Site icon Sanchika

నా జీవన గమనంలో…!-10, 11

[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]

10

[dropcap]1[/dropcap]977 సంవత్సరం.

ఓ రోజు దినపత్రికలో ఆంధ్రా బ్యాంకు, గ్రేడ్ 2 ఆఫీసర్ కేడర్‍లో గ్రామీణ ఋణాధికారుల డైరక్ట్ రిక్రూట్‍మెంట్‍కు సంబంధించిన ప్రకటన చూడ్డం జరిగింది.

అర్హతలు: విద్య: వ్యవసాయ శాస్త్రంలో డిగ్రీ.

అనుభవం: ప్రభుత్వ వ్యవసాయ, పశుసంవర్ధక, విత్తన, సహకార శాఖలలో అధికారిగా 5 సంవత్సరాల కనీస అనుభవం. జాతీయ బ్యాంకులలో అగ్రికల్చరల్ క్లర్కుగా 5 సంవత్సరాల కనీస అనుభవం.

చూడగానే, నేనూ నా దరఖాస్తును పంపుదామనుకున్నాను. ‘జాతీయ బ్యాంకులలో’ అని చూడగానే ఒకింత నిరాశకు గురయ్యాను.

మనసులో ఆలోచనలు పరి పరి విధాలా పరుగులు తీశాయి. అదేంటి? జాతీయ బ్యాంకులలో 5 సంవత్సరాలు పని చేస్తే అర్హులా! ఆంధ్రా బ్యాంకులో 5 సంవత్సరాలు పని చేస్తే అనర్హులా!! అప్పటికింకా ఆంధ్రా బ్యాంకు ప్రైవేటు సెక్టారులోనే పనిచేస్తుంది. అయినా ఎందుకీ వ్యత్యాసం? అంటే!… ఆంధ్రా బ్యాంకులో చేరడం మేము చేసిన పాపమా! ఇదెక్కడి న్యాయం?

వెంటనే నాలా 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి గుంటూరు జిల్లాలో వేరే బ్రాంచీలలో పని చేస్తున్న, ఓ ఇద్దరు అగ్రికల్చరల్ క్లర్కులతో చర్చించాను. ఆ రోజే రీజనల్ మేనేజరు గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఆంధ్రా బ్యాంకులో 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని అర్థించాము. ఆ రిప్రజెంటేషన్‍ను చదివిన రీజనల్ మేనేజర్ గారు, మేము లేవనెత్తిన అంశంలో ఓ అర్థం ఉందని, సకారాత్మాకంగా స్పందించారు.

“రెండు మూడు రోజుల్లో హెడ్ ఆఫీసు నుంచి జనరల్ మేనేజర్ శ్రీ. కె.జి.కె. మూర్తి గారు మన రీజియన్‍ని సందర్శించబోతున్నారు. అప్పుడు వారిని కలవడానికి వీలుగా మీకు అపాయింట్‍మెంట్ ఇప్పిస్తాను. ఈ విషయంపై వారితో మాట్లాడండి. నేను నా వంతుగా మీ వివరణను సమర్థిస్తూ సిఫారసు చేస్తాను” అని చెప్పారు.

మొదటి ప్రయత్నంలోనే మాకు రీజనల్ మేనేజర్ గారి నుండి అంతగా మద్దతు లభించినందుకు చాలా సంతోషమైంది. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశాము.

***

ఆ రోజు హెడ్ ఆఫీసు నుండి జనరల్ మేనేజరు గారు మా రీజినల్ ఆఫీసుకు వచ్చారు.

శ్రీ కె.జి.కె.మూర్తి గారు, జనరల్ మేనేజర్..

మా రీజినల్ మేనేజరు గారు, ఇంతకు  ముందు మాకు ఇచ్చిన మాట ప్రకారం, మేము జనరల్ మేనేజర్ గారిని కలిసేందుకు సాయంత్రం ఆరు గంటలకు అపాయింట్‍మెంట్ ఇప్పించారు. సరిగ్గా చెప్పిన టైమ్‍కే, మేం ముగ్గురం జనరల్ మేనేజర్‍గారిని కలిశాము. మాతో రీజినల్ మేనేజర్ గారు కూడా వున్నారు.

ఆంధ్రా బ్యాంకులో గ్రామీణ ఋణాధికారుల పోస్టులకు జాతీయ బ్యాంకుల్లో అగ్రికల్చరల్ క్లర్కులుగా 5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. అలాగే మన బ్యాంకులో 5 సంవత్సరాల అనుభవం వున్న అగ్రికల్చరల్ క్లర్కులకు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించమని అర్థించాము.

