[box type=’note’ fontsize=’16’] ‘నా బాల్యం కతలు’ అంటూ తన చిన్ననాటి ముచ్చట్లను అందిస్తున్నారు జిల్లేళ్ళ బాలాజీ. [/box]
4. దసరా ఉండి – సరదాకు గండి
[dropcap]ద[/dropcap]సరా! ఈ పండగొస్తే సైదా అయ్యోరి దగ్గర ప్రవేటు చదువుకునే పిలకాయలకంతా చానా కుశాల వొచ్చేస్తాది.
ఎందుకంటే సైదా అయ్యోరు ఆ పది రోజులూ గుడి పనిమింద చానా బిజీగా ఉంటాడు. మాకు ప్రవేటు ఉండదు కదా, జాలీ! అంతేకాదు, దసరా పండగప్పుడు రోజూ దుర్గమ్మ గుళ్లో అమ్మోరిని రకరకాలుగా అలంకరిస్తారు. అప్పుడు సైదా అయ్యోరి దగ్గర చదువుకునే పిలకాయలకు చానా పన్లు అప్పజెప్పతారు. అది మాకెంతో సరదాగా ఉంటింది.
రోజూ తెల్లార్తో దుర్గమ్మకు అభిసేకం, పూజలూ జరుగుతాయి. వచ్చే బక్తుల్ని లైన్లలో పంపీటం, ప్రెసాదం పంచటం, ఒక్కోసారి టెంకాయలు కొట్టివ్వటం… ఇట్టాంటి పన్లన్నీ మేమే చేసేటోళ్లం.
మద్దేనం మూడు గంటలకాణ్ణించి గుడి పక్కన ఏసుండే కొట్టంలో ఉస్సవమూర్తిని అలంకరిస్తారు. రోజుకో అవతారం. మయిసాసుర మర్ధిని, సరస్పతీ దేవి, బాలా త్రిపరసుందరి, ఇట్టా! అమ్మోరికి అలంకరణ జేసేటప్పుడు అయ్యోర్లకు మేమే సహాయం జేస్తాం! పూలు, నూలు అందీయటం, పూలు సుట్టమంటే సుట్టటం, ఇట్టాంటివన్నీ… కానీ రాను రాను మగపిలకాయల కన్నా ఆడపిలకాయలకే అట్టాంటి పన్లన్నీ అప్పచెప్పసాగినారు.
దసరా జరిగినన్ని రోజులూ గుడి ముందు వేలూరు, మద్రాసు, గుడిపాల, గుడియాత్తం బస్సులు… టవును బస్సులు ఆగేటివి. అప్పుడు మేము ఉండీలు ఎత్తుకోని బస్సులోకి ఎక్కి, ప్రెతి పేసింజిరు ముందూ దాన్ని శబ్దంచేసి ఆడిస్తా, దాన్ని వాళ్ల ముందుకు జాపి డబ్బులెయ్యమనేటోళ్లం. పేసింజిర్లు భక్తితో జోబీల్లో, మనీపర్సల్లో నుండి రూపాయి, అద్దరూపాయి, ఒక్కోసారి ఐదూ, పదీ కూడా తీసి ఉండీలో ఏసేటోళ్లు.
మాలో ఒకడు ఉండీ ఎత్తుకుంటే, ఇంకోడు ఆరతి తట్ట ఎత్తుకునేటోళ్లం. ఆ తట్టలో ఇబూదీ, కుంకుమా ఉంటాయి. అవి కావల్సిన భక్తులు వాటిని తీసుకుని నొసటికి పూసుకునేటోళ్లు. ఒక్కోసారి ఆరతి తట్టలో కూడా డబ్బులు ఏసేటోళ్లు. మేము బస్సు దిగినాంక ఆ డబ్బుల్ని తీసి ఉండీలో ఏసేసేటోళ్లం.
