నా జీవన గమనంలో…!-21

57
2

[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]

23

1981 సంవత్సరం జూలై నెలలో రాష్ట్రంలో పని చేస్తున్న వివిధ కర్షక సేవా సహకార సంఘాల మేనేజింగ్ డైరక్టర్లందరికీ, హైదరాబాద్ సకలార్థ సహకార శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో, ములకనూరు సహకార గ్రామీణ బ్యాంకులో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఆ సమావేశంలో రాష్ట్రంలోని కర్షక సేవా సహకార సంఘాలన్నింటి పనితీరును అధ్యయనం చేశారు. ములకనూరు సహకార గ్రామీణ బ్యాంకు అధ్యక్షులు శ్రీ ఎ.కె. విశ్వనాథరెడ్డి గారు, ఇతర అధికారులు ఆ సమావేశంలో పాల్గొని, వారి బ్యాంకు ఈ స్థాయికి చేరుకోవడంలో, వారి సుదీర్ఘ అనుభవాలను మా అందరికీ వివరించారు. వారి అనుభవ పాఠాలు మా అందరిలో ఎంతో స్ఫూర్తిని నింపాయి. మా ఆత్మస్థైర్యాన్ని పదింతలు పెంచాయి. పర్యవసానంగా ములకనూరు సహకార గ్రామీణ బ్యాంకులా అభివృద్ధి పరచలేకపోయినా, ఆ బ్యాంకును ఆదర్శంగా తీసుకుని, కురవి కర్షక సేవా సహకార సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనే బలీయమైన కోరికకు, అప్పుడే బీజం పడింది నా మనసులో.

చివరిగా రాష్ట్రంలోని కర్షక సేవా సహకార సంఘాల పనితీరుపై జరిపిన సమీక్షలో, ముందుగా నిర్ణయించిన ప్రామాణికాలను బట్టి, కురవి కర్షక సేవా సహకార సంఘం రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. అప్పుడే నాకంటూ ఓ లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నాను. కురవి కర్షక సేవా సహకార సంఘంలో, నా పదవీ కాలం ముగిసే లోపు, ఆ సంఘాన్ని రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలబెట్టాలనే దృఢ సంకల్పం నా అంతరంగంలో నిశ్చయమైంది.

24

1981 సంవత్సరం సెప్టెంబరు నెలలో… సంఘ పరిధిలోని గ్రామాల్లో వున్న గొర్రెల మందల్లో, గాలికుంటు వ్యాధి (ఫుట్ అండ్ మౌత్ డిసీజ్) అనే భయంకరమైన వ్యాధి ప్రబలింది. ఆ వ్యాధి సోకిన గొర్రెలు వందల సంఖ్యలో మృతి చెందాయి. ఆ జబ్బు అతి త్వరితగతిన వ్యాపిస్తూ మిగతా గొర్రెలకూ కూడా పాకుతుంది.

ఆ విపత్కర పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున, జిల్లా పశు సంవర్ధక శాఖ నుండి వెటరనరీ డాక్టర్లు, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది, గ్రామాల్లో పర్యటిస్తూ, ఆ జబ్బు వ్యాప్తిని అరికట్టేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు.

గొర్రెల్లో గాలికుంటు వ్యాధిని అరికట్టేందుకు తండావాసులకు జాగ్రత్తలు వివరిస్తున్న రచయిత మరియు ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ అధికారి

వారికి అండగా, మా వంతు బాధ్యతగా, మా సంఘం తరఫున వారికి సంపూర్ణ సహకారం అందజేయాలనుకున్నాము. వారందరూ ఉండేందుకు తగిన బస, భోజన సదుపాయాలు ఏర్పాటు చేశాము. అలా వారి కెలాంటి అసౌకర్యాలు లేకుండా మా సంఘం సిబ్బంది, పాలకవర్గ సభ్యులు, అందరం దగ్గరుండి చూసుకున్నాము.

అప్పటికే వ్యాధి బారిన పడిన గొర్రెలను క్వారంటైన్‍లో వుంచి, మృత్యువాత పడకుండా మందులు వాడారు. మిగతా గొర్రెలకు మందులు వాడుతూ, ముందు జాగ్రత్తగా వ్యాధి నిరోధక చర్యలను చేపట్టారు. ఫలితంగా గొర్రెలలో మరణాలను కట్టడి చేయగలిగారు. ఆ భయంకరమైన వ్యాధి మరింతగా వ్యాపించకుండా అడ్డుకట్ట వేయగలిగారు.

ఆ క్రమంలో కురవి కర్షక సేవా సహకార సంఘం యొక్క సహాయ సహకారాలను, చికిత్స చేయడానికి వచ్చిన వెటరనరీ డాక్టర్లు, ఇతర అధికారులు, సిబ్బంది… ఎంతగానో కొనియాడారు.

సంఘం పరిధి లోని గ్రామాల్లో ఎలాంటి కష్టాలు వచ్చినా,… సంఘం సేవాభావంతో ముందుకొచ్చి ఆదుకుంటున్న వైనాన్ని చూసిన గ్రామీణ ప్రజలు తమ సంతృప్తిని, సంతోషాన్ని వెలిబుచ్చారు.

