నా జీవన గమనంలో…!-22

17
2

[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]

27

[dropcap]సా[/dropcap]ధారణంగా వ్యవసాయం చేస్తున్న భూముల్లో నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం మొదలైన రసాయనాల నిల్వలు కొంతమేరకు సహజసిద్ధంగా వుంటాయి. వాటిని వాడుక భాషలో యన్.పి.కె. అంటారు. అలాగే సాగు చేసే పంటల ననుసరించి యన్.పి.కె. రసాయనిక ఎరువులు ఎంత మోతాదులో వాడాలో నిర్ధారించారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. అలా ఆ పంటకు నిర్ధారించబడిన యన్.పి.కె.ల అవసరం, ఆ పంట వేసే భూమిలో సహజసిద్ధంగా వున్న యన్.పి.కె. నిల్పలు, ఈ రెంటికీ గల వ్యత్యాసం మేరకు అవసరమైనంత యన్.పి.కె. రసాయనిక ఎరువులను అదనంగా వాడితే సరిపోతుంది. కాని రైతులకు తమ భూముల్లో యన్.పి.కె. నిల్వలు ఎంతెంత వున్నాయో ఎవరికీ తెలియదు. ఆ నేపథ్యంలో యల్లయ్య ఇన్ని కేజీలు వాడాడని మల్లయ్య, మల్లయ్య వాడాడని రంగయ్య, రంగయ్య వాడాడని సుబ్బయ్య… ఇలా అవసరానికి మించి రసాయనిక ఎరువుల వాడకం గ్రామాల్లో సర్వసాధారణమైపోయింది. అలా రసాయనిక ఎరువులు అవసరానికి మించి వాడడం వల్ల, వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు అనవసరంగా పెరిగిపోతున్నాయి. అంతిమంగా రైతుకు వచ్చే రాబడిలో కోత పడుతుంది. ఈ విషయాల్లో రైతులకు ఒక అవగాహన కల్పించి, వారికి సంఘం తరఫున మా వంతు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను.

మా సంఘంలో పని చేస్తున్న వ్యవసాయ విస్తరణాధికారి శ్రీ జమీల్ అహ్మద్ గారిని వెంటబెట్టుకుని హైదరాబాద్ లోని ప్రభుత్వ సంచార భూసార పరీక్షా కేంద్రం (మొబైల్ సాయిల్ టెస్టింగ్ సెంటర్) అధికారులను కలిశాను. మా సంఘ పరిధిలోని గ్రామాల వ్యవసాయ భూముల్లో భూసార పరీక్షలు నిర్వహించవలసిందిగా కోరాము. అందుకు వారు సమ్మతించారు. కాకపోతే, పరీక్షలు నిర్వహించే సిబ్బంది, మొబైల్ ల్యాబ్ (వ్యాన్)తో వచ్చి మహబూబాబాద్‍లో బస చేస్తారు. వాళ్ళు మహబూబాబాద్ వచ్చే నాటికి మట్టి నమూనాలు సేకరించి పరీక్షల కోసం తయారుగా వుంచాలని చెప్పారు. అందుకు మా సంసిద్ధతను తెలియజేసిన పిమ్మట, మట్టి నమూనాలను సేకరించే పద్ధతిని మాకు వివరించి, సంబంధిత కరపత్రాలను మాకందించారు. ఒక వారం రోజుల్లో మహబూబాబాద్ చేరుకుంటామని వారు తెలియజేశారు.

వెంటనే కార్యాచరణలోకి దిగాము. మొదటిగా: మట్టి నమూనాలను సేకరించేందుకు ఒక కేజీ మట్టితో నింపే ఏడువేల గుడ్ద సంచులను కుట్టించాము.

  • ప్రతి గ్రామం నుండి అయిదారుగురు యువకులను ఎన్నుకొని, వారందరికి పొలంలో మట్టి నమూనాలను సేకరించే పద్ధతి గురించి శిక్షణ ఇచ్చాము.
  • ప్రతి నమూనాకు రైతు పేరు, గ్రామం, సర్వే నెం, విస్తీర్ణం, పండించబోయే పంటలు మొదలైన వివరాలు నింపేందుకు ముద్రించబడిన ఫారాలు వారికందించాము.
మట్టి నమూనాలను సేకరించే పద్ధతి గురించి శిక్షణ ఇస్తున్న మా సంఘ వ్యవసాయ విస్తరణాధికారి శ్రీ జమీల్ అహ్మద్ గారు

