Site icon Sanchika

నా జీవన గమనంలో…!-24

[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]

36

[dropcap]1[/dropcap]984 సంవత్సరం.

ఆంధ్రా బ్యాంకు ఆవిర్భవించి అరవై సంవత్సరాలు నిండిన సందర్భంగా, ఉత్సవాలను ఘనంగా నిర్వహించ తలపెట్టింది ఆంధ్రా బ్యాంకు యాజమాన్యం. ఆ క్రమంలో ప్రతి బ్రాంచిలో, ప్రతి రీజియన్‍లో, సభలు, సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అందులో భాగంగా వరంగల్ రీజియన్ తరఫున, ముగింపు కార్యక్రమం, వరంగల్‍లో జరుపుతున్నారు. ఆ రోజు వరంగల్ పట్టణంలోని బ్రాంచీలలో పని చేస్తున్న సిబ్బంది – సంగీతం, నృత్యం, మొదలైన కార్యక్రమాలతో పాటు, ఒక నాటికను కూడా ప్రదర్శించబోతున్నట్లు మా సిబ్బందికి తెలిసింది.  ఆ సమయంలో మా బ్రాంచిలో క్లర్కుగా పని చేస్తున్న సుబ్బారావు గారు, తనకు నటనలో కొంత అనుభవం వుందని, తాను రచించిన ‘ఇంటర్వ్యూ’ అనే నాటికను, మన బ్రాంచి తరఫున ప్రదర్శిద్దామని ఓ సలహా ఇచ్చాడు. ఆ మాట కొస్తే, నేను కూడా రచనలో, నటనలో, దర్శకత్వంలో కొంత అనుభవం, ఎంతో అభిరుచి వున్న వ్యక్తిని కాబట్టి సుబ్బారావు గారి సలహాను పాటిద్దామనుకొన్నాను. అదీ గాక, మా సిబ్బందికి తమలో వున్న ప్రత్యేకమైన టాలెంట్‍ను బహిర్గతం చేసే అవకాశం కల్పించినట్లవుతుంది.

వెంటనే వరంగల్ రీజినల్ మేనేజరుగారితో మాట్లాడి, మా ఆలోచనను వివరించాను. వెనువెంటనే ఒప్పుకుని, వారు మా బ్రాంచికి నలభై ఐదు నిమిషాలు కేటాయించారు.

ప్రదర్శనకు పదిహేను రోజుల టైం మాత్రమే వుంది. ఇక ఆ రోజే రిహార్సల్స్ మొదలెట్టాము. రోజూ బ్రాంచి లోనే సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు రిహార్సల్స్ నిరాటంకంగా కొనసాగాయి. అనుకోకుండా, ఆ నాటికలో నేను ఒక పాత్ర పోషించాల్సి వచ్చింది. పైగా, సుబ్బారావు గారి అభ్యర్థన మేరకు, నేనే దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వచ్చింది.

ఈ నాటిక ఇతివృత్తం గురించి చెప్పాల్సొస్తే, ఈమధ్య కాలంలో సినిమాల్లో నటించాలనే కోరికతో గ్రామాల నుండి, పట్టణాల నుండి ఎంతోమంది యువతీయువకులు మద్రాసు, హైదరాబాద్ నగరాలకు చేరుకుని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆ క్రమంలో కొన్ని బోగస్ కంపెనీలు, తామే సినిమాలు తీయబోతున్నట్టు, ఆ సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామని ఆశలు రేకెత్తించి, ఎందరో అమాయకులను మోసం చేస్తూ, వారి నుండి పెద్ద మొత్తాల్లో డబ్బులు కూడా వసూలు చేస్తున్నాయి ఆ బోగస్ కంపెనీలు. అలాంటి బోగస్ కంపెనీలతో అప్రమత్తంగా వుంటూ, వాటి బారిన పడి మోసపోవద్దని, నష్టపోవద్దని, ఓ మంచి సందేశాన్ని హాస్యయుక్తంగా అందించడమే ఈ ‘ఇంటర్వ్యూ’ నాటిక ముఖ్యోద్దేశం.