25

1982 సంవత్సరం.

ఒక కర్షక సేవా సహకార సంఘాన్ని గొప్పగా అభివృద్ధి చేయాలనే ఆశయం నెరవేరాలంటే, ములకనూరు సహకార గ్రామీణ బ్యాంకును ఆదర్శంగా తీసుకోవాల్సిందే! నేను ఆ సహకార గ్రామీణ బ్యాంకును ప్రత్యక్షంగా చూడడమే కాకుండా, ఆ బ్యాంకు కార్యకలాపాలను బాగా అర్థం చేసుకున్నాను. వాటిని మా సంఘంలో అమలు చేయాలంటే, నేనొక్కడిని నిర్ణయించుకుంటే సరిపోదు. నాతో పాటు, మా సంఘ సిబ్బంది, పాలకవర్గ సభ్యులు కూడా నిర్ణయించుకోవాలి. వారందరూ కూడా ఆ సహకార గ్రామీణ బ్యాంకును సందర్శించాలి. ఆ బ్యాంకు కార్యకలాపాలను పరిశీలించాలి. వాటిని అర్థం చేసుకోవాలి. ఆ బ్యాంకును ఆదర్శంగా తీసుకుని, మన సంఘాన్ని కూడా బాగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలు వాళ్ళ మనసుల్లో కలగాలి. అప్పుడే వారందరి సంపూర్ణ సహకారం నాకు తప్పకుండా దొరుకుతుంది. అప్పుడే కురవి కర్షక సేవా సహకార సంఘాన్ని గొప్పగా అభివృద్ధి చేయాలనే నా ఆశయ సాధనకు మార్గం సుగమం అవుతుంది.

అనుకున్నదే తడవుగా, కొంతమంది సిబ్బందిని, మరికొంతమంది అందుబాటులో ఉన్న పాలకవర్గ సభ్యుల్ని ములకనూరు సహకార గ్రామీణ బ్యాంకు సందర్శనకు తీసికెళ్ళడం జరిగింది. వాళ్ళంతా మరెంతోమంది ఆలోచనలను ప్రభావితం చేయగల సమర్థులు. వాళ్ళంతా ఆ బ్యాంకులో జరుగుతున్న దినసరి కార్యక్రమాలను కళ్ళారా చూడగలిగారు. ఆ తరువాత బ్యాంకు పరిధిలో వున్న గ్రామాలకు వెళ్ళి అక్కడి సభ్యులతో సంభాషించారు. ఆసియా ఖండంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకున్న సహకార గ్రామీణ బ్యాంకును చూసి చాలా సంతోషించారు. మన కర్షక సేవా సహకార సంఘాన్ని కూడా మరింతగా అభివృద్ధి చేయాలనే ఏకాభిప్రాయానికి వచ్చారు వాళ్ళంతా.

అందుకే అంటారు ‘సీయింగ్ ఈజ్ బిలీవింగ్’ అని!… ఆ తరువాత రోజుల్లో మా కర్షక సేవా సహకార సంఘం అభివృద్ధి కార్యక్రమాలు మరింతగా ఊపందుకున్నాయి. ఈ ఉరవడి ఇలాగే కొనసాగితే, రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో ఉన్న మా సంఘం, ప్రథమ స్థానానికి చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదని నాకనిపిస్తుంది.

26

రోజులు గడిచే కొద్దీ మా కర్షక సేవా సహకార సంఘంలో అధిక సంఖ్యలో సభ్యులుగా చేరారు. రైతులందరికీ పంట పెట్టుబడికి స్వల్పకాలిక ఋణాలు; ఎడ్లు కొనుక్కోడానికి, బావులు తవ్వుకోడానికి, ఎలక్ట్రిక్ మోటార్లు, ఆయిల్ ఇంజన్లు కొనుక్కోడానికి, స్ప్రేయర్లు, డస్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలు కొనుక్కోడానికి, గేదెలు కొనుక్కోడానికి, గొర్రెల పెంపకానికి, కోళ్ళ పెంపకానికి మధ్యకాలిక ఋణాలు ఇవ్వడం జరుగుతుంది. రైతులతో పాటుగా చేతిపని వృత్తుల వారికి, చిరు వ్యాపారులకు మధ్యకాలిక ఋణాలు ఇవ్వడం జరుగుతుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా షెడ్యూలు కులాల, షెడ్యూలు తెగల, వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థలు, జిల్లా మహిళాభివృద్ధి సంస్థ, జిల్లా పరిశ్రమల శాఖ మొదలైన ప్రభుత్వ శాఖలు, సంఘ పరిధిలోని గ్రామాల్లో గుర్తించిన లబ్ధిదారులకు మధ్యకాలిక ఋణాలు మంజూరు చేయడం జరుగుతుంది.