“మీరు చెప్పినట్టే, మన బ్యాంకులో పని చేసేవారూ కూడా అర్హులే. వెంటనే సర్క్యులర్ పంపుతాము. మీరూ దరఖాస్తు చేసుకోండి” అని చెప్పారు జనరల్ మేనేజరు గారు. మా అభ్యర్థనను మన్నించినందుకు జనరల్ మేనేజరు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశాము.

మరో నాలుగు రోజుల్లో జనరల్ మానేజర్ గారు చెప్పినట్లుగా సర్క్యులర్ వచ్చింది. వెంటనే నా దరఖాస్తు కూడా పంపాను.

శ్రీ యమ్.గోపాలకృష్ణయ్య గారు(టైతో)అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదోన్నతిపై బదిలీ అయినప్పుడు వీడ్కోలు చెప్పడానికి..,వారి స్థానంలో రీజనల్ మేనేజర్ గా చేరిన శ్రీ మానేపల్లి కృష్ణారావు గారికి (సూట్ తో) స్వాగతం పలికే సందర్భంలో…గుంటూరు రీజనల్ ఆఫీసు సిబ్బంది… నిలుచున్నవారిలో మొదటి వరుసలో కుడివైపున చివర… రచయిత…

***

మరో వారం రోజుల తరువాత హెడ్ ఆఫీసులో జరగబోయే ఇంటర్వ్యూకి హాజరవాల్సిందిగా తెలియజేశారు. ఐదు రోజుల సమయం ఉంది. బాగా ప్రిపేరయి ఇంటర్వ్యూకి వెళ్ళాను.

ఆ రోజు ఇంటర్వ్యూ, ఆంద్రా బ్యాంకులో 5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన అగ్రికల్చరల్ క్లర్కులకు మాత్రమే. ఇతరులకు ఆ తరువాత రెండ్రోజుల్లో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశారు.

ఆ రోజు వచ్చిన 12 మందిలో, ఆరుగురు బాపట్ల వ్యవసాయ కళాశాలలో నా కాలేజ్‍మేట్స్. ఆ ఆరుగురిలో నలుగురు నా క్లాస్‍మేట్స్. ఆ నలుగురిలో ఒకతను నా రూమ్‍మేట్ కూడా. పేరు కె. రమణమూర్తి. ఇంటర్వ్యూ ఏమో గాని, పాత స్నేహితులం అందరం కలుసుకున్నాము. ఆప్యాయంగా పలకరించుకున్నాము. సరదాగా కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాము.

ఇంటర్వ్యూలో అందరం పోటాపోటీగా పాల్గొన్నాము. రాత్రి తొమ్మిది గంటల తరువాత, ఎవరి ఊళ్ళకు వాళ్ళం బయలుదేరాం.

***

వారం తిరక్క ముందే ఇంటర్వ్యూ ఫలితాలు వచ్చాయి. నేను గ్రామీణ ఋణాధికారిగా, గ్రేడ్ 2 ఆఫీసరుగా సెలెక్ట్ అయ్యాను. అందరితో పాటు నాకూ ఆశ్చర్యమే! నమ్మలేకపోయాను! కానీ అదే నిజం!

ఇంటర్వ్యూకి వచ్చిన 12 మందికి బ్యాంకులో మంచి పేరుంది. ఎవరికి ఎవరూ తక్కువ కాదు. కాని 12 మందిలో ఓ ఇద్దరికి ఇవ్వాలనుకుంటే, ఎవరికివ్వాలో తేల్చుకోలేక, అప్పటికే సి.ఎ.ఐ.ఐ.బి పార్ట్ 1 పాసయిన నన్ను, శ్రీకాకుళంలో పని చేస్తున్న నా క్లాస్‌మేట్ కె. రమణమూర్తిని, ఎంపిక చేశారని అనధికారికంగా తెలిసింది.

అప్పటికి నా జీతం నెలకు సుమారు 700 రూపాయలు. గ్రేడ్ 2 ఆఫీసరుగా పదోన్నతి పొందిన తరువాత నా జీతం, నెలకు 1100 రూపాయలు కాబోతోంది.

