[box type=’note’ fontsize=’16’] ‘నా బాల్యం కతలు’ అంటూ తన చిన్ననాటి ముచ్చట్లను అందిస్తున్నారు జిల్లేళ్ళ బాలాజీ. [/box]
7. సోలింగపురం కోతులు
[dropcap]నే[/dropcap]ను తొమ్మిదో తరగతిలోకి వొచ్చినప్పుడు మా నాయినకి నా పాత మొక్కుబడి ఒకటి గుర్తుకొచ్చె.
నా పుట్టెంటికలు మా కులదేవుడు ఎంకటేశులసామికి ఎప్పుడో సెల్లించేసినారంట కానీ, నాకు సెవులు మాత్రం కుట్టలేదంట. ఇంకా ఆలీసం చేస్తే దేవుడు కండ్లు పొడిజేస్తాడని, ఆ సమ్మచ్చరం ఎట్టయినా ఆ మొక్కు తీర్సేయాలని సెప్పినాడు.
అందుకనీ ఒక ఆదివోరం ‘సోలింగపురం’ పోయి నర్సిమ్మసామికి గుండుకొట్టి, సెవులు కుట్టించాలని తీర్మానం జేసె.
ఆ మాట ఇన్నప్పటి నుండి నాకు ఒకటే దిగులు పట్టుకునే. ఎందుకంటే బోడిగుండుతో, సెవల్లో పోగుల్తో ఇస్కూలుకి పొయ్యేదెట్టబ్బా? ముక్కెంగా ఆడపిలకాయల ముందర ఎట్టా తిరిగేది? అమ్మో నాకిప్పుడే సిగ్గేస్తా ఉండాది!
అందుకే ఇస్కూలుండే రోజుల్లో కాకండా ఎక్కువ లీవులొచ్చే దినాల్లో నా మొక్కును తీర్సమని మా నాయినతో సెప్పినాను. కానీ, మా నాయిన నా మాటను చెవినేసుకోలేదు. నాకేం జెయ్యాల్నో దిక్కు తోసలేదు.
ఒక మంచిరోజు జూసుకుని సిత్తూరులో బస్సెక్కి సోలింగపురం చేరుకుంటిమి. కొండమీదుంది గుడి. కిందనే బోడి కొట్టుకోని, సెవులు కుట్టుకోని దేవుని దర్శనానికి మెట్లెక్కి పైకి పోవాలంట. అందుకని ముందు బోడికొట్టే కల్యానకట్ట కాడికి పోతిమి. బోడి కొట్టుకున్నాక సెవులు కుట్టుకోవాలంట. నాకు ఈ వొయిసులో ఆడపిల్లల్లాగా సెవులు కుట్టుకోవాలంటే చానా సిగ్గుగా ఉండాది. కానీ తప్పేటట్టులేదు.
కల్యానకట్టలో నాకు నున్నంగా బోడి కొట్టినారు. ఇంకపోయి నీళ్లు పోసుకోని రావాల. తిరప్తిలో అయితే బోడి కొట్టుకున్నోళ్లకు నీళ్లు బోసుకునేందుకు ఉడుకునీళ్లు దొరుకుతుందంట.
కానీ ఇది తిరప్తి కాదే, సోలింగపురం! అందుకనీ నీళ్లు పోసుకునేందుకు కోనేటి కాడికి పోతిమి.
కోనేట్లో నీళ్లు సల్లగా ఉండాది. సన్నీళ్లలోకి అడుగు పెట్టాలంటే వొళ్లు సలపరిస్తాది. ఇంగ ఆ నీళ్లల్లో మునగాలంటే పేనం పొయ్యేంత పనవుతాది. మెట్లు దిగి కిందమెట్టు మింద కాలు బెడ్తే… ఆడ బాగా పాసిపట్టి సర్రున జారిపడేట్టు ఉండాది.
