[box type=’note’ fontsize=’16’] ‘నా బాల్యం కతలు’ అంటూ తన చిన్ననాటి ముచ్చట్లను అందిస్తున్నారు జిల్లేళ్ళ బాలాజీ. [/box]
9. దుర్గా కొటాయిలో రత్తపాతం
[dropcap]ఆ[/dropcap] సమ్మచ్చరం ఎండాకాలం లీవులికి ఎప్పుడెప్పుడు తిర్తనికి పోదామా అని ఎదురుసూస్తా ఉండాం, నేనూ మా సిన్నక్కా! మానాయిన గ్రీన్ సిగ్నలిచ్చె. ఇంకేం మర్నాడే తిర్తనికి ఎలబార్తిమి. మా కోసరం ఎదురుజూస్తా ఉండాది మా పెద్దక్క.
మేము పోయిన దినమే ఆటల్లో లీనమై చానా ఆటలు ఆడుకుంటిమి. మస్తు మజా చేస్తిమి.
అప్పుడు… దుర్గా కొటాయిలో ‘సరస్పతి శపదం’ అన్న అరవ సినిమా ఏసినారు. ఆ సినిమాలో శివాజీ, కె.యార్.విజియ, ముత్తురామన్ లాంటి గొప్పగొప్ప యాక్టర్లంతా యాక్టింగు సేసినారు. ఆ సినిమాను సూసినోళ్లంతా చానా బాగుండాదని కతలు కతలుగా చెపతా ఉండారు. మాకూ ఆ సినిమాను సూడాలని చానా ఆశ పుట్టింది.
అప్పుడు నేల టిక్కెట్టు ముప్పై పైసాలు. మా ముగ్గురికి కలిపి రూపాయి కూడా కాదు కర్సు. అందుకే సినిమాకు దుడ్డియ్యమని మా తాతను అడిగితిమి. మా తాతకు సినిమాలంటే పడదు. అవంటే ఒళ్లు మంట. ‘కావాలంటే తినేదానికి దుడ్డిస్తాను. సినిమాకు మాత్రం దుడ్డియ్యనని’ తేల్చి చెప్పేసినాడు.
“అయితే తినేదానికే దుడ్డియ్యి…?” అని టక్కున సెయ్యి సాపినాను.
ఆ దుడ్డుతో ఏమీ తీసి తినకుండా, సినిమాకు పోవచ్చని నా అవిడియా.
“వీడ్రా నా మనవడంటే…”అని మెచ్చుకుంటా జోబీలోనుండి అయిదు పైసాలు తీసి నా సేతిలో పెట్నాడు మా తాత.
దాన్ని సూసి కోపంతో. “నువ్వే తీసుకో ఈ ఐదు పైసాలు, నాకేం వొద్దు పో…” అన్నాను మూతి ముడుసుకుంటా. ఏడు పెత్తుకునింది మా సిన్నక్క. దానికి మా తాత దగ్గర దుడ్డు ఎట్టా రాబట్టాల్నో బాగా తెలుసు. కంట్లో నీళ్లు రాకండా ఏడుపెట్టా ఏడవాలో దానికి తెలిసినట్టు ఈ బూ పెపంచకంలో ఇంకెవురికీ తెలీదు. అట్టాంటి ఏడుపెత్తుకునింది. మా పెద్దమ్మ వొచ్చింది. సముదాయించింది. ఊహూ… అది ఏడుపు ఆపలేదు. మద్దేనం అన్నానికి మా పెదనాయినొచ్చినాడు. అప్పుడు మళ్లా ఎత్తుకునింది ఏడుపు. ఆయనా సముదాయించినాడు. ఊహూ… అది ఏడుపును ఆపింటే ఒట్టు.
సివరికి దాని ఏడుపుకు తట్టుకోలేక ఆ సాయంత్రం సినిమాకు దుడ్డిచ్చినాడు మా తాత. అంతే ఠక్కున ఆగిపోయింది దాని ఏడుపు. ఆ రోజు మేము ముగ్గురుం, మా అత్తా, ఆమె కూతురు పుస్పా కలిసి సెకండ్ సో కు పోవాలని తీర్మానించుకుంటిమి.
ఆ రేత్రి గబగబా అన్నాలు తినేసి ఉసారుగా సినిమాకు బయలుదేరితిమి.
