[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారా ఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే సంవత్సరం విజయదశమి వరకూ సాగుతుంది.]
నా గొడవ
[dropcap]న[/dropcap]వంబరు 13 వ తేదీ, ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ వర్ధంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, యువభారతికి ఆత్మీయులు, సంస్థ శ్రేయోభిలాషి, శ్రీ కాళోజీ గారు రచించిన ‘నా గొడవ’ పుస్తకం గురించి చిరు పరిచయం.
‘అక్షర రూపం దాల్చిన ఒకే ఒక్క సిరా చుక్క – లక్ష మెదళ్ళకు కదలిక’ అన్న కవితను చదివినప్పుడు–
‘చెమ్మ గిల్లని కనులు బ్రతుకు కమ్మదనము చూడలేవు –
చెమ్మగిల్లని కనులు బ్రతుకు కమ్మదనం చాటలేవు..’ అన్న కవిత విన్నపుడు –
కాళన్న జ్ఞాపకం రాకపోరు.
‘కాళోజీ’ లేదా ‘కాళన్న’గా సుపరిచితులైన శ్రీ కాళోజీ నారాయణరావు గారు తెలంగాణా ప్రజల ప్రతి ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతారు. ఆయన రాజకీయ, సాంఘిక చైతన్యాల సమాహారం. నిజమైన కవిత్వం వ్రాసిన ప్రజాకవి. హక్కులడిగిన ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది. మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజి. పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు ఆయన. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా ఆయన తన కలం ఎత్తారు. స్వాతంత్ర్యసమరయోధుడు, తెలంగాణా ఉద్యమకారుడు. ఆయన 1992లో భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మవిభూషణ్’ తో గౌరవించబడ్డారు. ఆయన జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవించింది. వరంగల్‌లో నెలకొన్న ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టబడింది. అలాగే హనుమకొండ పట్టణంలో కాళోజీ కళాక్షేత్రం నిర్మిస్తున్నారు. ఒక్క వాక్యంలో చెప్పాలంటే, తెలంగాణ తొలిపొద్దు కాళోజీ.
అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి
అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి
అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు
.. అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు.
ఉదయం కానే కాదనుకోడం నిరాశ..
ఉదయించి అట్లానే వుండాలనుకోడం దురాశ
ఈ చీకటి ఉండదు – సూర్యుడు తప్పక ఉదయిస్తాడు
ఆ వెలుతురు నిలవదు – సూర్యుడు మళ్ళీ అస్తమిస్తాడు
చీకటిలో కనువిప్పినవారికి వెలుతురంటే బూచి
వెలుతురులో కనుతెరిచినవారికి చీకటంటే పిశాచి
ఇదే జరుగుతూ వచ్చింది..
ఇంతకుముందు ఇదే జరిగింది..
తప్పదు ఇక ముందు..
అని ఆశా నిరాశల మధ్య ఉన్న సన్నని గీతను భూతద్దంలో ఉంచి చూపించిన వైతాళికుడు కాళోజీ.
శ్రీ కాళోజీ గారి షష్టిపూర్తి సందర్భంగా, ‘సాహితీ వాహిని’ పరంపరలో భాగంగా యువభారతి ప్రచురించిన ‘నా గొడవ’ పుస్తకం – ఆయనకు పట్టిన అక్షర నీరాజనం.
క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.
లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోవచ్చు.