సంఘం నుండి తీసుకున్న ఋణంతో తవ్విన వ్యవసాయ బావిని పరిశీలిస్తున్న రచయిత, సంఘ సిబ్బంది, రైతులు
సంఘం నుండి తీసుకున్న ఋణంతో నిర్మించిన గోబర్ గ్యాస్ ప్లాంట్‌ను పరిశీలిస్తున్న ప్రధాన అధికారి, ఆంధ్రా బ్యాంకు ప్రధాన కార్యాలయం, హైదరాబాద్ – శ్రీ కె.యస్. గురురాజారావు గారు, వరంగల్ ప్రాంతీయ కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీ యన్. సుబ్బారావు గారు, రచయిత, సంఘ సిబ్బంది, రైతు
బలపాల గ్రామంలో వున్న సంఘ గోడౌన్‌ను పరిశీలిస్తున్న శ్రీ కె.యస్. గురురాజారావు గారు, శ్రీ యన్. సుబ్బారావు గారు, రచయిత, సంఘ సిబ్బంది
తండాలో సంఘ సభ్యులతో ముచ్చటిస్తూ సంఘ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకుంటున్న శ్రీ కె.యస్. గురురాజారావు గారు, శ్రీ యన్. సుబ్బారావు గారు, రచయిత, సంఘ సిబ్బంది

మా సంఘం ద్వారా తీసుకున్న అప్పులు సద్వినియోగం చేసుకుంటూ, గ్రామీణ ప్రజలంతా ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో మా సంఘం ద్వారా సుమారు 1.20 కోట్ల రూపాయలు పంట పెట్టుబడికి స్వల్పకాలిక ఋణాలు సమకూర్చితే, పైన తెలుపబడిన ఇతర అవసరాల నిమిత్తం దాదాపు 1.10 కోట్ల రూపాయలు మధ్యకాలిక ఋణాలుగా మంజూరు చేయడం జరిగింది.

నిజానికి వ్యవసాయ రంగం, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే, స్వల్పకాలిక ఋణాలతో సమానంగా మధ్యకాలిక ఋణాలు ఇవ్వాల్సి వుందనేది నిర్వివాదాంశం.

ఆ క్రమంలో రాష్ట్రమంతటా తిరిగి, సహకార పరపతి సంఘాలు మధ్యకాలిక ఋణాలు ఇవ్వడంలో ఎదుర్కుంటున్న ఇబ్బందులు, వాటిని అధిగమించే మార్గాలు అన్వేషించేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకు, హైదరాబాద్ ఒక కమిటీని నియమించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకు జనరల్ మేనేజరు శ్రీ యస్.వి.యస్. రాజు గారు, సకలార్థ సహకార సంఘాల సమాఖ్య, హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ మామిడి రామారెడ్డి గారు, ములకనూరు సహకార గ్రామీణ బ్యాంకు అధ్యక్షులు మరియు సకలార్థ సహకార సంఘాల శిక్షణా సంస్థ, హైదరాబాద్, అధ్యక్షులు అయిన శ్రీ ఎ.కె. విశ్వనాథరెడ్డి గారు, ఆ కమిటీలో గౌరవ సభ్యులు.

కాని మన రాష్ట్రంలోని సహకార పరపతి సంఘాలన్నింటిలో, స్వల్పకాలిక, మధ్యకాలిక ఋణాల నిష్పత్తి సగటున 90:10 మాత్రమే వున్నట్టు ఆ కమిటీ గుర్తించింది.

ఆ కమిటీ తమ రాష్ట్ర పర్యటనలో భాగంగా 1982 సంవత్సరం మే నెలలో మా కర్షక సేవా సహకార సంఘానికి విచ్చేసింది. మా సంఘ కార్యకలాపాలను పరిశీలించిన మీదట, రాష్ట్రంలోని సహకార పరపతి సంఘాల్లో స్వల్పకాలిక, మధ్యకాలిక ఋణాల నిష్పత్తి సుమారు 90:10 వుండగా, అందుకు భిన్నంగా కురవి కర్షక సేవా సహకార సంఘంలో, ఆ నిష్పత్తి దాదాపు 1:1గా వుండడం గమనించింది ఆ కమిటీ. ఆహ్వానించదగిన ఈ పరిణామంతో కమిటీ సభ్యులు మిక్కిలిగా సంతోషించారు.

ఋణాలు తిరిగి చెల్లించే సమయంలో సంఘ కార్యాలయంలో జరుగుతున్న పనులను పరిశీలిస్తున్న శ్రీ కె.యస్. గురురాజారావు గారు, శ్రీ యన్. సుబ్బారావు గారు, రచయిత, సంఘ సిబ్బంది

ఏ సహకార పరపతి సంఘ విజయానికైనా కొలబద్ద ఇచ్చిన ఋణాల వసూళ్ల శాతం. మరి మా సంఘంలో వసూళ్ల శాతం, 90 శాతంపైగా వుండడం గమనించిన కమిటీ సభ్యులు, మా కర్షక సేవా సహకార సంఘ మేనేజింగ్ డైరక్టర్‍ని, సిబ్బందిని, పాలకవర్గ సభ్యులని పరిపరి విధాలా అభినందించారు.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here