టికెట్ తీసుకొని కొటాయిలోకి పోయి మంచి సోటు సూసుకుని కూసింటిమి.
సినిమా మొదలైంది. సినిమా బలే రంజుగా ఉండాది. లచ్చిమి, సరస్వతి, పార్వతుల మద్దెన పోటీ వొచ్చేసింది. ఈ బూ పెపంచకంలో ఎవురు గొప్ప? నేనంటే నేనని వాదించుకున్నారు. నేనేందో, నా గొప్పతనమేందో సూపిస్తానని ముగ్గురూ ఒగరికొకరు సవాళ్లు ఇసురుకున్నారు… సినిమా పోటాపోటీగా సాగతా ఉండాది.
ఇంతలో ఇంట్రవెల్లు వొదిలినారు. మురుకులు, పబ్బిళ్లలు, సెనిగుంటలు ఇంకా ఏందేందో… మా మద్దెకొచ్చి అమ్మతా ఉండారు అమ్మేటోళ్లు. కొనేవోళ్లు ఆటిని కొనుక్కోని తింటా ఉండారు.
మంచి ఎండా కాలం కాబట్టి సోడాలు, కలర్లు, నన్నార్లూ అమ్మతా ఉండారు కొందరు పిలకాయలు. రొండు బాటిళ్లను సేతబట్టుకుని, ఇంకో నాలుగు బాటిళ్లను ఇనుప స్టాండులో మోచేతికి తగిలించుకుని “సోడా, కలర్… సోడా, కలర్…” అంటా అరస్తా మా మద్దెన తిరగతా ఉండారు. ఎవురు కావాలని పిల్సినా… ఆపాట్నే గభీమని సోడా బాటిల్ని కొట్టి వాళ్ల సేతికి బాటిళ్లను అందిస్తా ఉండారు పిలకాయిలు. వాళ్లు తాగేలోపల ఇంకెవురైనా పిలస్తారేమోనని మనుసుల మద్దెలో అట్టా ఇట్టా తిరగతా ఉండారు. తీసుకున్నోళ్లు తాగేసినాంక పిలిసి దుడ్డిస్తే తీసుకుంటా ఉండారు. లేపోతే పిలకాయిలే తాగినోళ్ల దగ్గరికెళ్లి దుడ్డు వసూలు సేసుకుంటా ఉండారు. ఈ వ్యాపారంలో నలుగురైదుగురు పిల్లకాయిల మద్దెన పోటీ బాగా ఉండాది. తాము తెచ్చిన బాటిళ్లు అయిపోవాలని పోటీలుపడి అడిగోళ్లకు ఆపాట్నే సోడా బాటిళ్లను కొట్టిస్తా ఉండారు. ఆ కొట్టే తొందరలో ఒక్కోసారి బాటిల్ కింద సపోర్ట్ పెట్టుకోవాలన్న ఆలోసనను కూడా మర్సిపోతా ఉండారు. కింద ఏమీ ఊతం పెట్టుకోకనే గాల్లోనే కొట్టిస్తా ఉండారు. మరి కొంతమంది పిలకాయలైతే సోడా ఓపెనర్‌తో కొట్టకుండా సేతి బొటనేలితోనే గోలీని కిందికి నొక్కేసి ఇచ్చేస్తా ఉండారు. సోడా బాటిల్లో గ్యాస్ ఎక్కువగా ఉంటాది. గోళీకాయను కిందికి నొక్కగానే ఒక విధమైన శబ్దంతో సోడా నీళ్లంతా బుసబుసమంటా పైకి పొంగకొస్తాది.
ఇంతలో ఎవురో… ‘రేయ్ సోడా…’ అని అరిసినారు. అంతే! మా ముందు నిలబడున్న పిలగోడు గాల్లోనే తన దగ్గరున్న సోడా బాటిల్ను కొట్టేసినాడు. దాన్ని కొట్టి కొట్టగానే అది ఢామ్మన్న శబ్దంతో పగిలిపోయింది.
దాంతో ఒకటే అరుపులు… పెడబొబ్బలు… ఉన్నట్టుండి సినిమా కొటాయిలో గందరగోళం సెలరేగింది.
