Site icon Sanchika

నా జీవన గమనంలో…!-14, 15

[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]

14

[dropcap]1[/dropcap]979 సంవత్సరం.

గ్రామీణ ఋణాధికారి అంటే కేవలం గ్రామీణ ప్రాంతాల్లో అప్పులు ఇవ్వడానికి, ఇచ్చిన అప్పులు వసూలు చేయడానికి మాత్రమే, నియమించబడిన అధికారి… అని అర్థం స్ఫురిస్తుంది. అందుకే హెడ్ ఆఫీసు వారు, ఈ విషయంలో నిశితంగా పరిశీలన జరిపి, ఆ హోదాను ‘గ్రామీణ ఋణాధికారి’ (రూరల్ క్రెడిట్ ఆఫీసర్) బదులు ‘గ్రామీణ అభివృద్ధి అధికారి’ (రూరల్ డెవెలప్‍మెంట్ ఆఫీసర్) గా మార్చారు. అంటే, ఇకపై గ్రామాల్లో అప్పులిచ్చి వసూలు చేయడంతో పాటు, ఆ గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి విస్తృతస్థాయీ బాధ్యతలను నిర్వహించాలి… ఈ గ్రామీణ అభివృద్ధి అధికారులు.

ఆ క్రమంలో పైలట్ ప్రాజెక్టుగా, ‘ఇంటిగ్రేటెడ్ డెవెలప్‌మెంట్ ఆఫ్ సెలెక్టెడ్ విలేజ్’ (ఐ.డి.ఎస్.వి.) అనే నూతన పథకాన్ని ప్రవేశపెట్టింది ఆంధ్రా బ్యాంకు. ఆ పథకం కొరకు రూపకల్పన చేసిన విధి విధానాల ననుసరించి, ఒక్కో గ్రామీణాభివృద్ధి అధికారి, తను అప్పటికే నిర్వహిస్తున్న విధులకు అదనంగా… ఒక్కో గ్రామాన్ని ఎన్నుకొని, ఆ గ్రామాభివృద్ధి కోసం ప్రణాళికను తయారు చేసుకొని, అమలుపరచాలి. ఓ సంవత్సరం తరువాత, ఐ.డి.ఎస్.వి. పథకం ద్వారా, ఆ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో, ఆ గ్రామ ప్రజల ఆర్థిక స్థితి గతుల్లో, వచ్చిన మార్పుపై ఓ నివేదిక సమర్పించాలి. గ్రామీణాభివృద్ధి అధికారులంతా, వెంటనే ఈ పథకం అమలు చేయాలని హెడ్ ఆఫీసు నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.

నా మటుకు నేను, గొల్లప్రోలు, కత్తిపూడికి మధ్యలో ఉన్న ‘చేబ్రోలు’ అనే గ్రామాన్ని దత్తత తీసుకుని, ఆ ఐ.డి.ఎస్.వి. పథకాన్ని గొల్లప్రోలు బ్రాంచి ద్వారా అమలుపరచాలని నిర్ణయించుకున్నట్లు హెడ్ ఆఫీసుకు తెలియపరిచాను. గొల్లప్రోలు బ్రాంచి మేనేజర్ శ్రీ సుబ్బారావు గారు, ఆ బ్రాంచీలో పని చేస్తున్న అగ్రికల్చరల్ క్లర్కు శ్రీ అశోక్ రాజు గారు ఇద్దరూ నాకు సంపూర్ణ సహకారం అందించేందుకు, సుముఖత వ్యక్తం చేశారు.

***

చేబ్రోలు గ్రామంలో ఆరా తీయగా, ‘దొరవారు’ అని పిలవబడే ఓ విశిష్ట వ్యక్తి గురించి అందరూ చెప్పారు. ఆయన మృదు మధురభాషి, అజాతశత్రువు, తోటివారికి సహాయపడే మనస్తత్వం కలిగిన మనిషి. ఆయన అసలు పేరు నాకు తెలియదు. కానీ అందరూ ‘దొరవారు’ అనే అంటారు. ఆయనొక పెద్ద రైతు, రైసు మిల్లు ఓనరు కూడా. వారిని కలిసి ఐ.డి.ఎస్.వి. పథకం క్రింద నేను చేబ్రోలు గ్రామాన్ని ఎన్నుకున్నట్లు చెప్పి, ఆ పథకాన్ని విజయవంతంగా అమలుపరిచేందుకు, వారి సహాయ సహకారాలు కోరాను. అందుకు దొరవారు ఎంతో సంతోషించారు. గ్రామంలోని ప్రజలందరికీ, మంచి జరుగుతుందంటే, తానెప్పుడూ ముందుంటానని, నాకు అన్ని విధాలా తోడ్పాటు నందిస్తానని మాటిచ్చారు.