సంచార భూసార పరీక్షా కేంద్రం, హైదరాబాద్ వారు, వారి మొబైల్ ల్యాబ్ (వ్యాన్)తో మహబూబాబాద్ చేరడానికి ఒక రోజు ముందే సుమారు 6660 మట్టి నమూనాలను సేకరించగలిగాము. మరుసటి రోజు ఆ నమూనాలను పరీక్షల నిమిత్తం మహబూబాబాద్ చేరుకున్న మొబైల్ ల్యాబ్‌కి అందించాము. ఆ నమూనాలన్నింటిని పరీక్ష చేసి ఆయా భూముల్లో యన్.పి.కె. నిల్వలు, రైతులు సాగుచేయబోయే పంటలను బట్టి, అదనంగా ఎంతెంత యన్.పి.కె.లు వాడాలనేది తెలియజేస్తూ, ప్రతి రైతు పేరు మీద విడివిడిగా ధ్రువపత్రాలు తయారు చేశారు. మొత్తం 6660 మట్టి నమూనాల పరీక్షలను, వారం రోజుల్లో పూర్తి చేయగలిగారు.

చివరి రోజున వరంగల్ నుండి మా రీజినల్ మేనేజర్ శ్రీ మాలకొండారెడ్డి గారు వచ్చారు. రైతులందరితో ఒక సభను ఏర్పాటు చేశాము. ఆ సభలో రైతులకు భూసార పరీక్షల ధ్రువపత్రాలను అందజేశారు మా రీజినల్ మేనేజర్ గారు. భూసార పరీక్షకు నిర్వహించిన ప్రభుత్వ సిబ్బంది… ఒకే విడతలో 6660 మట్టి నమూనాలను పరీక్షించడం… తమకు ఓ అరుదైన అనుభవంగా అభివర్ణించారు. అది కేవలం కురవి కర్షక సేవా సహకార సంఘం వారి సహకారం వలనే సాధ్యపడిందని చెప్పారు.

రైతుల తాలూకూ భూసార పరీక్షల ధ్రువపత్రాలను రచయితకు అందజేస్తున్న వరంగల్ రీజినల్ మేనేజర్ శ్రీ మాలకొండారెడ్డి గారు

రైతాంగానికి ఉపయోగపడే ఇలాంటి ఉపయుక్తమైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు రీజినల్ మేనేజర్ గారు మమ్మల్ని, మా సంఘాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు, రైతులందరూ కురవి కర్షక సేవా సహకార సంఘం వారి చొరవను, సేవలను ఎంతగానో కొనియాడారు.

మా సంఘ కార్యాలయం ముందు నిలబెట్టబడిన సంచార భూసార పరీక్షా కేంద్రం, హైదరాబాద్ వారి మొబైల్ ల్యాబ్ (సంచార పరిశోధనాశాల) వ్యాన్ దగ్గర, వరంగల్ రీజినల్ మేనేజర్ శ్రీ మాలకొండారెడ్డి గారితో, ఆంధ్రా బ్యాంకు ప్రధానాధికారి శ్రీ. కె.యస్. గురురాజారావు గారు, సంఘ పాలక సభ్యులు శ్రీ అమృతరెడ్డి గారు, ఇతర పాలకవర్గ సభ్యులు, అధ్యక్షులు శ్రీ ముత్తి లింగం గారు, బలపాల గ్రామం (కుడివైపు నుండి మూడవ వ్యక్తి), మరియు భూసార పరీక్షా కేంద్ర సిబ్బంది, సంఘ సిబ్బంది, రచయిత.

28

1983 సంవత్సరం.

‘నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవెలప్‌మెంట్’ (నాబార్డ్) బొంబాయిలోని ప్రధాన కార్యాలయం భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీని కలిసేందుకు, ప్రతి రాష్ట్రం నుండి ఇద్దరేసి రైతులను ఎంపిక చేసింది. ఆ క్రమంలో మన రాష్ట్రం నుండి ఎంపిక చేయబడిన ఇద్దరిలో, మా సంఘ సభ్యుడు ఒకరు కావడం, మా సంఘానికే గర్వకారణంగా నిలిచింది. ఆ ఎంపిక ద్వారా మా సంఘానికి జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు లభించినట్లయింది. ఆ రైతు ఎవరో కాదు! కురవి కర్షక సేవా సహకార సంఘ సభ్యుడు, మాధాపూర్ తండాకు చెందిన లంబాడా రైతు శ్రీ ఇస్లావత్ ధూప్ సింగ్. విషయం తెలియగానే ఆ రైతును కలిసి మేమందరం అభినందనలను తెలియజేశాము.