అంతే! కోనేట్లోకి దిగనంటే దిగనని మొండికేస్తిని. ఇంతలో మా అత్త ఒక గుండుజొంబు బట్టుకొచ్చి, “ఒరే అదురోడా, నీళ్లు పోసుకునేందుకు ఎందుకురా అట్ట బిత్తరకపోతా ఉండావు. నువ్వట్టా ఆ మెట్టుమింద కూసో. నేను ఈ గుండుజొంబుతో నీళ్లు ముంచి నాలుగుసార్లు నీ తలమింద పోస్తా. అంతే, అయిపాయె నీ తానం.” అనింది ఆ పని చాలా వీజీ అన్నట్టుగా.
సరేనని పైనుండే మెట్టుమింద మట్టసంగా కాళ్లు ముడుసుకుని కూసున్నా. మా అత్త కింది మెట్టుపై నీళ్లల్లో నిలబడి, కోనేట్లో నుండి గుండుజొంబుతో నీళ్లు ముంచి నా తలమీంద ఒక్కసారిగా గుమ్మరించింది.
అంతే! ఆ సల్లదనానికి నాకు ఉన్నపళాన ఊపిరాడనంత పనైంది. గుక్క తిప్పుకోలేకపోయినాను. “ఆ… ఆ… ఆ…” అని మెట్టుమీంద నుండి గభాలున పైకిలేసి నిలబడినాను. గట్టిగా ఊపిరి పీల్సుకోసాగినాను.
“ఒరే నా బట్టా, ఆ సేతల్తో మూతి మూసుకోనుంటే గదరా నువ్వు. సేతులు తీసేస్తివి. ఒక్కసారిగా సేవల్లోకీ, ముక్కల్లోకీ నీళ్లు దూరె… నీకు ఊపిరి తిరక్కపోయే…” అనింది మా అత్త.
“నిదానంగా పొయ్యత్తా…” అని ఎట్టో ఒగట్టా సమ్మాళించుకోని మళ్లా కూసున్నాను.
“అట్టే లేరా. నువ్వు కండ్లు గెట్టిగా మూసుకోని కూసో…” అంటా మళ్లా ఒక చెంబుడు నీళ్లు ముంచి పోసింది. సన్నీళ్లు ఒంటిమీద పడేకొందికి నరాలంతా జివ్వన లాగినట్టయింది. ఒళ్లంతా ఒనుకు పుట్టింది. ఎట్టాగో ఓర్చుకున్నాను.
ఈసారి రొండు చెంబులు గబగబ ముంచి నా తలమీంద అమాంతం గుమ్మరించింది. అంతే నాకు ఊపిరాడక బిత్తరతో లేసి నిలబడి అత్త సేతిలోని గుండుజొంబును తీసి కోనేట్లోకి ఇసిరేస్తిని. అది బుడుంగుమంటా నీళ్లల్లోకి మునిగిపోయె.
“అయ్యో, అయ్యో, గుండుజెంబు నీట్లో మునిగిపాయెనే…” అని మా అత్త అరిసేకొందికి, మా నాయినొచ్చి విషయం తెలుసుకుని కోపంగా నా గుండుమీంద ఒక్క మొట్టిక్కాయేసి నన్ను నానా తిట్లూ తిట్టె.
మా పిన్ని వొచ్చి…“వొరే బిత్తిరి నా కొడకా, అది మా అమ్మ నా పెండ్లికిచ్చిన సీదనం రా. బంగారట్టాంటి పిత్తలి గుండు చెంబును కోనేట్లో ఏసి పున్నెం కట్టుకున్నేవు గదరా అదురు నాయాలా…” అంటా ఆమె కూడా కోపం ఆపుకోలేక నా గుండుమీంద ఠంగుమంటా ఒక్కటేసింది. దాంతో నేను కోపంతో ఆణ్ణించి గబగబా నడిసి ఏడస్తా పైకొచ్చేస్తిని.
ఆపైన నన్ను ఎట్టెట్టో సముదాయించి నాకు నీళ్లుబోసి, సెవులు కుట్టించుకోని కొండమీంద గుడికి బయలుదేరినాము.