ఆ రోజే, గ్రామ సర్పంచ్, మరియు గ్రామ పెద్దలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, నేను ఈ పథకం గురించి వివరించాను. అందరూ ఎంతగానో సంతోషించారు. తమ గ్రామాన్ని ఎన్నుకున్నందుకు నన్నెంతగానో అభినందించారు.

చేబ్రోలు గ్రామస్థులతో నిర్వహించిన సభ
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు గురించి రాత్రివేళ చలన చిత్ర ప్రదర్శన

***

నిజానికి, మన దేశ జనాభాలో దాదాపు డెబ్భై శాతం మంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు. అందుకే ‘ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్…’ అంటారు. జిల్లాలోని గ్రామాలన్నీ అభివృద్ధి చెందితేనే ఆ జిల్లా అభివృద్ధి చెందుతుంది. జిల్లాలన్నీ అభివృద్ధి చెందితేనే ఆ రాష్ట్రం, రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందితేనే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది.

దేశాభివృద్ధి జరగాలంటే ప్రతి గ్రామం తప్పనిసరిగా అభివృద్ధి చెందాలని, మనసా వాచా కర్మణా విశ్వసించే నేను, ఈ ఐ.డి.ఎస్.వి. పథకాన్ని వ్యక్తిగతంగా కూడా స్వాగతించాను. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఈ చేబ్రోలు గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడిపించాలని, కృతనిశ్చయుడనై, రంగంలోకి దిగాను.

హెడ్ ఆఫీసు నుండి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీ డి.యన్.మూర్తిగారు, కాకినాడ నుండి రీజినల్ మేనేజర్ శ్రీ సి.హెచ్.రాజారావు గారు ఋణవితరణకై చేబ్రోలు గ్రామాన్ని సందర్శించినప్పుడు గ్రామస్థులతో జరిపిన ర్యాలీ
ఆనాటి సభలో వేదికపై (ఎడమ నుండి కుడికి) గొల్లప్రోలు బ్రాంచి మేనేజర్ శ్రీ సుబ్బారావు గారు, శ్రీ కుమారస్వామి, కత్తిపూడి – పిఠాపురం బిడివో, శ్రీ కె.వెంకటేశ్వర రావు గారు – శ్రీ సి.హెచ్. రాజారావు గారు – రచయిత – శ్రీ డి.యన్. మూరిగారు, పిఠాపురం ఎం.ఎల్.ఎ. శ్రీ కె.వి.సి.హెచ్. మోహనరావు గారు
సభలో పాల్గొన్న కొంతమంది గ్రామస్థులు
గేదెల కొనుగోలుకు ఋణాలు
గొర్రెల కొనుగోలుకు ఋణాలు
రిక్షాల కొనుగోలుకు ఋణాలు
చేబ్రోలు వాసి డా. సీతారామయ్య గారికి చేబ్రోలు గ్రామంలో క్లినిక్‌ని ఏర్పాటు చేసుకునేందుకు ఋణం మంజూరు
బ్యాంకు ఋణంతో స్థాపించిన రైస్ మిల్లు ప్రారంభోత్సవం
ఈనాడు దినపత్రికలో ‘ఆనాటి’ కార్యక్రమాల గురించి ప్రచురణ