రచయిత, సంఘ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీ మల్లారెడ్డి గారు, రైతు శ్రీ ఇస్లావత్ ధూప్ సింగ్ (కుడి వైపు తలపాగాతో) గారిని అభినందిస్తూ…

‘నాబార్డు’ ఆధ్వర్యంలో ఆ రైతుల ప్రత్యేక బృందం, ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీని కలుసుకుంది. ప్రధానమంత్రి ప్రతి రైతునీ పేరు పేరునా పలకరిస్తూ, మెమెంటోను అందజేసి, శాలువాతో సత్కరించారు.

ఢిల్లీ నుంచి తిరిగి మహబూబాబాద్ చేరుకున్న ధూప్ సింగ్ గారిని మా పాలకవర్గ సమావేశంలో ఘనంగా సన్మానించాము.

ఎక్కడో మారుమూల గ్రామంలో, ఓ తండాలో నివసించే ఓ సాధారణ రైతు ధూప్ సింగ్. అలాంటి సాధారణ వ్యక్తి, సాక్షాత్తు భారతదేశ ప్ర్రధాని చేతుల మీదుగా గౌరవించబడడం అంటే… నిజంగా… ధూప్‌ సింగ్ గారి అదృష్టం అని చెప్పకతప్పదు. ఒక విధంగా మా కురవి కర్షక సేవా సహకార సంఘానికి కూడా గౌరవ ప్రదమైన అంశం!

29

కురవి కర్షక సేవా సహకార సంఘ అభివృద్ధి కోసం, నాకు చేదోడు వాడోదుగా ఉంటూ, నాతో పాటు అహర్నిశలు కష్టపడి పని చేసే సిబ్బందికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా, అత్యంత ఉపయుక్తమైన ఓ సదుపాయం కల్పించే అవకాశం వచ్చింది. మా సిబ్బంది 14 మంది కలిసి, మహబూబాబాద్ శివార్లలో ఒక ఎకరం భూమిని తమ సొంత ఇళ్ళను నిర్మించుకునేందుకు అరవై వేల రూపాయలకు కొనుగోలు చేశారు. పార్కు, రోడ్లకు పోను, ఒక్కొక్కరికి 220 చదరపు గజాల ప్లాటు వచ్చేట్టు లేఅవుట్ తయారు చేయించారు. ఆ లేఅవుట్‌ను హైదరాబాద్ లోని రాష్ట్ర ప్రభుత్వ టౌన్ ప్లానింగ్‌ డిపార్టుమెంటుకు పంపారు. ఆ డిపార్టుమెంటు అధికారి మహబూబాబాద్ వచ్చి, లేఅవుట్‍ను సందర్శించి, తమ నివేదికను టౌన్ ప్లానింగ్ డిపార్టుమెంటుకు అందించారు. ఆ నివేదిక ఆధారంగా ఆ డిపార్టుమెంటు లేఅవుట్‍ను యథాతథంగా ఆమోదించింది. మా సిబ్బంది, తాము కష్టపడి దాచుకున్న మొత్తాన్ని ప్లాటు కొనుగోలు చేయడానికి ఉపయోగించుకున్నారు. 220 చదరపు గజాల ప్లాటు కొనుగోలుకు ఒక్కొక్కరికి ₹ 4,500/- దాకా ఖర్చయింది. ఇక ఆ ప్లాట్లలో ఇళ్ళు కట్టుకునేందుకు కావల్సిన డబ్బు కోసం, బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకోవడం మినహా, వేరే గత్యంతరం లేకపోయింది. ఆ 14 మందికి ఆ సమయంలో, మా సంఘం ద్వారా ఒక్కొక్కరికి నలభై వేల రూపాయలు అప్పు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాము. ఆ నెలలో జరిగిన పాలకవర్గ సమావేశంలో ఆ అప్పులు మంజూరయ్యాయి. మా సిబ్బంది ఎంతగానో సంతోషించారు. వారి సేవలను గుర్తించి ఈ విధంగా  ప్రోత్సహించినందుకు తామంతా సంఘానికి ఎల్లప్పుడూ కృతజ్ఞులై వుంటామని ప్రతినబూనారు.