టెంకాయి, కర్పూరం కొనుక్కునే దానికి ఒక అంగడికి పోయినపుడు, అంగిటాయన అన్నీ ఇచ్చి కడాన మాకు ఒక పొడుగాటి కట్టెపుల్లను కూడా ఇచ్చినాడు. “ఇది దేనికీ?” అని ఆయన్ను అడిగితిని.
“దీని అవసరం నీకు ముందు ముందు తెలిస్తింది, తీసక పో…” అన్నాడాయన నవ్వతా.
సూద్దును గదా.. కొండమీందికెక్కే వాళ్లందరి సేతుల్లోనూ ఒక కట్టెపుల్ల ఉండాది. ఆచ్చర్యంగా అనిపించింది నాకు.
కొంచెం దూరం పొయ్యేకొందికి అడవి మొదలయ్యే. సుట్టూ సెట్లు. వాటి మద్దెన పైకి పొయ్యేటందుకు మెట్లుండాయి.
మేము మెట్లెక్కి పైకి పోతాఉంటే, సెట్ల కొమ్మల్లో కోతులు నడమాడతా ఉండాయి. అవి మమ్మల్ని సూసి గబగబా సెట్లు దిగి రావటం మొదలుపెట్టినాయి. వొచ్చి కింది కొమ్మల్లో కొన్ని, రాతి గుండ్లమీంద కొన్ని, నేలమీంద కొన్నీ కూసున్నాయి.
మా అందరి సేతుల్లోనూ ఏదో ఒక లగేజీ బొళువు ఉండాది. కోతుల్ని జూసి జాగర్తగా లగేజీని పట్టుకోని నడస్తా ఉండారంతా. అవి మమ్మల్నే దీచ్చగా సూస్తా ఉండాయి.
ఇంతలో… మా ముందు పోతావుండే మనుసుల కాడికి ఒక కోతి పరుగెత్తుకొచ్చి ఒక ఆడపిల్ల సేతిలో ఉన్న వైరు బ్యాగును పట్టుకొని గుంజింది. బయ్యింతో ఆ పిల్ల సేత్తో పట్టుకోనుండే బ్యాగును వొదిలేసింది. అది ఆ బ్యాగును ఎత్తుకోని ఒక బండమీందికి పోయి బ్యాగులో ఉండే వస్తువుల్నంతా తీసి కిందపారేసింది. అడుగున మిచ్చర్ పొట్లం, అంటిపొండ్లు కనిపించే కొందికి ఆటిని బయటికి తీసింది. మిచ్చర్ పొట్లాన్ని గట్టిగా చింపేకొందికి మిచ్చరంతా సెల్లా సెదురై నేలపాలైంది. బ్యాగును వొదిలేసి ఆ కోతి ఒక సేత్తో మిచ్చరు జవురుకొని నోట్లో కుక్కుకోసాగింది. దాన్ని సూసి నాలుగైదు కోతులు ఆడికి పరుగెత్తుకొచ్చినయి. అవి మిచ్చరు పోటీపడేకొందికి ఇంకో సేతిలో పట్టుకోనున్న అంటిపండ్లను తీసుకొని ఆ కోతి సెట్లకొమ్మల్లోకి పారిపోయింది. ఆ అంటిపండ్ల కోసరం ఇంకో రెండు కోతులు దాన్ని ఎంబడించే. వాటినే సూస్తా ఉండిపోయినారు అంతా.
ఈ సందట్లో ఒక కోతిపిల్ల ఒక పిలగాడి సేతిలో ఉండే కోకోకోలా బాటిల్‌ను బలింతంగా లాక్కొని పారిపోయింది. వాడు కుయ్యోమని ఏడవటం మొదలు పెట్టినాడు. ఆ కోతిపిల్ల దూరంగా పోయి కూసోని బాటిల్ మూతను తిప్పి పైకెత్తి పెట్టుకొని కోకోకోలాను గుటగుటమంటా తాగసాగింది. ఆ పిలగాడు “నా కోకోకోలా… నా కోకోకోలా…” అంటా బావురుమని ఇంకా గెట్టిగా ఏడుపందుకున్నాడు. పాపం వాణ్ణి సముదాయించే కొందికి వాళ్లకు సాలు సాలు అని అయిపోయింది.