ఆ రోజు రానే వచ్చింది. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో అశేష ప్రేక్షకుల ముందు మా నాటిక ప్రదర్శన. వరంగల్ వారి నాటికతో పోటాపోటీగా వుండబోతోంది మా నాటిక. పైగా ఒక బ్రాంచి మేనేజర్‌గా వున్న నేను కూడా అందులో నటించడమే కాకుండా, దర్శకత్వం కూడా వహిస్తున్నాను. అందుకే అందరికీ, మా నాటికను చూడాలనే కుతూహలం మెండుగా వుంది. నాటిక మొదలైంది.

‘ఇంటర్వ్యూ’ నాటికలో ఒక సన్నివేశం. ఎడమ నుంచి కుడికి రచయిత, శ్రీ సుబ్బారావు గారు, శ్రీ. డి.యన్. మూర్తి గారు, శ్రీ కృష్ణమూర్తి గారు, శ్రీ శివకుమార్ గారు
‘ఇంటర్వ్యూ’ నాటికలో మరో సన్నివేశం. ఎడమ నుంచి కుడికి శ్రీ సుబ్బారావు గారు, రచయిత, శ్రీ. డి.యన్. మూర్తి గారు, శ్రీ కృష్ణమూర్తి గారు.
‘ఇంటర్వ్యూ’ నాటికలో ముగింపు సన్నివేశం. ఎడమ నుంచి కుడికి రచయిత, శ్రీ. డి.యన్. మూర్తి గారు, శ్రీ సుబ్బారావు గారు, శ్రీ కృష్ణమూర్తి గారు, శ్రీ శివకుమార్ గారు

ఆద్యంతం ప్రేక్షకులు తమ నవ్వులతో పువ్వులు పూయించి, ఆడిటోరియం నిండా పరిమళాలను వెదజల్లారు. నాటిక పూర్తయింది. ప్రేక్షకుల కరతాళ ధ్వనులు ఆడిటోరియంలో మారుమ్రోగాయి. మా శ్రమకు తగ్గ ఫలితం… కాదు… కాదు… పదింతల ఫలితం మాకు దక్కినట్లనిపించింది. తరువాత మా నాటికలో నటించిన వారందరినీ మొమెంటోలతో సత్కరించారు. చాలా తృప్తిగా అనిపించింది.

వరంగల్ రీజినల్ మేనేజర్ శ్రీ యల్. వీరభద్రరావు గారి సతీమణి చేతుల మీదుగా ‘ఇంటర్వ్యూ’ నాటికలో నటించిన నటులకు మొమెంటోల బహుకరణ

వేదిక మీద నుండి క్రిందకి నడుస్తుంటే, నలుగురు కుర్రాళ్ళు మమ్మల్ని కలవడానికి వచ్చారు.

“సార్! మీ ‘ఇంటర్వ్యూ’ నాటిక అద్భుతంగా వచ్చింది సార్! మంచి రెస్పాన్స్ వచ్చింది! … మేము ఈ మెడికల్ కాలేజీ కల్చరల్ అసోసియేషన్ సభ్యులం సార్! నా పేరు వేణు… నేనే ఈ అసోసియేషన్ అధ్యక్షుడ్ని” అన్నాడొకతను.

“మీకు మా నాటిక నచ్చినందుకు,  మీరు మమ్మల్ని మెచ్చుకున్నందుకు ధన్యవాదాలు!”

“సార్! మిమ్మల్ని ఓ రిక్వెస్టు చేద్దామని వచ్చాం సార్!”

“చెప్పండి… పరవాలేదు!”