గుడికాడ బస్సెక్కితే… బస్టాండు ఏపుకు పొయ్యే బస్సులైతే గిరింపేట కలెక్ట్రాపీసు స్టాపు దగ్గర ఆగేటివి. మేము ఆడ బస్సు దిగేసి మళ్లీ ఎదురొచ్చే బస్సులెక్కి గుడికాడ దిగేటోళ్లం. అదే వేలూరు ఏపుకు పొయ్యే బస్సులైతే కొంచిం దూరంలో ఉండే ఆట్సు కాలేజీ స్టాపుదగ్గిర ఆపితే, ఆడ దిగేసి ఇంకో బస్సు వొచ్చేంతవరకూ ఎదురుసూసేటోళ్లం. బస్సు రాకుంటే ఒక్కోసారి నడుసుకుంటా కూడా గుడికాడికి వొచ్చేసేటోళ్లం.
ఇట్టా బస్సెక్కటం.. పేసింజిర్ల ముందు ఉండీ ఆడించటం… దుడ్డు ఏయించుకోవటం… (దుడ్డు ఏసేంతవరకూ పేసింజిర్లను వొదిలేటోళ్లం కాము) స్టాపులో దిగాటం, మళ్లా ఇంకో బస్సు ఎక్కటం… దిగటం… ఇదంతా మాకు చానా సరదాగా ఉండేది. ఒకరోజు పదిగంటల సమయంలో బాలడు ఉండీని, మణిగాడు ఆరతి తట్టను పట్టుకోని బస్సుకోసరం ఎదురుసూస్తా గుడి ముందర నిలబడుకో నుండాము. ఇంతలో వేలూరుకెళ్లే బస్సొకటొచ్చి ఆగగానే నేను గబగబ బస్సులోకి ఎక్కేసినాను. మణిగాడు మాత్రం కిందనే ఉండి కిటికీల కాడున్న పేసింజిర్ల ముందుకు ఆరతి తట్టను జూపిస్తా ఉండాడు.
ఇంతలో కండక్టర్ గెట్టిగా విజిలేసినాడు. బస్సు బుర్రుమంటా బయలుదేరింది. ఆ రోజనగానే బస్సునిండా పేసింజిర్లుండారు. వాళ్లు నిలబడే దానిక్కూడా సందులేకుండా కిక్కిరిసిపోయి ఉండారు.
సరే, ఎట్టో సందుజేసుకోని ఒక్కో వరస కాడికీ పోయి ఉండీని ఆడించి చూపిస్తా ఉండాను. తలా రూపాయో, అద్దరూపాయో ఎంతో కొంత ఏస్తా ఉండారు. దాంతో మరింత ఉసారుగా అందరి ముందుకూ ఉండీని చాపతా ఉండాను.
బస్సు ఆట్సుకాలేజీ స్టాపింగు దగ్గరికొచ్చింది. కానీ ఆడ బస్సాగలేదు. కలెక్సను జోరుగా ఉండే కొందికి ఆడ దిగాల్సింది కూడా మర్చిపోయి ఉసారుగా ముందుకుపోతా ఉండాను. ఐదు నిమిసాలు అయ్యింటుంది. బస్సు ఆగకుండా ముందుకుపోతానే ఉండాది. నేను ఆ ఇసయాన్ని గమనించుకోలేదు. దుడ్డు వసూలుజేసే పనిలో నిండా మునిగిపోయుండాను. బస్సులో ఈ కడా నుండి ఆ కడాకు జేరుకున్నాను.
ఇంతలో బస్సు సెక్ పోస్ట్‌ను కూడా దాటేసింది. అప్పుడు గమనించినాను నేను. అంతే! నా గుండె గుభేల్ మనింది.
“వోల్టాన్… వోల్టాన్…”అని గెట్టిగా అరిసినాను. “వొరే, నువ్వింకా దిగలేదా?” అని కండక్టర్ నన్ను చూసి ఆచ్చర్యకపోయినాడే కానీ బండిని ఆపేటందుకు విజిల్ మాత్రం ఎయ్యలేదు. “అన్నా, బస్సును ఆపన్నా…” అన్నాను బిత్తరగా.