బాటిల్ ముక్కలు ముక్కలుగా పగిలిపోయి… సినిమాకొచ్చిన మనుషుల మీంద పడింది. ఒక గాజు ముక్క నా కుడి సెంపలోకి దూరిపోయింది. అంతే! నా సెంప నుండి రక్తం బుసబుసమని పొంగుకుంటా బయటికొస్తాంది. రక్తాన్ని సూసి మా సిన్నక్క బిత్తరకపోయి ఏడుపెత్తుకునింది. సినిమాకు వొచ్చినోళ్లంతా రక్తాన్ని చూసి బయపడిపోయి నాకు ఏదేందో సేస్తా ఉండారు. ఒకామె తన ఒంటి మీదున్న సీరను సరసరమంటా సింపి గబగబా నా సెంపనుండి కారుతున్న రక్తాన్ని అదిమిపట్టింది. కొంచేపటికంతా ఆ గుడ్డంతా రక్తంతో తడిసిపోయింది. దాంతో అందరిలోనూ ఒకటే బయ్యిం పట్టుకునింది.
రత్తాన్ని ఆపేటందుకు ఇంకో పెద్దాయన తన బుజమ్మీదున్న సవకాన్ని తీసి నా సెంపకేసి అదిమి పట్టినాడు! కానీ రత్తం ఆగలేదు. అదీ తడిసిపోయింది. ఇంక ఈడుంటే లాబం లేదనీ, డాకట్రు దగ్గరికి తీసకపోవాలని ఎవురో సెప్పినారు.
ఇంతలో ఈ ఇసయం ఎట్టా మా ఇంట్లో వాళ్లకు తెల్సిందో, ఏమో? మా అత్తా, మా మామా, మా బందుగులంతా దుర్గా కొటాయి కాడికి వొచ్చేసినారు. ఆల్లోకి వొచ్చి మా కోసరం ఎతకతా ఉండారు. నా సుట్టూ మనుసులుండే కొందికి వాళ్లనంతా పక్కకు తోసేసి మా మామ నన్ను అలాగ్గా సేతల్లోకి జవురుకున్నాడు.
కొటాయి బయటికొచ్చి రిచ్చాలో కూసోబెట్టుకొని నేరుగా కిష్ణమూర్తి డాకట్రు దెగ్గరికి తీసకపోయినారు. ఆయిన నా పరిస్థితిని సూసి… “రక్తం బాగా పొయ్యుండాది. సీసా పెంకు లోపల ఉన్నట్టుండాది. పైన ఊరికే కట్టుకట్టే లాభం లేదు. ఆపరేసన్ సేసి దాన్ని తియ్యాల. ఆ పని నేను సెయ్యలేను. ఎంటనే మీరు బిడ్డనెత్తుకోని ‘నగిరి’కి పోండి. అక్కడ డాకట్రు ఈశ్వర్రాజు అని నాకు తెలిసిన ఒక మంచి సర్జన్ ఉండాడు. ఆయనకు నా పేరు సెప్పినారంటే సాలు. ఆపరేషన్ జేసి సీసాపెంకును తీసేస్తాడు. ఆపైన బిడ్డ ప్రాణానికి ఏ ప్రైమాదమూ ఉండదు.” అని సెప్పి కాగితంలో ఏందో రాసిచ్చినాడు.
ఆపరేసన్ అనే కొందికి మా బందుగులందరిలోనూ బయ్యిం పట్టుకునింది. మా పెద్దమ్మ బోరోమని ఏడుపెత్తుకొనింది. “బిడ్డకు ఆపరేసను సెయ్యాలంట్రా నాయనోయ్, నేనేం జేతున్రా దేముడోయ్.” అని రాగాలు తియ్యసాగింది.
ఇసయం ఇన్న ఎంబటే మా ఈదిలో ఉండేటోళ్లు ఒగ ఒంటెద్దు బండిని సిద్ధం చేసి డాకట్రు ఇంటికాడికి తోలకొచ్చినారు.