“దయచేసి ‘ఇంటర్వ్యూ’ నాటిక స్క్రిప్టు మాకివ్వండి సార్! మా కాలేజీ వార్షికోత్సవం రోజు ప్రదర్శించాలనుకుంటున్నాము! ప్లీజ్ సార్!”

“అయ్యో! దాందేముందండి!” అంటూ సుబ్బారావు గారి వైపు తిరిగి, “ఏం సుబ్బారావు గారు, ఏమంటారు?” అని అడిగాను.

“మీ ఇష్టం సార్!”

“చూడండి సుబ్బారావు గారు! ఒక రచయితకు తాను రచించిన నాటిక గాని, నాటకం గాని ప్రదర్శించబడితే అంతకంటే మించిన ఆనందం, తృప్తి మరొకటి వుండదు. ఈరోజు మనం ప్రదర్శించాం… రేపు వాళ్ళు ప్రదర్శిస్తారట! ఇచ్చేద్దాం సుబ్బారావు గారు”

“ఇవ్వండి సార్!”

“అదేదో…  మీ చేతుల మీదుగా వేణు గారికి ఇవ్వండి! ఎంతైనా అది మీ సొంత ఆలోచనల్లోంచి వెలుగు చూసిన రచన.. మీ సొంతం!”

సుబ్బారావు ఇచ్చిన నాటిక స్క్రిప్టు కాపీని అందుకున్న వేణు…

“మీ అందరికీ ధన్యవాదాలండీ! సార్! ఇంకొక రిక్వెస్టు!” అంటూ బ్రతిమాలుతున్నట్లు చూశాడు.

“ఇంకొక రిక్వెస్టా? ఏంటది?” అడిగాను.

“మేము ఈ నాటికను ఎప్పుడు ప్రదర్శించబోయేది మీకు ముందుగానే తెలియజేస్తాము. మీరందరూ వచ్చి, ఆ నాటికను చూసి, మమ్మల్ని ఆశీర్వదించాలి!”

“ఓ… తప్పకుండా వస్తాము…!”

“మరి… మేం వెళ్ళొస్తామండి!” అంటూ శలవు తీసుకున్నారు వేణువాళ్ళు.

“ఆల్ ది బెస్ట్!” అంటూ మేమూ బయలుదేరాము. అపరిమిత ఆనందంతో, మోయలేనంత తృప్తితో తిరిగి మహబూబాబాద్ చేరుకున్నాము మేమంతా.

37

లయన్స్ క్లబ్‍లో చేరి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న క్రమంలో నాకు మంచి స్నేహితులు దొరికారు. మేమంతా కలిసిమెలసి ఉంటూ, ఆనందాలను, ఆప్యాయతలను పంచుకుంటున్నాం. ఎవరి కుటుంబంలో ఏ చిన్నపాటి ఫంక్షన్ జరిగినా, అందరం కలిసి సరదాగా గడుపుతున్నాం. కుటుంబాలతో అప్పుడప్పుడు వరంగల్ జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నాం. ముఖ్యంగా కిన్నెరసాని ప్రాజెక్టు చూడడం కోసం వెళ్ళినప్పుడు మా ఆనందాలకు అంతులేదు. ఆటలు, పాటలు, విందు, వినోద కార్యక్రమాల్లో పిల్లలు, పెద్దలూ… అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. రోజంతా ఉల్లాసంగా గడిపాము మేమంతా… అదొక మరపురాని రోజు. ఆనాటి అనుభూతులు మా అందరి మనసుల్లో చెరగని ముద్రలు వేశాయంటే అతిశయోక్తి కాదు.

***

మా స్నేహ బృందంలో… మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో దంతవైద్యుడిగా పని చేస్తున్న డాక్టర్ కె.ఎల్.వి. ప్రసాద్ గారు ఒకరు.

మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో దంత వైద్యులు డా. కె.ఎల్.వి. ప్రసాద్

తనూ నేను ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకున్న మీదట మంచి స్నేహితులమయ్యాము. ప్రసాద్ గారు మృదుమధురభాషి. ఎవరి మనసు నొప్పించరు. సాటి మనిషికి సాధ్యమైనంత సహాయం చేయాలనే తపన వున్న మంచి వ్యక్తి. వృత్తి రీత్యా దంతవైద్యుడు కాబట్టి, దంత పోషణ, దంతసంరక్షణ మొదలైన విషయాలపై తను వ్రాసే వ్యాసాలు దిన, వార, మాస పత్రికలలో ప్రచురింపబడుతుంటాయి. ఆకాశవాణిలో కూడా ప్రసంగాలు చేస్తూ, శ్రోతల సందేహాలకు తగిన సలహాలను ఇస్తుంటారు.

మా ఇద్దరికీ ఓ కామన్ ఫ్రెండ్ ఉన్నారు. ఆయనే డా. పి.వి. రమణ గారు. హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీలో థియేటర్ ఆర్ట్స్ ప్రొఫెసర్‍గా పని చేస్తున్నారు.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదులో థియేటర్ ఆర్ట్స్ ప్రొఫెసర్‍ డా. పి.వి. రమణ గారు

నేను కూడా సాహిత్య అభిమానినే కాబట్టి, మేం ముగ్గురం కలిసినప్పుడల్లా, మా మధ్య సాహిత్యపరమైన చర్చలు సుదీర్ఘంగా కొనసాగుతుంటాయి.

ఒకరోజు డాక్టర్ ప్రసాద్‍తో నాకున్న చనువు కొద్దీ… “ఎప్పుడూ ఆ దంతాల పైన వ్యాసాలేనా? కథలు రాయొచ్చు కదా!” అన్నాను

“కథలు రాయడానికి ప్రయత్నం చేశాను. సాధ్యం కాలేదు. అందుకే ఆ ఆలోచనను తాత్కాలికంగా పక్కన పెట్టాను!” అంటూ అప్పటికి మాట దాటేశారు డాక్టర్ ప్రసాద్.

అయినా నేను వదిలిపెట్టలేదు. అవకాశం దొరికినప్పుడల్లా, చెవులో జోరిగలాగా, కథలు రాయమని చెప్తూనే వున్నాను. ఏమనుకున్నారో ఏమో కాని, నా పోరు తట్టుకోలేక, ఓ మంచి ముహూర్తంలో, ఆ వారం ‘స్వాతి’ పత్రికలోని బాపు బొమ్మకు ‘అస్త్రం’ అనే పేరుతో కథ రాసి పంపారు. ఆ కథ మరుసటి వారం ‘స్వాతి’లో అచ్చయింది.

‘స్వాతి’ పత్రికలో ప్రచురితమైన డా. కె.ఎల్.వి. ప్రసాద్ మొట్టమొదటి కథ ‘అస్త్రం’

వెంటనే ఆ కథను నాకు చూపించారు డాక్టర్ ప్రసాద్. ముందుగా ఆశ్చర్యపోయినా, తరువాత చాలా సంతోషించాను. ఆ కథను చదివిన డా. పి.వి. రమణ గారు, శ్రీ పేర్వారం రాములు గారు కూడా డాక్టర్ ప్రసాద్‌ గారిని కథలు రాయమని ప్రోత్సహించారు. అప్పటి నుండి డాక్టర్ ప్రసాద్ గారు కథలు వ్రాస్తున్నారు. కథలు రాయమని ప్రోత్సహించిన నా మాటలే, తనలో ఉన్న కథారచయితను తట్టిలేపి, తనొక కథారచయితగా కూడా ముందుకు సాగడానికి దోహదపడ్డాయని, డాక్టర్ ప్రసాద్ గారు నాకు కృతజ్ఞతలు చెప్తూనే వున్నారు.

ఒక మంచి కథారచయితకు నేను ప్రేరణ కావడం నాకెంతో ఆనందదాయకం.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version