15

గ్రామీణ ప్రాంతాల్లో, నూతనంగా బ్యాంకు శాఖలు తెరవడానికి జిల్లా అధికారులు సర్వే చేసి, ఓ ఇరవై దాకా గ్రామాలను గుర్తించారు. లీడ్ బ్యాంక్ సమావేశంలో ఆయా బ్యాంకులు, ఆంధ్రా బ్యాంకుతో సహా, కొన్ని గ్రామాలను ఎంచుకుని, ప్రభుత్వం గుర్తించిన అన్ని గ్రామాలలో శాఖలు తెరవడానికి ముందుకొచ్చాయి; ఏజన్సీ ప్రాంతంలోని రాజవొమ్మంగి, మారేడుమిల్లి గ్రామాల్లో తప్ప. ఆ సమయంలో తూర్పు గోదావరి జిల్లాకు లీడ్ బ్యాంక్‍గా వ్యవహరిస్తున్న ఆంధ్రా బ్యాంకు ఆ రెండు గ్రామాల్లో విధిగా తమ శాఖలు తెరవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆ క్రమంలో ఆ రెండు గ్రామాలకు వెళ్ళి అక్కడి ప్రజలతో సంప్రదింపులు జరపడం, సర్వే చేసి బడ్జెట్లు తయారు చేయడం నా వంతయింది. ఆ తరువాత ఆ రెండు గ్రామాల్లో బ్యాంకు శాఖలు తెరవడానికి తయారు చేసిన ప్రతిపాదనలను, రీజినల్ మేనేజర్ గారు హెడ్ ఆఫీసుకు పంపారు. హెడ్ ఆఫీస్ వారు ఆ ప్రతిపాదనలను తమ సిఫారసులతో, లైసెన్సులు ఇచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపారు. వెంటనే రిజర్వ్ బ్యాంక్ వారు లైసెన్సులు మంజూరు చేశారు.

మరోసారి ఆ గ్రామాలకు వెళ్ళి, అక్కడ బ్యాంకు శాఖలను ఏర్పాటు చేయడానికి అనువైన ఇళ్ళను అతి కష్టం మీద గుర్తించి, ఆ ఇళ్ళ యజమానులను ఒప్పించి, అద్దెకు తీసుకున్నాము. అవసరమైన మరమ్మత్తులు చేయించి, బ్యాంకు శాఖలు తెరవడానికి కావలసిన ఫర్నీచర్‍ను, రికార్డులను, రిజిస్టర్‍లను అందుబాటులో వుంచాము. ఈలోపు రీజినల్ మేనేజర్ గారు, ఆ శాఖలను నడిపించేందుకు మేనేజర్లను, ఇతర సిబ్బందిని బదిలీ చేశారు.

ఓ మంచి రోజున జిల్లా కలెక్టరు గారి చేతుల మీదుగా రాజవొమ్మంగి, మారేడుమిల్లి గ్రామాల్లో ఆంధ్రా బ్యాంకు శాఖలు ప్రారంభించబడ్డాయి. ఆ ప్రాంత ప్రజలందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

ఇక్కడ చెప్పుకోదగ్గ ముఖ్యమైన విషయం ఉంది.

అలనాడు బ్రిటీష్ సామ్రాజ్యంపై, స్వాతంత్ర్యం కోసం, ఏజన్సీ ప్రాంతంలో, అలుపెరుగని సాయుధ పోరాటం చేసి, చివరికి బ్రిటీష్ వారి తుపాకుల తూటాలకు బలైపోయి వీరమరణం పొందిన, స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం పులి, అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన పవిత్ర ప్రదేశాల్లో, ఇప్పుడు నేనూ తిరిగాను. స్వాతంత్ర్య సాధన కోసం అల్లూరి సీతారామరాజు గారి నాయకత్వంలో బ్రిటీష్ వారిపై సాయుధ పోరాటం చేసి అసువులు బాసిన మన్యం వీరుల వారసుల మధ్య, ఇప్పుడు నేను తిరిగాను.

అదొక మధురానుభూతి. చరిత్ర పుటల్లోకి తొంగి చూడగలిగాను. ఆనాటి సంఘటనలను గుర్తు చేసుకుంటేనే రోమాలు నిక్కబొడుచుకున్నాయి.

దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను, తృణప్రాయంగా అర్పించిన ఆ త్యాగమూర్తులందరికీ మనసులోనే వందనాలు సమర్పించాను.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version