అందులో నన్ను పండుకోబెట్టుకొని నగిరికి ఎలబారినారు. ఆ నడిజాము కాడ బండ్లో నేనూ, మా పెద్దమ్మ, మా మామ, మా అత్త, బండెనక ఇంకో మామ, పెదనాయిన, ఇంకా మా ఈదిలో ఉండే ఇద్దురుముగ్గురు మొగోళ్లు ఎనకనే నడుసుకోని వస్తా ఉండారు. రత్తం కారతా ఉంటే గుడ్డను అదిమిపడతా ఉండాది మా పెద్దమ్మ. నాకు గాలి బాగా ఆడాలని కొంగుతో ఇసరతా కూసోనుండాది మా అత్త. నాకు మగత ఆవహిస్తా ఉండాది. కండ్లు మూసుకోని ఉండిపోయినాను.
అట్టా ఎంత సేపు గడిసిందో నాకు తెలీదు. ఎప్పుడు నగిరి సేరుకున్నామో, డాకట్రు నాకెప్పుడు ఆపరేసను జేసినాడో ఏమీ నాకు తెలీదు. కండ్లు తెరిసేకొందికి ఇంటికాడ సాప మింద పండుకోనుండాను. కుడిసెంపకు నడీ మద్దెన ఏందో బిగుతుగా ఉండాది. ఆడ కొంచిం నొప్పిగా కూడా ఉండాది. మెల్లింగా ఆడ తాకి సూత్తే బ్యాండేజీ గుడ్డ సేతికి తగిలింది.
“నాయినా సేత్తో తాక మాకు. నొప్పిగా ఉండాదా?” అని మా పెద్దమ్మ నా కండ్లల్లోకే సూస్తా అడిగింది. ఔనన్నట్టుగా తలాడిస్తిని. “తగ్గిపోతిందిలే నాయినా, కొంచిం ఓర్చుకో…” అని కండ్లల్లో నీళ్లు పెట్టుకొనింది మా పెద్దమ్మ. ఇంతలో మా పెదనాయినొచ్చి “మేయ్, ముందు నువ్వు బిడ్డకాడనుండి పైకి లే. బిడ్డ ఇప్పుడే బిత్తరకపోయుంటే పక్కనే కూసోని నువ్విట్టా ఏడస్తా ఉన్నావంటే వాడింకా దిగులుపడిపోతాడు. లే ఈణ్ణించి…” అని మా పెద్దమ్మను కసురుకున్నాడు.
“నొప్పికి బిడ్డేటా తట్టుకుంటాడో, ఏమో? నా బిడ్డను ఆ మురుగుడే కాపాడాల…” అంటా లేసి బయిటికి పొయ్యింది.
మా పెద్దక్క సిన్నక్క పుస్ప అందురూ బెదరకపోయుండారు. మా తాత ముఖం నిండా దిగులు కనిపిస్తా ఉండాది.
తెల్లారింది! ఈదీదీ తిరిగి ఇడ్లీలు అమ్ముకునే ఆచారవ్వ నన్ను సూడ్డానికొచ్చింది. ఆప్యాయంగా నాకల్లా జూస్తా “ఎట్టుండే బిడ్డ ఎట్టయిపాయినమ్మా!” అనగానే మా అత్త- “బిడ్డ వొంట్లోని రత్తమంతా కారిపోయె కదా ఆచారమ్మా. ఇంకేం మిగిలుండాది వాడి వొంట్లో” అనే ఏడుపు గొంతుతో. ఆచారవ్వ నడుముకాడ దోపుకున్న కొంగుముడిని ఇప్పి “బిడ్డకు బాగవ్వాలని అంకాలమ్మకు మొక్కుకోని వొస్తిని. ఆ దేవత తొరగానే నయిం జేసిందిలే, బాదపడమాకండి…” అంటా కాగితపు పొట్లంలో ఉన్న ఇబూదిని తీసి నా నొసటన పెట్టింది. ఆమెవరు? మేమెవరం? కానీ తన బిడ్డకు బాగవ్వాలని దేముడికి మొక్కుకోని వొచ్చిన ఆచ్చారమ్మకల్ల కృతజ్ఞతగా సూసింది మా పెద్దమ్మ. తర్వాత ఆకులో మూడు ఇడ్లీలు పెట్టి ఇంత సాంబారు బోసి… “బిడ్డకు తినిపించమ్మా…” అంటా దుడ్డు తీసుకోకనే పాత్రను నడుమ్మీద పెట్టుకొని ఈదిలోకి నడిసింది ఆచారవ్వ.
(మళ్ళీ కలుద్దాం)