సాధారణంగా గ్రేడ్ 2 ఆఫీసరు అవ్వాలంటే, గ్రేడ్ 3 ఆఫీసరుగా కనీసం 5 సంవత్సరాలు పని చేయాల్సి ఉంది. అంటే నాకు నెల జీతంలో దాదాపు 400 రూపాయలు పెరగటమే కాకుండా, గ్రేడ్ 3 ఆఫీసరుగా కనీసం 5 సంవత్సరాలు పని చేయకుండానే, డైరక్ట్ రిక్రూట్‍మెంట్‍లో గ్రేడ్ 2 ఆఫీసరుగా సెలెక్ట్ అయ్యాను. అందువల్ల జీతం పెరుగుదలతో పాటు, సుమారు 5 సంవత్సరాల సర్వీసు కూడా కలిసొచ్చింది. అందుకే, నా స్నేహితులు, సహోద్యోగులు… నన్ను ఎంతగానో అభినందించారు.

ఈ విషయం తెలుసుకున్న నా శ్రీమతి మరియు మా బంధువులంతా చాలా సంతోషించారు.

తరువాత రెండు రోజులకు గ్రేడ్ 3 ఆఫీసర్‌ ప్రమోషన్ కోసం హైదరాబాద్‍లో ఇంటర్వ్యూకి రమ్మని ఉత్తరం అందింది. అప్పటికే గ్రేడ్ 2 ఆఫీసర్‍గా సెలెక్ట్ అయిన నేను, ఆ గ్రేడ్ 3 ఆఫీసర్ ప్రమోషన్ ఇంటర్వ్యూకి వెళ్ళలేదు.

క్లర్కుగా పనిచేస్తున్న నేను డైరక్ట్ రిక్రూట్‍మెంట్‌లో గ్రేడ్ 2 ఆఫీసర్‌గా అవడం అనేది… కేవలం ఆ దేవుడి దయ వల్ల మాత్రమే జరిగిందని నా నమ్మకం.

స్నేహితులకు, బంధువులకు, సహోద్యోగులకు పెద్ద పార్టీ ఇచ్చాను.

***

కాకినాడ రీజియన్ లోని రావులపాలెం బ్రాంచిలో పోస్టింగ్ ఇచ్చారు. ఓ వారం రోజుల్లో జాయిన్ అవాలి.

***

గుంటూరు రీజియనల్ ఆఫీసులో ఆ శనివారం రిలీవ్ అయి, సోమవారం రోజు రావులపాలెం బ్రాంచిలో జాయిన్ అయ్యాను. అలా సర్వీస్‍లో బ్రేక్ లేకపోవడం వలన, డైరక్ట్ రిక్రూట్‍మెంట్‌ ద్వారా గ్రేడ్ 2, గ్రామీణ ఋణాధికారిగా జాయిన్ అయినా, నాకు స్టాఫ్ కోడ్, పి.యఫ్.ఖాతా నెంబరు పాతవే యథాతథంగా కొనసాగాయి. లీవ్ రికార్డు, సీనియారిటీ, సర్వీస్ రికార్డు అన్నీ పాతవే కొనసాగించబడ్డాయి.

11

ఉత్తరం వైపు విజయవాడ దాటి ముందు కెళ్ళడం ఇదే తొలిసారి. రావులపాలెం ఓ చిన్న వూరు. కోనసీమకు ముఖద్వారంలా వుంటుంది. కోనసీమ అందాల్ని సినిమాల్లో చూసేవాళ్ళం. ఇప్పుడు ప్రత్యక్షంగా చూడడం ఓ అపురూప అనుభూతి. పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు, సెలయేరులు, కాలువలు, పడవలు, మరీ ముఖ్యంగా పురాతన దేవాలయాలు, అన్నింటికీ మించి గోదావరీ నదీ సోయగాలు, కోనసీమ అందాల్ని ద్విగుణీకృతం చేస్తాయి. అలాంటి అందాల హరివిల్లు మధ్య నేను సంచరించబోవడం నా అదృష్టం… పూర్వ జన్మ సుకృతం.

రావులపాలెం ఊరికి నడిబొడ్డున, నాలుగు రోడ్ల కూడలిలో, హైవేకు కూతవేటు దూరంలో వున్న బిల్డింగు మొదటి అంతస్తులో, రెండు చిన్న గదుల్లో ఉంది ఆంద్రా బ్యాంకు బ్రాంచి. మేనేజరుతో కలిపి నలుగురు సిబ్బంది పనిచేస్తున్నారు. నేను ఈ రోజు జాయిన్ అవుతున్నట్లు ముందే తెలిసినట్లుగా నన్ను ఆహ్వానించారు… మేనేజరు గారు.

“రండి! రండి! వెల్‍కం! ఈ రోజు జాయిన్ అవుతున్నారా?”

“అవున్సార్! ఈ రోజు మంచి రోజు కదా!”

