఉండావు. బలానికి పండ్లూ అవీ బాగా తినాల… నీ దగ్గరే ఉండనీ” అంటా ఆయనే తన జోబీలో నుండి పదిరూపాయిలు తీసి వొద్దంటున్నా ఇనకుండా బలింతంగా సేతిలో పెట్టినాడు.

“తొరగా కోలుకోని నా అప్పు తీర్చే పని జూడు!” అని సక్కా బయిటికి పోయినాడు డాకట్రు.

మా మామ, అత్తా అందరమూ ఆయినకు సేతులెత్తి నమస్కరించినాము.

ఇంగొగసారి ఆట్టాడతా ఉంటే కిందపడి నా సేతికి దెబ్బ తగిలింది. తెలిస్తే తిడతారని రెండు రోజులు నేను ఇంట్లో వాళ్లకు తెలియకుండా జాగర్త పడితిని. మూడోరోజు మావోళ్లకు ఏటో తెలిసిపోయింది. డాకట్రు దెగ్గిరికి పదమని ఒకటే పోరు.

“నేనే పోతా డాకట్రు దెగ్గిరికి. మీరెవురూ నాతో రావొద్దు!” అని జెప్పి డాకట్రు దెగ్గిరికి పొయ్ తిరిగొస్తిని.

ఇంటికొచ్చిన నన్ను “డాకటు ఏం జెప్పినాడ్రా, నాయినా?” అని అడిగింది మా పెద్దమ్మ. “బాగైపోతిందంట, ఈ సిబ్జాల్ మాతరను టెంకాయినూనిలో రాసి పుండ్లకు పుయ్యమన్నాడు.” అంటిని.

“ఏం ఏం తినమన్నాడు డాకట్రు?” అని అడిగినాడు మా పెద్దనాయిన.

“రసం వొద్దే వొద్దన్నాడు, పులగూరతోనే తినమన్నాడు!” అని చెప్పటంతో కిసుక్కున నవ్వింది మా పెద్దక్క. అందరూ ఆచ్చెర్యకపోయినారు. మర్నాడు నాకు తెలియకుండా మా పెద్దమ్మ డాకట్టు దెగ్గిరికి పొయ్యి, నేను సెప్పిన ఇసయం సెప్పి నిజమేనా అని అడిగింది. “సూడు సావిత్రమ్మా, పత్యం బాగుంటే రోగం త్వరగా నయమవుతుందని రసమన్నమే పెట్టమని చెప్తామనుకో. అంతమాత్రాన మీరు మూడుపూటలా రసంతోటే అన్నం పెడితే రోగి నోరు ఏం కావాల. మరీ అంత కఠినమైతే ఎట్టమ్మా. అందుకే మీవాడు అట్ట చెప్పినట్టున్నాడు. ఎదిగే పిలగాడు. రసంతోపాటు పులగూరతోనూ అన్నం పెట్టు!” అన్నాడట.

(త్వరలో ‘నా బాల్యం కతలు రెండవ భాగం’ తో మళ్ళీ కలుద్దాం!)

Exit mobile version