“నేను ఆపమన్నా, డ్రైవర్ ఆపడొరే. బస్సు ఇప్పటికే కాలుగంట లేటు.” అని కొంచిం సీరియస్ గానే అన్నాడు కండక్టర్. “అన్నా, బస్సును ఆపమనన్నా..” అన్నాను మళ్లీ భీతితో వొణికిపోతా. “మాతోపాటు నువ్వూ వేలూరుకొచ్చేయ్. మళ్లీ నిన్ను రిటర్న్ జర్నీలో తెచ్చి గుడికాడ దించేస్తాం.” అన్నాడు కండక్టర్. “వేలూరుకా? వొద్దన్నా… మా నాయిన కొడతాడు.” అన్నాను ఏడుపు ముఖం పెడతా.
అట్టా చానాసేపు అడుక్కున్నేక ‘ఈసారి బస్సెక్కడ ఆగితే ఆడ దిగిపొమ్మన్నాడు’ కండక్టర్. అర్ధగంట గడిచినా బస్సు ఎక్కడా ఆగలేదు. ఇంతలో ఎవురో పేసింజెర్ ఆపమంటే బస్సును ఆపినాడు డ్రైవర్. ఆ పేసింజర్ ఎనకే ఎట్టో ఒగట్టా సరసరమంటా బస్సు దిగేసినాను. నేలమింద కాలుమోపి అమ్మయ్య అంటా ఊపిరి పీల్చుకున్నాను.
బస్సు పోయినాంక చుట్టూ సూస్తే ఆడ ఊరుకాదు కదా ఒక్క ఇల్లు కూడా లేదు. ఒక్క మనిసి అగుపించలేదు. అది ఏ ప్రాంతమో కూడా తెల్లేదు. అంతే! భయమేసింది నాకు. బస్సులో నిండి దిగిన మనిసి కోసరం సూస్తే ఆయన దూరంగా పొలాల మద్దెన సరసరమంటా నడిసిపోతా ఉండాడు. ఏం జెయ్యాల్నో తెలీక ఒంటిగా బిక్కుబిక్కుమంటా మర్రిసెట్టుకింద నిలబడినాను. ఈణ్ణించి గుడికెట్లా సేరుకునేది? నడుసుకుంటా పోదామంటే గుడి దగ్గరున్నట్టులేదు. చానా దూరమున్నట్టుంది.
ఏదన్నా బస్సు వొస్తుందేమోనని సూస్తా ఉంటే ఒక్కటీ అగుపించటం లేదు. ఒంట్లో అదురు ఎక్కువైంది. కాలుగంట తర్వాత దూరంగా ఒగ బస్సు వస్తా కనిపించింది. గబగబా లేసి నిలబడి ఉండీని ఆడిస్తా బస్సును ఆపే ప్రయత్నం చేసినాను. కానీ నా చేతిలోని ఉండీని చూసి ‘ఇది ఓసీ గిరాకీ’ అనుకొని ఆ డ్రైవర్ బస్సును ఆపకుండా ముందుకు పోనిచ్చినాడు. దాంతో మరింత అదురు ఎక్కువైంది నాకు.
గంట గడస్తా ఉండాది. సూర్యుడు నడినెత్తిమింద నిగడకాస్తా ఉండాడు. ఆణ్ణే ఒంటిగా ఉండాలంటే భయమేస్తా ఉండాది. అందుకే మెల్లగా నడక మొదలుపెట్టినాను. అప్పుడప్పుడు ఎనక్కు తిరిగి జూస్తా నడస్తా ఉండాను.
అంతలో దూరంగా ఒక రొండెద్దుల బండి వొస్తా కనిపించింది. అది దగ్గరికొచ్చేంతవరకూ ఆగి బండిని ఆపమని సైగజేసినాను. బండి తోలే పెద్దాయనకు నన్ను చూసి జాలేసినట్టుండాది. ఎంటనే బండిని ఆపి ఎక్కమన్నాడు.
బండిని ఎక్కుతున్నప్పుడు నా చేతిలోని ఉండీని జూసినాడు బండాయన. ఏందదీ అని అడిగినాడు. దుర్గమ్మ గుడి ఉండీ అనే కొందికి ఆయన అనుమానంగా నాకల్లా జూసినాడు. ఉండీతో నేనెందుకిక్కడ ఉండాల్సి వొచ్చిందో అంతా విలావరిగా జెప్పినాను. ఆయనడిగే ప్రెశ్నలకు బదులిస్తా ఉండీని జాగర్తగా ఒళ్లో పెట్టుకున్నాను.