“అయినా మిమ్మల్ని ఈ బ్రాంచిలో ఎందుకు వేశారో నాకర్థం కావడం లేదు. చాలా చిన్న బ్రాంచ్. ఇరుగ్గా వుంటుంది! పైగా కావాలని నేనసలు అడగలేదు. ఎందుకు వేశారో ఏమో!” అంటూ తన అసంతృప్తి వ్యక్తపరిచారు మేనేజరు గారు.

ఆయన మాటల్ని బట్టి నాకర్థమయింది, నేనా బ్రాంచిలో చేరడం తనకిష్టం లేదని. అయినా, ఇలాంటి ప్రత్యేకమైన పోస్టింగ్ విషయంలో, హెడ్ ఆఫీసు వారు అన్ని విధాలా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారని అందరికీ తెలుసు.

“నా హెడ్ క్వార్టర్స్ ఈ బ్రాంచి సార్! ఇక్కడి నుండి నేను కోనసీమ లోని అన్ని బ్రాంచిలను కవర్ చేయాలి. వారంలో ఒకటి రెండు రోజులు మాత్రమే నేను ఈ బ్రాంచిలో అందుబాటులో ఉంటాను” అని సంజాయిషీ ఇచ్చుకున్నట్టు చెప్పాను.

ఓ మూలన, ఒక చిన్న టేబిలు, కుర్చీ వేయించి, నా సీటుగా నిర్ణయించి అక్కడ నన్ను కూర్చోమన్నారు మేనేజరు గారు.

వారం రోజుల్లో, ర్యాలీ, కొత్తపేట, అంబాజీపేట, బండారులంక, అమలాపురం, ముమ్మడివరం, రాజోలు… ఆయా బ్రాంచీలన్నింటికి వెళ్ళి, మేనేజర్లను, సిబ్బందిని పరిచయం చేసుకున్నాను. కొన్ని చోట్ల మేనేజర్లతో కలిసి,  గ్రామాలకు వెళ్ళి అక్కడి రైతులతో ముచ్చటిస్తూ, వారవలంబిస్తున్న వ్యవసాయ పద్ధతులపై అవగాహనను పెంచుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా పెద్ద పెద్ద కొబ్బరిబోండాలతో, స్వాగతిస్తున్నారు అక్కడి రైతులు. నాకదే పూర్ణకుంభ స్వాగతంలా అనిపించేది!!

***

బ్రాంచికి దగ్గర్లోనే పొలాల్లోనే వున్న ఓ డాబా ఇంట్లో, సగం పోర్షన్ అద్దెకు దొరికింది. అప్పటివరకు గుమాస్తాగా వున్న నేను, ఓ అధికారిగా పనిచేయడం, సరికొత్త అనుభవం, ఆనందాల అనుభూతి. అధికారిగా బాధ్యతాయుతమైన విధి నిర్వహణలో పని భారం ఎక్కువై కష్టంగా అనిపించినా, ఇష్టంగా చేస్తున్నాను కాబట్టి, సంతోషంగానే ఉంటుంది.

ఆ తరువాత వారంలో జాయినింగ్ టైం వాడుకుని, ఫ్యామిలీని గుంటూరు నుండి రావులపాలెంకు తరలించాను.

***

తీరికనేది లేకుండా బ్రాంచీలను చుట్టి వేయటం, ఆయా బ్రాంచి మేనేజర్లతో కలిసి పని చేయడం చాలా బాగుంది. వాళ్ళంతా నేనందిస్తున్న సేవలకు సంతోషిస్తూ, నాకు కృతజ్ఞతలు చెప్తుంటే మరీ బాగుంది. ఏమైతేనేం అతి కొద్ది రోజుల్లోనే వాళ్ళందరితో కలిసిపోగలిగాను. అందరూ నా రాకను స్వాగతిస్తూ నాకు పూర్తి సహకారం అందిస్తున్నారు.

సెలవు రోజుల్లోనైతే, నా శ్రీమతి, బాబుతో కలిసి కోనసీమ అందాల్ని ఆసాంతం ఆస్వాదిస్తూ, ర్యాలీ లోని జగన్మోహినీ కేశవస్వామి దేవాలయం, మందపల్లి శనేశ్వర స్వామి దేవాలయం, అయినవల్లి సిద్ధి వినాయక స్వామి దేవాలయం, అప్పనపల్లి బాల బాలాజీ స్వామి దేవాలయం, మురమళ్ళ శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి దేవాలయం మొదలైన ప్రాచీన దేవాలయాన్నింటినీ దర్శించుకుంటూ, వాటిల్లో కొలువైయున్న దేవుళ్ళను, దేవతలను పూజించుకుంటున్నాము.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version