నా జీవన గమనంలో…!-1

44
3

[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రాబ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box] 

గమనిక:

[dropcap]వ్య[/dropcap]క్తిగత కారణాలు మరియు గోప్యత దృష్ట్యా, ఈ రచనలోని కొందరు వ్యక్తులు మరియు అధికారుల అసలు పేర్లకు బదులుగా వేరే పేర్లను వ్రాయడం జరిగింది. దయచేసి అర్థం చేసుకోగలరు.

~~

సెప్టెంబరు… 14 వ తేదీ… నా జీవితంలోనే అతి ముఖ్యమైన రోజు… అని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు.

దానికి కారణం లేకపోలేదు… సుమారు 47 సంవత్సరాల క్రితం అదే రోజు… నేను… ఆంధ్రా బ్యాంకు ఉద్యోగంలో చేరాను. ఆ రోజే ప్రతి సంవత్సరం నేను ఓ పండుగలా జరుపుకుంటున్న రోజు.

ఈసారి మాత్రం ఆ రోజున, అంటే, ది. 14.09.2019 అదో రకమైన దిగులు, బాధ. ఎందుకంటే ఇటీవల కేంద్రప్రభుత్వం బ్యాంకుల విలీనంపై తీసుకున్న ఓ నిర్ణయం.

ది. 30.08.2019 న కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన మేరకు, ఆంధ్రా బ్యాంకు మరియు కార్పోరేషన్ బ్యాంకు, పెద్ద బ్యాంకైన యూనియన్ బ్యాంకుతో విలీనం కాబోతున్నాయి.

ది. 13.09.2019న జరిగిన బోర్డు మీటింగులో, ఆంధ్రా బ్యాంకు డైరక్టర్లు, ప్రతిపాదిత విలీనానికి ఆమోదం కూడా తెలియజేయడం జరిగింది.

ఈ విలీనం ద్వారా 14.59 లక్షల కోట్ల రూపాయల ఆస్తులతో, 9609 శాఖలతో, దేశంలోనే ఐదవ అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంకుగా అవతరించబోతోంది యూనియన్ బ్యాంక్.

ఇక ఆంధ్రా బ్యాంకు విషయానికొస్తే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో స్వాతంత్ర్య సమరయోధుడు, డాక్టర్. బోగరాజు పట్టాభి సీతారామయ్య గారిచే స్థాపించబడిన బ్యాంకు ఆంధ్రా బ్యాంకు.

ది. 20.11.1923 న ఒక లక్ష రూపాయల పెయిడ్ అప్ క్యాపిటల్‍తో, ఒక మిలియన్ రూపాయల ఆథరైజ్డ్ క్యాపిటల్‍తో రిజిస్టర్ చేయబడింది ఆంధ్రా బ్యాంకు…

1956లో, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ ముఖ్య పట్టణమైంది. అప్పుడే ఆంధ్రా బ్యాంకు రిజిస్టర్డ్ ఆఫీసు మచిలీపట్నం నుండి హైదరాబాద్‍కు తరలించడం జరిగింది.

2011-12 సంవత్సరంలో త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలోకి ప్రవేశించింది ఆంధ్రా బ్యాంకు.

ప్రస్తుతం దేశంలోని 25 రాష్ట్రాలలో మరియు మూడు కేంద్ర పాలిత ప్రాంతాలలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది ఆంధ్రా బ్యాంకు.

దాదాపు 96 సంవత్సరాల క్రితం, మచిలీపట్నంలో ఒక చిన్న శాఖతో మొదలై, ఇంతై, అంతై, వటుడింతైనట్లు, శరవేగంతో అభివృద్ధి చెందింది ఆంధ్రా బ్యాంకు…

ది. 31.03.2019 నాటికి 2885 శాఖలతో, 3.64 లక్షల కోట్ల రూపాయల ఆస్తులతో, 4,387.95 కోట్ల రూపాయల ఆపరేటింగ్ ప్రాఫిట్‍తో, 20,981 మందికి ఉద్యోగాల కల్పనతో, ఉజ్వలంగా విరాజిల్లుతోంది ఆంధ్రా బ్యాంకు…

అలాంటి ఆంధ్రా బ్యాంకుతో దాదాపు 47 సంవత్సరాల అఖండమైన అనుబంధం నాది. ఎందుకంటే ఇప్పటికీ నేను ఆంధ్రా బ్యాంకు నుండి నెల నెలా పెన్షన్ తీసుకుంటూనే వున్నాను.

కానీ, వచ్చే సెప్టెంబరు 14 నాటికి ఆంధ్రా బ్యాంకు కనబడకుండా పోబోతుంది. కనీసం పేరు కూడా వినబడకుండా పోబోతుంది. అది తలచుకుంటే, నా గుండె పిండినట్లవుతుంది. ఆ తలంపు రాగానే మనసు కకావికలవుతుంది. కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి. ఏదో భరించలేని బాధ… తట్టుకోలేని దిగులు…

ఒక్కసారిగా నేను ఆంధ్రా బ్యాంకులో పని చేసిన రోజులు, అప్పటి అనుభవాలు, నా కళ్ళ ముందు సినిమా రీళ్ళలా కదిలిపోతున్నాయి.

సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలు…; అన్నింటిని చవిచూసిన నేను, వాటన్నింటినీ ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటున్నాను.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here