ఇంతలో… గుడ్డల సంచీని పట్టుకుని నడస్తా ఉండే మా రొండో అక్క కాడికి పరుగెత్తుకొని వొచ్చె ఒక మగకోతి.
దాన్ని సూసి “హేయ్… హేయ్…” అని మా అక్క అరిసినా అది పట్టించుకోకుండా సంచిని గట్టిగా పట్టుకునింది. అంతే! బిత్తరతో మా అక్క ఆ సంచిని వొదిలేసింది. అది ఆ సంచిని ఎత్తుకుని దూరంగా పారిపోసాగింది. మేమంతా అరస్తా దాని ఎనకే పోతిమి. అది ఒక్కసారిగా ఎనక్కి తిరిగి మాకల్లా జూస్తా పండ్లు ఇకిలించి కండ్లు ఉరిమింది. అంతే బయ్యింతో మేమంతా ఆణ్ణే నిలబడిపోయినాం.
అది ఆ సంచీని తీసుకొని గబగబ ఒక సెట్టెక్కి కూసునింది. తినేందుకు ఏమైనా దొరుకుతుందేమోనని సంచీలోని ఒక్కొక్క గుడ్డా బయిటికి తీసి కిందికి ఇసిరెయ్య సాగింది. ముందు మా నాయిన పంచొచ్చి నేలమీద పడింది. “రేయ్, పొయ్ నా పంచెను తీసకరాబో రా…” అన్నాడు మా నాయిన.
“వొద్దొద్దు… అన్నింటినీ అది కిందికి ఏసెయ్యనీ, పొయ్ తెచ్చుకుందాం. లేపోతే అది మనకు దూరంగా ఇంకెక్కడికో తీసకపోయి ఆడ ఏసేస్తుంది. దాన్ని ఎతుక్కోని తెచ్చుకోవాలంటే మనకు కస్టమయితాది.” అనింది మా పిన్ని.
ఈసారి ఆ కోతి మా పిన్ని లోపావడను ఇసిరేసింది. ఆ తర్వాత మా అక్క జాకెట్టు. అన్నీ ఇసిరిసిరి కిందికి ఏస్తా తినేందుకు సంచీలో ఏమైనా దొరికితిందేమోనని ఎతుకులాడతా ఉండాది. దానికి ఏమీ అగుపళ్లేదు.
ఆ సంచీలో ఇంకా నా డాయరు, తల టోపీ ఉండాది. అవిట్ని కిందికి ఇసిరేస్తుందేమోనని దానికల్లా చూస్తా ఉండా. ఆ కోతి అవిట్ని కిందికి ఇసిరెయ్యకుండా సంచీని ఎత్తుకుని ఇంకా పై కొమ్మల మీందికి పోయింది. “నా డాయరు… నా టోపీ…” అని అరిసి గెట్టిగా ఏడవటం మొదలుపెడితిని.
“పోనీలేరా. నీ డాయరు, టోపీమింద దానికి మణుసు మళ్లినట్టుండాది. ఆట్ని ఏసుకోని తిరగనీ…” అంటా కిందపడిన గుడ్డల్ని ఏరుకుని వొచ్చింది మా అక్క. అంతే! ఆ మాటతో అందురూ కోతులు పండ్లు జూపించినట్టు జూపిస్తా పకాపకామన్నారు.
ఇప్పుడర్థమైంది. ఇంతకుముందు టెంకాయిలాయన ఎందుకు మాకు కట్టెపుల్లను ఇచ్చినాడో. కానీ ఈ సందట్లో మాకాడ ఆ కట్టెపుల్ల ఉండే ఇసయమే మర్సిపోయినాము మేము.
(మళ్ళీ కలుద్దాం)