ఇళ్ళు కట్టించడం మొదలైంది. మంజూరు చేసిన నలభై వేలు సరిపోయేట్లు లేవు. వెంటనే, ఒక్కో ఇంటికి మరో ఇరవై వేలు, అంటే మొత్తం అరవై వేల రూపాయలు అప్పుగా మంజూరు చేసింది మా సంఘం. ఆ సమయంలో ఆంధ్రా బ్యాంకు కూడా తమ సిబ్బందికి సొంత ఇంటి నిర్మాణానికి అరవై వేల రూపాయల చొప్పున అప్పుగా మంజూరు చేస్తుంది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశంలోనే, ఏ కర్షక సేవా సహకార సంఘం, తమ సిబ్బందికి సొంత ఇళ్ళ నిర్మాణానికి అరవై వేల రూపాయల చొప్పున ఋణాలుగా ఇవ్వడం జరగలేదు. ఆ ఘనత కేవలం ఒక్క కురవి కర్షక సేవా సహకార సంఘానికి మాత్ర్రమే దక్కింది.

30

ఆ రోజు ఆకాశవాణి, హైదరాబాద్ కేంద్రం నుండి వచ్చిన బృందం, మా సంఘ కార్యాలయాన్ని సందర్శించింది. రాష్ట్రంలో వున్న వివిధ కర్షక సేవా సహకార సంఘాల పనితీరులో, ముందంజలో వున్న కురవి కర్షక సేవా సహకార సంఘంపై ఒక కార్యక్రమం తయారు చేసి ప్రసారం చేయడానికి వచ్చినట్టు తెలియజేసింది ఆ బృందం. విజయవంతంగా నడుస్తున్న మా సంఘ కార్యకలాపాలను రాష్ట్రం యావత్తూ తెలుసుకునేలా, ఆకాశవాణి, హైదరాబాద్ కేంద్రం వారు ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేయబోతున్నారని తెలిసి చాలా ఆనందించాను. వెంటనే రికార్డింగ్ కోసం అవసరమైన ఏర్పాట్లన్నీ జరిగాయి.

నన్ను, కొంత మంది సిబ్బందిని, అందుబాటులో వున్న పాలకవర్గ సభ్యులని ఇంటర్వ్యూ చేసింది ఆ బృందం. ఆ సమయంలో సంఘ కార్యాలయంలో తమ తమ పనుల నిమిత్తం వచ్చిన సంఘ సభ్యులను కూడా ఇంటర్వ్యూ చేసి, సంఘం ద్వారా వారు పొందుతున్న సేవలను గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఆ తరువాత హైదరాబాద్ చేరుకున్న బృందం, సంఘ కార్యకలాపాలన్నీ, శ్రోతలకు కళ్ళకు కట్టినట్టు వినిపించేందుకు ఒక సంక్షిప్త కార్యక్రమాన్ని తయారు చేశారు. ఆ కార్యక్రమాన్ని రాబోయే ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రసారం చేస్తున్నట్లు మాకు తెలియజేశారు. అదే విషయాన్ని, ఆంధ్రా బ్యాంకు వరంగల్ రీజినల్ ఆఫీసుకీ, హైదరాబాద్ లోని హెడ్ ఆఫీసుకు కూడా తెలియజేశారు, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు. ఆంధ్రా బ్యాంకు శాఖలన్నింటికి ఆ కార్యక్రమం ప్రసారం గురించి తెలియజేసింది హెడ్ ఆఫీసు.

మా సంఘం తరఫున ప్రభుత్వ శాఖలకు, మా సంఘ సిబ్బందికి, పాలకవర్గ సభ్యులకు, సంఘ సభ్యులకు, మా శ్రేయోభిలాషులందరికీ ముందుగానే తెలియజేశాము.

కార్యక్రమం ప్రసారం అయ్యే సమయానికి, సంఘ కార్యాలయంలోనే, మా సిబ్బంది అందరితో కలిసి కూర్చుని, ఆకాశవాణి, హైదరాబాద్ కేంద్రం వారు ప్రసారం చేసిన ఆ కార్యక్రమాన్ని చెవులారా విన్నాము. మనసారా సంతోషించాము.

రాష్ట్రంలో ఎంతో మంది ఆ కార్యక్రమం వినే వుంటారు. వారందరికీ మా సంఘం గురించి, మేము చేపడుతున్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలిసే వుంటుంది.

నిజంగా… ఆకాశవాణి… రేడియోలో, ఓ అర్ధగంట పాటు, కురవి కర్షక సేవా సహకార సంఘం కార్యకలాపాలపై, ఓ కార్యక్రమం ప్రసారమవడం గొప్ప విశేషంగా అభివర్ణించవచ్చు.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here