బండ్లో ఏవో మూటలుంటే ఒగదానికి ఆనుకున్నట్టుగా కాళ్లు జాపుకొని కూసున్న నేను… బాగా అలసిపోయి ఉండటంతో కొంచేపటికంతా అట్టనే నిద్దరలోకి జారిపోయినాను. ఎనక్కు జూసిన పెద్దాయన బాలడి తీరు జూసి నవ్వుకున్నాడు.
అట్టా ఎంతసేపు నిద్రపోయినానో తెలియదు. ఉన్నట్టుండి మెలకువొచ్చి చూసేకొందికి బండి మెల్లగా పోతా ఉంది. పెద్దాయన కూడా గూటానికి ఆనుకోని కునికిపాట్లు పడతా ఉండాడు. ఒళ్లో తడిమి జూసుకొని ఉలిక్కిపడితిని. ఉండి కనిపించలేదు. ఒళ్లు జల్లుమని అదురుపట్టుకొనింది. అమ్మోరు ఉండీ అది. అందులో చానా డబ్బులుండాయి. దాన్ని గుళ్లో అప్పజెప్పాల. లేకపోతే నేనే దొంగిలించాననుకుంటారు? గబగబా మూటల సందల్లో అంతా ఎతికినాను. కనబళ్లేదు. బండాయన కల్లా జూసినాను. ఆయన తావన కూడా లేదది. అయితే ఉండీ ఏమైనట్టు? ఏడుపు ముంచుకొచ్చింది నాకు. బోరుమని ఏడవటం మొదలు పెట్టినాను నేను. ఆ శబ్దానికి ఉలిక్కిపడి నిద్రలేసినాడు బండాయన.
ఇంతలో గుడికాడికి చేరుకునింది బండి. పెద్దాయన బండిని ఆపగానే నేను ఏడస్తా బండి నుండి కిందికి దిగినాను. నా ఏడుపును చూసి పూజారి ఏమైందో ఏమోననుకుని సరసరామంటా పరుగెత్తుకొచ్చినాడు. పూజారిని చూసేకొందికి నాకు ఏడుపు మరింత ఎక్కువైంది. బండాయన్ను ఓపారి చూసి- “ఉండీ కనిపించటం లేదు సామీ…” అన్నాను పూజారితో. మళ్లీ ఆ ఎంటనే- “సత్తెంగా నాకేమీ తెల్దు సామీ… దాన్ని నేను దొంగిలించలేదు….” అని ఎక్కిళ్లు పెట్టి ఏడవసాగినాను.
బండాయన బాలణ్ణి చూసి నవ్వతా… బండెనక్కొచ్చి బండి కిందికి దూరి అక్కడ దాపెట్టిన ఉండీని బయటికి తీసకొచ్చినాడు. “సామీ దీన్ని నేనే దాపెట్టినా. పిలగాడేమో ఉండీని పట్టుకుని నిద్దట్లో ఉండాడు. నాకూ నిద్దరొచ్చింది. ఏం జెయ్యాలబ్బా అని ఆలోసించి నేనే తీసి బండికింద దాపెట్టినాను.” అని దాన్ని నావైపుకు చాపగానే నేను పరుగెత్తకపోయి దాన్ని తీసుకొని అపురూపంగా గుండెలకు ఆనించుకుంటి. ఆనక తీసుకెళ్లి పూజారి చేతికిచ్చినాను. పూజారి ఉండీని తీసుకొని నా కన్నీళ్లు తుడిసి నన్ను తన పొట్టకు ఆనించుకొని చేత్తో నా ఈపుమీద రాస్తా ఓదార్సినాడు. నా ఏడుపు మెల్లింగా తగ్గిపోయింది. ఉండీ దొరికినందుకు నేను చానా సంతోషించినా ఆ సమచ్చరం మళ్లా నేను ఉండీ జోలికి మాత్రం పోలేదు.
(మళ్ళీ కలుద్దాం)